నేను మళ్ళీ పొదుపు చేస్తా...! - బొందల నాగేశ్వరరావు

Nenu mallee podupu chestaa

గుండూరావు గుర్రుపెట్టి నిద్రపోతున్నాడు. నిద్రలో అప్పుడప్పుడు నోరు కప్పలా తెరచ శబ్దం చేస్తూ వున్నాడు. అతని ప్రక్కన పడుకున్నభార్య బుజ్జమ్మకి నిద్ర రాలేదు. లేచి కూర్చొంది. అలా భర్త ముఖంలోకి చూస్తూ వుంది. గుండూరావు వున్నట్టుండి ఆహహహ....ఇహిహి అని నిద్రలో నవ్వుతున్నాడు. భయపడింది భార్య.

"ఏమండీ...ఏమండీ"అని అటూ ఇటూ కదిపి లేపింది భర్తను. లేచి భార్య వంక చూసి వెకిలిగా నవ్వాడు గుండూరావు.

"ఏంటండీ...నిద్రలో అలా నవ్వేరు. మీకు పిచ్చి పట్టిందేమోనని భయపడ్డాను.ఆఁ " అంది అమాయకంగా.

"అది పిచ్చ కాదే పిచ్చిమొహమా! మా ఆఫీసులో వున్న మొత్తం స్టాపులో పొదుపు చేయటంలో నేనే అగ్రగామినని అయ్యగార్కి పేద్ద... కాదు కాదు చిన్న బ్రీఫ్ కేస్‌ను ప్రెసంట్ చేశారు ఆఫీసర్లు. అందుకే అలా నవ్వుంటాను" అన్నాడు గుండూరావు.

"అద్సరేలే!ఎటూ నిజ జీవితంలో ఏమి పొదుపు చేయలేరు కనుక అలా కలలనైనా కనండి పాపం!" అంది బుజ్జమ్మ.

"ఎస్. ఆ కలలని నిజం చేసి ఆచరణలోకి తెస్తా! ఇదిగో మనింటికి వాడే నిత్యావస వస్తువుల్లో రేపటినుంచి సగానికి సగం కట్ చేసుకొని పొదుపును ప్రారంభిస్తా!కనుక అయ్యగారికి రోజూ ఇచ్చే మూడు కాఫీలకు బదులు ఇకపై ఒక్క కాఫీ ఇచ్చుకో! నెల్లో థియేటర్లకు వెళ్ళి చూసే మూడు సినిమాలను కొట్టి పారేసి ఒక్కటి చేసుకో! నువ్వు చేసే పూజలు,పునష్కారాలు, నైవే ద్యాలగ్గాను వాటికి కావలసిన పూలు, పళ్ళు, నెయ్య, నూనెల కంటూ అయ్యే ఖర్చుల్లో సగా నికి కోత పెట్టేసుకో! వీటివల్ల మిగిలే బోలెడు డబ్బును తీసుకెళ్ళి ఎస్.బి. ఎక్కవుంటులో వేస్తా. అవి కొంత కాలానికి వందలు,వేలై కూర్చుంటాయి. ఏమంటావ్?" అని మీసం మెలేశాడు గుండూరావు.

"బాగానే వుంది. మీసాలు తిప్పటం మానేసి పడుకొండి.మీరు చెప్పినట్టే అన్నిటిని సగానికి కుదించే ఆ పద్దతిని రేపటినుంచే అమలు చేద్దాంలే... పడుకొండి స్వామీ!" అంది బుజ్జమ్మ. ఇకిలిస్తూ దుప్పటి లాక్కొని కళ్ళు మూసుకున్నాడు గుండూరావు.

