పురాణమిత్యేవ న సాధు సర్వం - Kameswara Rao Rapaka

Puranamiyeva na sadhu sarvam

“అపుత్రస్య గతిర్నాస్తి", కొడుకు లేనివారికి మోక్షం లేదా గతి ఉండదు అనేది సనాతన ధర్మంలో సంప్రదాయబద్ధంగా వస్తున్న ఒక నానుడి. అయితే, ఇది ప్రాథమిక వేద సత్యం కాదు. కాలక్రమేణా సమాజంలో, పురాణాలలో ప్రచారంలోకి వచ్చిన ఒక ధార్మిక విశ్వాసం.

సనాతన ధర్మంలో ఆది శంకరాచార్యులు వంటి మహనీయులు వివాహం చేసుకోకుండానే, సంతానం లేకుండానే జ్ఞాన మార్గంలో అత్యున్నత స్థానాన్ని, మోక్షాన్ని పొందారు.

“పున్నామ నరకం" అనే నరకం నుండి రక్షించేవాడే పుత్రుడు అని పురాణాలు చెబుతాయి. కుమారుడు పిండ ప్రదానం, శ్రాద్ధ కర్మలు చేయడం ద్వారా పితృదేవతలకు సద్గతులు కలుగుతాయని నమ్ముతారు.

ప్రస్తుతం మన సమాజంలో ఈ నమ్మకంతో చాల మంది సతమతమవుతుంటారు. అటువంటి వారిలో ఒకరు అచ్యుత రామయ్య.

——-///——-

అచ్యుత రామయ్య చిన్నప్పటి నుండి పరమ ధార్మికుడు. నిత్యం దైవదర్శనం, పరోపకారం, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటుండే వాడు. నలుగురిలో మన్నన, మర్యాదలు అందుకునే వాడు. పుట్టిన రోజున పెళ్లి రోజున ఇంకా పండుగ రోజుల్లో అనాథ శరణాలయాలకు వెళ్లి అన్నదానం వస్త్ర దానం చేసేవాడు. పరోపకారానికి పెద్ద పీట వేసేవాడు.

తనకు పెళ్ళై అయిదేళ్లయినా సంతానం కలగకపోవడంతో దిగులు చెందుతూ అన్ని పూజలు, వ్రతాలు చెయ్యడం మొదలుపెట్టాడు. కొడుకు లేకపోతే తనకు పున్నామ నరకం తప్పదేమోనని బాధ పడేవాడు. కనిపించిన ప్రతి జ్యోతిష్యుడికి తన సంతాన ప్రాప్తి గురించి అడిగేవాడు.

ఒక జ్యోతిష్యుడి సలహా మేరకు సంతాన వేణుగోపాలస్వామి వ్రతం చెయ్యడానికి సంకల్పం చేసాడు. వ్రతంకు ఆహ్వానించడానికి ఆహూతుల జాబితా తయారు చేసాడు. అందులో మొదటి పేరు సుబ్రహ్మణ్యం.

