తీయని బాంధవ్యాలు - కామేశ్వర రావు రాపాక

Teeyani bandhavyalu

“అయ్యా, పిల్లలు పండుక్కొచ్చి తిరిగెల్లిపోతన్నారా?” ఒక పెద్దావిడ వాకబు

“అవును పెద్దమ్మా”

“యావూరులుంతారు?”

“అమెరికాలో”

“అమిరికా..... అంతె అదెక్కడుంతాది? మనూరికి ఎంత దూరం?”

“మనకి పది వేల మైళ్ళ దూరం”

“ఆ... పది ఏలా !!!.... “

“అవును”

"అదెక్కడే! ఏడు సంద్రాలు దాటెల్లాలే” కొంచెం లోక జ్ఞానం తెలిసిన ఆమె.

"బూ పెపంచకంలో మనం ఈ మూలనుంతె అది ఆ మూలనుంతాదే. మనకి పొగులైతె అక్కడ రేతిరవుతాది" ఇంకాస్త ఎక్కువ తెలిసిన ఇంకొకామె.

ఇది నీలకంఠం కొడుకు సునీల్ కోడలు సుశీల అమెరికా తిరుగు ప్రయాణ సమయములో ఆ వీధిలోనున్న బంధువులు మరియు ఆత్మీయులంతా గుమిగూడి ఎవరికి తెలిసిన రీతిలో వారు స్పందిస్తున్నారు.

నీలకంఠం ఒక్కగానొక్క కొడుక్కి పెద్ద చదువుల కోసం అమెరికా పంపించాడు. చదువు ముగిసిన పిమ్మట సునీల్ కు అమెరికాలోనే ఉద్యొగం దొరకడంతో కిందటేడాది పెళ్ళి చేసి కోడలుతో సహా అమెరికా పంపించాడు. ఒక ఏడాది గడిచిన తరువాత సంక్రాంతి పండుగ కోసం అమెరికా నుండి వచ్చారు. నెల రోజులకోసం వస్తున్నామంటె నీలకంఠం దంపతులిద్దరు చాల సంబరపడ్డారు కాని ఉన్న నెలలో ఒక వారం అత్తవారింటికి ఇంకో వారం విహార యాత్రలకి ఆ తరువాత స్నేహితులతో కలవడానికి విశాఖపట్నం తదితర ప్రాంతాలు తిరిగొచ్చినప్పటికి తిరుగు ప్రయాణం దగ్గర పడింది. ఈ రోజు వారు తిరిగి వెళ్ళిపోతున్నారు. నీలకంఠం ముఖములో దైన్యం కనిపిస్తుంది.

కొడుకుని పై చదువుల కోసం అమెరికా పంపినప్పుడు మరియు పెళ్ళి తరువాత కోడలితో అమెరికా పంపించినప్పుడు ఉన్న ఉత్సాహం నీలకంఠం లో లేదిప్పుడు. వయసు పైబడుతుంది. వృద్ధాప్య ఛాయలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. ఏదో తెలియని బాధ మనసులో గూడు కట్టుకుంటుంది.

"డాడీ కారు వచ్చెస్తుంది. బేగేజ్ అంతా బయటపెట్టండి. అమ్మా వెళ్ళొస్తామమ్మా" అని సునీల్ అనడంతో నీలకంఠం లేని ఉత్సాహం తెచ్చుకుని అంతకు ముందే సర్దిపెట్టుకున్న సూట్ కేసులను బయట పెట్టాడు. నీలకంఠం భార్య లక్ష్మి కొడుకుని కోడలిని ఆత్మీయంగా ముద్దు పెట్టి "జాగ్రత్త నాన్నా ఊరగాయలు, పొడులు ఇంకా మిగిలిన తినుబండారాలు సర్దాను. అక్కడికి చేరుకున్నాక క్షేమ సమాచారం తెలియజేయండి" అంది.

"అలాగేనమ్మా, మీరు కూడ జాగ్రత్త. మందులు టైం సరికి వేసుకోండి. ఏ ప్రోబ్లం వచ్చినా వెంటనే కాల్ చెయ్యండి. రెక్కలు కట్టుకుని వాలిపోతాం"

కారు గుమ్మం లో ఆగింది. సామానులు అన్నీ డిక్కీలో సర్దాక నీలకంఠం డ్రైవర్ పక్క సీట్ లో కూర్చున్నాడు. కొడుకు కోడలు ఆ వెనక సీట్ లో కూర్చున్నారు. అందరికి ‘బై’ చెప్పారు. కారు విశాఖపట్నం ఎయిర్ పోర్టుకు బయలుదేరింది.

