ఒప్పందమా / సాంప్రదాయమా - మద్దూరి నరసింహ్మూర్తి

Oppandama/sampradayama

“నమస్కారం లాయర్ గారూ, మా వివాహ ఒడంబడిక పత్రం సిద్ధం చేసేరా”

“మీరు కోరినట్టుగానే ఒడంబడిక పత్రం తయారు చేసి ఉంచేను. కానీ, అది మీరు అందుకొనే ముందర నా ప్రశ్నకు మీ జవాబు కావాలి”

“అడగండి, తెలుస్తే తప్పకుండా చెప్తాము” సుగుణ చెప్పింది.

“మగ ఆడ పెళ్లి ఎందుకు చేసుకుంటున్నారు, వారు ముఖ్యంగా ఎలా పెళ్లి చేసుకోవాలి”

“వయసులో ఉన్న మగ ఆడ మధ్యలో కలిగే ప్రధానమైన శారీరక ఆకర్షణతో ప్రేమలో పడిన వారు కలిసి తిరిగి ఒకరినొకరు అర్ధం చేసుకొని పెళ్లి చేసుకోవాలన్న అంగీకారంకు వచ్చిన తరువాత, పెద్దవారు ఒప్పుకుంటే సరి లేకపోతే మరేదో విధంగానైనా వారంతట వారే పెళ్లి చేసుకోవాలి” సుందరం వివరణ.

“సుందరం జవాబుని నేను కూడా సమర్ధిస్తున్నాను” అంది సుగుణ నవ్వుతూ.

“అంటే, ప్రేమకు తొలిమెట్టు శారీరక ఆకర్షణ ఆ తరువాత ఒకరినొకరు అర్ధం చేసుకొని అంగీకారంకు రావడమే తప్ప పెద్దవారి అంగీకారంకి ప్రాముఖ్యం లేదంటున్నారా”

“ఎవరు ఒప్పుకున్నా లేకున్నా అదే నిజం”

“అయితే, నేను చెప్పే ఒక కథ వినాలి మీరు”

“ఎందుకు”

“ఆ కథ వింటే మీకే తెలుస్తుంది”

“సరే చెప్పండి” అన్నారు సుగుణ సుందరం ఇద్దరూ ఏకకంఠంతో.

తొలిసారిగా పెళ్లి చూపులు జరుగుతున్న జానకి రాఘవ లకు చాలా కుతూహలంగా ఉంది.

ఒకరినొకరు ఫోటోలో చూసుకోవడమే కానీ ప్రత్యక్షంగా చూసుకోవదానికి సిద్దపడడం ఇద్దరికీ ఇదే తొలిసారి.

‘మా ఇద్దరి పేర్లు ఎంతగా కలిసాయో అంతగా మా మనసులు కూడా కలిసి పోతే బాగుంటుంది’ అన్న ఆలోచనతో ఉన్న వారిద్దరూ పెద్దల సమక్షాన ఎదురెదురుగా కూర్చున్నారు.

“అలా తల దించుకొని కూర్చుంటే ఆమె ముఖారవిందం ఎలా చూసేదీ” అని రాఘవ మనసులో అనుకున్న మాటలు గాలిలో ప్రయాణించి జానకి చెవిలో నిశ్శబ్దంగా దూరేయి కాబోలు, మరు క్షణంలో జానకి మెల్లగా తలెత్తి అతన్ని చూసింది. ఇద్దరి చూపులు కలవగానే, వారిరువురికీ ఒకరినొకరు ఎన్నో ఏళ్లుగా ఎరిగిన వారనిపిస్తూ ఒకరి కోసం ఒకరు అన్న మధురమైన భావనకు లోనయ్యేరు.

‘నీవేనా నను తలచినది’ అని పాడుకోవాలనిపించి వారిద్దరి కళ్ళు నిశ్శబ్దంగా నవ్వులు చిలకరించేయి.

అందరూ ఒక్కసారి పెద్దగా నవ్వుతూంటే, ఇద్దరూ సిగ్గు పడి తలలు దించుకొని చిన్నగా నవ్వుకోసాగేరు.

