నలుపు - వేముల శ్రీమాన్

Nalupu

ఆసుపత్రి వరండాలో గడియారం ముళ్లు ముందుకు కదులుతున్నాయి. కానీ శ్యామ్‌కు మాత్రం కాలమే ఆగిపోయినట్టనిపించింది. కాలుకాలిన పిల్లిలా ఆసుపత్రి వరండాలో అటూ ఇటూ తిరుగుతున్నాడు

అతని ప్రతి అడుగులోనూ ఆందోళన. ప్రతి నిట్టూర్పులోనూ ఒక మౌన ప్రార్థన.

ప్రసూతి గది తలుపు మూసి ఉంది. లోపల నిషా ప్రసవ వేదనను భరిస్తోంది.

బయట శ్యామ్ తన జీవితంలోనే అత్యంత పెద్ద యుద్ధాన్ని తనలో తానే పోరాడుతున్నాడు."అమ్మాయైనా... అబ్బాయైనా... ఆరోగ్యంగా పుట్టాలి."

అని పెదవులు ప్రార్థిస్తున్నాయి.కానీ...మనసు మాత్రం మరో మాట చెబుతోంది.

"దేవుడా... . ఈసారి బిడ్డ నల్లగా పుట్టకూడదు."

ఆ ఆలోచన వచ్చిన ప్రతిసారి అతనికే తన మీద అసహ్యం వేసేది.

"నేనెప్పటి నుంచి ఇలా ఆలోచిస్తున్నాను?"

అతనికి తెలుసు...పుట్టబోయే బిడ్డ రంగు తన చేతిలో లేదు.అది దేవుడి నిర్ణయం.

అయినా మనిషి కొన్నిసార్లు దేవుడికి కాదు... సమాజానికే ఎక్కువ భయపడతాడు.

ఆ భయం శ్యామ్‌ను వెంటాడుతోంది.

నాలుగేళ్ల క్రితం కూడా ఇలాగే ఇదే ఆసుపత్రి.అదే వరండా.అదే ఆందోళన.

ఆ రోజు వారి జీవితాల్లోకి ఒక పాప వచ్చింది.

పుట్టిన క్షణంలో ఆమె ముఖాన్ని చూసి శ్యామ్ కళ్లలో నీళ్లు తిరిగాయి.

చిన్న ముక్కు...చిన్న పెదవులు...చిట్టి వేళ్లు...

అతనికి ప్రపంచంలోనే అందమైన శిశువులా కనిపించింది.

కానీ ఆ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు.

"పాప కాస్త నల్లగా ఉంది."అని ఎవరో అన్న మాట...ఆ రోజు నుంచి అతని మనసులో శాపంలా మిగిలిపోయింది.బంధువులు ఒక్కొక్కరిగా వచ్చారు.

పాపను చూసే ముందు...రంగును చూశారు."అయ్యో... ఇంత నలుపా!"

"పెరిగాక తెల్లబడుతుందిలే.""క్రీములు బాగా రాస్తే మారిపోతుంది."

"పెళ్లి మాత్రం కష్టమే."

పుట్టిన గంట కూడా కాకముందే...ఆ చిన్నారి భవిష్యత్తుకు తీర్పు చెప్పేశారు.

ఆ రోజు శ్యామ్ తొలిసారి ఒక నిజాన్ని చూశాడు.

ఈ ప్రపంచంలో...కొంతమంది మనిషిని చూడరు.అతని రంగునే చూస్తారు.

అకస్మాత్తుగా ప్రసూతి గది నుంచి ఒక పసికందు ఏడుపు వినిపించింది.

ఆ ఏడుపు ఆసుపత్రి నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ వరండా అంతా నింపేసింది.

శ్యామ్ గుండె వేగంగా కొట్టుకుంది.

కొద్ది క్షణాల తర్వాత తలుపు తెరుచుకుంది.ఒక నర్స్ చిరునవ్వుతో బయటకు వచ్చింది.

"అభినందనలు... బాబు పుట్టాడు."శ్యామ్ ముఖం ఒక్కసారిగా వెలిగిపోయింది.

