ఓ చెల్లి తంజమ్మ కథ - హేమావతి బొబ్బు

O chelli Tanjamma katha

పంతొమ్మిదో శతాబ్దం మొదట్లో పుట్టిన తంజమ్మ తన జీవితం లో ఎన్నో ఆటుపోట్లను చూసింది. తాగుబోతోడైన కట్టుకున్న భర్త పెట్టిన చిత్రహింసలు భరించలేక ఆమె తన పుట్టింటికి చేరింది. అన్నదమ్ముల ఆదరణలో కొంతకాలం గడిచినా, విధి వక్రించి ఆ అన్నదమ్ములు కూడా మరణించారు. అప్పుడు కుంగిపోకుండా, వారి కుటుంబాలకు, పిల్లలకు తానే పెద్దదిక్కై నిలబడింది తంజమ్మ. కష్టాల కడలిని ఈదుతూ తనకంటూ ఒక ప్రశాంతమైన ప్రపంచాన్ని నిర్మించుకుంది. ప్రతిరోజూ ఉదయం 5 గంటలకే ఆమె దినచర్య మొదలవుతుంది. సాయంత్రం 6:30 వరకు ఆమె చేతులు ఏదో ఒక పని చేస్తూనే ఉంటాయి. ఉదయం లేవగానే ముందుగా తన ఆవు, దూడల బాగోగులు చూసుకుంటుంది. వాటికి గడ్డి కోసుకురావడం, మేత వేయడం, నీళ్లు పెట్టడం వంటి పనులన్నీ ఎంతో ప్రేమగా చేసేది.గిలక బాయి లో పొద్దున్నే నీళ్లు అందరికంటే ముందే వెళ్లి తోడేసేది. ఆమెది మట్టి ఇల్లే అయినా, ఇంటి చుట్టూ చాలా ఖాళీ స్థలం ఉంటుంది. ఆ స్థలంలో రకరకాల తీగ జాతి మొక్కలు, సొరకాయ, చిక్కుడు, కూరగాయలు, అందమైన పూల మొక్కలు పెంచేది. వడ్లు ఉడకబెట్టి ఆరబోయడం, ఎండిన తర్వాత వడ్ల నుంచి బియ్యాన్ని దంచి వేరుచేయడం ఆమెకు నిత్యకృత్యం. అలా స్వయంగా తయారు చేసిన బియ్యాన్ని, ఇంటి చుట్టూ ఉన్న ఖాళీ స్థలంలో పండించిన చిక్కుళ్లను అమ్మి ఆ సంపాదనతో కుటుంబాన్ని పోషిస్తుంది. రాగులు, సజ్జలు, జొన్నలు, బాగా ఎండబెట్టి, విసురు రాయి లో విసిరి పిండి చేసి, దానితో సంగటి చేసేది. ఇప్పట్లో లా అప్పుడు గోధుమ రొట్టెలు తినేవాళ్ళు కారు కానీ, రాగి, సజ్జ, జొన్న రొట్టెలు తినేవాళ్ళు. పొద్దున మాత్రం సద్దెన్నం మాగాయ తో లోట్టలు వేసుకుంటూ తినేవాళ్ళు. తొండలు గుడ్లు పెట్టవు అని ఎప్పుడో పెద్దోళ్ళు వదిలేసిన పొలంలో కందులు పండించి, వాటిని తడిచిన మట్టిలో కప్పిపెట్టి మొలక కట్టాక వాటిని నుండి పప్పు వేరు చేసి, బాగా ఎండబెట్టి సంవత్సరం మొత్తం వాటిని వాడుకునేది. ఇంకా పొలంలో ఉన్న ఒక్కగానొక్క చింత చెట్టు నుండి రాల్చిన చింతకాయ నుండి పండు వేరు చేసి దాచుకునేది. నూనె గానుగ నుండి తెచ్చి బాగా ఎండలో ఆ నూనె డబ్బాను పెట్టి ఆ నూనెను వాడుక నూనెగా మార్చేది. వంట కోసం కట్టెలు కొట్టి పొయ్యి వెలిగిస్తుంది. వంటకు కావాల్సిన దినుసులన్నీ ఒక పళ్లెంలో అమర్చుకుని, ఆ కట్టెల పొయ్యి ముందు కూర్చుని వంట చేయడం ఆమెకు ఎంతో ఇష్టం. పప్పుతో పాటు, ఎండు చేపలతో రకరకాల కూరలు వండటంలో ఆమెది అందెవేసిన చేయి. ఎండాకాలం వచ్చిందంటే నోరూరించే ఆవకాయ, మాగాయ పచ్చళ్లు పడుతుంది. అంతేకాదు, పచ్చి మాంసాన్ని చిన్న చిన్న ముక్కలుగా కోసి, ఉప్పు, పసుపు దట్టించి, వాటిని సూదితో దారానికి గుచ్చి మండుటెండలో ఆరబెడుతుంది. బాగా ఎండిన ఆ మాంసాన్ని (ఉప్పుకండలు) మట్టి కుండల్లో భద్రపరుస్తుంది. కుండ మీద కుండ చూడడానికి ఎంతో ముచ్చట. వర్షాకాలంలో ఈ ఎండబెట్టిన మాంసంతో వంటలు చేసి కుటుంబానికి కావాల్సిన ప్రొటీన్‌ను అందిస్తుంది. గాదె లో దాన్యం దాచి కావలసినప్పుడు కొంచం కొంచం తీసుకుని వాడుకునేది. తంజమ్మకు దైవభక్తి చాలా ఎక్కువ. అయితే, ఆమె దృష్టిలో దేవుళ్లంతా ఒక్కటే. మతాలు, దేవుళ్ల మధ్య ఏ భేదభావం చూపదు. విష్ణుమూర్తికి, ఇతర దేవుళ్లకు ఎంతో శ్రద్ధగా పూజలు చేస్తుంది. కార్తీక మాసం వచ్చిందంటే చాలు, నెలరోజుల పాటు ఎంతో నిష్టగా ఉపవాసాలు ఉంటుంది. కార్తీక మాసమంతా ప్రతిరోజూ తన ఇంటి ముందు భక్తిగా దీపం వెలిగిస్తుంది. ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి అంటే ఆమెకు ఎంతో విశ్వాసం. 'అరోహర... అరోహర...' అంటూ ఆ స్వామిని మనసారా వేడుకుంటుంది. తన మొక్కులు తీర్చుకోవడానికి ప్రతి సంవత్సరం తప్పకుండా తిరుత్తణి వెళ్లి సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకుని వస్తుంది. వెంకటేశ్వరునికి మొక్కులు మొక్కి శనివారం ఉపవాసాలు ఉండి పిండి తలిగె వేసి దీపం వెలిగించేది. తన అన్నలు చనిపోయినా వాళ్ళను గుర్తుకు తెచ్చుకుంటూ సంవత్సరాలనుండి బోగి అయిన మరునాడు వాళ్లకు, తరతరాల పెద్దలకు, అన్న పిల్లల దగ్గర పెద్దల పండుగ చేపించేది. కుటుంబ దేవుడైన మునీస్వరుడిని మర్చిపోకుండా పూజించేది. నాగుల పండుగ మరిచేది కాదు. అక్క చెల్లెళ్లయిన సప్త కన్యలను తలచుకునేది. అన్న పిల్లలు దారి తప్పుతారేమోనని వాళ్లకు కాపలా కాసేది. నాబట్టా అంటూ వాళ్ళను తిట్టేది. వాళ్ళ అల్లరిని భరించేది. యోగ అనే పేరు ఆమెకు తెలియదు కానీ రెండూపూటలా సూర్య నమస్కారాలు చేసేది. ధ్యానం అంటే తెలియదు కానీ అనుక్షణం ప్రస్తుతం లో జీవించేది. దేవుడి దగ్గర ఎంత భక్తిగా, శాంతంగా ఉంటుందో... తన ఆత్మగౌరవం విషయానికి వస్తే అంత దీటుగా నిలబడుతుంది. ఎవరైనా తనను కానీ, తన వాళ్లను కానీ తక్కువ చేసి మాట్లాడినా, అవమానించినా అస్సలు సహించదు. ఎదుటివారు ఎవరైనా సరే వెంటనే నిలదీస్తుంది, అవసరమైతే గట్టిగా గొడవపడి తన న్యాయాన్ని, గౌరవాన్ని దక్కించుకుంటుంది. కష్టాలు పడి పైకొచ్చిన ఆవిడకు ఎవరి ముందూ తలవంచడం ఇష్టం ఉండదు. నాయుడికి, రెడ్డికి, కరణంకు, కంసాలికి, గొల్ల, ఈడిగ, సాయిబు లకు, వడ్డీ లకు డబ్బులు ఇచ్చి దేవుడి వడ్డీ తీసుకునేది. కష్టాలు వచ్చిన వాళ్ళు ఆమె డబ్బులు ఆమెకు ఇవ్వకుండా రాత్రికి రాత్రే ఇంట్లో దీపం పెట్టి ఉడాయిస్తే, తన కష్టం నీళ్ల పాలయింది అని ఏడ్చింది కానీ , అందరూ వాళ్ళ ఇంటిని ఆక్రమించుకోమని అన్నా నాకొద్దు అని ఆత్మ గౌరవం తో నిలబడింది. మిగిలిన డబ్బు తో అప్పుడప్పుడు కొన్న బంగారు సొత్తులు అందరికి పంచి, పోయేటప్పుడు అన్నీ ఇక్కడే భూమి మీద వదిలేసి పోయింది.... చివరకు కంచికి పోయినప్పుడు తన చిన్నాన్న కొని ఇచ్చిన బంగారు జరీచీర కూడా ఇక్కడే వదిలేసింది.

మరిన్ని కథలు

Vinta charya
వింత చర్య
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Illu-Illalu
ఇల్లు-ఇల్లాలు
- డా:సి.హెచ్.ప్రతాప్
Daariu choopina mitrudu
దారి చూపిన మిత్రుడు
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Chiru kaanuka
చిరు కానుక
- Prabhavathi pusapati
Jada bharathudu
జడభరతుడు
- డా:సి.హెచ్.ప్రతాప్
Vidhivanchitha
విధివంచిత
- రాపాక కామేశ్వర రావు