"లంచ్ అయ్యిందా?” అంటూ చొరవగా తలుపు తీసుకొని రాఘవరావుగారి రూమ్‌లోకి ప్రవేశించారు ప్రకాశరావు.
ప్రకాశరావు, రాఘవరావు ఇద్దరూ ఒకే గవర్నమెంట్ ఆఫీస్‌లో చాలా కాలంగా కలిసి పనిచేస్తున్నారు. రాఘవరావుగారు చాలా కష్టపడి, నిజాయితీగా పనిచేసి ప్రమోషన్స్‌తో త్వరత్వరగా పైకి వచ్చి పెద్ద పొజిషన్‌లో ఉన్నారు.
ప్రమీలతో పెళ్లయిన తర్వాత ఉద్యోగ బాధ్యతలు తప్పించి పెద్దగా ఏ బాధ్యతా తన మీద వేసుకోలేదు రాఘవరావుగారు. ఆఫీసే ఆయనకు ఒక లోకమైపోయింది. పిల్లల చదువులు, ఉద్యోగాలు, వాళ్ల బాగోగులు... అన్నీ ఎక్కువ శాతం ప్రమీలే చూసుకునేది. ఉద్యోగం, ఆర్థిక విషయాలు మాత్రమే రాఘవరావుగారు చూసుకునేవారు.
పిల్లల పెళ్లిళ్లు కూడా కిందటి ఏడాదే అయిపోయాయి. కూతురి పెళ్లి మేనల్లుడు మురళితో, కొడుకు చైతన్య పెళ్లి డాక్టర్ శ్రావణితో జరిగిపోయాక ఇద్దరికీ ముందే ఏర్పాటు చేసిన ఇళ్లల్లో కాపురాలు పెట్టించారు.
అన్నీ సజావుగా జరుగుతున్న సమయంలో రాఘవరావుగారి తండ్రి కాలం చేశారు.
అనుకోకుండా జరిగిన ఆ ఘటన రాఘవరావుగారికి పెద్ద సమస్యను తీసుకొచ్చింది.
రాఘవరావు ఒక్కడే కొడుకు. ఊళ్లోనే డిగ్రీ చదువు పూర్తయ్యాక పై చదువుల కోసం పట్నం వెళ్లిపోయారు. సెలవులకు రెండు మూడు రోజులు ఇంటికి రావడం తప్ప, ప్రమీలతో పెళ్లయ్యాక కూడా ఆమె బలవంతం చేయడం వల్ల అప్పుడప్పుడు పండగలకు రెండు మూడు రోజులు వెళ్లి రావడం తప్ప ఎప్పుడూ తల్లిదండ్రులతో కలిసి ఉన్నది లేదు.
తన అదృష్టం బాగుండి పట్నంలో పెరిగిన పిల్ల అయిన ప్రమీల తనని బాగా అర్థం చేసుకుంది. తన తల్లిదండ్రుల మనస్థితి తెలుసుకొని తానే ఉత్సాహంగా పిల్లల్ని ఊరికి బయలుదేరదీసేది. అక్కడ సదుపాయాలు ఉన్నా లేకపోయినా, ఉన్నన్ని రోజులు హాయిగా గడిపి వచ్చేవారు.
ప్రమీల బాగా చదువుకున్నది. తెలివైనది, చురుకైనది కూడా. తాను కూడా ఒక్కతే కూతురు. పుట్టింటి వైపు నుంచి పెద్దగా ప్రేమ, ఆప్యాయతలు పొందలేదు. అయినా కూతురిగా గానీ, కోడలిగా గానీ తన ధర్మం పాటించడంలో ఎప్పుడూ ముందుండేది.
రాఘవరావుగారి తల్లిదండ్రులు సనాతన సంప్రదాయాలు పాటిస్తూ, ఆధునిక జీవితానికి దూరంగా ఉంటూ ఉన్న ఊరికే పరిమితమైపోయారు. కొడుకు ఇంట ఏ కార్యానికీ పెద్దగా రారు. వచ్చినా అంటీముట్టనట్టుగా, తమ ప్రమేయం ఏమీ లేదన్నట్టు చుట్టపుచూపుగా వచ్చి వెళ్లిపోయేవారు.
