రానున్న కాలం - మద్దూరి నరసింహమూర్తి

Raanunna kaalam

“తరుణ్, ఈరోజు సాయంత్రం ఆరుగంటలకు మా ఇంటికి దగ్గర పార్క్ ఎదురుగుండా ‘కాఫీ డే’ లో మీకోసం ఎదురుచూస్తూ ఉంటాను” – అంటూ ఫోటో మరియు చిరునామాతో సహా తన చరవాణికి వచ్చిన సందేశాన్ని చదువుకున్న తరుణ్ కి చాలా సంతోషం వేసింది.

“స్వాగతం తరుణ్. ఇలా కూర్చోండి. నా పేరు శోభ. సామాజిక మాధ్యమంలో అందంగా ‘ హి మాన్’ లా ఉన్న మీ ఫోటో చూసి సందేశం పంపేను”

“ధన్యవాదాలు. మీరు కూడా స్కర్ట్ బ్లౌజ్ తో విరబోసుకున్న పొట్టి జుట్టుతో సెక్సీగా చాలా బాగున్నారు”

“మనం ఇద్దరం ఒకరినొకరు నచ్చుకున్నాము కాబట్టి, మనం ఒకటైతే ఎలా ఉంటుంది”

“చాలా బాగుంటుంది. ఎలాగా ఆ అభిప్రాయానికి వచ్చేము కాబట్టి, ‘మీరు’ బదులుగా ‘నువ్వు’ అని మాటలాడుకుంటే బాగుంటుంది” అన్న తరుణ్ మాటలకు –

‘సరే’ అన్నట్టు, చేతి బొటనవ్రేలెత్తి చూపింది శోభ.

“నీ జీతం ఎంత” శోభ ప్రశ్న.

“నాకు సంవత్సరానికి 42 ఇస్తారు, మరి నీకో”

“ఇంటినుంచే పని చేస్తున్నాననో, లేక లింగ వివక్షయో, నాకు 33 మాత్రమే ఇస్తున్నారు”

“నేను కూడా ఇంటినుంచే పని చేస్తున్నాను” అన్నాడు తరుణ్ నవ్వుతూ.

“నాకు వంట చేయడం అంటే మంట”

“జొమాటో స్విగ్గీ లాంటివాటితో పాటూ రకరకాల హోటళ్ళు ఉండగా మనకు వంట చింత ఎందుకు” అన్న తరుణ్ సూటిగా “నేను డ్రింక్స్ తీసుకుంటాను, స్మోకింగ్ కూడా చేస్తాను, నీ సంగతో” అని అడిగేడు.

“కంపెనీ కొనుగోలుదార్లతో సమావేశాలకు అప్పుడప్పుడు వెళ్లవలసి వస్తూంటుంది. బయట ఊర్లకు కూడా వెళ్లవలసి వస్తూంటుంది. అప్పుడు ఆ రెండూ తప్పడం లేదు. అంతేకాదు, అటువంటి సమావేశాల్లో అక్కడకు వచ్చిన వాళ్ళతో కొంచెం చనువుగా కలిసి మెలిసి తిరుగుతూ, అప్పుడప్పుడు కొందరితో ఒకే గదిలో నిద్రించవలసి వస్తూంటుంది. అందుకే, నేను కుటుంబ నియంత్రణ మాత్రలు వాడుతూ ఉంటాను”

“మీ ఆడవారికి ఆ మాత్రం జాగ్రత్తలు తప్పవు. నాకూ అలాటి పనులు తప్పడం లేదు” అని నవ్వేడు తరుణ్.

“కంపెనీ పనులకోసం నేను వీలైనంత అందంగా కనపడడం చాలా ముఖ్యం. నా అందం కాపాడుకోవాలంటే, గర్భం దాల్చడానికీ, పిల్లలు కనడానికీ, పిల్లలకు పాలిచ్చేందుకు నేను దూరంగా ఉండక తప్పదు”

“తరగని అందంతో నన్ను ఎప్పుడూ కనువిందు చేస్తానంటే, అంతకంటే నాకు కావలసినది ఏముంది”

