మా ఇంటి టి.వి (feelgood story) - అనిసా తబస్సుమ్ sk

Maa Inti TV (feelgood story)

ఈ కథ మా అమ్మ చిన్నప్పటి తీపి జ్ఞాపకాలతో రాయడం జరిగింది.ఈ కథ మీ చిన్నపాటి రోజులను గుర్తుచేస్తుంది.ఈ కథను మా అమ్మ,చిన్నమ్మకు మరియు ప్రతి 90'స్ కిడ్స్ కు అంకితం చేస్తున్నాను.ఈ కథ ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో నాతో చెప్పడం మర్చిపోకండి.

90's లో బాగా సంపన్నుల ఇళ్లలోనే టి.వీలు ఉండేవి, అంటే ఊరుమొత్తానికి కలిపి ఐదు,ఆరు టి.విలే ఉండేవి.ఆదివారం వస్తే ఆ టి.వి ఉన్న వీధిలో వాళ్లంతా పిల్ల,జల్లా కలిసి మూకుమ్మడిగా టి.వి ఉన్న ఇంటికి వెళ్లేవారు. ఆ రోజు ఒక జాతరలు ఉండేది. ఆ కాలంలోనే మా తాతయ్య కూడా కొత్త టి.వి తెచ్చారు.కొత్త టి.వి తెచ్చి ఇంటి వసారాలో పెట్టారు.

ఇంటి పైకప్పు పై నుంచొని,యాంటెన్నా సరిచేస్తుంటే, వసారాలో అమ్మమ్మ,పిల్లలంతా కలిసి బొమ్మ సరిగ్గా వస్తుందో లేదో చూసేవారు. యాంటెన్నా తిప్పి "వచ్చిందా........." అని అరిచి అడిగితే,బొమ్మ వస్తే "వచ్చింది.....వచ్చింది.....'అని అరవడం,రాకపోతే "పోయింది....పోయింది...."అని అరిచేవారు. టి.వి తెచ్చిన మొదటి రోజైతే ఒక పండుగ వాతావరణం కనిపించేది.యాంటెన్నా సరిచేస్తున్న తాతయ్యను చూసి ఆ దారిన వెళ్ళేవాళ్ళు ఆగి మరీ..."ఎం వాసు కొత్త టి.వి తెచ్చారా"అని అడగడం,"అవును...అవును సాయంత్రం వచ్చేసేయ్"అని పిలవడం కూడా అయిపోయేది. అప్పుడే సాయంత్రం నమాజ్ చేసుకొని వెళ్తున్న మస్తాన్,ఊరందరికీ కనిపించేలా ఇంటి పై కప్పుపై ఎక్కి యాంటెన్నా సరిచేస్తున్న తాతయ్యను చూసి పెద్ద అరుపులాంటి కేకతో "ఎం వాసు టి.వి తెచ్చావూ..... "అని అనడం, కంటికి కనిపించిన ప్రతి ఒక్కని" రా...రా...రా....."అంటూ పిలిచి మరి సంగతి చెప్పడం అయిపోయింది.

చీకటిపడే వేళా ఒక్కొకరుగా జనమంతా పోగయ్యారు.ఒక వాడ జనం మొత్తం ముస్తాబు చేసుకొని,పౌడర్ పూసుకొని,ఆడపిల్లలైతే రంగు, రంగుల రిబ్బన్లతో జాడలు కట్టుకొని,మంచి బట్టలు వేసుకొని,పూలు పెట్టుకొని,ముసలి..ముతక,పిల్ల,జల్లా అంత కలిసి ఆర్భాటంగా వచ్చేవారు. మా అమ్మమ్మ ఇంటిముందు వసారాయే కాకుండా చాలా పెద్ద ఖాళీ స్థలం ఉంటుంది.ఆ టి.విని వసారాలో పెట్టారు,ఇక వసారానుంచి ఇంటి బయట గేటు దాక అంత జనాలతో కిక్కిరిసి ఉంది. చూడటానికి హౌస్ఫుల్ అయినా ఒక చిన్న సినిమా థియేటర్ ల ఉంది.అందరూ ఒక క్రమంలో కూర్చున్నారు. ముందు వరుసల్లో పిల్లల్తో నిండి ఉంటె,రెండో వరుసలో ఆడవారు కూర్చున్నారు,ఆ...పై మగవారు,స్థలం చాలక గేటు బయట అరుగుల మీద కూడా కూర్చున్నారు కొంత మంది మగ గుంపు.