అతను లోపలికి అడుగుపెట్టబోతుండగా...వెనుకనుంచి ఒక పెద్దమ్మ నవ్వుతూ అంది—

"మగబిడ్డే... కానీ కాస్త నలుపు."ఆ "కానీ"...ఆ ఒక్క మాట...

అతని ఆనందాన్ని ఒక్క క్షణంలో మింగేసింది.

ఒక చిన్నారి జీవితానికి...

పుట్టిన మొదటి నిమిషంలోనే సమాజం రాసిన మొదటి తీర్పు అదే.

నిషా అలసటతో మంచంపై పడుకుంది.ఆమె ఒడిలో చిన్నారి నిద్రపోతున్నాడు.

శ్యామ్ నెమ్మదిగా దగ్గరకు వెళ్లాడు.బిడ్డను చేతుల్లోకి తీసుకున్నాడు.

అంత చిన్న ప్రాణి...అతని అరచేతుల్లో ఇమిడిపోయాడు.

మూసుకున్న కనురెప్పలు...చిట్టి ముక్కు...గట్టిగా బిగించిన పిడికిలి...

ఏ దేవదూతకూ తక్కువ కాని అందం.

అతను చాలాసేపు తన కొడుకును చూస్తూనే ఉన్నాడు.

ఒక్కసారిగా అతని మనసులో ఒక ప్రశ్న మెరిసింది.

"ఇంత అందంగా ఉన్న ఈ బిడ్డలో... నేను చూడలేనిది ఏమిటి?"

సమాధానం వెంటనే వచ్చింది."నేను కాదు... ఈ సమాజమే చూడలేకపోతోంది."

కానీ ఆ ఆలోచన క్షణంలోనే చెదిరిపోయింది.బయట బంధువుల మాటలు మొదలయ్యాయి.

"ఎండలో ఎక్కువగా ఆడనివ్వొద్దు.""చిన్నప్పుడే మంచి క్రీమ్ వాడాలి."

"ఇప్పుడే జాగ్రత్తపడితే రంగు మారుతుంది."ప్రతి మాటా...బిడ్డ మీద కాదు.రంగు మీదే.

అంతలో తెల్లజుట్టు, ముడతలతో ఉన్న ఒక పెద్దాయన నిట్టూర్చాడు.

"మన చేతిలో ఏముంది బాబూ... గత జన్మలో పాపం చేస్తే ఈ జన్మలో నల్లగా పుడతారట."

ఆ మాట వినగానే...శ్యామ్ చేతుల్లో ఉన్న పసిబిడ్డను మరింత దగ్గరగా హత్తుకున్నాడు.

అతని గుండెలో ఒక్కసారిగా ఒక బాధ ఉప్పొంగింది.

"ఇంకా కళ్లే సరిగా తెరవని ఈ చిన్నారి... ఏ పాపం చేశాడు?"జవాబు ఎవరి దగ్గరా లేదు.

అక్కడున్న వారందరూ తమ తమ నమ్మకాలతో మాట్లాడుతున్నారు.

కానీ...ఆ రోజు ఎవరికీ తెలియని ఒక నిజం నిశ్శబ్దంగా జన్మించింది.

ఆ బిడ్డతో పాటు...రంగు వివక్షకు వ్యతిరేకంగా ఒక ప్రశ్న కూడా ఈ లోకంలోకి అడుగుపెట్టింది.

కాలం ఎవరి కోసం ఆగదు. కృష్ణ... చూడచూడగానే బడిబ్యాగ్ వేసుకునే వయసుకు వచ్చాడు.అతని కళ్లలో అమాయకత్వం,మాటల్లో తేనెలాంటి మాధుర్యం.

చిరునవ్వులో ఎలాంటి కల్మషం లేదు.కానీ...

అతడు అడుగుపెట్టబోయే ప్రపంచం అంత అమాయకం కాదు.

పాఠశాల మొదటి రోజు.

నిషా అతని జుట్టు దువ్వి, యూనిఫాం సరిచేసి, నుదుటిపై ముద్దుపెట్టుకుంది.