వారి హావభావాలను గ్రహించిన పెద్దలు, పిల్లలిద్దరినీ మరి అడగక్కరలేదు అనుకొన్నవారై, ఇద్దరికీ వివాహం నిశ్చయించేరు. ఇంకా శాస్త్రీయంగా పెళ్లి జరగ వలసి ఉన్నా, పెళ్లి చూపులు జరిగిన ముహూర్తబలమో ఏమో కానీ, వారిద్దరి మనసుల్లో అప్పటికే వివాహం జరిగిపోయిన విచిత్ర అనుభూతి నిండిపోయింది.

ఇరు కుటుంబాలు పురాతన సాంప్రదాయ పద్ధతికి పట్టం కట్టేవారు కాబట్టి, ‘మీరిద్దరూ ఏమైనా మాటలాడుకోవాలనిపిస్తే ఆ గదిలో కూర్చొని మాటలాడుకోండి’ అని ఎవరూ జానకి రాఘవ లకు చెప్పలేదు. మానసికంగా ఒకటైపోయిన జానకి రాఘవ లకు కూడా విచిత్రంగా ఆ ఆలోచన రానే లేదు.

ఇరు కుటుంబాల వారు సిద్ధాంతిగారిని సంప్రదిస్తే, మూడు నెలల తరువాత దివ్యమైన ముహూర్తం ఉందంటూ, అది దాటిపోతే మరో ఆరు నెలలవరకూ మంచి ముహూర్తం లేదు అని కూడా ఆయన తెలియచేయడంతో, మూడు నెలల తరువాత ఉన్న ముహూర్తానికే పట్టం కట్టేరు.

మూడు నెలల సమయమే ఉంది కదా అని ఇరువైపు పెద్దలు పెళ్లి పనులు ఒక్కొక్కటీ త్వరగా చేసుకుంటూంటే, ఇంకా మూడు నెలలు ఆగాలా అనిపించసాగింది జానకి రాఘవ లకు.

అనుకున్న సమయానికి, ఎదురు సన్నాహ సంరంభాలతో ఆడపెళ్లివారి స్వాగత సత్కారాలు సంతృప్తిగా అందుకున్న మగపెళ్ళివారు విడిదిలో దిగేరు. ఆరోజు జరిగిన తోట సంరంభం కార్యక్రమంలో పెళ్లికొడుకు పెళ్లికూతురుతో సహా ఇరు కుటుంబ సభ్యులూ ఎదురెదురుగా కూర్చొని సాంప్రదాయ రీతిలో సత్కరించుకున్నారు. అక్కడున్న పెద్దలందరికీ క్షుణ్ణంగా వినిపించేటట్టు ఇరుపక్కల పౌరోహితులు లగ్న పత్రిక అంగీకార పత్రిక బిగ్గరగా చదివి వినిపించేరు. ఆ కార్యక్రమంలో భాగంగా –

పెళ్ళికొడుకు చేత పెళ్లికూతురికి అలాగే పెళ్లికూతురు చేత పెళ్లికొడుకుకి చందనం వ్రాయడం వసంతం పన్నీరు జల్లడం చేయిస్తూ ఉంటే, ఒకరి మేని స్పర్శ మరొకరికి తెలిసి వచ్చి, క్రొంగొత్త సుఖానుభవానికి గురైన వారిరువురి మనసులూ ఏకకాలంలో మధురోహలలో విహరించసాగేయి.

వివాహ కార్యక్రమానికి ముందుగా పెళ్లికొడుకైన రాఘవ పెళ్లి మంటపానికి నడిచి వచ్చి పెళ్లిపీట మీద కూర్చొని పురోహితులవారి ఆధ్వర్యంలో విఘ్నేశ్వర పూజ ఆరంభించేడు.

సౌభాగ్యప్రదాత అయిన మంగళగౌరీ దేవికి పెళ్లికూతురైన జానకి చేత పురోహితులవారు పూజ చేయించిన తరువాత, అలంకరించిన వెదురు బుట్టలో కూర్చొని ఉన్న మహాలక్ష్మీ స్వరూపమైన పెళ్లికూతురైన జానకిని మేనమామలు అభిమానంగా మోస్తూ తెచ్చి పెళ్ళికొడుకు ఎదురుగా కూర్చొని ఉన్న పెళ్లికూతురి తల్లితండ్రుల పక్కన కూర్చోపెట్టేరు. అప్పటికే, పెళ్ళికొడుకు పెళ్లికూతురు ఒకరినొకరు చూసుకొనే వీలు