అచ్యుత రామయ్యకు సహాధ్యాయుడు మరియు అతి సన్నిహిత మిత్రుడు సుబ్రహ్మణ్యం. ఇద్దరికీ స్వంత ఊరిలోనే కొలువులు. అచ్యుత రామయ్య సోంపేట జూనియర్ కళాశాలలో తెలుగు అధ్యాపకుడు. సుబ్రహ్మణ్యం ఆ ఊరిలోనే న్యాయవాద వృత్తిలో ఉన్నాడు. వీరిద్దరికి ఇంచుమించుగా ఒకేసారి పెళ్లి జరిగింది. సుబ్రహ్మణ్యం పిల్లలు పాఠశాల ప్రవేశం కూడ చేసారు. సుబ్రహ్మణ్యం కూడా మంచి వాడే గాని అచ్యుత్ లాగా ప్రతి విషయానికి బాధ పడకుండా నిశిత పరిశీలన తరువాత నిర్ణయాలు తీసుకుంటాడు. “స్వంత లాభం కొంత మానుకుని పొరుగు వాడికి తోడు పడవోయి” అన్న గురజాడ వారి మాటలను గౌరవిస్తూ, ఇతరులకు చేతనైనంత సహాయం చేసేవాడు. కానీ “తనకు మాలిన ధర్మం” చేసేవాడు కాదు. అలాగని స్వార్థపరుడు కాదు. “తన కుటుంబం తన ఉద్యోగం తన జీవితం” ఆయన ప్రాథమిక సూత్రాలు. “జీవితం జీవించడానికి మాత్రమే” అన్న భావనతో జీవించేవాడు. “కష్ట ఫలాన్ని నమ్మినవాడు. కర్మఫల భావనను దరిచేరనివ్వడు. అలాగని నాస్తికుడు కాదు. “దేవుడు ప్రజలందరిని తన పిల్లలుగా చూసుకుంటాడు, కష్టసుఖాలకు మనం స్పందించనవసరం లేదని” భావించే వాడు.

——-///——-

“ఒరే సుబ్బు, వచ్చే కృష్ణాష్టమి రోజున మా ఇంట్లో సంతాన వేణుగోపాల స్వామి వ్రతం చేస్తున్నాం, మీ దంపతులు ఇద్దరూ వచ్చి వ్రత సాఫల్యానికి సహకరించ వలసిందిగా కోరుతున్నాంరా ” అని భార్య పుష్పలతతో కలిసి వెళ్లి సుబ్రహ్మణ్యం దంపతులను ఆహ్వానించాడు అచ్యుత్.

కృష్ణాష్టమి రోజున అనుకున్నట్లే ఆహుతుల సమక్షంలో సుముహూర్తంలో సంతాన వేణుగోపాలస్వామి వ్రతం ఆచరించారు అచ్యుతరామయ్య దంపతులు.

చక్కటి సంతానం కలగాలని వంశాభివృద్ధి జరగాలని అందరూ శుభాకాంక్షలు అందించారు.

పూజలో భాగంగా సంతాన గోపాల స్తోత్రం పఠించిన అనంతరం అర్చక స్వామి వారు బీజాక్షర మంత్రాన్ని అచ్యుత రామయ్య దంపతులకు ఉపదేశించారు.

“ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం దేవకీసుత గోవింద వాసుదేవ జగత్పతే।

దేహి మే తనయం కృష్ణ త్వామహం శరణం గతః”

“వ్రతం ఆచరించిన వారు ప్రతి రోజు ఈ బీజాక్షర మంత్రాన్ని క్రమం తప్పకుండా పఠించడం వలన సకల దోషాలు తొలగి, బుద్ధి మంతులైన ఆరోగ్యకరమైన సంతానం కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి” అని చెప్పి పూజ ముగించారు.

——-///——-

ఇంకొక సంవత్సరం గడిచింది. అచ్యుతరామయ్య భార్య పుష్పలత కడుపు పండలేదు.

ఆ రోజు వార్తాపత్రికలో వచ్చిన ప్రకటన చూసిన సుబ్రహ్మణ్యం సాయంత్రం అచ్యుత రామయ్య ఇంటికి వెళ్లి ఆవిషయమై చర్చించాలని అనుకున్నాడు.

“ఒరే అచ్యుత్ సాయంత్రం మీ ఇంటికి కాఫీ కోసం వస్తానురా. నీవు కాలేజీ నుండి సరాసరి ఇంటికి వస్తున్నావా లేదా?”

“వెల్కమ్ రా, చాల రోజులైంది మనం కలిసి”

చెప్పినట్లుగానే సుబ్రహ్మణ్యం ఆ రోజు సాయంత్రం అచ్యుత రామయ్య ఇంటికి వెళ్ళాడు. స్నేహితులు ఇద్దరూ కాఫీ తాగుతూ లోకాభిరామాయణంలో మునిగి పోయారు. కానీ సుబ్రహ్మణ్యం గమనించాడు అచ్యుత రామయ్య మనసులో పడుతున్న వేదన.