అద్దంలా మెరిసిపోతున్న హైవే పై కారు సర్రున దూసుకుపోతుంది. కొడుకుని కోడలిని వైజాగు ఎయిర్ పోర్టులో ఫ్లైట్ ఎక్కించడానికి బయలుదేరిన నీలకంఠం మదిలో గత స్మృతులు ముప్పిరిగొన్నాయి.

-----///-----

"బాబు నీవు అల్లరి చెయ్యకుండా బుద్ధిగా నాయనమ్మ సెప్పిన మాట ఇనుకోని సదువుకో. సదువుకుంటె మంచి ఉద్దేగమొస్తాది. మీమున్న జాగాలో మన తెలుగు సదువులు లేవు. అక్కడంతా హింది సదువులు." చిన్నప్పుడు అమ్మా నాన్న చెప్పిన మాటలకు కట్టుబడి నీలకంఠం పుట్టెడు దుఃఖాన్ని ఆపుకొని అమ్మా నాన్నలకు టాటా చెప్పాడు.

నీలకంఠం నాన్న రంగయ్య అండమాన్ లో పోర్టు కలాసీ గా పని చేసేవాడు. అ రోజుల్లో స్వంత ఊరిలో కూలి దొరక్క కూలి కోసం కొంత మంది యువకులు అండమాన్ వెళ్తుంటె వాళ్ళతో కలిసి అండమాన్ వెళ్ళిపోయాడు. అక్కడ పని దొరికిన తరువాత పెళ్ళి చేసుకొని భార్యతో కలిసి అండమాన్ వెళ్ళిపోయాడు. నీలకంఠం, తాను పుట్టిన తరువాత సంవత్సరానికొకసారి సంక్రాంతికి తమ ఊరిలో ఉన్న నాయనమ్మ దగ్గరికి తల్లిదండ్రులతో కలిసి వచ్చేవాడు. అయిదేళ్ళవరకు అమ్మ నాన్నతో కలిసి అండమానులోనే పెరిగాడు.

అయిదేళ్లు నిండిన తరువాత నాన్నమ్మ ఉంటున్న తమ ఊరు సోంపేటలో సమితి ప్రాథమిక పాఠశాలలో చేరాడు నీలకంఠం. ఆ తరువాత నాన్నమ్మని, తనని చూడడానికి అమ్మానాన్నలు అండమాన్ నుండి అప్పుడప్పుడు వచ్చేవారు. కానీ తను టెన్త్ క్లాస్ చదువుతున్నప్పుడు, దురదృష్టవశాత్తు తండ్రి పనిచేసే టింబర్ డిపోలో ప్రమాదం కారణంగా ఆయన చనిపోవడంతో, అమ్మ ఒక్కతే తిరిగి వెనక్కి వచ్చేసింది. తన బాల్యమంతా నాన్నమ్మ సంరక్షణలోనే సాగింది. తల్లిదండ్రుల ప్రేమాభిమానాలు అంతగా పొందలేదు.

టెంత్ క్లాస్ తరువాత పై చదువులకోసం శ్రీకాకుళం, విశాఖపట్నం వెళ్లడం వలన అమ్మ ప్రేమను కూడ ఎక్కువ పొందలేక పోయాడు. తరువాత తన పెళ్లి అయిన వెంటనే నాన్నమ్మని, అమ్మని ఒకేసారి కోల్పోయాడు. ఉద్యోగం వచ్చిన తరువాత చీటికి మాటికి బదిలీల కారణంగా తన కొడుకు సునీల్ చదువు పాడవుతుందని భావించిన నీలకంఠం కొడుకుని హాస్టల్లో చేర్పించాడు. అలా తన కొడుకుకు కూడా తల్లిదండ్రుల ప్రేమాభిమానాలు అంతగా పంచలేకపోయాడు. కొడుకు పెరిగి ప్రయోజకుడు అయ్యాడన్న సంబరం ఎక్కువ కాలం నిలవలేదు. అమెరికా వెళ్లి పై చదువులు చదువుతానన్న కొడుకు కోరికను కాదనలేక పోయాడు. ఆ తరువాత అమెరికాలోనే ఉద్యోగం దొరకడం వలన కొడుకు అక్కడికి వెళ్లి పోయాడు. ఈ విధంగా కొడుకు తన నుండి దూరమైపోయాడు. తన చివరి రోజుల్లో అయినా కొడుకు తన దగ్గర ఉంటాడన్న ఆశ ఆవిరైపోయింది. “శేష జీవితం ఎలాగడుస్తుందో! “ అన్న ఆలోచన ముప్పిరిగొంది మనసులో.