ఎన్నడూ ప్రమీలకి “మేమున్నాము” అన్న భరోసా కలిగేలా ప్రవర్తించలేదు.
ప్రమీల మాత్రం తనవల్ల జరగవలసిన ఏ సహాయమైనా ముందుండి చేసేది.
అందుకేనేమో ఇప్పటివరకు కుటుంబ బాధ్యతలు, పరిస్థితుల గురించి రాఘవరావుగారు పెద్దగా ఆలోచించవలసిన అవసరం రాలేదు.
ఇప్పుడు తన తల్లి ఊరిలో ఒక్కత్తి ఉండలేని పరిస్థితి. అలాగని వదిలి రాలేని పరిస్థితి.
ఏం చేయాలో అన్న ఆలోచనల్లో మునిగి ఉండగా ప్రకాశం,
“అమ్మ సంగతి ఏమాలోచించావు? ప్రమీల ఏమంది?” అన్న పలకరింపుతో ఈ లోకంలోకి వచ్చారు.
ప్రకాశం పేరుకి సహోద్యోగే అయినా తన గురించి, తన కుటుంబ పరిస్థితుల గురించి పూర్తిగా తెలిసినవాడు. ఆప్తుడు కూడా.
“ప్రమీలతో మాట్లాడావా?” అని స్నేహపూర్వకంగా అడిగాడు.
రాఘవరావు నిన్న రాత్రి తనకి ప్రమీలకి జరిగిన సంభాషణ మొత్తం చెప్పాడు.
“ప్రమీల తన అత్తగారిని ఊళ్లోనే అన్ని సదుపాయాలూ సమకూర్చి, ఇంట్లోని సగభాగం అద్దెకి ఇచ్చి, అక్కడే ఆవిడ దూరపు చుట్టం పర్యవేక్షణలో ఉంచమంటోంది. లేదంటే ఇక్కడికి తీసుకొస్తే మన ఇంటికి దగ్గరగా వేరే ఇల్లు తీసుకొని, అన్ని సదుపాయాలు సమకూర్చి మన సంరక్షణలో ఉండేలా చూద్దామంటోంది.
కానీ మన ఇంట్లో ఒకే చూరు కింద మాత్రం వద్దని ఖరాఖండిగా చెబుతోంది.
అందరికి ప్రేమాభిమానాలు పంచుతూ, అందరితో నవ్వుతూ కలగొలుపుగా ఉండే ప్రమీల అత్తగారి విషయంలో ఇంత నిఖార్సుగా ఎందుకు మాట్లాడుతోందో అర్థం కావడం లేదు.”
విషయం విన్న ప్రకాశం నవ్వుతూ,
“నాకు చెల్లెమ్మ అన్నదాంట్లో తప్పేమీ కనిపించడం లేదు” అన్నాడు.
“అదేమిటి? నువ్వు కూడా అలా అంటావా? అమ్మకి నేనొక్కడినే కొడుకుని. ఇప్పుడు నేను నా ధర్మం పాటించకపోతే ఎలా?” అన్నాడు రాఘవరావు ఆశ్చర్యంగా.
“అమ్మ మీద బెంగతో ప్రమీల మాట, మనసు నీకు సరిగ్గా అర్థం కాలేదు రాఘవా.
ప్రమీల నిన్ను కొడుకుగా నీ ధర్మం చేయవద్దని అనడం లేదు. తనని, మీ అమ్మగారిని ఇద్దరినీ హాయిగా జీవితం గడపనివ్వమని అడుగుతోంది.
ఒక్కసారి నీ అమ్మగారి గురించే ఆలోచించు. మీ నాన్నగారు ఇంకొన్ని సంవత్సరాలు బ్రతికి ఉంటే, నువ్వు ఇద్దరినీ తీసుకువద్దామని ఎప్పుడైనా అనుకున్నావా?
లేదా మీకోసం, మీ అవసరాలకైనా వాళ్లు ఎప్పుడైనా ఇక్కడికి రావాలని అనుకున్నారా?
