అమ్మ కోరిక - మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు

Amma korika

“ఒరేయ్ రాము… నేను వచ్చే నెలలో రెండు రోజులు మా తమ్ముడి ఇంటికి వెళ్లి వస్తాను రా…” ఆషాఢ మాసం మొదలైనప్పటి నుంచీ మా అమ్మ రోజుకి నాలుగైదుసార్లు ఇదే మాట అంటోంది. మా అమ్మకు డెబ్బై ఐదేళ్లు. కాళ్లు నొప్పులు. ఎవరో ఒకరు తోడుంటే తప్ప బయటకు వెళ్లలేదు. నిజానికి, ఇంతవరకు ఎప్పుడూ ఇలా ఎక్కడికైనా వెళ్లాలని పట్టుబట్టిన సందర్భమే లేదు. కానీ ఈసారి మాత్రం మా మేనమామ ఇంటికి వెళ్లాలన్న కోరికను గట్టిగా పట్టుకుంది. “పోనీ… మా మేనమామను ఇక్కడికి రమ్మని చెబుదామా?” అనుకుంటే అదీ కుదరదు. మా మేనమామ పరిస్థితి కూడా అమ్మలాగే. ఆయన కూడా తన పెద్దకొడుకు దగ్గర విశాఖపట్నంలో ఉంటున్నాడు. మేమున్న చోటు నుంచి వాళ్లింటికి దాదాపు నాలుగు గంటల ప్రయాణం.అందుకే నేను పెద్దగా స్పందించకుండా,“చూద్దాంలే అమ్మా…” అంటూ దాటేస్తున్నాను.మర్చిపోతుందేమో అనుకుంటే అదీ లేదు. అమ్మ జ్ఞాపకశక్తి చాలా బాగుంది. పైగా పాతకాలం విషయాలన్నీ ఒక్కొక్కటిగా గుర్తు తెచ్చుకుని, నిన్న జరిగినట్టుగా మాకు కథలుగా చెబుతూ ఉంటుంది. తన తమ్ముడితో ప్రతిరోజూ ఫోన్లో మాట్లాడుతూనే ఉంటుంది. వాళ్లతోనే కాకుండా మేనమామ పిల్లలు, చిన్నాన్న పిల్లలు… తెలిసిన వాళ్లందరితోనూ ఫోన్లో కబుర్లు చెబుతూ కాలక్షేపం చేస్తుంది. ఇంకా మా పిల్లలంటే అమ్మకు ఎంత ఇష్టమో!ప్రతిరోజూ వాళ్లతో కలిసి టీవీ చూస్తుంది. వాళ్లు చూసే కామెడీ షోలు, డాన్స్ షోలు అన్నీ ఆసక్తిగా చూస్తూ, పిల్లల్లో పిల్లలా కలిసిపోతుంది. వాళ్ల దగ్గర తనకు తెలియని విషయాలేమైనా ఉంటే అడిగి తెలుసుకుంటుంది.అది చూసినప్పుడల్లా నాకు నవ్వొస్తుంది. “ఈ వయసులో కూడా ఇంత ఉత్సాహమా!” అనిపిస్తుంది. కానీ వెంటనే మరో ఆలోచన వస్తుంది. పోనీలే… ఏదో ఒక కాలక్షేపం చేసుకుంటోంది కదా. ఈ వయసులో ఆవిడను ఎందుకు బాధపెట్టడం?అందుకే నేను పెద్దగా పట్టించుకోను. పిల్లల చదువుల గురించి అడుగుతుంది. వాళ్ల బట్టల గురించి మాట్లాడుతుంది. వాళ్లు ఆడే ఆటలు, పాడే పాటలు… అన్నింటి గురించీ కబుర్లు చెబుతుంది. నిజానికి, మా అమ్మకు ఇప్పుడు కావాల్సింది పెద్దగా ఏమీ లేదేమో.డబ్బు కాదు.