'అయ్యే రామా!ఏం మనిషండీ ఈ గుండూరావు' అని తల బాదుకొని వెళ్ళికిలా పడుకొని తిరుగుతున్న ఫ్యాన్ వంక అయోమయంగా చూస్తూ వుంది బుజ్జమ్మ. మళ్ళీ టక్కున లేచి కూర్చొన్నాడు గుండూరావు. బుజ్జమ్మ షాక్ తిన్నట్టు భర్తముఖంలోకి చూస్తూ "మళ్ళీ ఏంటండీ?"అని అమాయకంగా అడిగింది.

"నీకు మరో ముఖ్యమైన మేటరు చెప్పాలి. మనకు ఇప్పట్లో పిల్లలొద్దు.అయిదేళ్ళ తరువాత కందాం. అప్పుటికి రెండు, మూడు లక్షలు పొదుపు చేద్దాం"

"ఏంటండీ మీరంటుంది!నేను ఆల్రెడీ ప్రగ్నెంటండీ! మనకు పెళ్ళియి పదేళ్ళు. పిల్లలు లేరని ఇంటా బయట జనాలు కాకుల్లా పొడిచి చంపుతుంటే అదృష్టం కొద్ది ఎలాగో వచ్చిందీకడుపు. దీన్నితీసివేయించుకోమంటారా!"

"ఏంటీ ఎలాగో వచ్చిందా...అంటే! "సందేహంగా అడిగాడు గుండూరావు .

"అబ్బా...అంటే మీ వల్లనే వచ్చిందిలే! కొంపతీసి పొదుపులో భాగంగా దీన్ని కూడా తీసి వేయించుకోమంటారనీ..." సాగదీతతో అంది బుజ్జమ్మ.

"అబ్బే...వంశాంకురాన్ని తీసివేయించుకో... అనేటంతటి నీచుణ్ణి కాను బుజ్జమ్మా!అదిగో...ఆ గదిలో వున్నాడే మీ తాతయ్య... అదేనమ్మాయ్!మనందరికని వండే భోజనం మొత్తం ఒక్కడే మెక్కేసి టి.వీని చూస్తూ కుంభ కర్ణుడిలా నిద్రపోతుంటాడే ఆడికి మొదట రేషనింగ్ పద్దతి అమ లు చెయ్య. అంటే ఆడికి అన్నింటిలో కోత పెట్టి తగ్గించమని చెపుతున్నా!"

"అది కుదరదండీ. భోజనం తగ్గిస్తే మా తాతయ్య బోరున ఏడుస్తాడు" "అలాగా...అయితే ఆడితో కూర్చొని నువ్వు కూడా ఏడువు. కాకపోతే భోజనం తగ్గిస్తే బోరున ఏడుస్తాడట. అయినా నా ఇళ్ళేం ధర్మ సత్రమా!ఇది చెన్నై సిటే పిచ్చి మొహమా! ఎక్కడ చెడ్డ పల్లెటూరోళ్ళందరికి హేప్పియస్టు ప్లేసు. అందుకే వస్తుంటారు. సిటీ మొత్తం తిప్పి చూప మం టారు. సినిమాలకు,బీచీలకు తీసుకు వెళ్ళమంటారు. మొత్తానికి బాగా ఎంజాయ్ చెయ్యా లం టారు . వాళ్ళ కోరికలు తీర్చాలంటే నెలకో పది వేలు అదనంగా కావాలి. ఇంతకు మీ నాన్న కూడా వచ్చి ఓ నెలుండి వెళతానన్నాడే... నా మాటిని మాకు ఆర్ధిక ఇబ్బందులు బాగా వున్నాయి నాన్నా! మీరిప్పుడు రావొద్దు అని ఫోన్ చేసి చెప్పేయరాదూ!"

"అదీ కుదరదండీ! ఆల్రెడీ ట్రెయిన్ ఎక్కుంటాడు. రేపు భోజనాల వేళకు దిగి పోతాడు!"

"అమ్మో...ఇంకేం పొదుపురో నాయనో!"అంటూ గట్టిగా కళ్ళు మూసుకొని మళ్ళీ దుప్పటి లాక్కున్నాడు.

