
ఉమ్మడి కూటుంబం కావడంతో ప్రోదున్నే ఆ ఇల్లు అంతా సందడిగా ఉంది. స్కూళ్ళకు, కళాశాలకు వెళ్ళడానికి సిద్ధమవుతున్న పిల్లలు, వారికి పాల గ్లాసులు, బద్దకంగ పక్క మించి లెస్త్తున్న మగవారికి కాఫీ గ్లాసులు అందిస్తూ, ఒకవైపు టీఫిన్స్, మరొకవైపు వంటలు చేస్తున్న ఆడవారితో ఇల్లు సందడిగా ఒ సుడిగుండం చుట్టిన ప్రాంతంలా ఉంది.
అంతటి గొలలో కుడా సూర్యం అలసటతో మంచంపై గాఢ నిద్రలో ఉన్నాడు. ఉజ్జయిని నుండి రెండు రోజుల రైలు ప్రయాణం చేసి, అర్ధరాత్రి ఇంటికి చేరుకున్న ఆయన పక్కనే ఉన్న ఫోన్ ఆగకుండా మోగుతున్నా ఎత్తకపోవడంతో తమ్ముడి కొడుకు హర్ష ఫోన్ తెచ్చి, "పెద్దనాన్న ఫోన్" అని సూర్యాన్ని తట్టి లేపాడు.
సూర్యం తన సెల్ ఫోన్ చెవి దగ్గరికి తీసుకుని "హలో" అని పలకగానే, అవతలి వైపు నుండి, సూర్యం పిన్ని కూతురు లక్ష్మి, “అన్నయ్యా, నువ్వు క్యాంప్ నుండి వచ్చేసే వుంటావు అనుకుని ఇంత ప్రోదున్నే ఫోన్ చేశాను. ఏమీ అనుకోవద్దు” అంది కొంచం యిబ్బందిగా. దానికి సూర్యం "పర్వాలేదమ్మా, నిన్న రాత్రి తిరిగి వచ్చేటప్పటికి ఆలస్యమయింది, అందుకే గాఢ నిద్రలో వుడి ఫోన్ అందుకోలేకపోయాను. మీరంతా బాగున్నారు కదా?" అని ప్రశ్నించాడు.
లక్ష్మి బదులిస్తూ, "మేము అంతా బాగున్నాం అన్నయ్యా, నీ ఉజ్జయిని క్యాంప్ ఎలా జరిగినది? ఆ శివయ్య దర్శనం చేసుకున్నావా?” అని ఆమె ప్రశ్నించడంతో సూర్యం మనసులో ఉజ్జయిని అనుభవాలు మెదిలాయి. ఆనందంతో పులకరిస్తూ, "చాలా బాగా జరిగింది అమ్మా, ఫోన్లో చెప్పడం కన్నా నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు వివరిస్తాను" అనగానే ఆమె “మా గురువుగారి మంచితనం గురించి నీకు ముందే చెప్పాను కదా, అక్కడ మీకు ఎలాంటి ఇబ్బంది కలగదనీ, నీకే నమ్మకం కుదరలేదు. ఆ విషయం తెలుసుకోవాలనే ఫోన్ చేశాను. సరే అన్నయ్యా, వీలు చూసుకుని తప్పకుండా వచ్చి ఉజ్జయిని విశేషాలు వింటాను. నువ్వు విశ్రాంతి తీసుకో, మళ్ళీ మాట్లాడుతాను" అని ఫోన్ పెట్టేసింది.
ఉజ్జయిని యాత్ర లక్ష్మి ద్వారానే ఏర్పాటు అవడమే ఆమెకు ఇంత ఆసక్తి కలగడానికి కారణం.