ఎప్పుడూ మీరు వెళ్లడమే తప్ప, వాళ్లు ఎప్పుడైనా మీ అవసరాలు గుర్తించి మీ దగ్గరకు వచ్చారా?”
రాఘవరావు మౌనంగా విన్నాడు.
“ఇప్పుడు ఆవిడ అక్కడ ఉండలేని పరిస్థితి వచ్చింది కాబట్టి నీ దగ్గరికి వస్తున్నారు. అందుకే ప్రమీల మీ అమ్మగారిని మీతోపాటు ఒకే ఇంట్లో వద్దు, ఆవిడకి విడిగా ఇల్లు ఏర్పాటు చేసి ఉంచుదామని అంటోంది.
ఆవిడ ఆరోగ్యంగానే ఉన్నారు. తన పనులు తాను చేసుకోగలుగుతున్నారు. కావలసింది కేవలం ఒక అండ.
అది కొడుకే అవ్వాల్సిన రూలేమీ లేదు.
ఆవిడ బాధ్యత నీదే. కానీ ఆ బాధ్యత మీకు బరువుగా కాకూడదనేది ప్రమీల అభిప్రాయం.”
“కానీ లోకం ఏమనుకుంటుంది ప్రకాశం? కొడుకు ఉండి తల్లిని వేరే ఇంట్లో పెట్టాడంటారు.”
“లోకం గురించి ఆలోచించకు. ముందు నీ ఇంట్లోని మనుషుల గురించి ఆలోచించు.
నువ్వు నీ కొడుకు పెళ్లి అయ్యిన వెంటనే వేరే కాపురం పెట్టించాలి అని వాడి పెళ్లికి ముందే అనుకున్నావు. ఎందుకు?
మీ కోడలు కూడా మీ ఇంట్లోనే ఉండి వయసు వస్తున్న నీ భార్యకి సహాయంగా ఉండమని అడగవచ్చు కదా!
కానీ అది సాధ్యపడదని నీకు తెలుసు. కోడలు డాక్టర్. వాళ్లు వేరుగా ఉంటేనే వాళ్లకి సౌకర్యంగా ఉంటుంది. వాళ్లు మీతో కలిసి ఉంటే జీవితం నువ్వు అనుకున్నంత సజావుగా సాగదని తెలిసే ముందుగానే వాళ్లని వేరుగా ఉండమన్నావు.
అదే నీ తల్లి విషయం వచ్చేసరికి ఆవిడని వేరుగా ఉంచడం మాత్రం నేరంగా భావిస్తున్నావు.
నీకు ఒక న్యాయం... నీ కొడుక్కి ఒక న్యాయమా?”
ఆ మాటకి రాఘవరావు తలెత్తి చూశాడు.
“అది వేరు ప్రకాశం.”
“ఎందుకు వేరు?
పూర్వకాలంలో పెళ్లయిన తర్వాత కోడలు ఉమ్మడి కుటుంబంలోనే ఉండేది. కానీ ప్రమీల విషయం అలా కాదు కదా!
నువ్వు ఇన్నేళ్ల కాలంలో పెళ్లాం పిల్లలతో కలిసి మీ ఊరికి ఎన్నిసార్లు వెళ్లావు? మీ అమ్మానాన్నలతో కలిసి ఎన్నాళ్లు ఉన్నావు?
అసలు ప్రమీల ‘నాకు పల్లెటూళ్లు పడవు, అక్కడ సదుపాయాలు లేవు. నేను రాను’ అని అంటే నువ్వేం చేసేవాడివి?
కానీ ప్రమీల అలా అనలేదు. తనవంతు ధర్మం ఇన్నాళ్లూ పాటించింది.
ఇప్పుడు తాను కూడా వయసులో పెద్దదవుతోంది. తల్లిగా తన బాధ్యతలు నిర్వర్తించింది. తనకూ విశ్రాంతి కావాలి కదా!
మన మగవాళ్లకి రిటైర్మెంట్ ఉంటుంది. ఇన్నాళ్లు చేసిన ఉద్యోగం ఎంత అలవాటైనా, ఒక వయసు వచ్చిన తర్వాత విశ్రాంతి తీసుకోమని గవర్నమెంట్ చెబితే అది తప్పు కాదు.