లేకుండా వారి మధ్యలో తెర ఉంచడంతో ఇద్దరూ సహజమైన కించిత్ అసహనానికి గురైనా, భవిష్యత్తులో ఏదైనా కారణానికి ఇద్దరూ దూరంగా మసలవలసి వస్తే, ఎలా ఉండగలగాలో ఇప్పుడే నేర్పుతున్నారు కాబోలు అన్న వివేకవంతమైన ఆలోచనతో ఆ ఆచారం ఏర్పరచిన అజ్ఞాత గురువులకు మనసులో నిశ్శబ్దంగా ప్రణమిల్లేరు వారిద్దరూ.

జీలకర్ర బెల్లం కలిపిన ముద్దలు జానకి రాఘవ తలలమీద ఒకరి చేత మరొకరికి పెట్టించి, వారు ఆ భంగిమలో ఉండగానే తెర తీసి, శుభ ముహూర్త సమయానికి ఇద్దరినీ ఒకరి కళ్లలోకి మరొకరు చూసుకోమని చెప్పిన పౌరోహితులవారికి మనసా ధన్యవాదాలు సమర్పించుకున్న వారిద్దరూ, ప్రేమపూర్వకంగా చిరునవ్వులు చిందిస్తూ ఒకరి కళ్లలోకి మరొకరు తనివితీరా చూసుకొని, ఆ చూపులు కలకాలం వారి జ్ఞాపకాల పందిరిలో ఉండిపోయేటట్టుగా ఇరు మనసులలో గాఢంగా ముద్రించుకున్నారు. వారి హృదయ విపంచులలో అప్పుడు ‘నా కంటిపాపలో నిలచిపో’ అన్న పాట మధురంగా మ్రోగసాగింది.

నారాయణ స్వరూపుడైన పెళ్ళికొడుకు రాఘవ కాళ్ళు విధివిధాయకంగా భార్య సహకారంతో కడుగుతూ జానకి తండ్రి కన్యాదానం చేసేడు. ఆ సమయంలో, జానకి తల్లితండ్రుల మనసులు సంతోషం విచారం కలగలిపిన అనుభవాన్ని ఏకకాలంలో నింపుకున్నాయి.

పురోహితులవారు పెళ్లికొడుకైన రాఘవ ను ఉద్దేశించి “నాయనా -- ధర్మేచ, అర్ధేచ, కామేచ త్వయా ఏషా, చితిచరితవ్యా” అని చెప్తూ, అతని చేత “నాతి చరామి” అని ప్రతిజ్ఞ చేయించేరు.

“గురువుగారూ, మీరు ఇప్పుడు చదివిన సంస్కృత పదాలకు నా చేత చేయించిన ప్రతిజ్ఞకు అర్ధాలు తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది” అన్న రాఘవతో --

“అలా అడిగేవారుండాలే గానీ, సంతోషంగా చెప్తాను నాయనా” అని –

“ధార్మిక, ఆర్ధిక, కామ విషయాలలో నువ్వు ఈ నూతన వధువును – అంటూ జానకి వైపు చూపించి -- అతిక్రమించి నడచుకోరాదు అని నీకు చెప్పిన నా మాటలకు నీవు ‘అటులనే నడుచుకుంటాను’ అని ప్రతిజ్ఞ చేసేవు. ఈ ప్రతిజ్ఞ నీ చేత చేయించవలసిన అవసరమేమంటే, ధర్మాన్ని ఎవరు అతిక్రమించినా అగచాట్లు తప్పవు. భార్యాభర్తల సంబంధం కేవలం లౌకిక విషయాలకు సంబంధించినది కాదు. అది మానవాళి మనుగడకు ఉపయోగపడే ఆత్మ సంబంధం. భార్య సహకారంతో మాత్రమే పురుషుడు దేవతా ఋణం పితృ ఋణం తీర్చుకోగలడు. అంత ప్రాముఖ్యం ఉన్న భార్యకు నచ్చనిది ఏదీ చేసే అధికారం భర్తకు ధర్మం ఇవ్వలేదు. అలాగే, భర్తను అనుగమించడమే భార్యకు సర్వధర్మాచరణం” అని ఆయన నేరుగా రాఘవకు, అంతర్లీనంగా జానకికి, దాంపత్య జీవనం గురించి క్లుప్తంగా బోధించేరు.