"బాగా చదువుకోవాలి నాన్నా..."అంది.

కృష్ణ ఆనందంగా తల ఊపాడు.ఆ రోజు అతనికి పాఠశాలంటే కొత్త ప్రపంచం.

కొత్త స్నేహితులు.కొత్త గురువులు.కొత్త కలలు.కానీ...కొద్ది రోజుల్లోనే అతనికి తెలిసిపోయింది—ప్రతి కొత్త ప్రపంచం అందరికీ ఒకేలా స్వాగతం పలకదు.

ఒక రోజు మధ్యాహ్నం...పిల్లలంతా మైదానంలో ఆడుకుంటున్నారు.

కృష్ణ కూడా వాళ్లతో కలిసి పరుగెత్తాడు.అప్పుడే ఒక అబ్బాయి గట్టిగా అరిచాడు.

"ఒరేయ్... కాలా... బంతి ఇటు విసురు!"మొదట కృష్ణ వెనక్కి తిరిగి చూశాడు.

మరెవరినో పిలుస్తున్నారనుకున్నాడు.కానీ అందరి చూపూ తనవైపే ఉంది.

వాళ్ల నవ్వులు కూడా తననే చూసి విరిశాయి.

ఆ రోజు...

తన పేరుకంటే ముందు మరో పేరు తనకు వచ్చిందని అతనికి తెలిసింది.

"కాలా..."ఆ తర్వాత ప్రతి రోజూ కొత్త పేరే."నల్లబొగ్గు...""కాకి...""రాత్రి...""కరెంట్ పోతే నువ్వు కనిపించవు..."ఆ మాటలు చెప్పిన వాళ్లకు అవి సరదా.విన్న కృష్ణకు మాత్రం...

ప్రతి మాట గుండెల్లో నిశ్శబ్దంగా దిగిపోయే ముల్లు.అతను ఎదురు మాట్లాడలేదు.ఎందుకంటే...వాళ్లు ఎందుకు నవ్వుతున్నారో కూడా అతనికి పూర్తిగా అర్థం కాలేదు.

ఒక రోజు తెలుగు పాఠం జరుగుతోంది.టీచర్ బ్లాక్‌బోర్డు మీద రాస్తూ...

"కృష్ణా... నువ్వు ఇక్కడ నిలబడకు. బోర్డు మీద అక్షరాలు కనిపించవు..."

అని నవ్వుతూ అనింది.తరగతి మొత్తం ఒక్కసారిగా పగలబడి నవ్వింది.

కొంతమంది బెంచీలు కొట్టారు.మరికొందరు చప్పట్లు కొట్టారు.

టీచర్ కూడా తన మాట ఎంత లోతుగా గుచ్చుకుందో గ్రహించలేదు.

కృష్ణ మాత్రం...పెదవులపై చిన్న నవ్వు తెచ్చుకున్నాడు.

ఆ నవ్వు...ఇతరుల కోసం.మనసు మాత్రం...నిశ్శబ్దంగా రక్తం కార్చుకుంది.

ఆ సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత...ఎప్పటిలా అమ్మ ఒడిలో పడుకోలేదు.

ఆటకు కూడా వెళ్లలేదు.నిషా పలుమార్లు పిలిచినా..."ఏమీ లేదు అమ్మ..."

అనే ఒక్క మాటే చెప్పాడు.రాత్రి అందరూ నిద్రపోయిన తర్వాత...

నెమ్మదిగా అద్దం ముందు వెళ్లి నిలబడ్డాడు.చాలాసేపు తన ముఖాన్నే చూస్తూ ఉన్నాడు.

అద్దంలో ఉన్నవాడు...తానే.కానీ...అతనికి తన ముఖం కొత్తగా కనిపించింది.

ముక్కు అదే.కళ్లు అవే.పెదవులు అవే.మారింది ఒక్కటే—తన చూపు.

ఇతరుల మాటలతో తనను తాను చూసే చూపు."నేను నిజంగానే అంత అందవిహీనుడినా?"అద్దం మౌనంగా నిలిచింది.సమాధానం చెప్పలేదు.