మా తాతయ్యకు చుట్టాలన్న,తెలిసినవారన్న,తెలియనివారన్న,అందాకేందుకు....మనిషి అంటేనే మహా ఇష్టం,వారికీ అతిధి మరియాదలకు చేయడంమంటే ఇంకా ఇష్టం. అలంటి వ్యక్తికీ ఒకేసారి అంతమంది జనం,తమ ఇంటి ముందు కనిపించేసరికి యమా ఆనందంగా ఉంది. ఆ సంతోషంతో తబ్బిబ్బుపోయారు. అప్పట్లో దూరదర్శన్ ఉండేది కావున వారానికి ఒక సినిమా చెప్పున వేసేవారు.ప్రతి శుక్రవారం చిత్రలహరి (సినిమా పాటలు)వచ్చేవి ,ఆదివారం ఒక తెలుగు సినిమా. ఇక ఆదివారం వచ్చిందంటే అందరూ సాయంత్రం ఐదింటి లోపు పనులు,వంటలు త్వర త్వరగ ముగించుకొని టి.వి ముందు కూర్చునేవారు. అందరూ వారం మొత్తం ఆ సినిమా వచ్చే రోజు కోసం ఎదురుచూసే వాళ్ళు. సినీమానో,ధారావాహికనో ఆ రోజు వస్తే...తరువాత రోజులన్నీ దాని గురించే చెప్పుకుంటూ పనులు చేసుకునేవారు. అప్పట్లో అంత శ్రద్ధతో,ఇష్టంతో టి.వి చూసేవారు. ఇకపోతే ఆ ఒక్క టి.వి చూడటానికి కొంత మంది పిల్లలు,ఆడవారు సినిమాహాల్ లాగా తినుబండారాలు కూడా తెచ్చుకునే వాళ్ళు.చూడటానికి చాలా సందడిగా,కళగా ఉండేవి ఆ దృశ్యాలు. "అంత పెద్ద మనుషులు....ఇంత చిన్న టి.విలో ఎలా పట్టారో..."అంటూ ఆశ్చర్యంగా చూసేవారు ఆ అమాయకపు మనసులతో.ఇంకొంత మందికైతే పాటలు చూసేటపుడు "అంత వెంట వెంటనే వాళ్ళ బట్టలు ,ప్రాంతాలు ఎలా మారుతున్నాయి అబ్బా"...అంటూ ఆసక్తిగా చూసేవారు ఇంకొంతమంది ఎంతో అమాయకంగా...అక్కడ టి.విలో జరుగుతుంది నిజమేనని అనుకోని టి.విలో వాళ్ళు నవ్వితే ఇక్కడ వీళ్ళు నవ్వడం,వాళ్ళు ఏడిస్తే వీళ్ళు ఏడవడం,వాళ్ళకి కష్టాలు వస్తే ఇక్కడ వీళ్ళు బాధపడిపోడం చేసేవాళ్ళు.

ఒకరోజు టి.విలో "మాతృదేవోభవ" సినిమా వేసాడు. ఇక అప్పుడు చూడాలి,ఆ సినిమా చుసిన వీళ్లంతా శోకాలు పెట్టి ఏడవడం మొదలుపెట్టారు. కల్మషం లేని మనసులు,టి.విలో కనిపించేది నిజం అనుకునే రోజులవి. స్వార్ధం లేని మనుషులు.కాలక్రమేణా మెల్ల మెల్లగ అందరి ఇళ్లలో టి.వీలు పుట్టుకొచాయి.కానీ ఆ కలాంలాంటి ఆదరణ మాయమైంది.ఆ నాటి అమాయకపు ప్రజలు కనుమరుగవుతున్న రోజులు ఇవి.ఇదండీ మా ఇంటి మొదటి టి.వి ప్రహసనం. ************

మరిన్ని కథలు

Raanunna kaalam
రానున్న కాలం
- మద్దూరి నరసింహమూర్తి
Tana kopame tana shatruvu
తన కోపమే తన శత్రువు!
- - బోగా పురుషోత్తం
Bongaram
బొంగరం
- సూర్య. మండా (MS)
Vellanu
వెళ్ళను
- isun finn
Punyakoti
పుణ్యకోటి
- కామేశ్వర రావు రాపాక
Prema.. O maaya
ప్రేమ.. ఓ మాయ
- డా:సి.హెచ్.ప్రతాప్
Doutya vijayam
దౌత్య విజయం
- డా:సి.హెచ్.ప్రతాప్
Teeru marchina reelu
తీరు మార్చిన రీలు
- ప్రభావతి పూసపాటి