తప్పెవరిది - మద్దూరి నరసింహమూర్తి

Tappevaridi

"ఏమిటి ఆ ఉత్తరం పట్టుకొని అలా కూర్చున్నారు? ఎక్కడినుంచి వచ్చింది? ఏముంది ఆ ఉత్తరంలో?"

"మా నాన్న దగ్గరనుంచి"

"ఏమిటి రాసేరేమిటి మీ నాన్నగారు?"

"అదేమిటి, మా నాన్న నీకు ఏమీ కారా?"

"ఆ సంగతి అలా ఉంచి, ఏమిటయ్యిందో చెప్పండి"

"ఈ నెలాఖరున మా నాన్న రిటైర్ అవుతారు. ఆ రోజు అమ్మని తీసుకొని రావాలని వాళ్ళ ఆఫిస్ వాళ్ళు చెప్పేరట"

"దానికి ఇంత ఆలోచన ఏమిటి?"

"అదేమిటి పద్మా ఏమీ తెలీనట్లు మాట్లాడుతున్నావు"

"నాకెందుకు తెలీదు. మీరెప్పుడు వెళ్ళాలి"

"అంటే నువ్వు రావా"

"నేనెందుకు లెండి"

"మనకి పెళ్ళై ఐదేళ్లయింది. నాతో కాపురానికి ఇక్కడికి రావడానికి ముందర వారం రోజులు మాత్రమే మా ఇంట్లో ఉన్నావు. ఈ ఐదేళ్ళలో నువ్వు కనీసం ఒక్కసారేనా మా ఇంటికి రాలేదు. ప్రతీసారీ నేనొక్కడినే వెళుతున్నాను. నాతో కనీసం పిల్లాడిని కూడా పంపవు. మా నాన్న రెండుసార్లు ఇక్కడికి వచ్చినప్పుడు మనవడిని చూడడమే. మనవడిని చూడడానికి మా అమ్మ కళ్ళలో ఒత్తులు పెట్టుకొని ఎదురు చూస్తోంది"

"మీ అమ్మని నేనేమేనా రావద్దన్నానా"

"అగో మళ్ళా. మీ అమ్మ మీ నాన్న అంటావేమిటి. వాళ్ళు నీకేమీ కారా"

"ఎందుకు కారు. మిమ్మల్ని పెళ్లి చేసుకున్నందుకు అత్తగారు… మామగారు…అయ్యేరు కదా."

"నువ్వింత నిర్దయగా ఎలా ఉండగలుస్తున్నావు, నిష్టూరంగా ఎలా మాట్లాడగలుస్తున్నావు"

"నా సంగతి వదిలి మీరెప్పుడు వెళతారో చెప్పి, మీ ఇంటికి తీసుకొని వెళ్ళడానికి ఆ రోజుకి ఈ వంటలక్క ఏమేమి చేయాలో సెలవీయండి" అంటూ లోపల వంటగదిలోకి వెళుతున్న భార్య వేపు చూస్తూ –

గతంలోకి జారుకున్నాడు కాంతారావు.

కాంతారావు నాన్నగారైన రమణారావు జీవితంలోకి జానకి ప్రవేశించిన మూడో నెలకే గర్భవతి అవడం, రమణారావు పనిచేస్తున్నది పల్లెటూరు అవడంతో, కోడలు ఆరోగ్యం జాగ్రత్తగా ఉండాలన్న నెపంతో ఐదో నెల రావడంతోనే రమణారావు అమ్మగారు కోడలిని తనతో తీసుకుపోయింది. ఏడోనెల రావడంతోనే అక్కడనుంచి జానకి పుట్టింటికి చేరుకుంది. తరువాత జానకి రమణారావు దగ్గరకి బుల్లి కాంతారావుకి ఏడో నెలవచ్చిన తరువాత సాయం కోసం తన అమ్మని తీసుకొని వచ్చింది.