ఉదయం తొమ్మిది గంటలకల్లా ఆఫీసుకు వెళ్ళటానికి తయారై హాల్లో కూర్చొని వున్న భర్త చేతికి క్యారియర్ను అందించింది బుజ్జమ్మ.

క్యారియర్ను తీసుకొని తిన్నగా బైకు దగ్గరికెళ్ళి 'ఊహుఁ! బైకొద్దు'అనుకొని సైకిల్ వద్దకెళ్ళాడు గుండూరావ్ . అంతలో హాండు స్టిక్కు సహాయంతో వరాండాలోకొచ్చిన తాతయ్య "ఒరేయ్ అబ్బాయ్ గుండూ! సాయంత్రం వచ్చేటప్పుడు ఓ డజన్ చక్కరకేళీలు, పావుకేజి పాలకోవా, మానెడు మరమరాలు, ఓ అరడజను లంగరు చుట్టల్ను తీసుకురారా!" అన్నాడు.

కోపంగా తాతయ్య వేపు చూసి, వరాండాలో నిలబడి వున్న భార్యను కొరకొర చూసి సైకిలెక్కి స్వీడుగా వెళ్ళిపోయాడు గుండూరావు. నవ్వుకొంటూ లోనికెళ్ళారు తాత,మనవరాలు.

ఆ రోజు ఆదివారం. అందరూ రిలాక్సుడుగా నిద్రపోతున్నారు. కాని గుండూరావు మాత్రం ఉదయాన్నే లేచి మామూలుగా అన్నీ ముగించుకొని 'బుజ్జమ్మా' అంటూ పెద్దగా కేకేసి హాల్లో వున్న సోఫాలో కూర్చొన్నాడు. " "అయిదు నిముషాల్లో వస్తానండి"అంటూ రోజుకొక్కసారే కాఫీని ముట్టుకునే మొగుడికి మంచి వాసనతో బ్రహ్మాండంగా తయారు చేసిన కాఫీని తీసుకువెళ్ళి ఇచ్చి ప్రక్కన కూర్చొంది.

కాఫీని సిప్ చేసిన గుండూరావు"ఇందుకూ...ఇందుకేనే బుజ్జమ్మా నువ్వంటే నాకు ఇష్టం. వంటా ఇంటి పనితో పాటు కాఫీ,టీలు కూడా స్టారు హోటలు రేంజిలో చేస్తావు.అందుకే వచ్చిన మీ తాతయ్య, రేపు రానున్న మీ నాన్నా నిన్ను అంటి పెట్టుకొని ఇంటిని వదలి వెళ్ళనంటుం టారు. చూస్తా...ఇలా ఎంతకాలం సాగుద్దో! ఏస్తా త్వరలో వాళ్ళకో ఎండు కార్డు " అంటూ పైకి లేచాడు.

"ఏంటండీ మీరు...మా నాన్నను,తాతయ్యను గెంటేయ్యాలని చూస్తున్నారా?!"భయపడుతూ అమాయకంగా అడిగింది.

"మరేమిటీ...మీతాతయ్యొచ్చి మూడు నెల్లు. తను నిత్యం భోజనంతో మాత్రం సరిపెట్టుకుంటే పర్వాలేదు. సినిమాలకు, షికార్లకు టాక్సీల్లో వెళ్ళడాలు రావడాలు, పెద్ద హోటల్లలో స్వీట్లు, హాట్లుతో పాటు ప్రతి రోజూ నాన్ వెజ్ భోజనాలతో నా కొంప నార్పేస్తున్నాడు. వాడి కోసమే నేను ఎక్స్ట్రా పనులు చేస్తోంది.ఇవాళ ఆదివారం. అయినా ఆఫీసుకు వెళుతున్నానే! అవును. నా ఫ్రెండొకడు తన పనికి నేను సహాయపడితే సాయంత్రానికి వెయ్యిస్తానన్నాడు." బ్రహ్మానందంలా కాస్త సంతోషం, కాస్త దిగులుతో అన్నాడు గుండూరావు.