ఆస్తి కాదు.పెద్ద పెద్ద సౌకర్యాలు కూడా కాదు.తన వాళ్ల మధ్య ఉండాలి.తమ్ముడిని ఒకసారి కళ్లారా చూడాలి.పుట్టింటి వాళ్లను చూడాలన్న కోరిక కలిగిందేమో. అందుకే అలా అంటుందేమో అనుకున్నాను.ఆషాఢం వెళ్లిపోయింది. శ్రావణం వచ్చేసింది. శ్రావణ సందడి ఊరంతా కనిపిస్తోంది. వీధిలో ముత్తైదువులు అటూ ఇటూ తిరుగుతుంటే, శ్రావణలక్ష్మి తానే నడిచివస్తున్నట్టుగా అనిపిస్తోంది. ఇంట్లో మంగళగౌరీ వ్రతాలు, వరలక్ష్మీ పూజల హడావుడిలో ముత్తైదువులు ఉంటే… ఆడపిల్లలు ఇంకో హడావుడిలో ఉన్నారు. దూర ప్రాంతాల్లో ఉన్న అన్నయ్య వరుస వాళ్లకు రాఖీలు ఎలా పంపాలి?ఏ రకం రాఖీలు కొనాలి?ఎంత ఖరీదులో కొనాలి?ఇంట్లో అదే సందడి. ఒకరోజు మా పెద్ద కూతురు మా అమ్మను అడిగింది. “మామ్మా… మీ కాలంలో రాఖీలు కట్టేవారా?”అమ్మ నవ్వింది. “లేదే! మాకసలు రాఖీలు అంటే ఏంటో కూడా తెలియదు. మేము చిన్నప్పుడు శుద్ధ పల్లెటూర్లో ఉండేవాళ్లం. నేను కాపురానికి వచ్చాక మీ తాతగారికి కూడా ఇలా రాఖీలు కట్టిన వాళ్లు ఎవరూ లేరు. ఈ సాంప్రదాయం ఎప్పుడు వచ్చిందో నాకు తెలియదు. కానీ ఇప్పుడు మన ఊళ్లలోకి కూడా పాకింది.” కాసేపు ఆగి మళ్లీ అంది.“ఇది కూడా మంచిదే. ఈ వంకనైనా కలుసుకుంటారు. చిన్నప్పుడు కలిసిమెలిసి పెరిగిన పిల్లలు పెద్దయ్యాక ఎవరి బతుకు వారిదే. ఏ పెళ్లిళ్లకో, శుభకార్యాలకో తప్పితే ప్రత్యేకంగా ఎవరి ఇంటికి ఎవరు వెళ్లరు. మా కాలంలో అయితే మరీ దారుణంగా ఉండేది. అప్పట్లో ఫోన్లు ఉండేవి కావు. ఉత్తరం వస్తే గాని పుట్టింటి వాళ్ల కబుర్లు తెలిసేవి కాదు. పైగా అత్తవారింటి నుంచి పుట్టింటికి వెళ్లాలంటే ఎన్నో అనుమతులు తీసుకోవాల్సి వచ్చేది.ప్రయాణ సౌకర్యాలు తక్కువ. సమాచార సాధనాలు తక్కువ. పెళ్లయిన తర్వాత ఆడపిల్లకి పుట్టింటితో సంబంధాలు చాలా చాలా తక్కువగా ఉండేవి. పురుళ్లకి, పండగలకి మాత్రమే వెళ్లేవాళ్లం. పుట్టింటి వాళ్లు కూడా ఎక్కువగా వచ్చే వాళ్లు కాదు. ఎందుకంటే అత్తింటి వారికి ఎక్కువగా నచ్చేది కాదు. ఏమిటో… ఆ కాలం పద్ధతులు అలా ఉండేవి.” అమ్మ మాటలు వింటూ నేను మౌనంగా ఉండిపోయాను. భగినీ హస్త భోజనానికి మా తమ్ముడు ప్రతి ఏటా తప్పనిసరిగా వచ్చేవాడు.కానీ రాను రాను వాడికి బాధ్యతలు పెరిగాయి.