సూర్యంది మధ్య తరగతి ఉమ్మడి కుటుంబం, పెద్ద చిన్నాతో కలిపి డజను మంది. వృత్తిరీత్యా అతను వంట బ్రాహ్మణుడు. సూర్యం తండ్రికి ఆయన వంటను వృత్తిగా మార్చుకోవడం అసలు ఇష్టం ఉండేది కాదు, కానీ పరిస్థితుల కారణంగా అంగీకరించక తప్పలేదు. సూర్యం తండ్రి రాఘవయ్యగారు రైల్వేలో ఒక చిన్న ఉద్యోగీ. కుటుంబం పెద్దది కావడంతో ఇంటి అవసరాలు తీర్చడం చాలా కష్టంగా ఉండేది. సూర్యం పెద్దవాడు అవడంతో ఆయన ఆశలన్నీ అతనిపైనే పెట్టుకున్నారు. ఆయన రిటైర్ అయేనాటికి సూర్యం బాగా చదువుకుని ఓ చిన్న ఉద్యోగంలో చేరి సంపాదిస్తే, అది వారికి ఒక ఆసరాగా ఉంటుందని అనుకునేవారు రాఘవయ్యగారు.
అయితే సూర్యం తెలివైనవాడే కానీ చదువుపట్ల ఆసక్తి, ఏకాగ్రత రెండూ లేవు. స్కూల్ కైతే వెళ్ళేవాడు కానీ తరగతిలో ఫైల్ అవుతూ పదవ తరగతిని కష్టపడి పాసయ్యాడు. తండ్రి ఎంత బతిమాలినా ఇక ముందు చదవనని చెప్పేశాడు. సూర్యంకి చదువైతే లేదు కానీ ఆయన చాలా బాగా వంట చేసేవాడు. చిన్నప్పటి నుండీ ఆయనకు వంట చేయడం అంటే చాలా ఇష్టం. తల్లి వెనకాలే ఉండి ఆమె వద్ద కమ్మగా వంట చెయ్యడం నేర్చుకున్నాడు. రాఘవయ్యగారికి సూర్యం ఎప్పుడూ వంటింటిలో దూరి వంట చెయ్యడం నచ్చేది కాదు. ఆయన సూర్యం భవిష్యత్తు గురించి బెంగతో చీటికి మాటికి సూర్యంపై చిరాకు పడేవారు.
ఒకరోజు రాఘవయ్యగారు సంతలో తన చిన్ననాటి స్నేహితుడు సుబ్బారావుని కలిశారు. సుబ్బారావుగారు ఆ వూరిలో పేరుగాంచిన వంట బ్రాహ్మణుడు. ఆయన వంట ఎంత బాగా చేసేవాడు అంటే ఆ ఉరివారే కాదు చుట్టుపట్ల వూరి వారు కుడా తమ ఇంటి కార్యాలకు ఆయననే పేలిచేవారు. చాలా రోజులకి కలిసిన ఇద్దరు మీత్రులు కుశలక్షేమాలు మాట్లాడుకున్న తర్వాత రాఘవయ్యగారు తన మనసులోని బాధను దాచుకోలేక తన కొడుకు సూర్యం గురించి అతనికి చెప్పుకొచ్చాడు.
అంతా విన్న సుబ్బారావుగారు చిన్నగా నవ్వి “రాఘవా, నువ్వు అంతగా బాధ పడవలసింది ఏమి లేదు, మన చేతి వెళ్ళే దానికి నిదర్శనం . ఒక వేలు పొట్టిగా ఉంటే ఇంకోటి సన్నగా పొడుగ్గా ఉంటుంది. కానీ ప్రతి ఒక్కటి మన పనికి ఉపయోగపడుతుంది. కుటుంబంలో కూడా అంతే, ఒక పిల్లవాడు బాగా చదువుకుంటే, మరొకరు వేరే పనుల్లో నైపుణ్యం చూపవచ్చు. ప్రతి పిల్లవాడికి వ్యక్తిత్వం మరియు ఇష్టం ఉంటాయి ఇష్టమైన పనిని వృత్తిగా చేసుకుంటే జీవితం సంతోషంగా ఉంటుంది. తల్లి తండ్రులు ఇది తప్పక గుర్తించాలి. పిల్లలకు ఏది ఇష్టం అనేది చూసి, ఆ దిశగా ప్రోత్సహించాలి. నువ్వు సూర్యం గురించి బెంగ పెట్టుకోకు. అతన్ని నా దగ్గర పంపు. నాకు వచ్చింది నేర్పుతా. అతనికి నచ్చితే నా వెంట పనికి తెసుకొనివెళ్తా. ఏమి అంటావు” అనడంతో రాఘవయ్యగారు సంతోషంగా అంగీకరించి, సూర్యన్ని మరుసటి రోజే సుబ్బారావుగారి దగ్గరకి పంపించారు. ఇలా సూర్యం కొత్త జీవితం ప్రారంభమైంది.