జానకి అమ్మగారు పూర్తిగా మూడు నెలలుండి చిన్న పిల్లాడితో చేసుకోవలసిన అన్ని పనులు నేర్పించి కూతురికి జాగ్రత్తలు పైకి కొన్ని, చెవిలో కొన్ని చెప్పి వెళ్ళిపోయింది. పెళ్ళైన తరువాత దాంపత్యసుఖం అనుభవించిన రోజులు వేళ్ళ మీద లెక్కపెట్టుకుంటూ ఆవురావురుమని ఉన్నరమణారావు దంపతులు -- ఇంట్లో పెద్ద ప్రాణం ఎవరూ లేకపోవడంతో వెంటనే ఒకటి కాకుండా ఉండలేకపోయేరు.

రెండు నెలలయేసరికి జానకికి మరలా ‘గర్భవతిని అయానా’ అని సందేహం వచ్చింది. మరో నెలకి ఆ సందేహం నిజంగా పరిణమించడంతో, దంపతులిద్దరూ మళ్ళా ఇద్దరూ త్వరగా విడిపోతారేమో అని ఎక్కువగా విచారించేరు. అందుకై, డాక్టర్ తిడతాడేమో అన్న భయంతో, రమణారావు గర్భవిచ్ఛిత్తుకి సంబంధించి తనకి సన్నిహితంగా ఉన్న వారి సలహాలు తీసుకోవడం ఆరంభించేడు. జానకి కూడా ఇరుగు పొరుగు అమ్మలక్కల సలహాలు అడగడం ఆరంభించింది. ఈ విధంగా మరొక నెల గడిచింది. ఆఖరికి, ఎవరో ఒకరి సలహ బాగుందనిపించి, ఆ నాటుసలహా పాటించిన నెల తరువాత కూడా గర్భం నిలిచిన సందేహం వచ్చి, గత్యంతరం లేక ఇద్దరూ వారి వారి తల్లితండ్రులకి ఈవార్త చేరవేసేరు.

వియ్యపురాళ్ళిద్దరూ కూడబలుక్కొని వచ్చి, జానకిని పిల్లాడితో సహా ఊరికి తీసుకొనిపోయి వైద్యుడిని సంప్రదించేరు. జానకిని పరీక్ష చేసిన డాక్టర్ ‘గర్భం నిలిచింది కానీ కానుపైన వరకూ చాలా జాగ్రత్తగా ఉండాలి, ప్రతీ పదిహేను రోజులకి వచ్చి పరీక్ష చేయించుకోవాలి’ అని చెప్పేరు.

వీటన్నిటి ఫలితంతో పురుడు పోసుకున్న జానకి అందమైన ఆడపిల్లకి జన్మనిచ్చింది. చంటి పిల్లని ఆరు నెలలుగా పరీక్షిస్తున్న వైద్యులు పిల్ల భౌతికంగా ఎదుగుతుంది కానీ మానసికంగా ఎదుగుదల చాలా తక్కువగా ఉండవచ్చు అని తేల్చేరు. అది విన్న రమణారావు జానకిలకు దాంపత్యసుఖం అంటే వెగటు విరక్తి కలిగి, యాంత్రికమైన దైనందిన జీవనం గడపడం అలవాటైపోయింది.

వైద్యులు చెప్పినట్టు, అందరూ భయపడినట్టు, పాపకి మానసిక ఎదుగుదల బాగా నెమ్మదించింది. ఇటువంటి పరిస్థితులలో చుట్టూ బంధువుల మధ్య ఉండడానికి మనసు అంగీరకించక, దూరప్రదేశంలో కాపురం పెట్టి, తమ కుటుంబీకులకు తప్ప బంధువర్గం ఎవరితోనూ ఎటువంటి సంపర్కం పెట్టుకోవడం మానేసి బ్రతకడం ఆరంభించేరు.

మానసికంగా ఎదుగుదల లేని పిల్ల ఇంట్లో ఉండడంతో, జానకి పాపం ఎవరింటికీ కనీసం పేరంటానికి కూడా వెళ్ళేదికాదు. ఎవరింట్లో ఏ కార్యమైనా రమణారావు ఒక్కడే వెళ్ళేవాడు. అవసరమనిపిస్తే, కొడుకైన కాంతారావుని వెంటబెట్టుకొని వెళ్ళేవాడు.

