మునికి సాయపడ్డ జంతువులు - నారంశెట్టి ఉమామహేశ్వరరావు

Muniki sayapadda janthuvulu


గంభీరం అడవుల్లో కుటీరం నిర్మించుకుని తపస్సు చేసేవాడు శతానందుడు. కుటీరం చుట్టూ పూల మొక్కలు, పండ్ల చెట్లు, పొదలు ఉండటంతో జంతువులు అక్కడకి వచ్చి విశ్రాంతి తీసుకునేవి. .
అలా వచ్చిన వాటిలో ఏ జంతువుకి లేదా పక్షికి గాయమైతే వాటిని చేరదీసేవాడు ఆయన. గాయాలను శుభ్రంగా నీరుతో కడిగి పసరు మందు పూసేవాడు శతానందుడు. వాటికి పూర్తి స్వస్థత వచ్చేవరకు ఏదైనా ఆహారం పెట్టేవాడు. అలా ఎక్కువ జంతువులతో ఆయనకి మచ్చిక ఏర్పడింది.
అవి కూడా ఆయన తపస్సు చేసుకుంటుంటే భంగం కలిగించేవి కాదు. . వాటిల్లో అవి జాతి భేదం మరచిపోయి కలసి మెలసి జీవించేవి. వాటిని చూసి సంతోషించేవాడు శతానందుడు.
ఒక రోజు ఉదయం శతానందుడు కాలకృత్యాలు తీర్చుకున్నాక అడవిలోకి వెళ్లి కందమూలాలు ఏరుకున్నాడు. పనిలో పనిగా వైద్యానికి ఉపయోగపడే ఆకులు, మూలికలు కనబడితే వాటిని కూడా ఒక సంచిలో వేసుకుని తిరిగి వచ్చాడు.
అక్కడ సింహానికున్న జూలుని తొండంతో ఏనుగు నిమురుతుంటే అది మైమరచిపోయి పడుకుంది. పెద్దపులి పంజాతో లేడిపిల్లను పట్టుకుని ముద్దు పెడుతుంటే అది భయం లేకుండా నవ్వుతోంది. కొండ గొర్రిని కౌగిలిలోకి తీసుకుని తోడేలు బుజ్జగిస్తుంటే తల్లి కౌగిలిలో ఉన్నట్టు పరవశిస్తోందది. గుర్రం మీద కూర్చుని స్వారీ చేస్తోంది కొండముచ్చు . కాలిగాయమై కదలలేని స్థితిలో ఉన్న ఎలుగుబంటికి చెరుకుగడలు తినిపిస్తోంది కోతి.
ప్రక్కనే ఉన్న పొదల మధ్య మరికొన్ని దృశ్యాలు కనబడ్డాయి మునికి. ఒక ఎలుక, అడవి పిల్లి మీసాలు లాగుతూ , తోక కొరుకుతూ ఆడుకుంటోంది. నిద్ర పోతున్న కుందేలుకి ఎండ తగలకుండా పడగవిప్పి గొడుగు పడుతోంది నాగుపాము. ఎంగిలి జాంపండ్లను తెచ్చి కాకి పిల్లలకు తినిపిస్తోంది చిలుక.
వాటిని తనివితీరా చూసిన ముని చాలా సేపటివరకూ అలాగే ఉండిపోయాడు. అక్కడున్న వాటిలో దేనికైనా గాయాలయ్యాయేమో పరీక్షించి అవసరమైన వైద్యం చేసాడు.
అలా కొన్నేళ్లు గడిచాయి.
ఒక వర్షాకాలపు ఉదయం నదికి స్నానానికి వెళ్లిన శతానందుడు చుసుకోకుండా జారుగా ఉన్న ప్రదేశంలో పాదం మోపాడు. ఆయన కాలు పట్టు తప్పింది. పక్కనున్న పెద్ద గొయ్యిలోకి జారుతూ పడిపోయాడు. అది జంతువులను పట్టడం కోసం వేటగాళ్లు తవ్వినది. ముని యొక్క కుడి కాలు విరిగింది. ఒళ్ళంతా చీరుకుపోయింది. రక్తం ధారలుగా స్రవించింది. గోతి నుండి బయటపడే మార్గం కోసం వెతికాడు కానీ కనబడలేదు. దాంతో రక్షించమని గట్టిగా అరిచాడు ముని.
ఆహారానికెళ్లి తిరిగొస్తున్న ఒక చిలుక ముని కేకలను ఆలకించింది. ఆయనకి ప్రమాదం జరిగినట్లు గ్రహించి, కుటీరం దగ్గరున్న జంతువులకు , పక్షులకు చెప్పింది. మునిని రక్షించుకోవాలంది.