అయితే...ఆ మౌనమే అతనికి సమాధానంలా అనిపించింది.

ఆ రోజు నుంచి...అద్దం అతనికి స్నేహితుడు కాదు.తీర్పు చెప్పే న్యాయమూర్తి అయిపోయింది.

ఆ తర్వాత ఒక విచిత్రమైన అలవాటు మొదలైంది.

ఎవరైనా నవ్వితే..."నన్నే చూసి నవ్వుతున్నారేమో..."అనిపించేది.

ఎవరైనా ఇద్దరు మాట్లాడుకుంటే..."నా గురించే మాట్లాడుతున్నారేమో..."

అనిపించేది.ఇలా...సమాజం నాటిన సందేహం...అతని మనసులో వేర్లు వేయసాగింది.

కానీ దేవుడు ఒక తలుపు మూస్తే...మరో తలుపు తెరుస్తాడేమో.చదువంటే కృష్ణకు అపారమైన ఇష్టం.పుస్తకం చేతిలో పడితే...లోకాన్నే మరిచిపోయేవాడు.

పాఠం ఒకసారి వింటే చాలు.గుర్తుండేది.పరీక్షల్లో ఎప్పుడూ మొదటి ర్యాంకే.

బహుమతులు.ప్రశంసాపత్రాలు.మెడల్స్.ఒక్కొక్కటిగా ఇంటికి చేరుతున్నాయి.

నిషా వాటిని అలమారలో అమర్చుకుంటూ గర్వపడేది.

శ్యామ్ కూడా కొడుకుని చూసి సంతోషించేవాడు.అయినా...

కొడుకు కళ్లలో ఏదో చెప్పలేని వెలితి ఉందని అతనికి అర్థమవుతూనే ఉండేది.

ఒక రోజు శ్యామ్ అడిగాడు.

"కృష్ణా... ఏమైంది? ఈ మధ్య చాలా మౌనంగా ఉంటున్నావు."

కృష్ణ తలదించుకున్నాడు.కొన్ని క్షణాలు నిశ్శబ్దం.తర్వాత మెల్లగా అడిగాడు.

"నాన్నా...""చెప్పు బాబూ.""నేను తెల్లగా పుట్టి ఉంటే... అందరూ నన్ను ఇలానే చూసేవారా?"ఆ ప్రశ్న విన్న శ్యామ్ గుండె ఒక్కసారిగా కుదేలైంది.

కొడుక్కి సమాధానం చెప్పే ముందు...తన మనసు తననే ప్రశ్నించింది.

"ఈ గాయాన్ని చేసినవాళ్లు ఎవరు?"పాఠశాలా?సమాజమా?లేక...

తన కొడుకు పుట్టిన రోజే అతని రంగును చూసి బాధపడిన తానేనా?

శ్యామ్ కళ్లలో నీళ్లు తిరిగాయి.అతను కృష్ణను దగ్గరకు తీసుకుని హత్తుకున్నాడు.

కానీ...కొన్నిసార్లు ఆలింగనం కన్నా...

ఒక నిజాయితీగల సమాధానం ఎక్కువ అవసరం.ఆ సమాధానం మాత్రం...

అతని దగ్గర లేదు.

కాలం కృష్ణ శరీరాన్ని మాత్రమే కాదు...అతని మౌనాన్నీ పెద్దదిగా చేసింది.

పాఠశాల పూర్తయ్యే సరికి అతను అందరికీ తెలివైన విద్యార్థి.ప్రతి పరీక్షలో మొదటి ర్యాంకు.ప్రతి పోటీలో బహుమతి.ప్రతి ఉపాధ్యాయుడి ప్రశంస.

కానీ...అద్దం ముందు నిలబడిన ప్రతిసారీ మాత్రం...అతను తనను తాను ఓడిపోయిన వాడిగానే చూసేవాడు.ఎందుకంటే సమాజం అతనికి ఒక పాఠం నేర్పింది.

"ప్రతిభతో గౌరవం వస్తుంది...అందంతో ఆదరణ వస్తుంది."