బంధాలు పెరిగాయి.బరువులు పెరిగాయి.వయసు కూడా పెరిగింది. రావడం తగ్గించేసాడు “ఇక అంతే… ఇక రావడం కుదరదేమో…”అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ఆ మాటలు అంటూ తన పెట్టెలో ఏదో వెతికింది. చివరికి అందులోంచి యాభై రూపాయల కాగితం తీసింది. “ఒసేయ్ చంటి… నాకు కూడా మంచి రాఖీ తెచ్చి పెట్టవే!” అని మా చిన్న కూతురిని అడిగింది. “నువ్వు ఎవరికి కడతావు మామ్మా?”అని ఆ పిల్ల నవ్వుతూ అడిగింది.“ఎవరికో కడతాను… నువ్వు తెచ్చి పెట్టవే…” అంది అమ్మ. ఆ మాటలో ఉన్న ఆత్రుతను అప్పుడు నేను పూర్తిగా అర్థం చేసుకోలేదు.మా పిల్ల తెచ్చి ఇచ్చిన అందమైన రాఖీని అమ్మ తన పెట్టెలో చాలా జాగ్రత్తగా పెట్టుకుంది. అప్పుడు ఒక్కసారిగా నాకు అమ్మ మనసు అర్థమైంది. ఆమెకు రాఖీ కావడం కాదు.తమ్ముడు కావాలి. తనతో కలిసి పెరిగిన ఆ తమ్ముడిని మరోసారి ఎదురెదురుగా కూర్చోబెట్టుకుని కబుర్లు చెప్పుకోవాలి. అంతే. మర్నాడు అమ్మ నన్ను అడిగింది.“నీకు రాఖీ పౌర్ణమి సెలవు ఏమైనా ఉందా?”నిజానికి సెలవు లేదు. కానీ ఆవిడ మనసులోని అంతరార్థం నాకు అర్థమైంది. “ఉందమ్మా…”అన్నాను.ఆమె ముఖంలో చిన్న వెలుగు కనిపించింది. “కారులో కూర్చుని అంత దూరం ప్రయాణం చేయగలవా?” అని అడిగాను.“ఎక్కడికి?” అని ఆవిడ అడగలేదు. “ఎక్కడికి వెళ్దాం అంటున్నానో చెప్పనా?” అన్నాను. ఆమె నా వైపు చూసింది. “ఇంకెక్కడికి రా… మావయ్య దగ్గరికి. పిల్లలతో నువ్వు చెప్పిన మాటలు వింటున్నావని నేను చూశాను!” అంది నవ్వుతూ. అది విన్న క్షణంలో ఆమె ముఖంలో కనిపించిన ఆనందం… ఇన్నాళ్లుగా నేను చూడలేదు.రాఖీ పౌర్ణమికి ముందు రోజే బయలుదేరాం. నాలుగు గంటల ప్రయాణం.మధ్యలో ఎన్నిసార్లు, “అమ్మా… కాళ్లు నొప్పిగా ఉన్నాయా?” అని అడిగానో నాకు గుర్తులేదు. కానీ ఆమె మాత్రం ఒక్కసారి కూడా, “నొప్పిగా ఉంది” అనలేదు. విశాఖపట్నం చేరుకునే సరికి మా అమ్మ ముఖం శ్రావణ పౌర్ణమి వెన్నెలలా వెలిగిపోయింది.మా మేనమామ కూడా ఎదురుచూస్తూనే ఉన్నాడు. అమ్మను చూడగానే ఆయన కళ్లలోనూ వెలుగు.ఇద్దరినీ ఎదురెదురుగా మంచాల మీద కూర్చోబెట్టం అంతే…మాటలు మొదలయ్యాయి.చిన్ననాటి సంగతులు. పుట్టింటి జ్ఞాపకాలు.ఎవరెవరు ఏం చేసేవాళ్లు.ఎవరు ఎవరిని ఏడిపించేవారు.