కాలం ఎవరికోసం ఆగదుకదా. జానకి జానకమ్మ అయింది. కాంతారావు పెద్దవాడయ్యేడు. చెల్లెలైన కుసుమని తల్లీ తండ్రులలాగే అతి సున్నితంగా ఆప్యాయంగా ఆదరణతో చూసుకునేవాడు.

మామూలుగా అయితే, చెల్లి పెళ్లి జరిగిన తరువాత కాంతారావుకి పెళ్లి జరగాలి. కానీ, కుసుమని ఎవరు పెళ్లి చేసుకుంటారు. అసలు కుసుమకి పెళ్లి అంటే ఏమిటో తెలిస్తే కదా. ఇటువంటి పరిస్థితులలో కాంతారావుకి పెళ్లి కుదిరింది. పెళ్ళికి ముందర కుసుమ ఆడపెళ్ళివారికి ఎదురు పడకుండా జానకమ్మ జాగ్రత్త పడింది. కానీ, ‘పెళ్ళిలో ఎలాగా’ అని ఆలోచించిన జానకమ్మ, నెల రోజులు ముందుగా ఆమె అమ్మని తీసుకొని వచ్చి, కుసుమని అమ్మమ్మకి చేరువ చేసి, వేరే ఒక ఇల్లు అద్దెకు తీసుకొని, ఇద్దరినీ అందులో ఉంచి, వారిద్దరూ పెళ్ళిలో లేకపోవడానికి ఏవో అనారోగ్యం కారణాలు చెప్పి, కుసుమ పరిస్థితి ఆడపెళ్ళివారికి కానీ ఇంకెవరికీ కానీ తెలియకుండా పెళ్లి జరిపించేరు. జానకమ్మ భౌతికంగా పెళ్ళిలో ఆడపెళ్లివారింట్లో ఉన్నా, కుసుమ అమ్మమ్మతో అక్కడ ఎలా ఉందో అన్న బెంగతో మనసంతా కుసుమ దగ్గరే ఉంది.

పెళ్లి శోభనం రెండూనూ ఆడపిల్లవారింట్లోనే జరిపించే ఏర్పాటు ఉండడం వలన, ‘మూడు నిద్దరలు అయినతరువాత అమ్మాయిని అల్లుడిని తీసుకొని రండి' అని ఆడపిల్లవారితో చెప్పి, రమణారావు జానకమ్మ వెనక్కి వెళ్ళిపోయేరు.

కొత్త కోడలుతో వచ్చిన వారు వెనక్కి వెళ్లినవరకూ కుసుమని కానీ తన తల్లిని కానీ జానకమ్మ ఇంటికి తేకుండా, జాగ్రత్తగా గడిపింది.

'ముందున్నది ముస్సళ్ల పండుగ' అన్నట్టు కొత్త కోడలికి కుసుమని ఎలా పరిచయం చేయడమా అని జానకమ్మ మథన పడని క్షణం లేదు. ఆ మానసిక ఒత్తిడి భరించలేని జానకమ్మ కుసుమని కొత్త కోడలైన పద్మకి చూపించకుండానే కొడుకుతో అతను పనిచేసే చోటుకి కాపురానికి పంపడానికి నిశ్చయించుకుంది.

అత్తవారింట్లో ఉండే అవసరం పడకుండా, నేరుగా భర్త దగ్గరకి కాపురంకి చేరుకున్న పద్మ మహదానందపడిపోయింది.

కొడుకు కోడలుతో పాటూ తాను కూడా వెళ్లి వారం రోజులు ఉండి తనను తీసుకొని వెళ్ళడానికి వచ్చిన భర్త రమణారావుతో కలిసి వెనక్కి జానకమ్మ వెళ్ళిపోయింది. అలా వెళ్లేముందర - కోడలికి చాటుగా, కాంతారావుని వేరే గదిలోనికి తీసుకొని వెళ్లి "మేము వెళ్ళిపోయిన తరువాత తాపీగా కుసుమ పరిస్థితి కోడలికి తెలియచేయి" అని చెప్పి వెళ్ళింది.