చిలుక మాటలు విన్న ఏనుగు, గుర్రం, కోతి ఆందోళన చెందాయి . వెంటనే ముని పడిపోయిన గోతి దగ్గరకు పరిగెత్తాయి. ఆయనని జాగ్రత్తగా బయటకు రప్పించి కుటీరానికి చేర్చాయి.
శతానందుడికి త్వరగా నయం కావడానికి ఏమి చేయాలో జంతువులన్నీ చర్చించుకున్నాయి.
“ఆయన జంతువులకు వైద్యం చేస్తుండగా చూసాను. ఏ రోగానికి ఏ ఆకు వాడాలో నాకు తెలుసు. మునికి వైద్యం చేస్తానని” ముందు కొచ్చింది ఎలుగుబంటి.
“పసర మందులకు అవసరమైన ఆకులు తెచ్చిస్తాను” అంది కోతి.
“మునికి నయమయ్యేవరకూ వేళకి పండ్లు తెచ్చిస్తాను” అంది చిలుక.
“నదికి వెళ్లి కడవల్లో నీళ్లు మోసుకొస్తాను” అని ఏనుగు చెప్పబోతుంటే తనకి ఆ అవకాశం వదలమంది గాడిద.
“సరే. నువ్వు తెచ్చిన నీటితో మునికి స్నానం చేయిస్తాను” అంది ఏనుగు.
అలా జంతువులన్నీ ఒక్కో పనిని పంచుకున్నాయి. మునిని కనిపెట్టుకుని సేవలెన్నో చేశాయి. జంతువులన్నీ మునికి ఏదో విధంగా సాయపడ్డాయి.
కొంతకాలం తరువాత ముని లేచి నిలబడగలిగాడు. అది చూసి జంతువులన్నీ సంతోషించాయి. మరి కొంతకాలానికి ఆయన నడవ గలిగాడు.
“నాకు ఒకవేళ భార్య, పిల్లలున్నా మీ అంత శ్రద్ధగా సపర్యలు చేసేవారు కారు. నాకు నయమయ్యే వరకు సాయపడ్డ మీ మేలు మరువలేను” అన్నాడు జంతువులతో ముని.
ఏనుగు ముందుకొచ్చి “ మీరిక్కడ కుటీరం కట్టుకున్న తరువాత మాకందరికీ మంచి చోటు దొరికింది. జాతి భేధాలు మరచిపోయి ప్రాణభయం లేకుండా మీ నీడలో బ్రతుకుతున్నాం. మాకు ఎవరికి అనారోగ్యం కలిగినా వైద్యం చేసారు మీరు. మా బాధలని పోగొట్టారు. మేమంతా సుఖంగా జీవిస్తున్నామంటే మీ సహకారం ఉంది. మీకు కష్టం కలిగినప్పుడు సాయం చేయడం మా ధర్మం. మీకు సేవచేసే అవకాశం కలిగినందుకు సంతోషిస్తున్నాం” అంది.
“ఏనుగు చెప్పింది నిజమే. మీకు సేవ చేసే భాగ్యం కలిగింది మాకు” అంది సింహం. ‘అవునవును’ అని గొంతు కలిపాయి మిగతా జంతువులు.
వాటి స్పందనకు శతానందుడు సంతోషించాడు “ ఎవరికైనా స్వార్ధం ఆశించకుండా సాయం చేస్తే , ఆపద సమయంలో తిరిగి ఏదో ఒక రూపంలో దేవుడే ఆదుకుంటాడని రుజువైంది. ఇకముందు మీకు దేనికి ఆపద వచ్చినా నేను మీకు సహాయపడతాను ” అని మాట ఇచ్చాడు .
—--** —---

మరిన్ని కథలు

Kulavrutti
కులవృత్తి
- ARADHYULA Pranav
Santrupthi
సంతృప్తి
- మండా సూర్యనారాయణ
Sanmanam
సన్మానం!
- బొల్లిముంత వెంకట రమణా రావు
Apramatthata
అప్రమత్తత
- డా:సి.హెచ్.ప్రతాప్
Samskaram
సంస్కారం
- మద్దూరి నరసింహమూర్తి
Chivari vuttaram
చివరి ఉత్తరం
- డా:సి.హెచ్.ప్రతాప్
Manavatwam gelichindi
మానవత్వం గెలిచింది
- డా:సి.హెచ్.ప్రతాప్