ఇప్పటికీ 25 సంవత్సరాలుగా గురువు సుబ్బారావుగారితో కలిసి వంట చేస్తున్నాడు సూర్యం. ఇరువురు చిన్నాపెద్ద కార్యలకేకాక ఈ మధ్యకాలంలో పర్యాటక బృందాలతో కలసి యాత్రలకు కూడా వెళ్ళుతున్నారు.
సుబ్బారావుగారికీ వయస్సుతో కలిగిన శారీరక సమస్యలు ఉన్నప్పటికీ, చాలా ఉత్సాహంగా పని చేసేవాడు. సూర్యం “గురువుగారు, మీరు ఇంత కష్టపడి పని చేయడం అవసరమా?” అని అడిగితే, సుబ్బారావుగారు “పని చేయడం ఆరోగ్యానికి చాలా మంచిది సూర్యం. వాడకపోతే ఇనుముకు తుప్పు పట్టినట్లు మన శరీరంలోని అవయవాలు పని చేయడం మానేస్తాయి. అదేకాక నాకు వంట చేయడం చాలా ఇష్టం. చేతనైన్నని రోజులు చేస్తాను” అని ఎంతకాలు నొప్పి అయినా బయలుదేరేవారు.
సూర్యునికి చిన్నతనం నుండి కొత్త ప్రదేశాలు చూడాలనే కోరిక వుండేది, కానీ ఆర్థిక సమస్యల వల్ల అది నెరవేరలేదు. అందుకే, పర్యాటక బృందాలతో యాత్రలకు వెళితే ఆయన కోరిక కొంతమేర తీరుతుందనే ఆశతో ఒప్పుకునేవాడు. కానీ అతని కోరిక పెద్దగా తీరలేదు. భారతదేశంలో చాలా ప్రదేశాలకు వెళ్ళాడు, కానీ పర్యాటక బృందంవారికి నాలుగు పూటలు వండి వార్చే సరికే సమయం అయిపోయింది, వెళ్లిన ప్రదేశాలు చూడడానికి తీరిక ఉండేది కాదు. పోనీ తొందరగా పని ముగించి ఊరు చూసి వద్దాం అనుకుంటే బృందం నిర్వాహకులు కొన్నిసార్లు అసహనంతో ఒప్పుకుంటే, మరికొన్నిసార్లు మాత్రం కచ్చితంగా వెళ్లవద్దని చెప్పేవారు. పోనీ కష్టపడి వారికి నచ్చేలా వండినా, వారు మాటవరుసకు కూడా మెచ్చుకోకపోవడంతో సూర్యం మనసు నొచ్చుకునేది. సుబ్బారావుగారు మాత్రం “పరవాలేదులే, మన పని మనం బాగా చేస్తే చాలు, ఫలితం ఆశించకూడదు. గీతలో కుడా పరమాత్ముడు అదే తెలిపాడు” అని అనేవారు. యిలా సూర్యం చాలా చెడు అనుభవాలను ఎదుర్కొన్నాడు. కొంతకాలం క్రితం ఉత్తర భారత యాత్రలకి వెళ్ళి వచ్చిన వారు, ఇకపై యాత్రలకు వెళ్లకూడదని నిర్ణయిం వెనక ఒక బలమైన కారణం ఉంది.