ఆ రెండు ఒకటే కావని అతనికి అప్పుడే అర్థమైంది.

కాలేజీ...

కొత్త భవనాలు...కొత్త ముఖాలు...కొత్త ఆశలు...

"ఇక్కడైనా ఎవరూ నా రంగును చూడకపోవచ్చు."అని మొదటిసారి మనసులో చిన్న ఆశ మొలిచింది.ఆ ఆశకు కారణం...వైష్ణవి.ఆమె నవ్వితే...

కృష్ణ మనసులో ఏళ్లుగా పేరుకుపోయిన చీకటి కాసేపు తొలగిపోయేది.ఆమె మాట్లాడితే...

తనలో తాను తక్కువనుకునే భావన కొద్దిసేపు మాయమైపోయేది.

ఒక రోజు లైబ్రరీలో పుస్తకం కోసం వెతుకుతుంటే ఇద్దరి చేతులూ ఒకే పుస్తకాన్ని తాకాయి.

వైష్ణవి నవ్వింది."మీరు తీసుకోండి."కృష్ణ తల ఊపాడు.

"లేదు... మీరు చదవండి.""అయితే ఇద్దరం కలిసి చదువుదాం."

ఆ మాట విన్న క్షణం...ఎవరో తన జీవితంలో మొదటిసారి తన రంగును కాదు...

తనను చూసినట్టనిపించింది.ఆ రోజు నుంచి ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు.

పాఠాల గురించి...పుస్తకాల గురించి...కలల గురించి...ఎన్నో మాట్లాడుకునేవారు.

ఆమెతో ఉన్నప్పుడు మాత్రమే...కృష్ణ తన రంగును మరిచిపోయేవాడు.

ఒక సాయంత్రం...

కాలేజీ తోటలోని చెట్టు కింద ఇద్దరూ కూర్చున్నారు.

సూర్యాస్తమయం బంగారు రంగులో ఆకాశాన్ని అలంకరిస్తోంది.

వైష్ణవి ఒక్కసారిగా అడిగింది.

"కృష్ణ... నువ్వు ఎప్పుడూ ఇంత మౌనంగా ఎందుకు ఉంటావు?"

కృష్ణ చిరునవ్వు నవ్వాడు."మాట్లాడితే అందరూ వినరు...

మౌనంగా ఉంటే కనీసం ఎవరూ గాయపరచరు."ఆమె ఆశ్చర్యంగా అతని ముఖం చూసింది."నీలో చాలా బాధ ఉంది."అంది.ఆ మాట వినగానే...

ఎన్నో ఏళ్లుగా గుండెల్లో బంధించిన కన్నీళ్లు బయటకు రావాలని తపించాయి.

కానీ...అతను నవ్వేసాడు.ఎప్పటిలాగే.రోజులు గడిచాయి.

ఆ నవ్వులోనే కృష్ణ ఒక జీవితాన్ని ఊహించుకున్నాడు."బహుశా...

నన్ను అర్థం చేసుకునే మనిషి దొరికిందేమో."అని మొదటిసారి అనుకున్నాడు.

ప్రేమ...కొన్నిసార్లు ఒక మాటతో పుడుతుంది.మరో మాటతో చనిపోతుంది.

ఒక రోజు...

కాలేజీ కారిడార్‌లో నడుస్తూ వస్తున్న కృష్ణకు...పక్కనే ఉన్న తరగతి గది నుంచి నవ్వులు వినిపించాయి.అది వైష్ణవి స్వరం.ఆమె స్నేహితురాలు నవ్వుతూ అడిగింది...

"నిజం చెప్పు...ఆ నలుపు నీకు నిజంగానే నచ్చాడా?"కొన్ని క్షణాలు నిశ్శబ్దం.

కృష్ణ గుండె బలంగా కొట్టుకుంది.ఆమె సమాధానం కోసం ఊపిరి బిగపట్టుకున్నాడు.

వైష్ణవి చిన్నగా నవ్వింది."అయ్యో...అంత సీరియస్‌గా తీసుకోకు.మంచి ఫ్రెండ్ అంతే."

