చిరు కానుక - Prabhavathi pusapati

Chiru kaanuka

"రేపు మీరు అన్నట్టే శాంతి తపోవనం కి వెళ్ళి పోదాము " గదిలోకి వస్తూ దూరంగా పడక కుర్చీలో పడుకొని రామాయణం -మానవీయ బంధాలు "అనే చాగంటి గారి ప్రవచనం వింటున్న సూర్యంగారి ని ఉద్దేశిస్తూ అని కన్నుల నీరు ఆయనకి కనపడ కుండా మంచం మీద నడుము వాల్చింది కమల . "అదేమీ ఉన్నట్టు వుండి మనసు మార్చుకొన్నావు. మనకేమి ఖర్మ? మనకి ఇంత మంది మార్బలం ఉండగాఎవరు లేని వాళ్ళల్లా రిటైర్మెంట్ హొమెస్ మనకి ఎందుకు అని అన్నావు ?" సౌండ్ తగ్గిస్తూ అడిగారు . వున్నారు వున్నారు ,పేరుకి పది మంది . ఉండడముఅంటే మనస్సులో ఉండటం కానీ , చుట్టరికాని కి చెప్పు కోవటాని కి అని కాదు ,చూసారుగా మీ పిల్లల నిర్వాకం ,ఇన్నాళ్లు ఎవరు ఏమి అనుకొన్న మన పిల్లలు మనలని చక్కగా అర్థం చేసుకొంటారు అన్న ఆశ ఐన ఉండేది ,పొద్దున్న చిన్న కూతురు చేసిన రచ్చ తో మనసు విరిగి పోయింది. రేపు భోజనాలు అయ్యాక వెళ్ళి అక్కడ ఉండ టానికి కి కావాల్సిన వి ఏమిటో కనుక్కొని వద్దాము ,పడుకోండి పొద్దు పోయింది అంటూ పక్కకు తిరిగి పడుకొంది. వింటున్న ప్రవచనం ఆపి వచ్చి కమల పక్కన నడుము వాల్చారు కానీ సూర్యంగారి మనసు రక రకాల ఆలోచనలతో సుడులు తిరుగుతోంది . కమల సూర్యంగారి జీవితం లో అడుగు పెట్టి దాదాపుగా 50 వసంతాలు పూర్తి కావస్తున్నాయి .నిన్న మొన్న జరిగినట్టు అప్పటి రోజులు గుర్తుకు వస్తున్నాయి . "పెళ్ళికి అమ్మాయి వాళ్ళ కండిషన్ ఒక్కటేనట చేసుకో బోయే అబ్బాయి వాళ్ళకి పెద్ద కుటుంబం వుండాలిట.ఎవరైనా ఆస్తి పాస్తులు ఉండాలి ,ఒక్కడే కొడుకు అయ్యి ఉండాలి ఇలా ఉంటే బాగుంటుంది అని అనుకొనే రోజుల్లో ఇలా ఆలోచించే వాళ్ళు వున్నారు అని నాకే ఆశ్చర్యం వేసిందనుకోండి "పెళ్లిళ్ల పేరయ్య గొంతు విన్న సూర్యం కి నిజంగా చేసుకొంటే ఇలాంటి అమ్మాయి నే చేసుకోవాలి అని అప్పుడే అనిపించింది. సూర్యం వాళ్ళది పెద్ద వుమ్మడి కుటుంబం .సూర్యం తండ్రి అయన తమ్ముళ్లు అనుకోని అందరు ఒక వీధి లోనే వరసగా ఇల్లు కట్టుకొని అందరిదీ ఒక్క మాట మీద అన్నట్టు అందరు కలివిడిగా ఉండేవారు. కమల పెళ్లి అయ్యి ఇంటికి వచ్చేటప్పటికి ఇల్లంతా పెద్దలతో పిల్లలతో,మరుదులు ఆడపడుచులు తో కళకళ లాడుతూ ఉండేది , కొద్దీ రోజుల్లోనే సూర్యం తో పాటు ఇంటిల్లిపాది అమ్మాయి కోడలా, కమలత్త ,కమల పిన్ని ,కమలక్క పెద్దమ్మ ఇలా అనేక పేర్లతో ,పిలుపులతో ఇల్లు మారు మోగేది .