"అయ్యో పాపమండీ మీరు. ఇవాళ ఆదివారం. ఆదివారం కూడా ఆఫీసుకు వెళుతున్నారు. సరే వెళ్ళిరండి. నేనెళ్ళి మళ్ళీ నిద్రపోవాలి" అంటూ పడగ్గదిలోకి వెళ్ళిపోయింది బుజ్జమ్మ.

ఆఫీసులో ఫ్రెండు ప్రక్కన కూర్చున్న గుండూరావు తన కిచ్చిన పన్ని చేసుకొంటూ అప్పు డప్పుడు పెన్నుతో పళ్ళను టప్ టప్ మని కొట్టుకొంటూ ఆకాశంలోకి చూస్తూ ఆలోచిస్తూ వున్నాడు.

అది గమనించిన ఫ్రెండు"ఏంట్రా!ఏదో ఆలోచనలతో వుక్కిరి బిక్కిరై పోతున్నట్టున్నావ్! నాతో చెప్పుకో... ఏదేని ఐడియా నా మదికి తడితే నీకు చెపుతాను" అన్నాడు. "ఏం లేదురా! నా శ్రీమతి తాతయ్యగాడు మూడు నెల్ల క్రితం వచ్చి నా ఇంట్లో తిష్ట వేశాడు. వాడి కయ్యే ఖర్చులకు తట్టుకోలేక నేనిలా ఎక్స్ట్రా పనులు చేస్తున్నాను. రేపు ఆడి కొడుకు అంటే నాకు పిల్లనిచ్చిన మామయ్య కూడా వచ్చి ఓ నెలుండి పోతాడట. ఇక వాళ్ళద్దరికి నిత్యం నాన్ వెజ్ భోజనాలతోపాటు సినిమాలకు,షికార్లకు టాక్సీల్లో తిప్పుకొస్తూ పెద్ద హోట ళ్ళలో స్వీట్లు,హాట్లు తినపెట్టుకు చావాలట. కుదరదంటే నా పెళ్ళాం ఏడుస్తుంది.ఇక నేనేం పొదుపు చేయగలనో చెప్పు?ఇప్పటికే ఇంట్లో ఖర్చులగ్గాను పొదుపు చేసి వుంచిన లక్షను తగలేశాను. వాళ్ళ బారినుంచి తప్పించుకునేదెలా అని ఆలోచిస్తున్నాను." అన్నాడు గుండూరావు.

"ఓర్ నీ దుంపతెగ... ఇది వెరీ సింపుల్రా !కుక్క కాటుకు చెప్పుదెబ్బ. కీలెరిగి వాత పెట్టాలి. శుభ్రంగా నువ్వు రివర్సుగేములోకి వెళ్ళిపో! అన్ని సర్దుకుపోతాయ్ "అన్నాడు ఫ్రెండు.

"అంటే"ఆసక్తితో ఆశ్చర్యంగా ఫ్రెండు ముఖంలోకి చూశాడు గుండూరావు.

"అంటే ఏముందీ...విషయాన్నంతా మీ నాన్నకు చెప్పి నీవద్దకు పిలిపించుకో. ఇక ఆయనే ఆడుకొంటాడు వాళ్ళతో! మీ నాన్న డబ్బు విషయంలో చాలా స్ట్రిక్టు అని,ఇలా తేరకే తిని వూరికే వుండే వాళ్ళంటే చిరాకు పడతారని నువ్వేగా చెప్పావు. విషయాన్ని ఆయనకు వదిలేయ్... ఫో!"అన్నాడు ఫ్రెండు.