ఆ మాట...కృష్ణ చెవుల్లో కాదు...నేరుగా గుండెల్లో పడింది.

అతను అక్కడి నుంచి నిశ్శబ్దంగా నడిచిపోయాడు.ఎవ్వరూ అతన్ని చూడలేదు.

కానీ...అతని లోపల ఒక ప్రపంచం కూలిపోయింది.

ఆ రాత్రి...గదిలో ఒక్క దీపం కూడా వెలగలేదు.చీకటి నిండిన గదిలో...మంచం అంచున కూర్చున్నాడు.చాలా సంవత్సరాలుగా అణచిపెట్టిన బాధ...ఒక్కసారిగా ఉప్పెనలా ఎగిసిపడింది.చిన్నప్పటి అవమానాలు...పాఠశాల నవ్వులు...టీచర్ మాటలు...

అద్దం...అన్నీ ఒకేసారి గుర్తొచ్చాయి.మొదటిసారి...తనను ఆపుకోలేదు.

గట్టిగా ఏడ్చాడు.అంత గట్టిగా...తన ఏడుపు తనకే వినిపించకుండా ఉండాలని కోరుకున్నాడు.కన్నీళ్లు చెంపల మీదుగా జారుతూ నేలను తడిపాయి.

ఆ చీకటిలో...అతని కన్నీళ్లను ఎవరూ చూడలేదు.చీకటి...వాటిని తనలో కలిపేసుకుంది.

కొంతసేపటి తర్వాత...కిటికీ దగ్గరకు వెళ్లి నిలబడ్డాడు.

బయట ఉరుములు వినిపిస్తున్నాయి.ఆకాశం మొత్తం నల్లని మేఘాలతో నిండిపోయింది.

అంతలో భారీ వర్షం మొదలైంది.మెరుపు మెరిసింది.

వెంటనే కరెంట్ పోయింది.ప్రపంచమంతా ఒక్కసారిగా చీకటిలో మునిగిపోయింది.

కృష్ణ మెల్లగా నవ్వుకున్నాడు."విచిత్రంగా ఉంది...మనుషులు నన్ను నలుపు కోసం తిరస్కరించారు...

కానీ ఈ రాత్రి...ప్రపంచమంతా ఈ నలుపునే ఆశ్రయిస్తోంది."

అతను బయటకు నడిచాడు.వాన చినుకులు ముఖంపై పడ్డాయి.

తడిసిన నేల వాసన...అతని గుండె లోతుల్లోకి చేరింది.

అప్పుడే...అతని జీవితాన్ని మార్చబోయే ఒక ఆలోచన...నిశ్శబ్దంగా జన్మించింది.

ఆ రాత్రి...వర్షం కురుస్తూనే ఉంది.ఆకాశమంతా నల్లని మేఘాలు పరుచుకున్నాయి.

మెరుపులు ఆకాశాన్ని చీల్చుతున్నాయి.చల్లని గాలి కృష్ణ ముఖాన్ని తాకింది.

వర్షపు చినుకులు అతని కన్నీళ్లతో కలిసిపోయాయి.

చాలాసేపు నిశ్శబ్దంగా నిలబడి ఆకాశాన్నే చూస్తూ ఉన్నాడు.

ఆ నిశ్శబ్దంలో...ఎవరో తనతో మాట్లాడుతున్నట్టు అనిపించింది.

అది బయట ప్రపంచం కాదు...తన అంతరాత్మ.

అతని చూపు తడిసిన నేలపై పడింది.ఆ నల్లని నేల...విత్తనాన్ని తనలో దాచుకుని మొక్కగా జన్మనిస్తుంది.రైతు చెమటను పంటగా మారుస్తుంది.ఆకలిని అన్నంగా మారుస్తుంది."ఈ నేల నలుపు కాబట్టే తక్కువైందా?"అని అతని మనసు ప్రశ్నించింది.

చూపు మళ్లీ ఆకాశం వైపు వెళ్లింది.నల్లని మేఘాలు లేకపోతే...వర్షం ఎక్కడి నుంచి వస్తుంది?వర్షం లేకపోతే...జీవం ఎక్కడి నుంచి పుడుతుంది?