రాఘవ తన మెడలో మంగళసూత్రంతో మూడు ముళ్ళు వేస్తూంటే ‘తమ ఇద్దరినీ భార్యాభర్తలుగా బంధించే పవిత్ర సూత్రం కదా ఇది’ అని జానకి ఆ మంగళసూత్రాన్ని రెండు చేతులతో పట్టుకొని ఆప్యాయంగా చూసుకుంటూ మురిసిపోయింది.

మంగళసూత్రంతో ముళ్ళు వేస్తున్న సమయాన రాఘవ వేళ్ళు జానకి మెడ మీద చిలిపిగా నడయాడుతూ తీయని గిలిగింతలు పెడుతూ ఉంటే, ఆ స్పర్శలో ఆమెకు చెప్పలేని తన్మయత్వం కలగసాగింది.

“ఏ పవిత్ర కార్యం చేసినా ఇద్దరం కలిసే చేస్తాము; ఆర్ధిక విషయాలలో కలిసికట్టుగా ధర్మబద్ధంగా ప్రవర్తిస్తాము; కోరికల విషయాలలో ఒకరికి తెలియకుండా మరొకరు ఎటువంటి హద్దులు మీరం” – అని నూతన దంపతులు చేత పురోహితులవారు అగ్నిసాక్షిగా ప్రమాణాలు చేయించేరు.

అగ్ని చుట్టూ కొన్నిసార్లు రాఘవ ను అనుగమించి జానకి, మరికొన్ని సార్లు జానకిని అనుగమించి రాఘవ ప్రదక్షిణలు చేస్తూ ఉంటే, భార్యా భర్తలిద్దరిలో ఒకరు ఎక్కువ మరొకరు తక్కువ కాదు ఇద్దరూ సమానమే అని అర్ధం చేసుకోవాలన్న నిశ్శబ్ద సంకేతానికి ఇద్దరూ గౌరవంగా తలలు వంచేరు.

తొలుత మంత్రపూర్వకంగా నూతన దంపతులు తలంబ్రాలు ఒకరి మీద ఒకరు పోసుకున్నా, చుట్టూ కూర్చున్న చిన్నా పెద్దల ప్రోత్సాహంతో ఒకరి మీద మరొకరు పోటాపోటీగా త్వరత్వరగా తలంబ్రాలను పోసుకున్న వారి ఆనందాన్ని చుట్టూ ఉన్న బంధుగణం స్నేహితులు కూడా పంచుకున్నారు.

సగం పైన నీరు నిండిన బిందెలో ఒక బంగారు ఉంగరం వేసి జానకి రాఘవ లను ఏక కాలంలో ఆ బిందెలో చేతులు పెట్టమని, ఉంగరం బయటకు తీసినవారిదే గెలుపు అన్న పురోహితులవారితో పాటూ చుట్టూ ఉన్న బంధుగణం గెలుపు ఎవరిని వరిస్తుందో అని అందరూ కుతూహలంగా చూస్తూ ఉంటే, బిందెలో ఉన్న నీటిలో

ఉంగరం అంది పుచ్చుకున్న చేయి ఆ ఉంగరాన్ని ఈవలకు తీయకుండా, నీటిలో ఉన్న మరొక చేతిలో ఉంచుతూంటే, ఆ ఉంగరాన్ని తనకు ఇస్తున్న చేతిలోనే రెండో చేయి ఉంగరాన్ని ఉంచుతూంటే, భార్యా భర్తలకు ఆ ఆట ద్వారా ఒకరి మీద మరొకరికి గెలుపులో కాదు ఓటమిలోనే నిజమైన మానసిక ఆనందం ఉంటుందన్న సత్యాన్ని తెలియచేస్తున్న సభ్యసమాజపు ఆచారం పట్ల వారిద్దరి మనసులు కృతజ్ఞతతో నిండిపోయేయి.