వైజాగ్ ఎయిర్ పోర్టులో కొడుకు, కోడలిని దింపి జాగ్రత్తలన్ని చెప్పి, వారానికోసారి అయినా అమ్మతో, నాతో మాట్లాడండి అని చెప్పాడు నీలకంఠం.

నాన్నగారు, మీకు ఏ మాత్రం ఇబ్బంది కలిగినా నాకు కాల్ చెయ్యండి. వెంటనే బయలుదేరి వచ్చెస్తాం. మీరేమి బాధ పడకండి అని చెప్పి పంపించాడు కొడుకు.

రిటైర్మెంట్ తరువాత తన చిన్నప్పుడు పెరిగిన ఇంట్లోనే సెటిల్ అయ్యాడు నీలకంఠం, ఎందుకంటే చుట్టుపక్కల అంతా తన బంధు మిత్రులు ఉంటారన్న ఆశతో.

——-///——-

మొదట్లో కొడుకు తరచుగా కాల్ చేసేవాడు. రాను రాను తగ్గి పోయింది. కొడుకుకి తన మీద ప్రేమ తగ్గి పోవడానికి తనే కారణమని తనను తాను నిందించుకునేవాడు నీలకంఠం. చిన్నప్పటి నుంచి వాడికి ప్రేమ మాధుర్యాలు పంచలేక పోయానని బాధ పడేవాడు.

వయసు మీద పడటంతో భార్యకు నీలకంఠంకు తరచు అనారోగ్యం ఎదురవుతుంది. ఈ సమయంలో కొడుకు, కోడలు తమతో ఉంటే బాగుండుననిపిస్తుంది. కొడుకు తమకు డబ్బులు పంపించనక్కరలేదు. తన పెన్షన్ మొత్తం సరిపోతుంది. ఏదైనా పెద్ద జబ్బు చేసినా గవర్నమెంట్ వారు ఆసుపత్రి ఖర్చులు పెట్టుకుంటారు కానీ తన చివరి రోజుల్లో తన వద్ద కొడుకు ఉండడన్న తలపు రోజు రోజుకు తనని కృంగదీస్తుంది. అలా ఇలా పది సంవత్సరాలు గడిచిపోయాయి. స్వంత పనులు చేసుకోవడమే కష్టంగా ఉంది. ఇంట్లో ఒక పనిమనిషిని పెట్టుకున్నా కూడా జీవితం దుర్భరం అనిపిస్తుంది.

“మన దేశం వచ్చి ఇక్కడేమైనా ఉద్యోగం చూసుకోరా, అలాగైనా మాకు దగ్గరగా ఉంటావు” అని కొడుకుతో చెప్పాడు నీలకంఠం. కొడుకు, తన ప్రతిపాదనకు మొగ్గుచూపినా కోడలు మాత్రం ససేమిరా అంది ఎందుకంటే అమెరికాలో ఉంటే తన పిల్లల భవిష్యత్ బాగుంటుందని ఆమె ఆశ.

——-///——-

ఆ తరువాత నీలకంఠం ఒక రోజు తన ఆప్తమిత్రుడు శ్రీరాములు ఇంటికి వెళ్ళి తన బాధలను చెప్పుకున్నాడు.

“చూడురా నీలకంఠం, పిల్లలు పెద్దయ్యాక వారి సంసారాలు వారివి. తమ పిల్లలకు కూడ వారు ప్రేమాభిమానాలు పంచాలి అలాగే మమతా మాధుర్యాలు చవి చూడాలి. ఇదే జీవన నియమం. మనం కూడా మన తల్లిదండ్రుల ప్రేమాభిమానాలు చవి చూసాం అలాగే మన పిల్లలకు మమతలు పంచాం. ఇలాంటి సమయంలో బంధువుల కన్నా మిత్రుల సాన్నిహిత్యం ఎంతో మేలు. మన మిత్రులతో రోజూ కలుస్తుంటే మన బాధలు సగం తీరిపోతాయి. అదీకాక మీకు బూరగాంలో బంధువులు ఉన్నారు కదా, ఎవరైనా ఇంట్లో సహాయకురాలిగా ఉంటారేమో ఒకసారి అడిగి చూడు.” అన్నాడు శ్రీరాములు.

నీలకంఠంకు మనసు కొంత కుదుట పడింది. అక్కడినుండి ఇంటికి తిరుగు ముఖం పట్టాడు. దారిలో “మామయ్యా బాగున్నారా?” అన్న పిలుపుతో తల పైకెత్తి చూసాడు నీలకంఠం. నీలకంఠంకు ఎదురుపడిన ఆమె కుశలమడుగుతుంది.