అతను తన చేతిలో కొద్దిగా మట్టిని తీసుకున్నాడు.ఆ మట్టిలో...జీవం వాసన ఉంది.

ఆ వాసనలో...ప్రకృతి తత్వం దాగి ఉంది.

అప్పుడే...ఎన్నో సంవత్సరాలుగా మూసుకుపోయిన అతని ఆలోచనల తలుపులు ఒక్కసారిగా తెరుచుకున్నాయి.

"కృష్ణుడు..."అతను తనలో తానే పలికాడు.నీలమేఘశ్యాముడు.

రాముడిని అందగాడని కీర్తించిన ఈ దేశం...కృష్ణుడి నలుపును మాత్రం భక్తిగా ఆరాధించింది.

మరి...మనిషి నలుపు ఎందుకు అవమానమైంది?

అబ్దుల్ కలాం గుర్తొచ్చాడు.నెల్సన్ మండేలా గుర్తొచ్చాడు.

చీకటిలోనే నక్షత్రాలు కనిపిస్తాయి.తల్లి గర్భంలోని చీకటిలోనే జీవం రూపుదిద్దుకుంటుంది.

రాత్రి చీకటి లేకుంటే...ఉదయం వెలుగు విలువ ఎవరికీ తెలుస్తుందా?

ఆ క్షణంలో...కృష్ణ జీవితమంతా వెంటాడిన ప్రశ్నకు సమాధానం దొరికింది.

"నలుపు సమస్య కాదు...నలుపును అవమానంగా చూసే చూపే సమస్య."

మరుసటి ఉదయం...

ఎన్నో సంవత్సరాల తర్వాత...కృష్ణ మళ్లీ అద్దం ముందు నిలబడ్డాడు.

చిన్నప్పటి నుంచి...అద్దం అతనికి శత్రువు.తనలో లేని లోపాలను చూపించిన న్యాయమూర్తి.ఈరోజు మాత్రం...అద్దంలో కనిపించింది వేరే ముఖం కాదు.

మారింది...చూసే మనసు.మెల్లగా తన ప్రతిబింబాన్ని తాకాడు.చిరునవ్వు నవ్వుకున్నాడు."ఇన్ని సంవత్సరాలు... నేను ద్వేషించింది...

నా రంగును కాదు...ఇతరుల మాటలను."అద్దం కూడా...ఈసారి తీర్పు చెప్పలేదు.

కేవలం అతని నవ్వును తిరిగి చూపించింది.

ఆ సాయంత్రం...శ్యామ్ గదిలోకి వచ్చాడు.

కొడుకు అద్దం ముందు నిలబడి నవ్వుతుండటం చూసి ఆశ్చర్యపోయాడు.

కొన్ని క్షణాలు ఏమీ మాట్లాడలేదు.

తర్వాత మెల్లగా అన్నాడు."కృష్ణా...""చెప్పండి నాన్న.""నిన్ను ఒక మాట అడగాలి."

కృష్ణ చిరునవ్వుతో చూశాడు."ఏమిటి?"శ్యామ్ కళ్లలో నీళ్లు మెరిశాయి.

"నువ్వు పుట్టిన రోజు...అందరూ నీ రంగు గురించి మాట్లాడినప్పుడు...

వాళ్లను ఆపాల్సింది నేను.కానీ...నేనూ భయపడ్డాను.నీ తండ్రినైన నేను కూడా...

సమాజం మాటలకు ఓడిపోయాను.నన్ను క్షమిస్తావా?"కృష్ణ ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు.తండ్రిని గట్టిగా హత్తుకున్నాడు."నాన్న...మీరు నన్ను ఎప్పుడూ తక్కువగా చూడలేదు.మీరు కూడా ఈ సమాజంలో ఒక బాధితుడే."

ఆ ఆలింగనంలో...ఇద్దరి గుండెల్లో ఏళ్లుగా పేరుకున్న బాధ కరిగిపోయింది.

కొన్ని సంవత్సరాలు గడిచాయి.