"ఓకే!నాన్నకు ఇవాళే ఫోన్ చేసి విషయాన్ని వివరించి రెండు రోజులకల్లా దిగిపొమ్మంటాను" అంటూ పని చకచక చేసుకుపోయాడు .

సాయంత్రం ఏడున్నర గంటలకు సైకిల్ తొక్కుకొంటూ వెళ్ళి ఇల్లు చేరుకున్నాడు గుండూరావు. సైకిల్ స్టాండు వేసి సంచి నిండుగా వున్న కిరాణా సరుకులతో హాల్లోకి కాలుపెడుతూనే బిల బిలమంటూ అయిదారుగురు ఆడ పిల్లలు గుండూరావును సైతం ప్రక్కకు నెట్టి గోలగోలగా వెళ్ళిపోయారు. ఆ శబ్దం విని హాల్లోకి వచ్చిన బుజ్జమ్మ భర్త చేతిలో వున్న సరుకుల సంచిని తీసుకొని "అయ్యో బాగా టయార్డయినట్టున్నారే! కూర్చొండి. ఈ రోజు ఓ ఎక్స్ట్రా కాఫీ తాగండి తెస్తాను" అంటూ కిచ్చన్లోకి వెళ్ళబోయింది.

"ఆగు.ఇది ఇల్లేనా!నన్ను చూస్తూనే పిల్లలు బిల బిలమంటూ వెళ్ళిపోయారు. అక్కడున్న ఎంగిలి ప్లేటులేమిటి? అందరికీ స్వీటూ, హాటని బోలేడు తెప్పించి పెట్టావా?ఓ అయిదొందలు ఖర్చయివుంటాయే!ఇలా అయితే నేనేలా పొదుపు చేయగలనే బుజ్జమ్మా!"కోపంతో అన్నాడు.

"మీరేకదండీ! గర్భవతిగా వున్నప్పుడు కోరుకున్నట్టు సంతోషంగా వుండాలి. మనసుకు తోచినవి చేసుకు తినాలన్నారు" గోముగా అంది భర్త గుండెలమీద రాస్తూ.

"అన్నానే!నువ్వు కోరుకున్నవి నిన్ను చేసుకు తినమన్నానే కాని వూర్లో వున్నవాళ్ళక్కాదు. అవేమిటక్కడ మృదంగం, శృతి కలుపుకునే పెట్టె, గజ్జలు.కొంపతీసి డాన్సుగాని చేశావేమిటీ?"

"అవునండి.చిన్న మూవ్ మెంట్సుతో అంటే కదలికలతో పిల్లలకు భరతనాట్యం నేర్పుతున్నా ను .అలాంటి మూవ్ మెంట్సు కడుపులో వున్న మన బిడ్డకు మంచిదట. తాతయ్య చెప్పాడు. పోతే పిల్లలు టయార్డు అయ్యారని హోటలునుంచి హాటు,స్వీటు,కాఫీ తెప్పించి పెట్టాను." అంటుండగా గదిలోంచి చుట్ట పొగ పీలుస్తూ బయటికి వచ్చాడు తాతయ్య.

"అదికాదురా అబ్బాయ్ గుండూ!బుజ్జమ్మకు పుట్టబోయే బిడ్డ బొద్దుగా,ముద్దుగా వుండా లంటే ఇవన్నీ తనకు అవసరమే! ఇదిగో...నేనైతే మా ఇంట్లోనే నా భార్య భద్రమ్మకు ఇష్ట మైన కబడ్డీ ఆటను మెల్లగా ఆడించేవాడిని. ఇక వీళ్ళ నాన్న అదేనోయ్ నా కొడుకు వాళ్ళమ్మ కడుపులో వున్నప్పుడు శ్రీ రామచంద్రున్ని ఆయన శ్రీమతి సీతాదేవి జింక పిల్లను కావాలని కోరినట్టు భద్రమ్మ తనకు పెరుగు పచ్చడి ఇష్టమని నన్ను చేసి పెట్టమంది. చేసిపెట్టి దాని ఆశను తీర్చానోయ్ !ఇలాంటి విషయాల్లో డబ్బులు లెక్కెట్టుకో కూడదు గుండూ ... తెలిసిందా !?" అన్నాడు మీసం దువ్వుతూ.