ప్రమీల అలాంటి విశ్రాంతి కావాలని అడిగితే మాత్రం తప్పు ఎలా అవుతుంది?”
రాఘవరావు ఏమీ మాట్లాడలేదు.
ప్రకాశం కొద్దిసేపు ఆగి మెల్లగా అన్నాడు.
“మీ అమ్మగారు ఒక్కరే ఉండలేరని నువ్వంటున్నావు.
అది నిజమే అయితే, ఇన్నాళ్లు మీ అమ్మగారిని ఆధునిక జీవితానికి సిద్ధం చేయాల్సిన బాధ్యత ఎవరిది?
ఆవిడ నీ తల్లి కాబట్టి ‘నువ్వు మారాలి’ అని నువ్వు చెప్పలేకపోతే, ప్రమీల నీ భార్య కాబట్టి ఆ మార్పు బాధ్యత కూడా ఆమె మీదే వేయడం న్యాయమా?
ఆమెను కోడలిగా మాత్రమే చూడకు రాఘవా.
ఇన్నేళ్లు నీతో కలిసి జీవితం పంచుకున్న మనిషిగా చూడు.
తనకి కూడా ఒక ఇల్లు కావాలి. తనదైన దినచర్య కావాలి. తనకి నచ్చినట్టు కొంత జీవితం గడిపే స్వేచ్ఛ కావాలి.
ఒకటి రెండు నెలలు అయితే ‘సర్దుకో’ అని చెప్పొచ్చు. కానీ జీవితాంతం తెలియని ప్రయాణంలో సర్దుకుపోవడం అంత తేలిక కాదు.” అని గడియారం చూసుకున్నాడు.
“ఇవాళ కబుర్లలో టైమే తెలియలేదు. నేను వెళ్తాను.”లేచి తన సీటు వైపు వెళ్తూ మళ్లీ వెనక్కి తిరిగి,
“నువ్వు ప్రమీలని సరిగ్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. తను చెప్పింది సానుకూలంగా ఆలోచించు.వాళ్లిద్దరినీ సంతోషపెట్టగలిగే సామర్థ్యం నీకే ఉంది.
మీ అమ్మగారికి మంచి ఇల్లు ఏర్పాటు చెయ్యి. నువ్వు రోజు కలిసిరా. ఆవిడ మంచి చెడ్డలు చూడు. కొడుకుగా అన్ని అవసరాలు తీర్చు.అవసరం వచ్చినప్పుడు ప్రమీల సహాయంతో ఆవిడకి అండగా ఉండు. అలా చేస్తే నీ అమ్మకి కొడుకుగా నీ బాధ్యతా నెరవేరుతుంది. ప్రమీలకి భార్యగా, మనిషిగా ఆమెకున్న హక్కూ దక్కుతుంది.”అని చెప్పి తన సీటుకి వెళ్లిపోయాడు.
ప్రకాశం మాటలు విన్న రాఘవరావుగారి మనసు ఆలోచనలో పడింది.నిజమే.ఇన్నేళ్ల తమ కాపురంలో ప్రమీల తనని నోరు తెరిచి ఏమీ అడగలేదు.ఇదే మొదటిసారి తన మనసులోని మాట బయటపెట్టింది.నిన్న రాత్రి జరిగిన సంభాషణ గుర్తొచ్చింది.“నేను అమ్మగారిని చూసుకోవద్దని ఎక్కడ అన్నాను రాఘవా?ఆవిడ మన దగ్గరే ఉండాలని మీకు అనిపిస్తే నేను అడ్డం చెప్పను.
కానీ నాకూ ఒక మనసుంది కదా! ముప్పై ఏళ్లుగా ఈ ఇంటినే చూసుకున్నాను. పిల్లల్ని చదివించాను. వాళ్ల పెళ్లిళ్లు చేశాను. మీ అమ్మానాన్నల విషయంలో నా వంతు బాధ్యత చేశాను.ఇప్పుడు నాకు కూడా కొంచెం ప్రశాంతంగా ఉండాలని ఉంది.మీ అమ్మగారిని మన ఇంటి దగ్గర్లోనే ఉంచుకుందాం. మీరు ప్రతిరోజూ వెళ్లి చూడండి. నాకు చేతనైనంత నేను చేస్తాను.