ఒక రోజు పద్మ హుషారుగా ఉన్నప్పుడు --- కాంతారావు కుసుమ పరిస్థితి వివరంగా చెప్పేడు.

అది విన్న పద్మకి కోపం నాసాళంకి అంటుకుంది.

"మమ్మల్ని మోసం చేయడానికి మీవాళ్లకి మనసెలా వచ్చింది? అలాంటి అమ్మాయి పుట్టిన వంశంలోకి కోడలిగా వచ్చిన నాకు కూడా రేపు అటువంటి పిల్లలు పుట్టరని గ్యారంటీ ఏమిటి? ఈ విషయం మా పుట్టింటివారికి ఇప్పుడే చెప్పి మిమ్మల్ని అందరిని బజారులో నిలబెడతాను" అంటూ రంకెలు వేసింది.

"పద్మా నా మాట నమ్ము. నిన్ను కానీ మీ పుట్టింటి వాళ్ళని కానీ మోసం చేయాలన్న ఉద్దేశం మాకెవరికీ లేదు. కుసుమని చూసి నలుగురూ నాలుగు రకాలుగా మాట్లాడతారన్న భయంతో అలా వ్యవహరించేం. నువ్వు కాస్త తాపీగా ఆలోచిస్తే, మేము చేసినదానిని సమర్ధించగలవు." అని బోధపరిచే ప్రయత్నం చేసేడు.

రెండు రోజులు భార్య భర్తల మధ్యలో మాటలు లేవు. ఆ నిశ్శబ్దంతో ఇద్దరికీ ఇల్లు నరకప్రాయం అనిపించింది.

మూడో రోజు రాత్రి - "ఈ నిశ్శబ్దం నేను భరించలేకుండా ఉన్నను పద్మా. నీకింకా కోపం పోకపోతే, తోచినట్టు నన్ను తిట్టు. అంతేకానీ, ఏదో ఒకటి నువ్వు మాట్లాడకపోతే నాకు పిచ్చి పట్టేటట్లుంది." అని వేడుకున్నాడు.

"మీ చెల్లెలుకి మానసికంగా ఎదుగుదల లేదు, ఇంక మీకు పిచ్చి పడితే చాలు, మన ఇల్లే ఒక పిచ్చాసుపత్రిగా మారిపోతుంది. దాంతో, నాకు కూడా పిచ్చి పడుతుంది." అని ఏడుస్తూ కూర్చుంది.

"అలా ఏడవకు పద్మా" అంటూ అనునయించబోయిన భర్త చేతిని విసిరి కొట్టింది.

ఏమీ చేయలేని కాంతారావు "పోనీ నీ మనసులో ఏముందో నేనేమి చేయాలో చెప్పు పద్మా" అని వేడుకున్నాడు.

కొంతసేపటికి ఏడుపు ఆపిన పద్మ, ఉక్రోషం తన్నుకు వస్తుంటే "నా వాళ్ళని నన్ను మోసం చేసిన మీవాళ్ళ ఇంటి గడప మరి నేను తొక్కను కాక తొక్కను. ఇప్పుడే చెపుతున్నాను - మీ వాళ్ళని చూడడానికి కావలిస్తే మీరు వెళ్ళండి. అంతేకానీ, నన్ను కానీ మనకు పుట్టబోయే పిల్లలిని కానీ ఆ ఇంటికి రమ్మని పిలవకండి, తీసుకొని వెళ్లే ప్రయత్నం పొరపాటున కూడా చేయకండి. అలా నామీద ఒట్టు వేయండి" అని కాంతారావుని బలవంతం చేసింది.

"ఒట్టు గిట్టు, అందునా నీమీద, ఎందుకు కానీ, నువ్వు చెప్పినట్టుగానే చేస్తాను. ఇంక ఆ విషయం ఒక పీడకలగా మరచిపో" అని అనునయించేడు గతిలేని కాంతారావు.

