నాన్నా..నన్ను క్షమించు..! - యు.విజయశేఖర రెడ్డి

Naanna nannu kshaminchu

భార్య ఫోటోను చేతిలోకి తీసుకుని కన్నీరు పెట్టుకుని “సుశీలా!..నన్ను విడిచి ముందే ఎందుకు వెళ్లిపోయావు” అని మనసులోనే రోదించాడు శేఖర్. కొద్దిసేపటికి కోడలు వనజ పిలుపుతో కంచంలోని అన్నం ఏదో తినడం అయ్యిందనిపించి, చీకటి కొట్టులాంటి గదిలోకి వచ్చి తలుపు దగ్గరకు వేశాడు. “పనీ పాట లేకుండా ఊరికే లైట్లు వేసుకోకండి. పోయిన నెల కరెంట్ బిల్ వెయ్యి రూపాయలు వచ్చింది” అన్న వనజ మాటలు గుర్తు చేసుకుని. కొవొత్తి వెలిగించి, కథల పుస్తకం తీసుకుని కొన్ని పేజీలు చదివి పుస్తకాన్ని పక్కన పెట్టాడు శేఖర్. మెల్లగా తలుపు తోసుకుని వచ్చాడు కృష్ణ “క్షమించు నాన్నా!.. నీవు లైటు కూడా వేసుకో లేని పరిస్థితిని కల్పించాను” అన్నాడు ఎంతో బాధతో.

“ఊరుకో కృష్ణా.. నా జీవితం ముగింపు దశకు చేరుకుంది..నీకు కష్టాలు కొన్నాళ్లే. నీవు పని చేసే కంపెనీకీ తీవ్ర నష్టం వచ్చిందని మూసేస్తే, నువ్వు మాత్రం ఏం చేయగలవు. ఉద్యోగం లేకపోతే ఇంట్లో వాళ్లే కాదు, బయట వారు కూడా చిన్న చూపు చూస్తారు ఇది సహజం” అని కొడుకు తల నిమిరాడు.

మరి కాసేపటికి మనవడు రవి వచ్చాడు. “ఇదిగో తాతయ్యా!..అమృతాంజన్” అని ఇచ్చాడు. “ఇది తేవడానికి నీకు డబ్బులు ఎక్కడివి బాబు” అన్నాడు శేఖర్. ”నా గల్లా పెట్టెలో రెండు వందల రూపాయలున్నాయి తాతయ్యా..అందులో నుండి ఒక యాభై రూపాయలు నీ కోసం వాడాను” అన్నాడు రవి. కొవొత్తి వెలుగులో తాతయ్య కళ్లను రవి గమనించ లేదు. తట్టుకో లేక కన్నీళ్లు బొటబొటా రాల్చి మనవణ్ణి గుండెలకు హతుకున్నాడు.

“ఇక పడుకో నాన్నా..” అన్నాడు కృష్ణ. “అవును తాతయ్యా!..ఇద్దరం కనకబడకపోతే అమ్మ గోలపెడుతుంది” అని రవి అన్నాడు. “అలాగే” అని వాళ్లు వెళ్లిపోయాక తలుపుకు గడియ పెట్టి, ఎప్పుడు కోడు విరుగుతుందో తెలియని మంచం పైన పడుకుని, రవి తెచ్చిన అమృతాంజన్ మూత తీసి వేలితో కొద్దిగా తీసుకుని ముక్కుకు రాసుకుని, ఈ సీసా మూడు నెలలు రావాలి, అందుకు జాగ్రత్తగా వాడుకోవాలి..ఎందుకంటే ఇప్పుడు యాభై రూపాయలు పెట్టి కొనుక్కునే పరిస్థితిలో తను లేడు అని కళ్లు మూసుకుని గతం లోకి వెళ్ళాడు శేఖర్.

”ఏవండీ.. మనకంటూ కొంచెం దాచుకోవాలి” అని ఎప్పుడూ చెబుతుంటుంది సీత.

హైదరాబాద్ నుండి కొడుకూ,కోడలు,రవి వచ్చారు. మహానగరంలో అద్దెలు బోలెడని, బహుళ అంతస్తులో డబుల్ బెడ్ రూమ్ యాభై లక్షలకు వస్తుందని కృష్ణ,వనజ పోరుతుంటే విజయవాడలో తను అటెండర్‌గా ప్రైవేట్ కంపెనీలో పని చేసి బ్యాంకులో దాచుకున్న ఐదు లక్షలూ ఇచ్చాడు శేఖర్.

ఆ డబ్బును బిల్డర్‌కు అడ్వాన్స్ కింద కడతానన్నాడు కృష్ణ. సొంత పెంకుటింట్లో ఉంటూ పచారి కొట్టుతో ఇల్లు ఎలాగోలా నెట్టుకొస్తోంది సీత.”మనిద్దరికీ తిండికి లోటు లేదు” అని సీతను సముదాయించాడు శేఖర్. “డబ్బు ఇచ్చాక చేసేదేముంది..తిండికి లోటు లేదు కానీ రేపేదైనా మనకు రోగం, రొప్పూ వస్తే ఎలాగా అన్నదే నా బాధ” అంది సీత.”అన్నిటికీ ఆ పై వాడే ఉన్నాడు” అని సీతను సముదాయించాడు శేఖర్. డబ్బు తీసుకుని వెళ్ళిపోయారు కొడుకూ,కోడలు,మనవడు.