ఎవరి పెళ్లికి ఏం జరిగిందో… నిన్ననే జరిగినట్టుగా ఒక్కొక్క జ్ఞాపకాన్ని బయటకు తీస్తున్నారు. గడియారం తిరుగుతోంది.రాత్రి అవుతోంది.కానీ వాళ్లకు మాత్రం సమయం ఆగిపోయింది. ఆ క్షణంలో అమ్మకు తన కాళ్ల నొప్పులు గుర్తుకు రాలేదు. మామయ్యకు తన బీపీ సంగతి గుర్తుకు రాలేదు. వాళ్లిద్దరూ మళ్లీ డెబ్బై ఐదేళ్ల వృద్ధులు కాదు. ఒకప్పుడు పుట్టింటి ముంగిట పరుగులు తీసిన అన్నాచెల్లెళ్లు.రాఖీ కట్టడానికి తెచ్చిన ఆ చిన్న దారం… ఆ రోజు వాళ్లిద్దరి మధ్య ఎన్నో దశాబ్దాల దూరాన్ని కట్టేసింది. ఆ మరునాడు నగరం అంతా రాఖీ పండగ హడావిడిగా ఉంది. పౌర్ణమి కదా… సముద్రుడు కూడా ఉత్సాహంగా ఉరకలు వేస్తున్నట్టుగా అలలు ఎగసిపడుతున్నాయి.మా ఇంట్లోనూ అంతే సందడి. సముద్రమంత ఉత్సాహం.ఉదయాన్నే మా అమ్మ లేచి కాలకృత్యాలు తీర్చుకుని, స్నానం చేసి వచ్చింది. వచ్చీరాగానే మామయ్య వైపు చూసి,“ఏమిట్రా… ఇంకా స్నానం చేయలేదా? పో… స్నానం చేసి రా!” అంది. ఆమె గొంతులో ఆ రోజు ఒక ప్రత్యేకమైన ఉత్సాహం. మామయ్య స్నానం చేసి రాగానే ఆయన నుదుటన బొట్టు పెట్టింది. నోరు తీపి చేసింది.తన పెట్టెలో ఎంతో జాగ్రత్తగా దాచుకున్న ఆ అందమైన రాఖీని బయటకు తీసింది. కొద్దిసేపు దాన్ని చేతిలోనే పట్టుకుని చూసింది.ఏళ్ల తరబడి ఎదురుచూసిన ఒక చిన్న కోరికను చేతిలో పట్టుకున్నట్టుగా… తర్వాత మెల్లగా తమ్ముడి చేతికి రాఖీ కట్టింది. ఆ క్షణంలో ఆమె ముఖంలో కనిపించిన ఆనందం మాటల్లో చెప్పలేనిది. మా పిల్లలంతా చుట్టూ చేరిపోయారు.“మామ్మా… కొంచెం ఇటు చూడు!” “తాతా… అటు చూడు!”“ఇద్దరూ దగ్గరగా కూర్చోండి!” అంటూ వాళ్ల బుల్లి కెమెరాలతో ప్రతి సన్నివేశాన్నీ బంధించేస్తున్నారు. ఎప్పుడో చిన్నప్పుడు కలిసి తిరిగిన అన్నాచెల్లెళ్లకు…ఇప్పుడు వాళ్ల మనవళ్లే డైరెక్టర్లయ్యారు. “మామ్మా… ఇంకోసారి రాఖీ చూపించు!” “తాతా… నవ్వండి!” అంటూ పిల్లలు చెబుతుంటే, వాళ్లిద్దరూ పిల్లల మాటలు వింటూ నవ్వుతున్నారు. నేను కాస్త దూరంగా నిలబడి ఆ దృశ్యాన్ని చూస్తున్నాను. ఆ రోజు నాకు ఒక విషయం చాలా స్పష్టంగా అర్థమైంది. మన పెద్దవాళ్ల జీవితంలో కొన్ని కోరికలు చాలా చిన్నవిగా కనిపిస్తాయి.