జానకి రాఘవ ల చేత ఒకరి కాలు మరొకరు తొక్కడం తదితర మంగళకర కార్యక్రమాలు జరిపించిన పురోహితులవారు, చుట్టూ ఉన్న పెద్దలతో కలిసి వివిధ ఆచారాల పేరిట నవదంపతులు మానసికంగా ఒకరికొకరు దగ్గరయేందుకు తగిన అవకాశం కల్పించేరు. అలా ఒకరి కాలు మరొకరు తొక్కుతున్నప్పుడు, తనవల్ల అవతలివారు బాధపడకూడదన్న జాగ్రత్త పాటించాలని ఎవరూ చెప్పకనే మసలుకోవడం మన వివాహ వ్యవస్థ నూతన దంపతులకు చెప్పే పాఠం.

నూతన దంపతులను పక్కపక్కనే కూర్చోపెట్టి ఒకరిచేత మరొకరికి తినిపించే ఆచారంతో భార్యాభర్తలు ఏది దొరికినా పంచుకొని తినాలి అని తెలియచెప్పడం మన సభ్యసమాజం దంపతులకు నేర్పే మరో పాఠం.

అంపకాల చర్యతో అప్పటివరకూ నవ్వుతున్న అందరి మనసులూ భారంగా మారిపోయేయి. వధువు ఎడల తమకు కల ప్రేమాభిమానాలను పరిపూర్ణంగా వెల్లబరుస్తూ, కన్నీళ్లతో పుట్టింటివారు వీడ్కోలు చెప్పే క్షణాలలో ఉన్న కష్టసుఖాల సమ్మేళనం అనుభవైకవేద్యం తప్పించి వేయి నాలుకలు కల ఆదిశేషునికి కూడా వర్ణింప వీలుకాదు.

గృహప్రవేశ వేళ నూతన వధువు చేత పాయసం వండించడం అత్తవారింట్లో అందరికీ ఆమె ద్వారా ఎల్ల వేళలా తీపి తినే భాగ్యానందం కలగాలని చెప్పకనే చెప్పే గొప్ప సందేశం.

వివాహ వేడుకలలో అందరూ ఆఖరుగా మిగిలినదనుకున్నా – నూతన దంపతులకు మాత్రం తొలి ముచ్చట – వారి చేత జరిపించవలసిన పునస్సంధాన హోమంతో గర్భధారణకు జరిగే శోభనప్రక్రియ.

అంతులేని అలజడి, చెప్పుకోలేని భయం, చెప్పరాని ఉత్సాహం, ఉత్సుకత నిండిన మనసులతో ఏమి చేయాలో తెలియకుండా ఉండగానే జానకి రాఘవ లు ఆ చర్యకు ఉపక్రమించవలసి వచ్చింది.

మూసుకున్న శోభనపు గది తలుపుల వెనుక భార్యాభర్తల మధ్య జరిగే శృంగారం గురించి అందరకూ తెలిసినదే. అయినా, పెద్దల ఆశీర్వాదంతో ఆమోదంతో నూతన వధూవరులను శోభనగదిలో బంధించే క్రియతో వారి మధ్య జరిగే శృంగారానికి సభ్య సమాజ ఆమోదం లభిస్తుంది.

జీవితంలో దేనిగురించైనా ఎవరు ఎవరినైనా అడిగి తెలుకోవచ్చు. కానీ – సాంసారిక శృంగార జీవితం గురించి మాత్రం భార్యా భర్తలు తొలిరాత్రి నుంచే ఎవరికి వారే తెలుసుకుంటారు, తప్పులుంటే ఒకరి సహకారంతో మరొకరు సరిదిద్దుకుంటారు. వారిలో ఒకసారి ఒకరు గురువు మరొకరు శిష్యులైతే, మరొకసారి ఆ స్థితి అటుదిటు తారుమారై ఇద్దరికీ నూతన అనుభవం విచిత్రమైన ఆనందం పుష్కలంగా కలగచేస్తుంది. శోభనరాత్రి ఆనందాలు అనుభవించి మేల్కొన్న జానకి రాఘవ లు ఆ క్షణం నుంచి ఒకరినొకరు విడిచి ఉండలేని మానసిక స్థితికి చేరువైనారు.

తదుపరి జరిగిన విందుకార్యక్రమానికి వచ్చిన స్నేహితులకు జానకి “మా ఆయన” అని రాఘవను ఎంతో గర్వంగా పరిచయం చేసింది. అలాగే, తన స్నేహితులకు “నా శ్రీమతి” అని జానకిని పరిచయం చేస్తున్న రాఘవకు అమిత ఆనందం కలిగింది.

