ప్రయత్నంతోనే ఫలితం - నారంశెట్టి ఉమామహేశ్వరరావు

Prayatnam thone falitham

పాల్తేరులో వీరయ్య అనే పేద వ్యక్తి ఉండేవాడు. అతడు నిజాయతీపరుడు. రోజూ వూరికి సమీపంలో ఉండే దట్టమైన అడవికి వెళ్లి కట్టెలు కొట్టి, వాటిని తీసుకెళ్లి పట్నంలో అమ్మేవాడు. అలా వచ్చిన డబ్బుతోనే అతడి కుటుంబం మొత్తం బతికేది.

ఒకసారి ఎప్పుడూ వెళ్లే దారిలో కాకుండా కొత్త బాటలో అడవికి వెళ్ళాడతడు . కొంత దూరం వెళ్ళగానే అక్కడో ఆశ్రమం, అందులో ఒక ముని తపస్సు చేసుకుంటూ కనిపించాడు. ఆ మునితో మాట్లాడాలని చాలా సేపు ఎదురుచూసినా , ఆయన కళ్ళు తెరవక పోవడంతో దండం పెట్టేసి వెళ్లిపోయాడు వీరయ్య.

మరుసటి రోజు అడవికి వెళ్ళేటప్పుడు ముని కోసం అరటిపళ్లు, కొన్ని ఆవు పాలు తీసుకెళ్లాడు వీరయ్య. ఆయన తపస్సులో ఉండడంతో, వాటిని అక్కడ పెట్టేసి దిగాలుగా వెళ్ళిపోయాడు వీరయ్య.

కొద్దీ రోజులు అలాగే చేయసాగాడు.

ఒకసారి అనుకోకుండా ముని కళ్ళు తెరచి “ నాయనా! ఎవరు నువ్వు? పాలు, పండ్లు రోజూ ఎందుకు తీసుకొచ్చి పెడుతున్నావు” అని అడిగాడు. ముందు ఆశ్చర్యపోయిన వీరయ్య … వెంటనే మునికి నమస్కరించి తన గురించి చెప్పాడు.

“మంచిది. తూర్పు దిక్కుగా ముందుకెళ్లు. నీకు అంతా మంచే జరుగుతుంది” అన్నాడా ముని.

ఆ మాట ప్రకారమే వెళ్లిన వీరయ్యకు ఒకచోట గంధపు చెట్లు కనిపించాయి. ఆ రోజు నుంచి వాటిని విక్రయిస్తూ కాస్త ఎక్కువ డబ్బు సంపాదించసాగాడు . కుటుంబ సభ్యులంతా మూడుపూటలా తిండి తినగలిగారు.

మునికి పాలు పండ్లు ఇచ్చాకనే అడవిలో కెళ్లడం వీరయ్యకు దినచర్యగా మారింది.

మరోసారి ఎప్పుడో ముని కళ్ళు తెరిచినప్పుడు గంధపు చెట్లు కనిపించాయన్న విషయం చెప్పాడతను .దానికి ఆయనేమీ బదులివ్వలేదు సరికదా ఎగతాళిగా నవ్వాడు.

ఆ నవ్వులో ఏదో అర్ధం ఉందని గ్రహించాడు వీరయ్య. “తూర్పు దిక్కుగా వెళ్ళమన్నాడు కానీ గంధపు చెట్ల వరకే అని చెప్పలేదు కదా . ఇంకాస్త ముందు కెల్దామని వెళ్ళాడు వీరయ్య.
అక్కడ ఒక చెట్టు మొదట్లో వెండి నాణేలున్న సంచి కనబడింది. అడవి దారిలో వెళ్తుండగా .. ఏ వ్యాపారో పోగొట్టుకుని ఉంటాడనుకున్నాడు. అది తీసుకుని ఇంటికెళ్లి , వాటిలో ఒక్కో నాణెం అమ్ముకుంటూ కాలం గడపసాగాడు.

అప్పటి నుంచి కట్టెలు కొట్టడం మానేసి ఎండు పుల్లలు, నేలరాలిన పండ్లూ ఏరుకెళ్ళేవాడు. వాటిని పేదలు, వృద్దులు, అనాధలు, దివ్యాంగులకు పంచేవాడు.

ఇంకోసారి ముని కళ్ళు తెరిచినప్పుడు వెండి నాణేల సంగతి చెప్పాడతను. ఈసారి కూడా ఒక నవ్వు నవ్వాడు ముని. అందులోనూ ఏదో భావం ఉన్నట్టు గ్రహించాడు వీరయ్య. “వెండి నాణేలు దొరికిన ప్రాంతం నుంచి ముందుకెళ్ళాడు.