“నాకు శాస్త్రప్రకారం పెళ్లి అంటే ఇష్టం లేదు. ఎందుకంటే –

నెత్తి మీద జీలకర్ర బెల్లం పెట్టించుకొని జుట్టు పాడుచేసుకోవడం, పశువుకి కట్టినట్టు మెడలో మంగళసూత్రం కట్టించుకోవడం, పొగతో కళ్ళు మండిపోతూంటే హోమం చేయడం, ముహూర్తం రాత్రైనా పగలైనా, కనిపించని అరుంధతి నక్షత్రం చూపించినట్టు పౌరోహితుడు మాటలాడడమే కాక, చూసినట్టు వధూవరులు అబద్ధం ఆడడం, తలంబ్రాలు పేరుతో బియ్యాన్ని నెత్తి మీదనుంచి నేల వంపుకోవడం, అప్పగింతలు పేరుతో ఆడపెళ్లివారు ఏడవడం –

– ఈ చాదస్తాలు నాకు నచ్చవు”

“నిజమే, జీలకర్ర బెల్లంతో గోడకి చేరబడితే, చీమలు కుడతాయి కూడా” అంటూ నవ్వేడు తరుణ్.

“పెళ్ళైన భార్యాభర్తలు ఎప్పుడు మూడ్ వస్తే అప్పుడు హాయిగా ఏకమవడం కాకుండా, గర్భాధారణ ముహూర్తం అంటూ, శోభనం పేరుతో పూజలు చేయించి, గంగిరెద్దును అలంకరించినట్టు భారీగా ముస్తాబు చేసి గదిలోనికి నెట్టడం, ఉదయం గదిలోంచి బయటకు రాగానే, ‘రాత్రి ఎలా గడిచింది’ అంటూ అమ్మలక్కల సరసాలూ -- ఆ తంతంతా వ్యభిచారంలా అసహ్యం వేస్తుంది”

“నువ్వు చెప్పిందంతా నిజమే, ఇప్పుడు మనం ఏం చేద్దాం”

“రిజిస్ట్రారుగారి దగ్గర పెళ్లి చేసుకుంటే సరి, పైగా ప్రమాణపత్రం కూడా ఇస్తారు”

“తక్కువ ఖర్చుతో ఆర్భాటాలు లేకుండా మనం ఇద్దరం ఒకటైపోతాం”

“నేను ఈ విషయంలో మా ఇంట్లో చెప్పి ఒప్పిస్తాను. నువ్వు మీ ఇంట్లో చెప్పి ఒప్పించగలవా?”

“మా ఇంట్లో తప్పకుండా ఒప్పుకుంటారు”

“అంత ధైర్యంగా ఎలా చెప్పగలుగుతున్నావు?”

“మా ఇంట్లో నాకు పెళ్లైతే చాలు అని ఎదురు చూస్తున్నారు” నవ్వుతూ చెప్పేడు తరుణ్.

“చనువుగా ఉన్న సహోద్యుగులను, దగ్గర బంధువులను మాత్రమే పిలిచి, ఒక హోటల్లో పరిమిత పదార్ధాలతో శాఖాహార విందు ఏర్పాటు చేస్తూ, ఎవరూ బహుమతులు తీసుకొనిరావద్దని తెలియచేద్దాం”

“అది సరే, నాకు మరో మంచి ఆలోచన వస్తోంది శోభా”

“మంచి ఆలోచన అయితే, ఆలస్యం ఎందుకు, త్వరగా చెప్పు”

“నువ్వు నన్ను తప్పుగా అర్ధం చేసుకోకూడదు”

“ప్రశ్నే లేదు”

“పెళ్లి ఊసే ఎత్తుకోక, మనం సహజీవనం చేస్తే సరిపోదా”

“ఎందుకు సరిపోదూ. నేను ఎలాగా పిల్లలు కనను అనుకుంటున్నాను కాబట్టి, వేరే సమస్యలు ఏమైనా ఉన్నాయేమో తెలుసుకుంటే సరి”

“సహజీవనాన్ని సమర్ధిస్తూ మన దేశపు అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చింది కదా, మరి సమస్యలెందుకు వస్తాయి”

“మన దేశపు అత్యున్నత న్యాయస్థానం అప్పుడప్పుడు వారి తీర్పును తిరగవ్రాయడం వింటున్నాం కదా”