కమల కూడా రోజంతా అందరు తనవారే అన్నట్టు అందరి అవసరాలు తీరుస్తూ అందరికి తలలో నాలిక లా అయిపోయింది . . పెళ్లి ఐన కొత్తల్లోనే అమాయకంగా "ఏవండీ మనం ఓ పదిమంది ని కందాము . లేదా ఓ నలుగురిని దత్తత చేసి తెచ్చుకొని పెంచుకొందాము. నా చిన్నతనము అంతా ఒంటరిగానే గడిచింది.మన ఇల్లు పిల్లలతో ఎప్పుడు సందడిగా ఉండాలి.వాళ్ళు మన ప్రేమ ఆప్యాతల మధ్య గొప్ప పౌరులుగా పెరగాలి "అని. కమల కోరినట్టే ఇద్దరు అబ్బాయిలు,ఇద్దరు అమ్మాయిలు కలిగారు.కమల తల్లిగా తనవంతుకర్తవ్యం నిర్వహించి ఇటు పిల్లలిని అటు పెద్ద వారి అవసరాలు గుర్తించి వాటిని నెరవేరుస్తూ తన భాద్యత సక్రమంగా నెరవేర్చింది..పెద్దవారి సేవలతో,మరుదులు ఆడపడుచుల పెళ్లిళ్లు,పురుళ్ళు ,పిల్లల ఆలనా పాలనతో కమల ఎప్పుడు కమల నుండి కమలమ్మ గాఁ రూపాంతరం అయ్యిందో గమనించనే లేదు. కాల చక్రం తోపాటు అన్నింటా ఎన్ని మార్పులు వచ్చాయో ,మనుష్యుల మధ్య ఉన్న అనుబంధాల లో కూడా వచ్చేసాయి. కమలకి మాత్రం ఈ విషయం మనసు కిఎక్కలేదు,తను తనవాళ్ళ తో ఉన్న అను బంధాల మధ్య ఎటువంటి తేడా రాదు అని గుడ్డిగా నమ్మిన తత్త్వం వలన అందరి బాగోగులు తనకే కావాలని ఆరాట పడేది. ఒక్కోక్క సంఘటన కమల అంచనాలను తలకిందులు చేస్తూ జరగసాగాయి .బాబాయ్ కొడుకు పెళ్ళిలో చనువుగా అందరిని పలకరిస్తూ ,చొరవగా ప్రతి పని లోను సాయం చేస్తూ తిరుగుతున్న కమలని బాబాయ్ కోడళ్ళు "అత్తయ్యగారు మీరు పెద్ద వారు అయ్యారు కదా ,కొంచెం మీ పెత్తనం తగ్గించి పక్కన కూర్చుంటే చాలు అదే మీరు మాకు చేసే పెద్ద సాయం, మాకు సంతోషం "అని మెత్తగానే చెపుతూ మీ పెద్దరికం మాకు అవసరం లేదు అని చెప్పకనే చెప్పేసారు.ఇలా చెదురు మొదురు సంఘటనలు నెమ్మది నెమ్మదిగా అనుబంధం ఆప్యాయత అంతా ఒక బూటకం ఆత్మ తృప్తికై మనుషులు ఆడుకొనే నాటకం అన్న ఆత్రేయగారి పాట నిజం అన్న తీరున గడిచాయి. కొన్ని రోజులు మధనపడిన కమల మళ్ళీ తేరు కొని పరాయి ఇంటి ఆడపిల్లలు కాబట్టి తేలికగా అనేసారు ,నా కడుపున పుట్టిన పిల్లలు చూడండీ నన్ను ఎంత ఆప్యాయంగా గౌరవంగా చూస్తారో అని మనసుని సమాధాన పరుచుకొంది. కొద్దీ కాలానికే అది కూడా భ్రాంతి అని తేలి పోయింది.