కృష్ణ ఒక మంచి ఉపన్యాసకుడయ్యాడు.దేశమంతా తిరుగుతూ...యువతతో మాట్లాడడం మొదలుపెట్టాడు.అతని ప్రసంగాల్లో రంగు గురించి కాదు...ఆత్మగౌరవం గురించి ఉండేది.

అతని మాటల్లో ఆవేశం ఉండేది కాదు.అనుభవం ఉండేది.

ఒక విశ్వవిద్యాలయంలో...వేలాది మంది విద్యార్థుల మధ్య ప్రసంగం ముగించే సమయం వచ్చింది.హాల్ మొత్తం నిశ్శబ్దంగా ఉంది.

కృష్ణ వేదిక మీద నిలబడి చివరిసారిగా మాట్లాడడం ప్రారంభించాడు.

"మీరు అందరూ...ఒకసారి కళ్లుమూసుకుని ఆలోచించండి.

పంటను పండించేది ఏ నేల?వర్షాన్ని మోసుకొచ్చేది ఏ మేఘం?ప్రపంచానికి విశ్రాంతినిచ్చేది ఏ రాత్రి?జీవాన్ని పెంచేది ఏ గర్భం?

అన్నీ...నలుపే.ప్రకృతికి నలుపంటే గర్వం.మనిషికి మాత్రం ఎందుకు సిగ్గు?

చర్మం రంగు...దేవుడు రాసిన కవిత.దాన్ని అవమానించడం అంటే...

సృష్టినే అవమానించడం.గుర్తుంచుకోండి...

మనిషి అందం చర్మంలో ఉండదు.మనిషిని చూసే చూపులో ఉంటుంది.

**నలుపు ఒక రంగు కాదు...ప్రకృతి తన చేతులతో రాసిన జీవగీతం."**

హాల్ మొత్తం కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా నిలిచిపోయింది.ఆ తర్వాత...చప్పట్లు.

ఒకటి కాదు...వేల చేతులు ఒకేసారి మోగాయి. అందులో ఒకప్పుడు తనను ఎగతాళి చేసినవారు, చిన్నచూపు చూసినవారు—స్నేహితులు, ఉపాధ్యాయులు, ప్రేయసి... అందరూ ఉన్నారు. ఆ చప్పట్లలో...కృష్ణ గెలుపు లేదు.

ఒక ఆలోచన గెలిచింది.ఒక మనిషి కాదు...

ఒక సమాజం తనను తాను ప్రశ్నించడం మొదలుపెట్టింది.

ఆ రోజు...అద్దంలో తన రంగును ద్వేషించిన చిన్న బాలుడు...

వేలాది మంది మనసుల్లో ఆత్మగౌరవానికి అద్దమయ్యాడు.

**అప్పటి నుంచి కృష్ణకు అద్దం అంటే భయం కాదు...

అది తనను తాను ప్రేమించడం నేర్పిన మొదటి గురువు.**

"వెలుతురిని అందరూ ప్రేమిస్తారు. కానీ వెలుతురిని పుట్టించేది చీకటే. అందుకే... నలుపు ఒక రంగు కాదు; ప్రతి వెలుగుకూ మూలమైన ప్రకృతి నిశ్శబ్దం."

మరిన్ని కథలు

Vanta gadi lo veerudi katha
వంట గదిలో వీరుడు కథ
- రాము కోలా దెందుకూరు
Avadhulu daatina abhimanam
అవధులు దాటిన అభిమానం
- మద్దూరి నరసింహమూర్తి,
Maarina jeevitham
మారిన జీవితం
- Prabhavathi pusapati
Dharmo rakshathi rakshitaha
ధర్మో రక్షతి రక్షితః
- డా:సి.హెచ్.ప్రతాప్
Prathiroopam
ప్రతిరూపం
- డా:సి.హెచ్.ప్రతాప్
Maarpu manathone
మార్పు మనతోనే
- జ్యోత్స్న జల్లూరి
Samayaspoorthi
సమయస్ఫూర్తి
- డా:సి.హెచ్.ప్రతాప్