“ఎవరమ్మా నీవు? నేను పోల్చుకోలేక పోతున్నాను.”

“నేను పార్వతిని. బూరగాం మా ఊరు.”

అంటే మా అప్పారావు కూతురివా?

“అవును. ఎలా ఉన్నారు మీరు? అత్తయ్య బాగుందా?”

“ఆ….. బాగుంది, పద, మన ఇంటికి వెళ్లి మాట్లాడుకుందాం.”

“మన పాత ఇంట్లోనే ఉన్నారా లేక కొత్త ఇల్లు ఎక్కడైనా కొన్నారా?”

“లేదమ్మా మన పాత ఇల్లే, చిన్నప్పుడు నీవు వచ్చేదానివి కదా!”

ఇద్దరూ కలిసి నీలకంఠం ఇంటికి వెళ్ళారు.

ఇంట్లో మేనత్త లక్ష్మి ని చూడగానే గబాలున హత్తుకుని “అత్తా బాగున్నావా?” అని అడిగింది పార్వతి.

“ఆ… బాగున్నాను పార్వతి, నీవెలాగున్నావు? నీవు పెళ్ళి చేసుకోలేదట కదా, అలా ఎందుకు చేశావ్?”

“ఈ జన్మకింతే అత్తా. నేను పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే మా అమ్మనెవరు చూస్తారు? అని మొదట్లో అనుకున్నాను. ఇప్పుడు మా అమ్మ చనిపోయిన తరువాత పెళ్లి మీద కూడా ఇంటరెస్ట్ పోయింది. అదీ కాక చిన్నప్పటి నుంచి బావే నా మొగుడు అని అందరూ అనేవారు. నా మనసులో కూడా అదే బలంగా నాటుకుంది.”

“అవునమ్మా మేము కూడా అలాగే అనుకున్నాం. కానీ మీ నాన్న చనిపోయిన తరువాత నీవు చదువు ఆపేసావు. బావేమో పెద్ద చదువులు చదివాడు.”

“అవునత్తా, నేను అయిదో తరగతి వరకు మా ఊర్లో చదివాను. హైస్కూలు చదవాలంటే రోజూ సోంపేట రావాలి. ఈలోపు మా నాన్న చనిపోయారు. ఇంక ఈ జన్మకు ఇంతే అనుకున్నాను.”

“అయినా ఎవరోఒకరిని పెళ్లి చేసుకుంటే బాగుంటుంది. ఎన్నాళ్లు ఇలా ఉండి పోతావు?”

“నా సంగతి వదిలేయండి. నాకు బాగానే ఉంది, మీరెలాగున్నారు? మిమ్మల్ని చూస్తుంటే ఏదో బాధ పడుతున్నట్టు అనిపిస్తుంది. బావ ఫోన్ చేస్తున్నాడా?”

“ఆ… చేస్తున్నాడు”, అని తటపటాయిస్తూ “నేను అడుగుతున్నానని ఏమీ అనుకోకు పార్వతి. నీవు ఒక్కదానివే అక్కడుంటున్నావు కదా, నీకు పెద్ద దిక్కు లేదు. ఇక్కడికి వచ్చి మాతో ఉంటావా? మాకు కూడా ఈ వయసులో ఆసరాగా ఉంటావు.” అంది నీలకంఠం భార్య లక్ష్మి.

“అలాగేనత్తా, నాకు మాత్రం ఎవరున్నారు, ఈ విధముగానైనా మీకు సేవ చేసే భాగ్యం దేవుడిచ్చాడనుకుంటాను.”

——-///——-

మరునాడు నీలకంఠం మిత్రుడు శ్రీరాములు ఇంటికి వెళ్లాడు.

“ఏంరా నీలకంఠం, నీ ముఖంలో సంతోషం కనిపిస్తుంది. ఏదైనా తీపి కబురు చెప్తావా?” అడిగాడు శ్రీరాములు.

“అవునురా, బూరగాంలో మా బంధువులని సంప్రదిస్తే ఎవరైనా సహాయకులు దొరుకుతారేమోనని సలహా ఇచ్చావు కదా. కాగల కార్యం గంధర్వులు తీర్చినట్టు, మీ ఇంటినుంచి వెళ్తుంటే దారిలో మా బావమరిది కూతురు కనిపించింది. ఇద్దరం కలిసి మాఇంటికి వెళ్ళాం. నేనేమి మాట్లాడకుండానే మా ఆవిడ ఆ పిల్లని మాతో ఉండమని అడగడం ఆ పిల్ల ఒప్పుకోవడం జరిగిపోయింది.” ఉత్సాహంగా చెప్పాడు నీలకంఠం.