కొన్ని నెలలకే సీతకు పెద్ద జబ్బే చేసింది, దానితో ఆరోగ్యం క్షీణించి చనిపోయింది. కొడుకు,కోడలు,మనవడు కర్మ కాండలు అయ్యేవరకు విజయవాడలోనే ఉన్నారు. “నాన్నా!.. ఒంటరిగా ఇక్కడ ఎలా ఉంటావు?.. నువ్వు మాతో పాటే రా... అందరం హైదరాబాద్ లోనే కలసి ఉందాము” అన్నాడు కృష్ణ. “అవును మామగారూ” అంది వనజ. ఉన్న పెంకుటిల్లును లక్ష రూపాయలకు అమ్మి ఆ డబ్బును కూడా కృష్ణకు ఇచ్చాడు శేఖర్. అందరూ కలసి హైదరాబాద్‌ చేరుకున్నారు.

గతం నుండి బయటకు వచ్చి లేచి మంచి నీళ్లు తాగి, మళ్లీ మంచం మీద వాలాడు శేఖర్. పెళ్ళైన దగ్గర నుండీ వనజ చిన్న కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. కృష్ణకు ఉద్యోగం లేక పోవడంతో ఇల్లు నడిపించే బాధ్యత కోడలు మీద పడింది. వచ్చే ఇరవై వేల జీతంతో ఇంటి అద్దె, ఇంటి ఖర్చులతో ఇల్లు నెట్టుకొస్తోంది. డబ్బులు సరిపోక అందరి మీద రుసరుస లాడుతుంటుంది వనజ. పొద్దున్నే రెండు పాల పాకెట్లు తేవడం, రవిని సైకిల్ మీద కూర్చొబెట్టుకుని స్కూల్లో దింపడం అయిపోయాక తీసుకు రావడం శేఖర్ డ్యూటి.

ఆరు నెలలు గడిచిపోయాయి. కృష్ణ, కృషి ఫలించింది. మంచి ఉద్యోగం వచ్చింది. జీతం నెలకు అరవై వేలు. కొడుకుకు ఉద్యోగం వచ్చినందుకు శేఖర్ ఎంతగానో సతోషించాడు. ప్రతి నెలా బ్యాంక్ ద్వారా బిల్డర్‌కు పాతిక వేలు కడుతున్నాడు కృష్ణ.

కాలచక్రం గిర్రున తిరిగి రెండు సంవత్సరాలు గడిచిపోయాయి. డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ తాళాలు కృష్ణ చేతికి వచ్చాయి. ఆర్భాటం లేకుండా కొత్త ఇంట్లో పాలు పొంగించి చేరిపోయారు కృష్ణ వాళ్లు. అమ్మ ఫోటో పక్కన, నాన్న ఫోటో చేరింది. ఇద్దరికీ కలిపి ఒకే దండ వేశాడు కృష్ణ. చివరి రోజుల్లో నిన్ను సరిగ్గా చూసుకో లేక పోయాను నన్ను క్షమించు నాన్నా!.. అని కన్నీరు పెట్టుకున్నాడు కృష్ణ.

కాసేపటికి వనజ వచ్చింది. వెండి గిన్నెలో పాలు పొంగించిన పాలతో చేసిన బెల్లం పరవాన్నం ఒక గిన్నె లోనూ, మామగారికి ఇష్టమని బాగా జీడి పప్పు,కిస్ మిస్ వేసి నెయ్యితో చేసిన రవ్వ కేసరి మరో గిన్నెలోనూ తెచ్చి టేబుల్ మీద ఉన్న అత్తా, మామల ఫోటో ఫ్రేమ్ ఎదురుగా పెట్టి కళ్లు మూసుకుంది. భార్య కళ్ళలో నుండి కన్నీరు జారడం గమనించాడు కృష్ణ. కాసేపటికి కొత్త అమృతాంజన్ బాటిల్ తెచ్చి తాతయ్య ఫోటో పక్కన పెట్టి దండం పెట్టాడు రవి.

*****

మరిన్ని కథలు

Jeevana bhruthi
జీవన భృతి
- వై.కె.సంధ్యా శర్మ
Manuvu mariyu chepa katha
మనువు మరియు చేప కథ
- హేమావతి బొబ్బు
Anakonda
అన”కొండ”
- రాపాక కామేశ్వర రావు
Cheekati pai yuddham
చీకటి పై యుద్ధం
- హేమావతి బొబ్బు
Mokkalu naatudam
మొక్కలు నాటుదాం!
- చెన్నూరి సుదర్శన్
Vuppena
ఉప్పెన
- కందర్ప మూర్తి