“ఒక్కసారి వెళ్లి వస్తాను…”“ఒక్కసారి చూసి వస్తాను…”“ఒక్కసారి మాట్లాడతాను…”అంటారు. మనకు అవి చిన్న కోరికలే అనిపిస్తాయి. కానీ వాళ్లకు మాత్రం అవే జీవితంలో మిగిలిపోయిన చివరి పేజీలు కావచ్చు. వాళ్ల వయసు పెరుగుతున్న కొద్దీ వాళ్ల కోరికలు తగ్గిపోతాయి. కానీ తగ్గిపోయిన ఆ కోరికల్లో కొన్ని మాత్రం… వాళ్ల జీవితానికి చాలా పెద్ద అర్థాన్ని మోసుకొస్తాయి. ఆ రోజు అమ్మకు రాఖీ కట్టాలనిపించలేదు. తన తమ్ముడి చేతికి రాఖీ కట్టి…తన చిన్ననాటి జ్ఞాపకాలను మరోసారి తాకాలనిపించింది. తన పుట్టింటి ముంగిటికి మనసారా వెళ్లి రావాలనిపించింది. తనతో కలిసి పెరిగిన తమ్ముడితో మరోసారి చిన్నపిల్లలా కబుర్లు చెప్పుకోవాలనిపించింది. కాలం ఎంత దూరం తీసుకెళ్లినా… బంధాల మధ్య దూరాన్ని మాత్రం ఒక చిన్న దారం చెరిపేయగలదని ఆ రోజు చూశాను. మన పెద్దవాళ్లు అడిగే కొన్ని కోరికలకు మనం సమాధానం వెతకాల్సిన అవసరం లేదు. వాళ్లు చెప్పిన మాట వెనుక ఉన్న మనసును అర్థం చేసుకుంటే చాలు. వాళ్లు అడిగేది ప్రయాణం కావచ్చు. మనకు కనిపించేది నాలుగు గంటల దారి కావచ్చు. కానీ వాళ్లు వెళ్లాలనుకునేది… మనకు కనిపించని మరో లోకం కావచ్చు. అది వాళ్ల బాల్యం కావచ్చు.పుట్టింటి వాకిలి కావచ్చు. తమతో కలిసి పెరిగిన మనిషి కావచ్చు. లేదా…కాలం తమ నుంచి దూరం చేసిన తమలోని ఒక చిన్ననాటి జ్ఞాపకం కావచ్చు. అమ్మకు వెళ్లాలనిపించింది. తన పుట్టింటికి…తన తమ్ముడి దగ్గరికి…తన బాల్యానికి…ఒక్కసారి తిరిగి వెళ్లాలని అనిపించింది.** దారిలో కాసేపు మౌనంగా ప్రయాణించిన తర్వాత నాకు ఒక సందేహం వచ్చింది. “అమ్మా…” “ఏంట్రా?” “ఇదివరకు ఎప్పుడూ మామయ్యకి రాఖీ కట్టలేదు కదా నువ్వు… మరి ఇప్పుడు కొత్తగా ఎందుకు?” అమ్మ కాసేపు ఏమీ మాట్లాడలేదు. కారు కిటికీలోంచి బయటకు చూస్తూ ఉండిపోయింది. రోడ్డు పక్కన ఉన్న చెట్లు వెనక్కి పరుగులు తీస్తున్నాయి. ఆమె చూపు మాత్రం ఎక్కడో చాలా దూరంలో ఉన్నట్టుంది. కొద్దిసేపటి తర్వాత మెల్లగా అంది. “అదేంటో రా… ఇప్పుడు ఎందుకో అనిపించింది.” “ఏం అనిపించింది?” “తమ్ముడిని చూడాలనిపించింది.” ఆ మాట చాలా మామూలుగా చెప్పింది. కానీ ఆ మామూలు మాట వెనక ఏదో పెద్ద బాధ దాగి ఉన్నట్టుగా నాకు అనిపించింది. “ఇన్నాళ్లూ చూడాలని