“ఆ పిల్ల బూరగాం లో ఒంటరిగా ఉంటుందని ఒకసారి చెప్పావు. నాకు గుర్తుంది. థేంక్ గాడ్, చాలా సంతోషంరా. ఈ వయసులో మనకు ఆహార వ్యాయామాలతో పాటు ఆనందం కావాలి. దానికి బలమైన కుటుంబ బంధాలు, స్నేహితులు ఉండాలి. వారితో నిత్యం మాట్లాడుతుండాలి. పిల్లలు మన దగ్గర ఉంటే వారు పంచే ప్రేమాభిమానాలు మనకు వెయ్యి ఏనుగుల బలమిస్తాయి.” అన్నాడు శ్రీరాములు.

“అదేరా, నా బాధ, కొడుకు దగ్గర లేడనే కదా!”

“నీకు కొడుకు దగ్గర లేక పోయినా, కూతురు లాంటి మేనకోడలు దొరికింది. ఆ పిల్లకు కూడా ఎవరు లేరు కాబట్టి కూతురిలా మిమ్మల్ని చూసుకుంటుంది. మీరు కూడా ఆ అమ్మాయిని ప్రేమగా చూసుకోండి, తరువాత మన చిన్నప్పటి మిత్ర బృందం ఉంది ఇంకా మీ వీథిలో మీ చుట్టూ ఉన్న వారందరూ మీ రక్త సంబంధీకులే. ‘బ్లడ్ ఈజ్ థిక్కర్ దేన్ వాటర్’ అని ఇంగ్లీషులో అంటారు, తెలుసు కదా, ఇంతకన్నా ఏమి కావాలి? ఇంతకన్నా వేరే స్వర్గం ఉంటుందా?” అని స్వాంతన పరిచాడు శ్రీరాములు.

“మా మేనకోడలు, పార్వతి, మాకు కోడలుగా రావలసిన అమ్మాయిరా, మా అబ్బాయికి ఆ అమ్మాయినిచ్చి పెళ్లి చేయకుండా ఇలా మాకు సేవ చెయ్యడానికి తెచ్చి పెట్టుకొంటే నలుగురు ఏమనుకుంటారో! “ అని సందేహించాడు నీలకంఠం.

“అలా ఎవరు ఏమనుకోరు. ఆ అమ్మాయికి కూడా ఎవరు లేరు కాబట్టి మీరు ఆసరా ఇచ్చారు అనుకుంటారు. లేదంటే ఒక అబ్బాయిని తెచ్చి ఆ అమ్మాయికి పెళ్లి చేయండి. కన్యాదానం ప్రతిఫలం కూడా వస్తుంది మీ దంపతులకు” అని సలహా ఇచ్చాడు శ్రీరాములు.

“ఆ ప్రయత్నం కూడా చేసాం, ఆ అమ్మాయి ఏమందో తెలుసా! ‘బావకు రెండో పెళ్ళాంగా నైనా వెళ్తాను గాని వేరే వారిని పెళ్లి చేసుకోను’ అంది.”

“అదేరా మన బాంధవ్యాల్లో ఉన్న తీయదనం. ఎంత బాగా అల్లుకుంటాయో, అంత బలంగా కూడా ఉంటాయి” అన్నాడు శ్రీరాములు.

ఇప్పుడు నీలకంఠం దంపతులకు కొడుకు తమ దగ్గర లేడనే భావన కలగడం లేదు. “కొడుకైనా కూతురైనా మాకు పార్వతి మాత్రమే” అనుకుంటూ బాంధవ్యాల రుచిని ఆస్వాదిస్తూ హాయిగా శేష జీవితం గడుపుతున్నారు.

——-///——-

మరిన్ని కథలు

Pisinikottu
Pisinikottu
- మోహనరావు మంత్రిప్రగడ
Vuchithalatho anardham
ఉచితాలతో అనర్ధం
- డా:సి.హెచ్.ప్రతాప్
Dayyaala Meda
దయ్యాల మేడ
- డా:సి.హెచ్.ప్రతాప్
Chivari chitram
చివరి చిత్రం
- డా:సి.హెచ్.ప్రతాప్
Idi ekkadi nyayam
ఇది ఎక్కడి న్యాయం
- ప్రభావతి పూసపాటి
Maa Inti TV (feelgood story)
మా ఇంటి టి.వి (feelgood story)
- అనిసా తబస్సుమ్ sk
Raanunna kaalam
రానున్న కాలం
- మద్దూరి నరసింహమూర్తి