పెద్దవాడు ,కోడలు పిల్లలు క్రిస్మస్ సెలవులకి పది రోజులు మీ దగ్గర గడపటానికి వస్తున్నాము అన్న వార్త వినగానే లేని ఓపిక తెచ్చుకొని వాళ్ళకి ఇష్టమైన వి అన్ని వండి పెట్టింది .పిల్లలు "ఓహ్! ఇవన్నీ చాల ఆయిల్ ఫుడ్స్ గ్రానీ,మాది అంతా ఫాస్ట్ ఫుడ్ ,డోంట్ కుక్ ఫర్ అస్ "అని ప్రేమతో వండిన వంటని,మమకారం తో వడ్ఢిద్దాము అన్న కమల మనసుని తీసి పడేసారు. అబ్బాయి ,కోడలు పిల్లలు పట్టణాల్లో పెరిగారు కాబట్టి ఆ మాట అన్నారు.వు రుకు పరుగుల జీవితం తో అలా యాంత్రికంగా అయిపోయి మొక్కుబడిగా మాట్లాడారు . చూస్తూవుండండి రేపు రాబోయే పెద్ద అమ్మాయి గృహప్రవేశం లో మమ్మా ,మమ్మా అంటూ మనుమలు, మన కోసం పిల్లలు ఎలా ఎదురు చూస్తూ వుంటారో,మనని ఎలా ఆదరిస్తారో.మనం ఓ పది రోజుల ముందు వెళదాము ,పనుల్లో సాయంగా ఉంటాము "అని ముందే వువ్విళ్ళు వూరింది . " కమల !పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు ,ఎవరి ప్రపంచం వాళ్ళది అయిపోయింది.నువ్వు కొంచెం మనసు కి నచ్చ చెప్పుకో,ప్రేమ నీ మనసులోనే ఉంచుకుంటే మంచిది."కమల ఉత్సహానికి పగ్గాలు వేస్తూ చెప్పారు సూర్యం గారు . అనుకొన్న రోజు రానే వచ్చింది. రేపు ఫంక్షన్ అనగా ముందు రోజుకి రమ్మని కబురు వచ్చింది. అదేమిటీ !అన్ని ఏర్పాట్లు అయిపోయాయి ,మేము వచ్చి సాయం చేద్దాము అని అను కొన్నాము ,ఐనా ఇంత లేటుగానా రమ్మనేది "వుండబట్ట లేక అడిగేసింది కమల. " నీది మరి చోద్యం అమ్మ ! ఇంకా అంతా నీ కనుసన్నల లోనే జరగాలి అని నువ్వు అను కొంటె ఎలా???,మేము పెద్దవాళ్ళం అయ్యాము ,మా ఇంటి గృహప్రవేశము మాది ,మా పిల్లల టేస్ట్ ని బట్టి జరుగుతుంది,ఇంకా నీ పాత చింతకాయ టేస్ట్ ఎవరికీ కావాలి?ఆర్డర్ చేస్తే పనులు అన్ని ఈవెంట్ మానేజ్మెంట్ వాళ్ళు చేస్తారు. రేపు మా ఫ్రెండ్స్ ముందు కూడా మా కాలం, ఆ రోజుల్లో అంటూ నసగకు".మెత్తని చెప్పుతో కొట్టినట్టు తేలికగా చెప్పేసింది. ఫంక్షన్ ఐన రాత్రి "నిజమే లెండి ,ఫంక్షన్అల్లుడు హోదా కి తగ్గట్టు చేసుకొన్నారు,మనది ఏముంది పిలిచారు,వచ్చాము,సంతోషం గాఁ రెండు అక్షంతలు వేసాము. మీరు అన్నది కూడా కరెక్ట్ మన ప్రేమలు మనవరకే ,ఇంత దూరం వచ్చాము కదా చిన్నవాడు ఆఫీస్ పని అని రాలేదు ,వాడిని చూసి అక్కడి నుండి ఇంటికి వెళ్లి పోదాము."