"ఇంకొక ముఖ్య విషయం. ఎటువంటి పరిస్థితిలోనూ మీ చెల్లి మనతో ఉండడానికి వీల్లేదు. నామాట కాదని మీ చెల్లిని మనతో ఉండడానికి తీసుకొనివస్తే, మన మధ్య మిగిలేవి విడాకులే" అని కుండ బద్దలుకొట్టింది.

"సరే. నీ మాటే కానీ పద్మా " అని అప్పటికి కాంతారావు తెర దింపుతూంటే –

"రేపే మీరు వెళ్లి కుటుంబనియంత్రణ ఆపరేషన్ చేయించుకుంటారా, లేక నన్ను చేయించుకోమంటారా?"

"మనకి ఇప్పుడు ఉన్నది ఒక అబ్బాయే కదా, ఇప్పుడు ఆ ఆపరేషన్ కి తొందర ఎందుకు? అందునా రేపే ఎందుకు?"

"మీ అమ్మా నాన్నకి మీ తరువాత పుట్టిన మీ చెల్లి ఎలా ఉందో మీకు తెలుసుకదా, మరి మనకి మన అబ్బాయి తరువాత సంతానంకి - అందునా ఆడపిల్ల పుడితే - తప్పకుండా మీ చెల్లి పోలికలు రావొచ్చు. అందుకే, ముందు జాగ్రత్తగా వెంటనే మీరో నేనో ఆ ఆపరేషన్ చేసుకోవలసిందే"

"నేనే చేసుకుంటాను. కానీ, రేపే ఎందుకు? తాపీగా చేసుకుంటానులే"

"అదేమీ కుదరదు. మీరు ఆ ఆపరేషన్ చేసుకున్నవరకూ నన్ను తాకడానికి కానీ, నా పక్కన పడుకుందుకి కానీ, నేనొప్పుకోను కాక ఒప్పుకోను."

"సరేలే, నేనే రేపు ఆపరేషన్ చేయించుకుంటాను. వచ్చి పడుకో, ఇప్పటికే అర్ధరాత్రి దాటింది"

"మీరు వెళ్లి హాల్లో పడుకోండి, ఈ పడకగది తలుపు వేసుకొని పిల్లాడితో నేను పడుకుంటాను" అని బలవంతాన కాంతారావుని బయటకి పంపి, తలుపు వేసుకుంది పద్మ.

ఇవనీ గుర్తుకు వచ్చిన కాంతారావు -

తనని, తనవాళ్ళని అర్ధం చేసు కొనేందుకు కనీసం ప్రయత్నం చేయక మంకుపట్టుతో ఉన్న పద్మది తప్పా ? తన సంసారం సాఫీగా నడచిపోవడానికి భార్య మాటకి గంగిరెద్దులా తలూపి, చెల్లి విషయంలో తల్లితండ్రులకు అండగా నిలబడని తనది తప్పా ? తగిన జాగ్రత్తలు తీసుకోకుండా గర్భం దాల్చి, సరైన సమయంలో డాక్టర్ ని కాకుండా ఎవరెవరినో సంప్రదించి, ఏవేవో మందులు మింగి, కుసుమ పరిస్థితికి కారణమైన తన తల్లితండ్రులది తప్పా ? కుసుమని, కుసుమ పరిస్థితిని, పద్మ దగ్గర పద్మ పుట్టింటివారి దగ్గర దాచిన తన తల్లి జానకమ్మది తప్పా ? అందుకు తన తల్లికి సహకరించిన అమ్మమ్మది తప్పా ? – లేక -- కుటుంబ పెద్దగా తన తండ్రిది తప్పా ?

-- అనుకుంటూ తప్పెవరిది అన్న ఆలోచనలో పడ్డాడు.

*****

మరిన్ని కథలు

Gatam gataha
గతం గతః (బాలల కధ)
- కొత్తపల్లి ఉదయబాబు
Talli bhasha
తల్లి భాష
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Daparikam
దాపరికం
- వరలక్ష్మి నున్న
Thotakoora naade..
తోటకూరనాడే...
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Nishani
నిశాని
- DR Bokka Srinivasa Rao
Vachhindi ashadha masam
వచ్చింది ఆషాఢమాసం
- తాత మోహనకృష్ణ