“మన హిందూమతం సాంప్రదాయంలో అనాదిగా ఇమిడి ఉన్న సంస్కృతికి ఈ రకమైన వివాహం ఒక ఉదాహరణ. ఇద్దరుగా కనబడుతున్న నూతన వధూవరులను మానసికంగా ఏకం చేయడంతో పాటూ ఒకరి కోసం ఇంకొకరు అని తెలిసి వచ్చేటట్టుగా తీర్చి దిద్దడమే ఈ వివాహంలో ఇమిడిన ఆచార వ్యవహారాల లక్ష్యం”

“ఇప్పుడు చెప్పండి మీకు ఈ అనుభవం కావాలా లేక ఒప్పందపత్రం కావాలా”

“మాకు కావలసినది మేము తెలుసుకోలేని స్థితినుంచి మమ్ము బయట పడేసి మాకు కనువిప్పు కలిగించిన మీకు ధన్యవాదాలు లాయరుగారూ. మేము ఇక్కడనుంచి మా పెద్దవారి దగ్గరకు నేరుగా వెళ్ళి వారిని ఎలా అయినా మా వివాహానికి ఒప్పించి మీరు మాకు వినిపించిన వివాహ కార్యక్రమంలోని మధురానుభవం పొందే ప్రయత్నం చేస్తాము. మా పెళ్లి శుభలేఖతో పునర్దర్శనానికి ఇద్దరమూ వస్తాము” అని లేచి వెళ్లబోతున్న వారిని ఆపిన లాయరుగారు –

“మీ వివాహ ప్రయత్నం సఫలం అవడమే కాక మీ వివాహం కూడా త్వరలో అవాలని కోరుతూ మీకు నేనిచ్చే నజరానా” అంటూ తాను తీసుకున్న ఫీజుతో పాటూ అంతకుముందు తయారుచేసిన ఒప్పందపత్రం చింపివేసి ముక్కలను వారిద్దరి చేతులలో పెట్టి -

“మీ వివాహానికి మీ పెద్దలను ఒప్పించేదుకు అవసరమైతే నాకు ఫోన్ చేసిన మరుక్షణం మీ సహాయానికి హాజరు అవుతాను. మీకివే నా ఆశీస్సులు. వెళ్ళి రండి. శుభం భూయాత్”

లాయర్ మహాలక్ష్మిగారు చెప్పిన కథంతా ఆమెదే అని సుగుణ సుందరం కు తెలియదు - ఆవిడ ఇప్పటివరకూ కూడా ఆ విషయం చెప్పలేదుగా మరి.

** శ్రీరామ**

మలి పలుకులు :

ఒప్పంద వివాహాలు మరియు లేచిపోయి పెళ్లిళ్ళు చేసుకొని విడాకులకు వ్యవధి

ఇవ్వకుండా మసలే యువతకు - మన వివాహ వ్యవస్థలోని మధురిమను చవిచూపిస్తూ –

ఆడ మగ మధ్య ఉండేది శృంగారంతో కూడిన ఆకర్షణ మాత్రమే కాదు – వివాహ సమయంలో

ఎదురయే అనురాగపూరిత మధురానుభవాలు కూడా –

అని తెలియచెప్పేందుకు చేసిన చిన్ని ప్రయత్నమే ఈ నా కథ.

---రచయిత.

మరిన్ని కథలు

Dayyala Porugu
దెయ్యాల పొరుగు
- నిర్మలాదేవి గవ్వల
Kalam tho.. srivari seva
కాలం తో ...శ్రీవారి సేవ
- హేమావతి బొబ్బు
Naanna nannu kshaminchu
నాన్నా..నన్ను క్షమించు..!
- యు.విజయశేఖర రెడ్డి
Jeevana bhruthi
జీవన భృతి
- వై.కె.సంధ్యా శర్మ
Manuvu mariyu chepa katha
మనువు మరియు చేప కథ
- హేమావతి బొబ్బు
Anakonda
అన”కొండ”
- రాపాక కామేశ్వర రావు
Cheekati pai yuddham
చీకటి పై యుద్ధం
- హేమావతి బొబ్బు