కానీ ఒకే ఇంట్లో ఉంటే... అది మీ అమ్మకీ, నాకూ మంచిది కాదు.నేను ఆవిడని దూరం చేయడం కాదు రాఘవా.
మనిద్దరి మధ్య మిగిలిన జీవితాన్ని ప్రశాంతంగా ఉంచుకోవాలని మాత్రమే కోరుకుంటున్నాను.”అప్పుడు తనకి ఆ మాటలు కాస్త కఠినంగా అనిపించాయి.
ఇప్పుడు మాత్రం ప్రకాశం మాటల తర్వాత వాటి వెనకున్న బాధ్యత కనిపించింది.ప్రమీల తన అత్తగారిని దూరం చేయాలని అనుకోవడం లేదు.
తనని తాను కూడా కోల్పోకుండా ఉండాలని కోరుకుంటోంది.
రాఘవరావు ఒక్కసారి కుర్చీలో వెనక్కి వాలాడు.ఇన్నేళ్లూ తాను తన తల్లికి కొడుకుగా ఉన్నాడనుకున్నాడు.
కానీ కొడుకుగా ఉండటం అంటే తల్లిని తన ఇంట్లోకి తీసుకురావడమేనా?లేక ఆమెకు గౌరవంగా, ఆమెకు నచ్చినట్టు జీవించే అవకాశం కల్పించడమా?అదే సమయంలో ప్రమీలకి భర్తగా ఉండటం అంటే ఏమిటి?ఆమె మాట వినడం కూడా తన బాధ్యతలో భాగమే కదా!
ఆలోచిస్తుంటే సమాధానం మెల్లగా స్పష్టమవుతున్నట్టనిపించింది.
తన తల్లికి ఒక మంచి ఇల్లు.తనకి దగ్గరగా.తన పర్యవేక్షణలో.ప్రమీలకి తనదైన జీవితం.ఇద్దరికీ తనవంతు అండ.
అదే సరైన మార్గమనిపించింది.
ఫోన్ తీసుకున్నాడు.ప్రమీల నంబర్‌కి కాల్ చేశాడు.
“మన లొకాలిటీలో మంచి సదుపాయాలున్న ఇల్లు చూడు.”
అవతల కొద్దిసేపు నిశ్శబ్దం.
“మీకు... నిజంగా అభ్యంతరం లేదా?”
రాఘవరావు చిరునవ్వు నవ్వాడు.
“అభ్యంతరం ఎందుకు ఉంటుంది?
అమ్మ నా బాధ్యత.నువ్వూ నా బాధ్యతే.
ఇద్దరిలో ఎవరినీ ఒకరి కోసం మరొకరిని కోల్పోవాలని నేను కోరుకోవడం లేదు.”
అవతల ప్రమీల ఏమీ మాట్లాడలేదు.
ఆమె నిశ్శబ్దంలోనే ఎంతోకాలంగా మోస్తున్న భారం కరిగిపోతున్నట్టు రాఘవరావుకి అనిపించింది.
“ఇల్లు నువ్వే చూడు ప్రమీలా. అమ్మకి నచ్చేదిగా ఉండాలి.”“అలాగే...” అంది ప్రమీల.
ఫోన్ పెట్టేసి రాఘవరావు కాసేపు అలాగే కూర్చున్నాడు.
ప్రకాశం చెప్పిన మాటలు మళ్లీ గుర్తొచ్చాయి.
తన ముప్పై ఏళ్ల కాపురంలో మొదటిసారిగా ప్రమీల తనని ఏదో అడిగింది.ఆమె అడిగింది ఇల్లు కాదు.
కొంచెం మానసిక విశ్రాంతి.ఆమెకి అది ఇవ్వడం తన చేతిలో ఉన్న అతిపెద్ద కానుక అనిపించింది.
తేలికపడిన మనసుతో రాఘవరావుగారు మళ్లీ తన ఆఫీస్ పనిలో పడిపోయారు.