“అలా అయితే, మనం తెలివిగా ఒక పని చేద్దాం. మన ఇంట్లో వారికి తప్ప ఇంకెవరికీ తెలియనీయకుండా, రిజిస్ట్రారుగారి దగ్గర వివాహం చేసుకొని ప్రమాణపత్రం తెచ్చుకుందాం. విందు గిందు ఏమీ పెట్టుకోకుండా సహజీవనం చేస్తూ, అందరి కళ్ళు కుట్టేటట్టు బాహాటంగా కలిసి తిరుగుదాం. అంతగా ఏ సమస్యైనా వస్తే, రిజిస్ట్రారుగారు ఇచ్చిన ప్రమాణపత్రం మనల్ని కవచంలా కాపాడుతుంది. రేపటినుంచే మన సహజీవనానికి కావలసిన మూడు పడకగదుల ఇల్లు చూసే పనిలో ఉంటాను”

“అంత పెద్ద ఇల్లెందుకు” శోభకు వచ్చిన అనుమానం.

“ఒక గదిలో నువ్వు పని చేసుకుంటావు, ఇంకొక గదిలో నేను పని చేసుకుంటాను, మూడో గది మన సరసాలకు” అన్న తరుణ్ మాటలకు ఇద్దరూ హాయిగా నవ్వుకున్నారు.

“స్నేహితులైనా, భార్యాభర్తలైనా గొడవపడేది డబ్బు దగ్గరే” తరుణ్ భవిష్య దర్శనం.

“అయితే మనం ఏం చేద్దాం” శోభ కుతూహలం.

“రేపటినుంచీ అన్ని ఖర్చులూ సమానంగా పంచుకుందాం. బాంకులో మన ఇద్దరి పేరున ఖాతా తెరిచి, చెరో రెండేసి లక్షలు వేద్దాం. ఆ డబ్బు ఖర్చు లెక్కలు చూసుకుంటూ, అవసరమైనప్పుడు ఇద్దరం కావలసినంత డబ్బు అందులో వేసి ఉంచి ఖర్చులు చేసుకుందాం”

“నా పేరులో నీ పేరులో వేరువేరుగా జీవితభీమా తీసుకొని నాకు నువ్వు నీకు నేను ‘నామినీ’ గా ఉందాం.

“నీ ముందు చూపుకు నా జోహార్లు శోభా”

“మనం అన్నీ మాటలాడుకున్నాం కానీ, ముఖ్యమైన విషయం మాటలాడుకోవడం మరచిపోతున్నాం”

“ఏమిటది” తరుణ్ తహతహ.

“మన పూర్వ అనుభవాలు ఎన్ని ఉన్నా, ఈరోజున మనం సంసారానికి పనికి వస్తాము అని వైద్య పరంగా రూఢి పరచుకోవడం ఉత్తమం”

“ఆ మాత్రం దానికి వైద్యుల దగ్గరకు వెళ్ళడం ఎందుకు” తరుణ్ ప్రశ్న.

“మరి పరీక్ష చేసేది వైద్యులే కదా”

“మనం ఉమ్మడిగా ఒకరినొకరం పరీక్ష చేసుకుంటే సరిపోతుంది కదా” తరుణ్ సమస్యను తేలికపరచేడు.

“అదీ నిజమే. అయితే, రేపు ఏదో హోటల్లో గది తీసుకుందాం. ఇద్దరం ఆ పరీక్ష విజయవంతంగా ముగించి ముందుకు అడుగిడదాం, సరేనా?” శోభ ప్రశ్న.

“రేపటి వరకూ ఆగక తప్పదా” అన్న తరుణ్ మాటలతో –

ఇద్దరూ పులకింతల మనస్సులతో హాయిగా నవ్వుకున్నారు.

మరిన్ని కథలు

Tana kopame tana shatruvu
తన కోపమే తన శత్రువు!
- - బోగా పురుషోత్తం
Bongaram
బొంగరం
- సూర్య. మండా (MS)
Vellanu
వెళ్ళను
- isun finn
Punyakoti
పుణ్యకోటి
- కామేశ్వర రావు రాపాక
Prema.. O maaya
ప్రేమ.. ఓ మాయ
- డా:సి.హెచ్.ప్రతాప్
Doutya vijayam
దౌత్య విజయం
- డా:సి.హెచ్.ప్రతాప్
Teeru marchina reelu
తీరు మార్చిన రీలు
- ప్రభావతి పూసపాటి
Ido prema katha
ఇదోప్రేమ కథ
- కొడాలి సీతారామా రావు