“ఒరే అచ్యుత్ నీవేమీ అనుకోనంటే ఒక సలహా ఇస్తానురా” అని ప్రారంభించాడు తాను చెప్పదలచుకున్న విషయాన్ని చెప్పడానికి.

“చెప్పురా నా దగ్గర నీకు మొహమాటం దేనికి రా”

“మీరు ఒకసారి వైద్యుని సంప్రదిస్తే బాగుంటుంది”

“ఓహ్ అదా, మేము ఎప్పుడో సంప్రదించాము.రెండేళ్ళ క్రితమే మన ఊరిలో డాక్టర్ కామమ్మ గారి దగ్గరికి వెళ్ళాము. ఆమె నాకు కొన్ని పరీక్షలు చేసి వీర్య కణాల వృద్ధి కోసం మందులు ఇచ్చారు, తనకి చిన్న డి ఎన్ సి ఆపరేషన్ చేసిన తరువాత హార్మోన్ల అసమతుల్యతను నివారించడానికి కొన్ని మందులు ఇచ్చారు. ఇప్పుడు వైద్య పరమైన లోపాలను సవరించుకున్నాము మరియు దైవానుగ్రహానికి కావలసిన పూజలు, వ్రతాలు కూడా చేశాము. నాకైతే ఇంకా నమ్మకం సడలి పోలేదు.

“అది కాదురా మనకు దగ్గరలో వైజాగులో సంతాన సాఫల్య కేంద్రం వచ్చింది. ఎలాంటి సమస్యకైనా పరిష్కారం దొరుకుతుందట. దీని కోసం ఇంతకుముందు బొంబాయి, హైదరాబాదు వంటి మహా నగరాలకు వెళ్లేవారు.. మీరు ఒకసారి వెళ్ళి చూపించండి”

“మొన్ననే వ్రతం చేసాం కదరా, కొన్నాళ్ళు వేచి చూద్దాం.”

మొన్ననే ఏమిటిరా, సంవత్సరం దాటిందిరా. అయినా మానవ ప్రయత్నం మనం చెయ్యాలి కదా ఆ తరువాత దైవానుగ్రహం తోడవుతుంది. అలా కాకుండా మంత్రాలకు పిల్లలు పుడతారని భ్రమలో ఉండిపోకు. మంత్రాలకు చింతకాయలు రాలతాయేమో గాని పిల్లలు మాత్రం పుట్టరు. అలాగని దేవుడు ఎవరికీ అన్యాయం చెయ్యడు. నా మాట విని రేపే వైజాగు వెళ్ళండి. మన ప్రయత్నం మనం చేద్దాం.

“సరే గానీ మన ప్రక్కన బారువా లో భువనేశ్వర్ పాణిగ్రాహి అని ఒక సిద్ధాంతి ఉన్నాడట. ఆయన దేవీ ఔపాసకుడట. ఆయన గురించి చాలామంది గొప్పగా చెబుతున్నారు. నిన్ననే మా కాలేజీలో తెలిసింది. ఆయన ఏదో ప్రసాదం లాంటిది తయారుచేసి ఇస్తాడట, అది తిన్న తరువాత ఎన్నో నెలలో సంతాన ప్రాప్తి కలుగుతుందో చెబుతాడట. ఆయన్ని ఒకసారి కలిసిన తర్వాత ఒక నిర్ణయానికి వద్దాం.”

“సరే నీ ఇష్టం, కానీ ప్రసాదాలకు, పాయసాలకు పిల్లలు పుట్టడానికి ఇది త్రేతాయుగం కాదురా” అని చెప్పి వెళ్ళిపోయాడు సుబ్రహ్మణ్యం.