మనసుని సమాధానపరచుకొని నడుము వాలుస్తూ సూర్యం గారిని అడిగింది. వద్దు అని విసురుగా అందామనుకొని కూడా అమాయకంగా పిల్లల ప్రేమ ఆప్యాతల కోసం ఆరాట పడుతున్న కమల అభ్యర్ధన ని కాదనలేక పోయారు. "ఇంటికి వెళ్లి పోతారు అను కొన్నాము అత్తయ్య,మీరు ఇలా వస్తారని అసలు అనుకోలేదు " తలుపు తీస్తూ ఎందుకు వచ్చారు అన్నట్టు గానే అడిగింది చిన్న కోడలు. "అబ్బాయి ఆఫీస్ పని లో బిజీగా వున్నాడు కదా ,మేమె మిమ్మలిని చూడాలని అని పించి వచ్చాము అమ్మాయి ,అన్నట్టు ఏమిటి బాగ్ లు సర్ది వున్నాయి ?ఎక్కడికైనా ప్రయాణమా? " పిల్లలు ఎప్పటి నుంచో మాల్దీవ్స్ చూడాలని గొడవ పడుతున్నారు అమ్మ అందుకు, సాయంత్రం ఫ్లైట్,సడెన్ గాఁ మీరు వస్తారు అని అనుకోలేదు.కొంచెం తడబడుతూ చెప్పాడు. పర్వాలేదురా ,మిమ్మల్ని చూడాలి అని మీ అమ్మ అంటుంటే ఇటు వచ్చాము,మేము మధ్యాహ్నం బండి కి వూరు వెళ్ళిపోతాము ,యు క్యారీ ఆన్ విత్ యువర్ ప్రోగ్రాం" సూర్యం గారి మాటలతో కొంచెం ఉపిరి పీల్చు కొన్నారు భార్యాభర్తలు . బయలు దేరిపోతూ " నాన్న నేను ఎప్పటి నుంచో కాశి చూడాలని అనుకొంటూ న్నాము రా ,వేసవి సెలవుల్లో కొంచెం నువ్వు తోడు వస్తే ..... నాకు ఎలా కుదురు తుంది అమ్మ ?నేను ఫుల్ బిజీ ...ఐనా మా పిల్లలికి కూడా అప్పుడే కదా హాలిడేస్ ,మేము ఫ్రెండ్స్ తో యూరోప్ ట్రిప్ వెళ్ళాలి అని ఎప్పటి నుంచో అను కొంటున్నాము,కొంచెం మా స్వార్ధం కూడా మేము చూసు కోవాలి కదా.ఇంకా ఎన్నాళ్ళు అమ్మ నాన్న అని పట్టు కొని వేలాడతాము?మాకు మా పర్సనల్ లైఫ్ ఉండాలి కదా..కుండ బద్దలు కొట్టినట్టు చెప్పాడు . బస్సు లో ప్రయాణం చేస్తున్నమాటే గాని బరువెక్కిన గుండెలు,ధారాలై వర్షిస్తున్న కళ్ళు మొదలంటా నరికేసిన చెట్టులా అయి పోయిన కమలని చూసి ఏమి చెయ్యలేక సూర్యంగారు జాలిగా చూస్తుండి పోయారు.. ఎప్పుడు ఇంటికి చేరారో తెలియనే లేదు. " ఊరికి దూరంగా శాంతి తపోవనం అని రిటైర్డ్ హొమెస్ కట్టారుట కమల ,మనం వెళ్లి చూసి వద్దాము ,ఈ మధ్య పిల్లలు విదేశాల్లో ఉన్న తల్లి తండ్రులు అంతా వెళ్లి అక్కడ ఉంటున్నారట.