'అది సరేలే... ఆరిపోయేది నేనేగా!వుండరా ముసలోడా రేపో మాపో మా నాన్న దిగుతాడు. తరువాత వుంది మీ పని. చెప్పాపెట్టకుండా అబ్బాకొడుకులు పరుగో పరుగు' మనసులో అనుకొంటూ "సరే ! వుదయాన మీరడిగిన వస్తువులు తెచ్చాను. ఆ సంచిలో వున్నై తీసుకె ళ్ళండి" అన్నాడు గుండూరావు. తాతయ్య సంచిలో వున్న తన వస్తువులను తీసుకొని "సరేనమ్మాయ్ !ఇంతకు మెరీనామాల్ థియేటర్లో ప్రభాస్ సినిమాకు రేపు నూన్ షోకి రెండు...రెండు టిక్కెట్లు బుక్ చెయ్యమ్మా. నేనొక్కడినే వెళితే మీ నాన్న చిన్నపిల్లాడిలా గుక్కపట్టి ఏడుస్తాడు"అన్నాడు.

"అలాగే తాతయ్యా! మీరెళ్ళండి"అంది బుజ్జమ్మ.

"ఏమిటీ రెండు టిక్కెట్లు, బుక్కింగు అంటున్నాడు ముసలోడు. మీ నాన్న వచ్చేశాడా?"

"ఇంకో అయిదు నిముషాల్లో వచ్చేస్తారండి. అదిగో వచ్చేశారు"అంటూ ఆటో దిగి లోపలికి వస్తున్న నాన్న వద్దకు పరిగెత్తుకొంటూ వెళ్ళి సూట్ కేసునందుకొంది బుజ్జమ్మ.

గుమ్మంలో కాలు పెడుతూనే "ఏమ్మా!మా నాన్నకు, మీ నాన్నకు సినిమా టిక్కెట్లు బుక్ చేశావా లేదా?"అడిగాడు బుజ్జమ్మ తండ్రి.

"నిముషంలో చేస్తాను నాన్నా! మీరు రండి లోపలికి" అంటుండగా...

"ఒరేయ్ కొడకా! మనం సినిమాకు వెళ్ళేది రేపు. ఇవాళ భోంచేసి రెస్టు తీసుకో. ఆఁ... మనవ రాలా! నాకు,మీ నాన్నకు రేపు ఓలా టాక్సీని కూడా బుక్ చెయ్యమ్మా!" అంటూ కొడుకును తీసుకుని గదిలోకి వెళ్ళాడు.

'ఓర్ నీ దుంప తెగ. అంత దూరం నుంచి వచ్చిన తండ్రివి కూతురు యోగక్షేమాలు అడిగి తెలుసుకోకుండా సినిమా టిక్కెట్టు గూర్చి అడుగుతావేంట్రా పిచ్చి నా మామా!మీ ఆటలు సాగేది రేపటి వరకే! వస్తున్నాడు మా నాన్న మీ భరతం పట్టడానికి' అని మనసులో అనుకున్నాడు గుండూరావు.

©©©© ©©©© ©©©©

గుండూరావు వరాండాలో అటూ ఇటూ తిరుగుతున్నాడు.ఉదయాన్నే రావలసిన తండ్రి ఇంకా రాలేదు. అంతలో ఆటో వచ్చి ఇంటిముందాగాంది.గుండూరావు తండ్రి చిదంబరం దిగి వుత్తి చేతులతో గేటు తీసుకొని లోనికి వస్తుంటే ఎదరే వెళ్ళాడు గుండూరావు. "ఏమిటి నాన్నా!వుత్తి చేతులతో వస్తున్నారు. వెంటనే వెళ్ళిపోతారా ఏంటీ?"మెల్లగా అడిగాడు గుండూరావు.