మరుసటి ఆదివారం అచ్యుత రామయ్య దంపతులు బారువా వెళ్ళి ఆ దేవీ ఉపాసకుడిని కలిశారు. ఆయన లేహ్యం లాంటి ప్రసాదం ఇచ్చి నెల రోజులు ఇద్దరూ పాలతో కలిపి సేవించాలని చెప్పాడు. అలా చేస్తే ఆ నెల విడిచి ఆ మరుసటి నెల గర్భధారణ జరుగుతుంది, ఆడపిల్ల పుడుతుంది అని చెప్పాడు. అచ్యుత రామయ్య దంపతులు చాలా ఆనందపడ్డారు. ఆయన చెప్పిన విధముగా చేసారు.

ఏ నోము ఫలించిందో లేక ఆ దంపతుల సత్కర్మల ప్రభావమో గాని పుష్పలత కడుపు పండింది కానీ ఆ సిద్ధాంతి చెప్పిన నెల కాకుండా ఇంకో నెల తరువాత జరిగింది. మరియు తొమ్మిది నెలల తరువాత ఆ దంపతులకు ఆయన చెప్పినట్లు ఆడపిల్ల కాకుండా కుమారుడు జన్మించాడు. అచ్యుత రామయ్య దంపతుల ఆనందానికి అవధుల్లేవు. తనకు పితృయోగమే కాకుండా ‘పున్నామ నరకం’ నుండి రక్షించే పుత్రుడు కూడా కలిగి నందుకు అమితానందం తో అచ్యుత రామయ్య అందరి దేవుళ్ళకు ముడుపులు, మొక్కులు చెల్లించుకున్నాడు. ఆ పిల్లవాడికి తన తండ్రి గారి పేరు “వెంకట రామయ్య” అని పెట్టుకున్నాడు.

వెంకట రామయ్య ఉరఫ్ వెంకట్ చిన్నప్పటి నుండి చదువుసంధ్యల్లో మొదటి ర్యాంకులో ఉండేవాడు. సుబ్రహ్మణ్యం కొడుకుని ఆదర్శంగా తీసుకుని చదివేవాడు. సుబ్రహ్మణ్యం కొడుకు అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా స్థిరపడ్డాడు. వెంకట్ కూడా అమెరికా వెళ్లడానికి నిర్ణయించుకున్నాడు.

విదేశాల్లో మన ఆచార వ్యవహారాలు, సంస్కృతి సాంప్రదాయాలు పాటించరని, అచ్యుత రామయ్య కొడుకుని విదేశాలకు పంపించడానికి ఇష్టపడలేదు. కానీ కొడుకు ఉత్సాహాన్ని గమనించిన అచ్యుత రామయ్య కాదనలేకపోయాడు. పర్యవసానం వెంకట్ కూడా అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా స్థిరపడి పోయాడు. అచ్యుత రామయ్య ఈ మధ్యలో బదిలీపై ఇచ్ఛాపురం జూనియర్ కళాశాలకు వెళ్ళి పది సంవత్సరాల తరువాత మళ్లీ వెనక్కి సోంపేట వచ్చాడు.