అన్ని సౌకర్యంగా ఉన్నాయిట ,ఇప్పుడు చాలామంది చేస్తున్న పని ఇదేనట "కొంచెం కమల తేరుకున్నాక ప్రస్తావన తెచ్చారు సూర్యంగారు. మీరే అంటున్నారు కదా విదేశాల్లో ఉన్న పిల్లల తల్లి తండ్రులని ,మన కి భగవంతుడు నలుగురిని ఇచ్చాడు కదా ..అందరు మన దేశం లోనే ఉన్నారుగా ...అంది.తన పిల్లలు తమని వదిలి పెట్టారు అన్న భ్రమ ఇంకా వీడని కమల . పిల్లలు ఎంత దూరంగా ఉన్నారన్నది కాదు,మన మనసు కి ఎంత దగ్గరగా వున్నారు అన్నది ముఖ్యం.కానీ ఇప్పుడే కోలుకొంటున్న కమలని మాటలతో గాయ పరచటం ఇష్టం లేక మళ్ళీ సందర్భం వచ్చి నప్పుడు నచ్చచెపుదాము అని మౌనంగా ఉండిపోయారు సూర్యంగారు. కానీ మళ్ళీ ఇంత త్వరగా ఆ ప్రస్తావన తీసుకు రావలసిన సందర్భం రానే వచ్చింది. సూర్యం గారు రిటైర్ అయ్యాక ఉన్న ఆస్తి సరి సమానంగా పిల్లల పేరున రాసేశారు.ఇల్లు మాత్రం తమ తదనంతరం పిల్లకి అని చెప్పారు .ఇప్పుడు చిన్న కూతురు అల్లుడు వాళ్లకి దగ్గరగా ఉన్న గేటెడ్ కమ్యూనిటీ లో విల్లా ఒకటి అమ్మకానికి వచ్చిందిట దానిని కొనటానికి పెద్ద మొత్తం కావలిసి వచ్చింది అందుకు ఇప్పుడు తల్లి తండ్రి ఈ ఇల్లు అమ్మేస్తే వచ్చే సొమ్ము వాళ్ళకి కట్టేస్తారు అని" ఇల్లు బేరానికి పెట్టు నాన్న "ఉపోద్ఘాతం గాఁ సెలవిచ్చింది. "ఇప్పటికి ఇప్పుడు ఇల్లు అమ్మ మంటే నేను నాన్న ఎక్కడ ఉంటాము ?ఈ వయసులో ఉన్న ఈ ఆసరా మాకు కూడా ఇల్లే కదా ..నువ్వు అల్లుడు ఇంకో చోట డబ్బుకి అడగలేకపోయారా ... అనుకొన్నాను అమ్మ ,నువ్వు ఈ మాట తప్పక అంటావని, చూసారా చూసారా నేను చెప్పాను కదా ..మా నాన్న కి అభ్యంతరం ఉండదు,కానీ అమ్మ మాత్రం పడనీయదు అని.అమ్మకి నేనంటే ఎప్పుడు చిన్న చూపే ,అన్ని సేవలు ,అన్ని ప్రేమలు పెద్ద వాళ్ళకే ..నేను అడిగిన ఈ చిన్న కోరిక తీర్చడానికి ఎన్ని సాకులు చెపుతోందో... అదికాదు పాపాయి..నువ్వు కూడా ఆలోచించాలి కదా ఈ వయసులో మేము ఎక్కడ ఉండాలి అని .... ఏంటి నాన్న మీరు కూడా అవసరం వచ్చి నప్పుడే కదా. మిమ్మలిని అడిగేది ,నువ్వు అమ్మ మీ జీవితం అనుభవించేసారు కదా.. ఇప్పుడు మీరిద్దరూ ఎక్కడైనా ఉండచ్చు.మా నలుగురి దగ్గర తలో నాలుగు నెలలు వుండండి.కొన్నాళ్ల తర్వాత ఏదయినా హొమెస్ లో చేరండి.