అక్కడో పెద్ద చెట్టు క్రింద వజ్రాల హారం, బంగారు ఆభరణాలు కనిపించాయి. వాటిని చూడగానే వేట కోసం వచ్చి ఏ సింహానికో బలైన రాజుగారివని అనుకున్నాడు వీరయ్య. వాటిని జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్లి భద్రపరిచాడు.

మరోసారి ముని కళ్ళు తెరిచినప్పుడు ఆభరణాల గురించి చెప్పాడు వీరయ్య. గతంలో లాగానే నవ్వాడు ముని. ఈసారి మరింత ముందు కెళ్లిన వీరయ్యకు అడవి అంతమై , ఓ నగరం కనబడింది.

అది ఆ రాజ్యపు రాజధాని నగరమని, ఆ రాజుగారు వేట కోసం వెళ్లి మరణించారని అక్కడి ప్రజలు అనుకోవడం విన్నాడు . నేరుగా కోటకు వెళ్లి యువరాజుని కలిసాడు.

తనకి కొన్ని నగలు దొరికాయన్న సంగతి చెప్పి భటులను సాయం పంపితే వాటిని అప్పగిస్తానన్నాడు

. వీరయ్య మాటలపై నమ్మకం ఉంచి , కొందరు భటులను వెంట పంపాడు యువరాజు.

వీరయ్య ఇంట్లో భద్రపరచిన నగలు రాజుగారివే అని నిర్ధారణ కావడంతో అతడి నిజాయతీని మెచ్చుకున్న యువరాజు, కోట కాపలాదారుడిగా ఉద్యోగం ఇచ్చాడు.

త్వరలో వచ్చి పనిలో చేరతానని యువరాజు వద్ద అనుమతి పొంది, మునిని కలిసాడు వీరయ్య.

అదృష్టవశాత్తూ ముని కళ్ళు తెరిచి వీరయ్యని చూసాడు.

క్షణం కూడా ఆలస్యం చేయకుండా … జరిగిందంతా వివరించాడు. ఈసారి ఆయన నవ్వకుండా “శభాష్ “ అని మెచ్చుకున్నాడు.
“తూర్పు దిక్కుకి వెళ్ళమన్నారు కానీ ఎంతవరకో చెప్పలేదు. ముందే తెలిసి ఉంటే, అప్పుడే కొలువు దొరికేది.” అంటూ వాపోయాడు వీరయ్య.

“బాధపడకు నాయనా. ఎంత శ్రమకు అంత ఫలితమన్నారు పెద్దలు. ఆగిపోకుండా ప్రయత్నించావు కాబట్టే గంధపు చెక్కలు, వెండి నాణేలు , బంగారు ఆభరణాలను దాటి కోటలో కొలువు పొందావు. మధ్యలోనే సంతృప్తి చెంది ఆగిపోయి ఉంటే గంధపు చెక్కలు అమ్ముకుంటూ బ్రతికాల్సి వచ్చేది. ఒకవేళ రాజుగారి నగలు సొమ్ము చేసుకుందామని అమ్మే ప్రయత్నం చేసినా పట్టుబడి జైలులో ఉండేవాడివి. నీ నిజాయతీనే నిన్ను కాపాడింది. కొందరు కొంతవరకే ప్రయత్నించి ఆగిపోతారు. అలాంటి వాళ్లు ఏదీ సాధించలేరు. చివరివరకూ ప్రయత్నించేవారు మాత్రమే గమ్యం చేరతారు. అప్పుడే సంతృప్తి చెందావా అన్న ఉద్దేశంతో ఎగతాళిగా నవ్వాను కాబట్టే మళ్ళీ మళ్ళీ ప్రయత్నించావు. ఇకముందు విశ్వాసంగా పని చేసి రాజుగారి మెప్పు పొందు” అని దీవించాడు ముని.

ఆయనకు ధన్యవాదాలు చెప్పి, కొలువులో చేరడానికి కుటుంబాన్ని తీసుకుని రాజధాని నగరానికి వెళ్ళిపోయాడు వీరయ్య.
—---***-----

మరిన్ని కథలు

Samayaspoorthi
సమయస్ఫూర్తి
- డా:సి.హెచ్.ప్రతాప్
Asooya techhina chetu
అసూయ తెచ్చిన చేటు
- బోగా పురుషోత్తం , తుంబూరు.
Rendo take
రెండో టేక్
- వెంకట్ మంత్రిప్రగడ
Vidya dhanam
విద్యాధనం
- చలసాని పునీత్ సాయి
The silent killer
ది సైలెంట్ కిల్లర్
- డా:సి.హెచ్.ప్రతాప్
Intini addekiste
ఇంటిని అద్దెకిస్తే...!
- బొందల నాగేశ్వరరావు
Aakhari vuttaram
ఆఖరి ఉత్తరం !
- బొల్లిముంత వెంకట రమణా రావు
Kalakshepapu porapaatu
కాలక్షేపపు పొరపాటు
- జ్యోత్స్న జల్లూరి