తన మాదిరిగానే కొడుకుకి కూడా సంతానం ఆలస్యం అవుతుందేమోనని భావించిన అచ్యుత రామయ్య వెంకట్ కు ఉద్యోగం వచ్చిన వెంటనే, తొందరగా పెళ్లి చేయాలన్న తలంపుతో సంబంధాలు వెతకడం ప్రారంభించాడు. తనకు నలుగురితో ఉన్న సత్సంబంధాలతో మంచి మంచి సంబంధాలు వచ్చాయి. అయితే వెంకట్ తన పెళ్లి విషయంలో ఇంకా కొంత సమయం కావాలని వాయిదా వేస్తూ వచ్చాడు. అలా రెండేళ్లు గడిచిపోయాయి. తరువాత అమెరికాలో ఉద్యోగం చేసే అమ్మాయిని వివాహం చేసుకోవాలని అనుకున్నాడు అయితే తన వివాహం విషయంలో తల్లిదండ్రుల ప్రమేయాన్ని మాత్రం ఇష్టపడలేదు. చివరికి తన కంపెనీలో పనిచేసే ఒక అమ్మాయిని ఇష్ట పడుతున్నానని ఆమె నే పెళ్లి చేసుకుంటానని అచ్యుత రామయ్య చెవిన వేసాడు. అది విన్న అచ్యుత రామయ్య ఆ పిల్ల పూర్వాపరాలను ఆరా తీశాడు. తమ కుమారుడు కులాంతర వివాహానికి మొగ్గు చూపుతున్నాడని అర్థమైంది. చావు కబురు చల్లగా చెప్పాలన్నట్లు రెండు రోజుల తరువాత ఈ విషయం భార్యకు కూడా చెప్పాడు. భార్యాభర్తలిద్దరూ చాలా బాధపడుతూ వెంకట్ మనసు మార్చడానికి ప్రయత్నించారు. కానీ వెంకట్ మనసు మార్చుకోలేదు. కొడుకు పెళ్లి వ్యవహారంలో మదన పడిన అచ్యుత రామయ్య తన సన్నిహిత మిత్రుడు సుబ్రహ్మణ్యంతో ఈ విషయంలో సంప్రదించడానికి ఆ రోజు సాయంత్రం సుబ్రహ్మణ్యం ఇంటికి వెళ్ళాడు.

“ఏరా అచ్యుత్, ఇలా వచ్చావేమిటి? ఫోన్ కూడా చెయ్యకుండా, ఏమైనా అత్యవసరమా? వెంకట్ ఎలా ఉన్నాడు? ఫోన్ చేస్తున్నాడా?” ఇలా ప్రశ్నలను ఒకదాని వెనక ఒకటి సంధించాడు సుబ్రహ్మణ్యం.

“ఆ…ఆ…వెంకట్ విషయమే నీతో మాట్లాడదామని వచ్చానురా”

“ఏమయిందిరా?”

వెంకట్ అమెరికాలో ఇష్టపడి, పెళ్ళి చేసుకోవాలనుకుంటున్న అమ్మాయి వివరాలన్ని అచ్యుత రామయ్య, సుబ్రహ్మణ్యం కు చెప్పాడు.

“ఓహ్…. అదా, ప్రేమ వివాహాలు ఇప్పుడు సర్వసాధారణం అయిపోయాయిరా. దాని గురించి బాధ పడకండి. సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా మన జీవితాలను సమన్వయం చేసుకోవాలి. ఇంకా నయం, ఈకాలంలో పిల్లలు పెళ్లి కాకుండానే సహజీవనం చేస్తూ తర్వాత నచ్చలేదని విడిపోతున్నారు. మన వాడు పెళ్లి చేసుకుంటాననడం సంతోషించదగ్గ విషయం, వాళ్ళు సంతోషంగా ఉంటేనే కదా మన జీవితం సఫలం అయినట్లు”

“అదేరా నా బాధ. ఈ ప్రేమ పెళ్లిళ్లు ఎంత కాలం నిలబడతాయి? దంపతుల మధ్య ఏ చిన్న తగాదా వచ్చినా విడాకులకు దారి తీయవచ్చు. అప్పుడు కూడా మనమే బాధపడాలి కదా. పెళ్లి తరువాత ప్రేమలు మనవి. మనం సంతోషంగా సంసారాలు చేసుకోవటం లేదా? పోనీ ప్రేమించిన వాడు మన కులపు అమ్మాయిని చూసుకుని ప్రేమించి పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది కదా?”