జరిగింది ఏమిటంటే సూర్యం మరియు సుబ్బారావుగారు 15 రోజుల ఉత్తర భారతదేశ విహార యాత్రకు వెళ్ళుతున్న ఒక యాత్ర బృందంతో వంటకి కుదిరారు. యాత్రలో భాగంగా అయోధ్య, ఆగ్రా కూడా చూపిస్తారని తెలిసి సూర్యం, సుబ్బారావుగారు ఇద్దరు చాలా సంతోషించారు. సుబ్బారావుగారు బాలరాముడిని దర్శించుకోవాలని, సూర్యానికి చిన్నతనంలో పాఠ్యపుస్తకాలలో చూసిన అందమైన తాజ్ మహల్ చూడాలని కోరిక ఉండడంతో, యాత్రకి సంతోషంగా ఒప్పుకున్నారు. అయోధ్య చేరి తొందరగా పని పూర్తి చేసుకుని సాయంత్రం నిర్వాహకుడు అయిన సుబ్బయ్యగారిని బతిమాలాడి బాలరాముడి దర్శనం చేసుకోగలిగారు, కానీ ఆగ్రాకు ఆలస్యంగా చేరడంతో వంట పని అయ్యేసరికి సాయంత్రం అయింది. సుబ్బారావుగారు ఆరోగ్యం బాగాలేకపోవడంతో సూర్యం ఒక్కడే త్వరగా తయారై తాజ్ మహల్ చూసి రావడానికి సుబ్బయ్యగారిని అనుమతి అడిగాడు. ఆయన “ఏమిటయ్యా, సమూహంలో ఉన్న సభ్యుల్లా నువ్వు తిరగడానికి వెళతానంటే ఎలా? మళ్లా సాయంత్రం అందరూ వచ్చేసరికి పలహారాలు చేయాలి, సుబ్బారావుగారికీ ఆరోగ్యం బాగాలేదు అన్నావు, మరి ఏలా? మళ్ళా ప్రోదున్నే ఢిల్లీకి బయలుదేరాలి” అన్నాడు పరోక్షంగా కాదంటూ.
ఇక ఏమి అనలేక మనసులోనే బాధపడుతూ ఊరకున్నాడు సూర్యం. బజార్ కి వెళుతున్న వారిచేత చిన్న తాజ మహల్ బొమ్మ తెప్పించుకుని సంతృప్తిపడ్డాడు. ఆ సంఘటనతో ఇక ఎప్పుడూ యాత్రలకి వెళ్లవద్దు అని నిర్ణయించాడు సూర్యం.
సుమారు రెండు నెలల తర్వాత ఒక రోజు సూర్యం పిన్ని కూతురు లక్ష్మీ ఫోన్ చేసి, "అన్నయ్యా, నువ్వు ఒక పని ఒప్పుకోవాలి. నేను నువ్వు చేస్తావని మాట ఇచ్చేశాను. మా గురువుగారు రామాచార్యులుగారు ఉజ్జయినిలో సుమారు 50 మందితో 10 రోజుల ఆధ్యాత్మిక శిబిరం ఏర్పాటు చేశారు. అక్కడ ఆంధ్రా భోజనం దొరకడం కష్టం కాబట్టి, మంచి వంట బ్రాహ్మడు కావాలంటే నీ పేరును చెప్పాను. వారు త్వరలోనే నిన్ను సంప్రదిస్తారు" అని చెప్పింది.
అది విన్న సూర్యం “లక్ష్మీ, నీకు తెలుసుగా గతంలో యాత్రలలో వంట కోసం వెళ్ళినప్పుడు చాలా చేదు అనుభవాలు ఎదురయ్యాయి. అందుకే ఇకపై యాత్రలకు వెళ్లవద్దు అని నిర్ణయించుకున్నానమ్మా. వారితో నాకు వీలుపడదని చెప్పు” అన్నాడు బాధగా.
“అన్నయ్యా, అందరూ ఒకేలాగా ఉండరు కదా. అయినా మా గురువుగారు చాలా మంచివారు, చాలా ఆప్యాయంగా ఉంటారు. నేను కూడా వెళ్లాలని అనుకున్నా కానీ పిల్లాడి పరీక్షల కారణంగా వెళ్లలేక పోతున్నాను. నీకు నేను హామీ ఇస్తునాను, ఈసారి యాత్ర చాలా బాగా జరుగుతుంది. వారు ఫోన్ చేస్తే నా కోసం ఒప్పుకో" అని లక్ష్మీ అనడంతో సూర్యం కాదనలేక ఒప్పుకున్నాడు.