సోఫాలో కూర్చొంటూ "సూట్ కేసు,సంచి వెనుకే వస్తున్నాయిలేరా! వచ్చిన పని పూర్తి చేసు కొనే వెళతానులే! నువ్వు ధైర్యంగా వుండు" అంటుండగా ప్రీజ్ లోనుంచి నీళ్ళ బాటిల్తో వచ్చి "బాగున్నారా మామయ్యగారూ" అంటూ బాటిల్ అందించింది బుజ్జమ్మ. అయోమయంలో పడ్డట్టు చూస్తున్నాడు గుండూరావు.అప్పుడు సూట్ కేసును తీసుకొని బుజ్జమ్మ తండ్రి, ఓ సంచిని తీసుకొని తాతయ్యలు లోనికొచ్చి హాలు నడుమ వాటిని పెట్టి వాళ్ళ గదికి వెళ్ళి పోయారు. అ సన్నివేశాన్ని చూసిన బుజ్జమ్మ మామగారిని భర్తను కొరకొరా చూసింది.

"ఎందుకమ్మా అలా చూస్తున్నావ్ ?వాళ్ళు కూలికే ఆ పని చేశారు!"అన్నాడు చిదంబరం.

"కూలికా!" ఏమిటి మామయ్యగారూ మీరంటుంది?" సంశయిస్తూ అడిగింది బుజ్జమ్మ.

"నేను ట్రెయిన్ దిగిన తరువాత ఎండకు ఒకలా వుంటే అక్కడే వున్న హోటల్కు వెళ్ళాను. కూల్ డ్రింక్సు తాగుతూ అటు చూశాడు. కాష్ పే చేసే చోట గోలగా వుంది. దగ్గరికెళ్ళి చూస్తే మీనాన్న,తాతయ్య గొడవపడుతున్నారు హోటలు ఓనరుతో. విషయం తెలుసుకుంటే టిఫన్ తిన్న వాళ్ళ వద్ద బిల్లు కట్టడానికి డబ్బుల్లేవు. ఇక చేసేది లేక నూటాయాభై రూపాయలు బిల్లు నేను 'పే' చేసి వాళ్ళను విడిపించుకొని ముగ్గురం కలసి ఆటోలో వచ్చాం" అన్నాడు.

అంతలో తాతయ్య బయటికొచ్చి "అవునమ్మా!నువ్వు ఖర్చులకని ఇచ్చిన అయిదొందలు గదిలోనే టేబుల్ మీద వుంచి వెళ్ళిపోయాం. ఎలాగో బావగారు తీసుకు వచ్చారు"అన్నాడు. "నాకు అవమానంగా వుంది తాతయ్యా! సరే.పదండి భోంచేద్దురు" అంటూ డైనింగ్ టేబుల్ వద్ద కు నడిచింది బుజ్జమ్మ. భర్త గుండూరావు, మామగారు చిదంబరం మెల్లగా నవ్వుకున్నారు.

పది రోజులు గడిచాయి. బుజ్జమ్మ నాన్న, తాతయ్యలు వాళ్ళ పనులు వాళ్ళే చేసుకు వెళుతు న్నారు. మునుపటిలా రకరకాల వంటలతో నాన్ వెజ్ భోజనాలు కోరటం లేదు. సినిమాలు, షికార్లకు వెళ్ళాలని వందలు, వేలు ఇమ్మని బుజ్జమ్మను అడగటం లేదు.కాఫీలు ఇస్తే తాగు తారు . లేకుంటే వూరకుండిపోతారు. గుండూరావు డబ్బులిచ్చి చేయించుకునే ఇంట్లోని చిన్నా చితక పనులను వాళ్ళే చేస్తున్నారు. తండ్రి కొడుకుల్లో ఎంత మార్పో!