అనిపించలేదా?” అమ్మ చిన్నగా నవ్వింది. “అనిపించేది రా… కానీ మనసులో అనిపించినవన్నీ చేయగలమా?” కాసేపు ఆగి మళ్లీ అంది. “చిన్నప్పుడు వాడితో కలిసి ఎంత తిరిగానో తెలుసా? వాడి వెంట నేనుండేదాన్ని. వాడు నా వెంట ఉండేవాడు. తగువులు పడేవాళ్లం… మళ్లీ కాసేపటికే కలిసిపోయేవాళ్లం.” ఆమె కళ్లల్లో చిన్ననాటి వెలుగు కనిపించింది. “పెళ్లయిన తర్వాత ఎవరి జీవితాలు వాళ్లవి అయిపోయాయి. అప్పట్లో వెళ్లాలన్నా వెళ్లలేకపోయాం. ఇప్పుడు వెళ్లే పరిస్థితి ఉన్నా… శరీరం సహకరించడం లేదు.” “మరి ఇప్పుడు ఎందుకు ఇంతగా వెళ్లాలనిపించింది?” అమ్మ నా వైపు చూసింది. “వయసు పెరిగేకొద్దీ మనకు ఏం కావాలో కాదు రా… ఇంకేం మిగిలి ఉందో అనిపిస్తుంది.” ఆ మాట విన్నాక నేను ఏమీ మాట్లాడలేదు. “ఇదిగో… నువ్వు చెప్పినట్టే ఈసారి రాఖీ పండగ కూడా వస్తోంది. అందరూ రాఖీలు కట్టుకుంటున్నారు. మా పిల్లలంతా, మనవళ్లంతా… అందరూ వాళ్ల వాళ్ల అన్నదమ్ముల్ని గుర్తు చేసుకుంటున్నారు.” “అందుకే రాఖీ కట్టాలనిపించిందా?”“రాఖీ కట్టాలని కాదు రా…” అమ్మ మెల్లగా నవ్వింది. “తమ్ముడి చేతిని ఒక్కసారి పట్టుకోవాలని అనిపించింది.” ఆ మాటతో నా గొంతు మూగబోయింది. కాసేపటి తర్వాత ఆమె మళ్లీ కిటికీలోంచి బయటకు చూస్తూ అంది. “ఎప్పుడో చిన్నప్పుడు వాడి చేతికి పట్టుకుని స్కూలుకి వెళ్లేదాన్ని. ఇప్పుడు వాడి చేతికి రాఖీ కట్టడానికి వెళ్తున్నాను.” చిన్నగా నవ్వింది.“జీవితం కూడా వింతే కదరా…” ఆమె మాటలకు నేను సమాధానం చెప్పలేదు. కారు మాత్రం ముందుకు సాగుతూనే ఉంది. నాలుగు గంటల దారి…కానీ ఆ రోజు నాకు అర్థమైంది. మనం అనుకునేది నాలుగు గంటల ప్రయాణం. అమ్మ మాత్రం… దాదాపు అరవై ఏళ్ల వెనక్కి ప్రయాణిస్తోంది.

మరిన్ని కథలు

Chirigina Note book
చిరిగిన నోటుబుక్
- డా:సి.హెచ్.ప్రతాప్
Teeyani bandhavyalu
తీయని బాంధవ్యాలు
- కామేశ్వర రావు రాపాక
Pisinikottu
Pisinikottu
- మోహనరావు మంత్రిప్రగడ
Vuchithalatho anardham
ఉచితాలతో అనర్ధం
- డా:సి.హెచ్.ప్రతాప్
Dayyaala Meda
దయ్యాల మేడ
- డా:సి.హెచ్.ప్రతాప్
Chivari chitram
చివరి చిత్రం
- డా:సి.హెచ్.ప్రతాప్
Idi ekkadi nyayam
ఇది ఎక్కడి న్యాయం
- ప్రభావతి పూసపాటి