ఉజ్జయిని ప్రయాణం ప్రారంభమైన వెంటనే సూర్యంకి లక్ష్మీ ఈ యాత్ర గురించి అన్నది నిజమే అనిపించింది. సమూహంలో వారు తమ తమ ఊరుల నుండి, వారి సౌకర్యానికి అనుగుణంగా, కొంతమంది విమానంలో, కొందరు రైలులో బయలుదేరారు. సూర్యంకి, సుబ్బారావుగారికీ కూడా హిందీ అంతగా రాకపోవడంతో, వారికి సహాయంగా సమూహంలో కొంతమంది తోడు వచ్చి, వారితోపాటే ఏసీ బోగీలో టికెట్లు తీసుకుని, ఏ కష్టమూ లేకుండా ఉజ్జయిని తీసుకొని వెళ్లారు. ఉజ్జయినిలో కూడా వారు ఉన్న ఆశ్రమంలో మంచి వసతి సదుపాయం ఏర్పాటు చేశారు.
వెళ్లిన మొదటి రోజునే రామాచార్యులుగారు వారిని స్నేహపూర్వకంగా పలకరించి, వారి వంటను ప్రశంసిస్తూ "తృప్తికరమైన మంచి భోజనం పెట్టారు బాబు" అని అభినందించారు. వారికి అన్నీ సౌకర్యంగా ఉన్నాయా లేవా అని కుడా తెలుసుకునేవారు. ఇక సమూహంలో సభ్యులు సూర్యం, సుబ్బారావుగారికి ఏ ఇబ్బంది కలగకుండ చూసేవారు. ఆశ్రమంలో పని చేసేవారు వంటకు సహాయం చేయకపోతే, సమూహంలోని ఆడవారు వచ్చి వంటలో సాయపడేవారు. ఇలాంటి సమూహాన్ని సూర్యం ఎన్నడూ చూడలేదు. ప్రతి సాయంత్రం గురువుగారు భగవద్గీత, ఉపనిషత్తులను బోధించేవారు. వీలైనప్పుడు సూర్యం కూడా వాటిని వినేందుకు వెళ్ళేవాడు. గురువుగారు నాలుగో రోజు సూర్యంని పిలిచి "రేపు మీరు వంట చేయకండి, ఆశ్రమం వారు వంట చేస్తారు. మీరు ఆ కాళేశ్వరుని దర్శించి ఊరు చూడండి" అని చెప్పడంతో సూర్యం చాలా ఆనందించాడు. మరుసటి రోజు ఇరువురు ఆటో తీసుకుని మహాకాళేశ్వరుని, కాలభైరవుడిని దర్శించి, చిన్తామన్ గణేష్ దేవాలయానికి వెళ్లి వారి కష్టాలు, బాధలుతీరాలని ప్రార్థించారు. ఇన్నాళ్ళకి నిజమైన తీర్థయాత్ర చేసినట్టు అనిపించింది వారికి.
రామాచార్యులుగారు చివరి రోజు సాయంత్రం ఆయన ఏర్పాటు చేసిన ఓ చిన్న కార్యక్రమానికి సూర్యం, సుబ్రమణ్యంగారిని ఆహ్వానించారు. వారు ఇద్దరూ తయారై సభకు చేరుకుని చివరి వరసలో కుర్చీలపై కూర్చున్నారు. గురువుగారు వేదికపైకి వచ్చి ఉజ్జయిని యాత్రలో సహాయం చేసి, యాత్రను విజయవంతం చేసిన సభ్యులను, ఆశ్రమం లో పనిచేసే వారిని ఒక్కక్కరిని పిలిచి సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. చివరికి రామాచార్యులుగారు సూర్యం, సుబ్బారావుగారు కూర్చున్న వేపు చూసి, సంబోధిస్తూ “మనందరికీ గత 10 రోజులుగా శ్రమపడి కమ్మటి తెలుగు భోజనం వండి పెడుతున్న సూర్యం, సుబ్బారావుగారు వేదిక పైకి రావాలని కొరుతున్నాను” అనడంతో వారు ఇద్దరూ కొంచెం ఆశ్చర్యంతో ఒకరినొకరు చూసుకుని మోహమాటంగా వేదిక పైకి వచ్చి గురువుగారికి నమస్కరించారు.