"ఏమండీ!మా నాన్న తాతయ్యల్లో బోలెడు మార్పు వచ్చిందండీ!వాళ్ళవల్ల ఇప్పుడు మనకు అస్సలు ఖర్చే లేదండి. పైగా పనులన్నీ వాళ్ళే చేసుకు వెళుతున్నారండీ" అంది బుజ్జమ్మ.

అందుకు మెల్లగా నవ్వి "వాళ్ళలా మారటానికి కారణం మా నాన్న" అన్నాడు గుండూరావు.

"అవునమ్మా!నేనే వాళ్ళకు ఇంటి పరిస్థితులను, మీరు పడుతున్న ఆర్థిక ఇబ్బందులను వివరించి, అల్లుడి ఇంట వాళ్ళ బాధ్యతలను గుర్తు చేశాను. నా కొడుకు పొదుపు పేరుతో దాచి వుంచిన డబ్బు ఖర్చయిపోయి, ఇంట్లో వున్న బంగారం కాస్తా మార్వాడి కొట్టుకు వెళ్ళిపోయి మీరు అప్పుల పాలైంది కళ్ళక్కట్టినట్టు చెప్పి వాళ్ళను గాటిలో పెట్టాను. ఈ ఇంటికి నేను చేస్తున్న ఆర్థిక సహాయం గూర్చి కూడా వివరించి వాళ్ళను కనీసం శరీరకంగా సహాయపడి కూతురు, అల్లుడ్ని అంటే... మిమ్మల్ని ఆదుకోమని అర్థించాను. ఆ క్షణం నుంచే వాళ్ళలో మార్పు మొదలయ్యింది" అన్నాడు చిదంబరం.

"ఎలాగో మామయ్యగారూ! నాన్న, తాతయ్యల్లో గొప్ప మార్పును చూడగలిగాను. పొదుపు లేకపోతే పోయింది ప్రతి సారి ఏదో ఒక వస్తువు తాకట్టులో పెట్టే సమయాన భార్యాభర్తలమిద్ద రం బాగా బాధకు లోనైయ్యే వాళ్ళం" అంది భర్త ముఖంలోకి చూస్తూ బుజ్జమ్మ.

"ఇకపై అలా వుండదు జుజ్జమ్మా!మానాన్న తాకట్టులో వున్న మన బంగారాన్ని విడిపించి పదివేల రూపాయలను కూడా ఇచ్చారు.ఇవిగో చూడూ!"అని సొమ్ము,డబ్బు భార్య చేతిలో పెట్టి "ఇక మనకు అన్ని ఇబ్బందులు సర్దుకున్నాయి. కనుక నేను మళ్ళీ రేపటి నుంచే పొదుపు చేయను ప్రారంభిస్తా! " అని పక పక నవ్వాడు గుండూరావు. భర్త అక్కున చేరింది బుజ్జమ్మ. ©©©© ©©©© ©©©©

మరిన్ని కథలు

Rakthaksharaalu
రక్తాక్షరాలు
- డా:సి.హెచ్.ప్రతాప్
Pakshi premikudu
పక్షి ప్రేమికుడు (బాలల కథ)
- చెన్నూరి సుదర్శన్
Panimanishi nmerpina gunapatham
పని మనిషి నేర్పిన గుణపాఠం
- కామేశ్వర రావు రాపాక
Sravanthi
స్రవంతి
- మండా. సూర్యనారాయణ
kala nijamayega
kalanijamayega
- ప్రభావతి పూసపాటి
Sahaayam
సహాయం
- డా:సి.హెచ్.ప్రతాప్
Toli Ekadashi
తొలి ఏకాదశి
- కొడవంటి ఉషా కుమారి
Mudi padina bandham
ముడిపడిన బంధం
- అనిసా తబస్సుమ్ sk (Anisa Tabbasum sk)