“కులాన్ని చూసి ప్రేమ పుడుతుందా? ఇదెక్కడి నియమంరా? ప్రేమ గుడ్డిది అని అంటారు కదా. కులము మతము రంగు అంతస్తు ఇలాంటివేవీ అడ్డు రావు ప్రేమించడానికి”

“అంటే మన ధర్మం మంట గలిసి పోవాల్సిందేనా?”

“మన ధర్మాలుగా పూర్వీకులు చెప్పిన చాలా విషయాలు ఇప్పుడు ఆచరణలో లేవు. ఉదాహరణకు ఆడపిల్లకు ఎనిమిదేళ్లు రాగానే పెళ్లి చేయాలి, భర్త చనిపోతే ఆ చితిలో భార్యకు సహగమనం. ఇవి కొన్నాళ్ళు సాగాయి. తరువాత భర్త చనిపోయిన స్త్రీ గుండు గీసుకుని తెల్ల చీర కట్టుకోవాలి, వితంతు వివాహం పనికి రాదు. ఇలాంటివి కూడా కొన్నాళ్ళు రాజ్యమేలాయి. కాని కొంతమంది సంఘ సంస్కర్తల మూలంగా అలాంటివి కూడా అంతరించి పోయాయి. గనుక మారుతున్న కాలానికి అనుగుణంగా సమాజంలో మార్పులు వస్తున్నాయి. వాటిని మనం స్వాగతించాలి.”

“ఒరే నా బాధంతా ఏమిటంటే ‘కులహీనుడైన కొడుకు పితృ కర్మలకు పనికి రాడు’ అని ఒక పెద్ద ప్రవచన కర్త తన ప్రసంగంలో చెప్పడం విన్నాను. అప్పటి నుండి నాకు దిగులు ఎక్కువైంది.”

“ఆ ప్రవచన కర్త చెప్పిన మాటలు ఏ పురాణాలలో ఉన్నాయో నాకు తెలియదు కానీ “పురాణమిత్యేవ న సాధు సర్వం” అని ప్రసిద్ధ సంస్కృత సుభాషితం ఉంది. అంటే పురాతనమైనవి అన్నీ మంచివని మనం గుడ్డిగా నమ్మకూడదు. విచక్షణా జ్ఞానంతో పరీక్షించి నిర్ణయాలు తీసుకోవాలి. తరువాత నీవు భగవద్గీత చాలా సార్లు చదివావు మరియు ప్రవచన కర్తల ప్రసంగాలు కూడా విన్నావు కదా. శ్రీకృష్ణుడు గీతలో చెప్పిందేమిటి? ‘జ్ఞానం, భక్తి, సత్కర్మల ద్వారా ఎవరైనా మోక్షం పొందవచ్చు’ అని. గనుక నీ భక్తి, సత్కర్మల ద్వారా నీవు మోక్షం పొందవచ్చు.”

సుబ్రహ్మణ్యం చెప్పిన మాటలతో మనసు కుదుటపడినట్లు కనిపించాడు అచ్యుత రామయ్య.

——-///——-

మరిన్ని కథలు

Vanta gadi lo veerudi katha
వంట గదిలో వీరుడు కథ
- రాము కోలా దెందుకూరు
Avadhulu daatina abhimanam
అవధులు దాటిన అభిమానం
- మద్దూరి నరసింహమూర్తి,
Maarina jeevitham
మారిన జీవితం
- Prabhavathi pusapati
Dharmo rakshathi rakshitaha
ధర్మో రక్షతి రక్షితః
- డా:సి.హెచ్.ప్రతాప్
Prathiroopam
ప్రతిరూపం
- డా:సి.హెచ్.ప్రతాప్
Maarpu manathone
మార్పు మనతోనే
- జ్యోత్స్న జల్లూరి
Samayaspoorthi
సమయస్ఫూర్తి
- డా:సి.హెచ్.ప్రతాప్
Asooya techhina chetu
అసూయ తెచ్చిన చేటు
- బోగా పురుషోత్తం , తుంబూరు.