గురువుగారు వారిని ఆప్యాయంగా కూర్చుండబెట్టి శాలువా కప్పి, మెడలో రుద్రాక్ష మాల వేసి, ఒక రాతి లింగం కూడా బహుకరించి వారిని రెండు మాటలు మాట్లాడమన్నారు. సుబ్బారావుగారు అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలిపి, సూర్యాన్ని మాట్లాడమని మైక్ అందించాడు. సూర్యం పొంగుకువస్తున్న కన్నీటిని తుడుచుకుంటూ మైక్ అందుకుని, "నాకు పెద్దగా చదువు లేదు, మీలాంటి మహానుభావుల ముందు మాట్లాడేంత అర్హత కూడా లేదు. కానీ, గురువుగారు అన్నారు కాబట్టి, ధైర్యం చేసి, రెండు మాటలు మాట్లాడుతున్నాను, “ఈ రోజు మా జీవితంలో మరువలేని రోజు, ఎందుకంటే మేము కలలో కూడా ఊహించనిది జరిగింది. నేను గత 25 ఏళ్లుగా చాలా కార్యక్రమాలకు, పెళ్ళిళ్ళకు, యాత్రలకు వెళ్లి వంట చేస్తున్నాను, కానీ ఇలాంటి అనుభవం ఎక్కడా కలగలేదు. ‘బాబూ, అన్నం ఇంకా ఉడకలేదు, పులిహారలో పులుపు తక్కువైంది, పచ్చడిలో ఉప్పు చాలదు’ అని అనేవారే, కానీ ఇలా వంట వారిని సత్కరించి, సన్మానించడం ఏనాడూ చూడలేదు. కొన్నిసార్లు గౌరవం, మర్యాదలేని వంట పనిని వృత్తిగా మార్చుకుని తప్పుచేశానేమో అనిపిచేది. కానీ ఈ నాడు ఆ భ్రమ తొలగిపోయింది. మీ అందరికి వండి పెట్టడం నా అదృష్టంగా భావిస్తున్నాను.
అలాగే ఈ సమూహంలో ఉన్న సభ్యుల గురించి కూడా ఒక్కమాట చెప్పాలి. ప్రతి ఒక్కరూ గురువుగారి అడుగుజాడల్లో నడుస్తూ, మాకు గడిచిన 10 రోజులుగా మేము చేసిన వంటను మెచ్చుకుంటూ, వారు ప్రతీ అడుగులో అందించిన సహాయం మరువలేనిది. పూజ్యులైన రామాచార్యులుగారు ఉదార హృదయం కలిగిన గొప్ప వ్యక్తి. గురువుగారు ఇక్కడ చెప్పిన ఒక భగవద్గీత శ్లోకంలో, కృష్ణ పరమాత్మకు ఇష్టమైన వారు ఎలా ఉంటారో వివరించారు,
అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ ।
నిర్మమో నిరహంకారః సమదుఃఖసుఖః క్షమీ ।।
అంటే ‘ఎవరు సమస్త ప్రాణుల పట్ల ద్వేషం లేకుండా, స్నేహంగా, దయతో ఉంటారో, మమకారము, అహంకారము లేకుండా, సుఖదుఃఖాలను సమానంగా స్వీకరిస్తారో, ఓర్పు కలిగి ఉంటారో, వారే నాకు ప్రియమైనవారు" అని. ఈ వివరణ పూజ్యులైన గురువుగారికి సరిగ్గా వర్తిస్తుందని అనిపించింది. ఆయన సుఖ సంతోషాలతో ఉండాలని, అతని జ్ఞాన జ్యోతి ఇంకా చాలా మంది జీవితాలలో అలుముకున్న చీకటి తొలగి ప్రకాశం చేకూర్చాలని కోరుకుంటున్నాను” ఆంటూ సభలో అందరికీ సవినయంగా దండం పెట్టి, మసులోనే మళ్ళా మళ్ళా ఇలాంటి యాత్రలు చేసుకునే అదృష్టాన్ని ప్రసాదించమని ఆ మహాకాళేశ్వరుని వేడుకున్నాడు.
***