మంచి విల్లా తక్కువ ధరలో ఇస్తామని వాళ్ళు ముందుకు వస్తే ఐన వాళ్ళు పైగా మా అమ్మ నాన్న సాయం చేస్తారు అని మా అత్తగారి ఇంట్లో అందరికి చెప్పి వచ్చాను .ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని వేళ్ళ మంటావు నాన్న ???? దాదాపు పెద్ద గొంతు తో ఏడుస్తూ చుట్టుపక్కల నాలుగు ఇళ్ళకి వినపడేలా రాద్ధాంతం చేస్తోంది. "సరేలే అమ్మ అలాగే నేను మీ అమ్మ తో మాట్లాడి నీకు కబురు చేస్తాను" అన్న సూర్యం గారి మాటల కి చల్లబడి సంతోషం తో బయలుదేరింది. గొడవ సర్దుమణి గింది కానీ కమల స్థాణువులా అయిపోయింది.ఎన్ని సంసారాలు గురించి విన్న ,ఎంత మంది పిల్లలని చూస్తున్న ప్రతి తల్లి లాగే కమల కూడా నా పిల్లలు ఆణి ముత్యాలు,నా పెంపకం చాల గొప్పది.ఎవరు ఎలా మాట్లాడిన నా కడుపున పుట్టిన నా పిల్లలు మాత్రం ఎన్నటికీ ఇలా మాట్లాడారు.నన్ను వాళ్ళ చిన్నప్పటి నుంచి వాళ్ళ మీద పంచిన ప్రేమని చూస్తూ ,మేము ఎన్ని కష్టాలు పడి వాళ్ళని పెంచాము చూసారు కదా అంతా తెలిసి కూడా ఇంత పాషాణాలుగా ,యాంత్రికంగా ఎలా మారిపోయారు??? పడుకొన్నదే కానీ కమల మనసు ఆవేదనతో రగిలి పోతోంది. పిల్లలు కాబట్టి ఎలాగా ఐన మాట్లాడవచ్చు .తమ మాటల ఈటెలు ఎంత తీవ్రంగా గాయం చేస్తున్నాయో వాళ్ళ కి అసలు తెలుస్తోందా ?ప్రేమ మత్తు లో వాళ్ళల్లో వస్తున్న మార్పు నాకు తెలియలేదా ?లేక వాళ్ళు పుట్టడమే ఇంత స్వార్ధం తో పుట్టారా?మమ్మలిని ఎంత తేలికగా తీసుకొన్నారు ,ఎంత చులకన చేసి మాట్లాడు తున్నారు. నా పెంపకం లో నే ఏదైనా లోపం వుందా?? కమల నిద్ర మత్తు లో పిల్లలిని కలవరిస్తూనే వుంది.పక్కు వత్తిగిల్లి "కమల ,కొంచెం నీళ్లు తాగు" అని గ్లాస్ చేతికి అందించారు. "ఇంకా పడుకోలేదా?పిల్లల గురించి ఆలోచిస్తున్నారా? " దుప్పటి సరిచేస్తున్న సూర్యంగారిని బేలగా చూస్తూ అడిగింది. "లేదు,లేదు మన గురించి ఆలోచిస్తున్నాను .పిల్లలు అన్న మాటలు మనసుకి తీసుకోకు కమల ,మనం కాకపోతే వాళ్ళని ఎవరు అర్థం చేసుకొంటారు చెప్పు.పని వత్తిడివల్ల ,మారిన సమాజపు విలువల వలన పిల్లల మాటతీరు మారిపోయింది. ప్రశాంతం గాఁ పడుకో .రేపు పొద్దున్న మాట్లాడు కొందాము " .అన్నారు ప్రయాణపు బడలిక తో వడిలి పోయిన కమల ముంగురులు సవరిస్తూ . " ఏమి ఆలోచించారు ఇంటి గురించి? పెద్ద పిల్లల కి కూడా మాట చెప్పాలేమో .ఇంటి బ్రోకర్ రామస్వామి కి కబురు పెట్టేరా ?"చేతిలో కాఫీ అందిస్తూ అడిగింది కమల . "లేదు రాత్రి నువ్వు అన్న మాటలని గుర్తు చేసు కొంటున్నాను ,మన ఇద్దరి భవిష్యత్తు ఏమిటా అని " కొంచెం తేరుకున్న కమల ని సంతోషం గాఁ చూస్తూ కుర్చీ లో కూర్చుంటూ అన్నారు. ఇల్లు వ్యవహారం తీరాక శాంతి తపోవనం గురించి ఆలోచిద్దాము "కొంచెం దీనం గాఁ వినపడింది కమల గొంతు. రాత్రి నుంచి నీ గురించి ,మన గురించి చాల ఆలోచించాను కమల .నీ మనసు కోరుకునేది ఏమిటో నాకు బాగా తెలుసు ,నువ్వు అందరిని మన వాళ్ళ లాగా ఆదరించాలి ,సాధ్య మైనంతవరకు అందరికి ప్రేమ పంచాలి అన్నది నీ భావన .అది తీరే మార్గం ఒకటి అనిపించింది ,నువ్వు అనే దానివి కదా! మనకి పిల్లలు కలగక పొతే ఓ నలుగురిని దత్తత చేసుకొందామని,ఇప్పుడు అది నెరవేర్చు కొందాము, మనం మన వూరు దత్తత తీసు కొందాము ,మనకి ఓపిక ఉన్న రోజులు మన ఊరిని బాగు చేద్దాము,అప్పుడు మనకి అందరు ఉన్నారన్న భావన ఉంటుంది .నీ కోరిక నెరవేరుతుంది .ప్రేమ కేవలం సొంతపిల్లలు కి మాత్రమే పంచనవసరం లేదు,ఆప్యాయంగా ఆదరించే మనసు ఉంటే అవి అందరితో పంచు కోవచ్చు "సూర్యంగారు చెపుతున్నది కల లేక నిజమా అన్నట్టు చూస్తోంది కమల. "అందుకే మనం ఇప్పుడే శాంతి తపోవనం లో చేరటం లేదు కమల,ఏమో రేపు మన ఇద్దరిలో ఎవరికీ అక్కడ చేరే అవసరం వస్తుందో ?ఇప్పుడు మాత్రం నీ కోరిక ప్రకారం ఊరిని దత్తత తీసుకొంటామని మన ఊరి కరణం గారికి కబురు పంపాను .నేను నీ మనసు ఎరిగి ఈ వయసులో ఇస్తున్న " చిరుకానుక" అనుకో,పద దానికి తగిన ఏర్పాట్లు చేసుకొందాము "అంటూ హుషారుగా కమలమ్మగారి కి చేయి (యుత) అందించారు సూర్యంగారు. " మానవత్వం పరిమళించే మంచి మనసుకు స్వాగతం" దూరంగా రేడియో లో నుండి వస్తున్న పాట వింటూ నవ్వుతు తన సమ్మతం తెలిపినట్టు చేయి అందుకొన్నారు కమలమ్మగారు.

మరిన్ని కథలు

Jada bharathudu
జడభరతుడు
- డా:సి.హెచ్.ప్రతాప్
Vidhivanchitha
విధివంచిత
- రాపాక కామేశ్వర రావు
Anavayoteetho abdhikam
ఆనవాయితీతో ఆబ్దికం
- మద్దూరి నరసింహమూర్తి
Gunthala Raju
గుంతల రాజు!
- - బోగా పురుషోత్తం
Adrustavanthulu
అదృష్టవంతులు
- యు.విజయశేఖర రెడ్డి
Adarsha kutumbam
ఆదర్శ కుటుంబం
- డా:సి.హెచ్.ప్రతాప్