వెలుగు వైపుకి పయనం - ప్రభావతి పూసపాటి

Velugu vaipuki payanam

“మీ అమ్మ ఎప్పుడు ఊరు వెళ్లిపోతుంది?” ఇంట్లోకి అడుగుపెడుతూనే విసురుగా దీపను అడిగాడు సుధీర్.

“ఏమిటి? మీ అమ్మ వస్తోందని కబురు ఏమైనా వచ్చిందా?” అంతకన్నా విసురుగా ఎదురు ప్రశ్నించింది దీప.

బయట మొక్కలకు నీళ్లు పోస్తున్న భారతమ్మకు ఆ మాటలు స్పష్టంగా వినిపించాయి.

దీపకు భారతమ్మ ఒక్కతే తల్లి. సుధీర్‌, దీపలది ప్రేమ వివాహం. మనవరాలి మొదటి పుట్టినరోజు కోసం బొమ్మలు, గౌనులు కొనుక్కొని, కూతురికి సాయం చేయడానికి రెండు రోజుల క్రితమే ఊరి నుంచి వచ్చింది భారతమ్మ.

సుధీర్‌ మంచివాడే. భార్యను, కూతురిని ప్రేమగా చూసుకుంటాడు. తనను కూడా మర్యాదగానే చూస్తాడు. కానీ అతని తల్లి తరఫు వాళ్లు ఇంటికి వచ్చినప్పుడు మాత్రం అతని ప్రవర్తనలో ఏదో తెలియని మార్పు కనిపిస్తుంది.

దీప ఎన్నోసార్లు “అమ్మా! ఊర్లో ఒక్కదానివి ఎందుకు? మా దగ్గరికి వచ్చి ఉండొచ్చు కదా!” అని అడిగినా, భారతమ్మే ఏదో ఒక కారణం చెప్పి వాయిదా వేస్తూ వచ్చింది.

కానీ ఈ రోజు సుధీర్ అడిగిన తీరులో మాత్రం...

“మీ అమ్మ ఎంత త్వరగా వెళ్తే అంత మంచిది” అన్న భావం భారతమ్మకు స్పష్టంగా వినిపించింది.

ఆ రాత్రి భోజనాల దగ్గర సుధీర్ చెప్పిన మాటలు ఆమె అనుమానాన్ని నిజం చేశాయి.

“అమ్మ ఇల్లు బేరానికి పెట్టింది. ఇక ఊర్లో ఒంటరిగా ఉండలేనంటోంది. రేపు ఊరెళ్లి ఇంటి బాధ్యత వదిలించుకుని అమ్మను తీసుకొస్తాను.”

దీప ఏమీ మాట్లాడలేదు.భారతమ్మ కూడా ఏమీ మాట్లాడలేదు.భోజనం ముగించుకుని తన గదిలోకి వెళ్లింది.

దూరంగా రేడియోలో...“ఆడ జన్మకు ఎన్ని శోకాలో...”అంటూ పాట వినిపిస్తోంది.ఆ పాటతో పాటు భారతమ్మ మనసు కూడా గతంలోకి జారిపోయింది.

ఐదుగురు ఆడపిల్లల్లో తాను రెండోది. తండ్రి ఆర్థిక పరిస్థితి చదువుకు దూరం చేసింది. అమ్మమ్మ ఇంట్లో జీతం బత్తెం లేని పనిమనిషి జీవితం ప్రేమకూ, ఆప్యాయతకూ దూరం చేసింది. బంధువులు తలా ఒక చేయి వేసి చేసిన పెళ్లి తన జీవితానికి కొంత స్థిరత్వం తెస్తుందనుకుంటే... భర్త ఆకస్మిక మరణం ఆ ఆశనూ చెదరగొట్టింది.జరిగింది అర్థం చేసుకునేలోపే దీప పుట్టింది.అమ్మ సాయంతో భర్త ఉద్యోగం తనకు వచ్చింది.

ఆ రోజు నుంచి ఒకటే నిర్ణయ..తన జీవితం ఎలా ఉన్నా, తన కూతురి జీవితం మాత్రం అలా ఉండకూడదు.

దీపను బాగా చదివించింది. తనకు చేతనైనంతగా పెంచింది. దీపే తన లోకంగా బ్రతికింది.ఒకరోజు దీప సుధీర్‌తో ప్రేమ, పెళ్లి విషయం చెప్పింది.దీప తన జీవిత భాగస్వామిని ఎంచుకునేంత పరిణతి ఉన్న అమ్మాయి అని నమ్మి భారతమ్మ మనస్ఫూర్తిగా పెళ్లికి ఒప్పుకుంది.

సుధీర్‌ బాగా ఉన్న కుటుంబం. తండ్రి లేడు. ఒక్కడే కొడుకు. సుధీర్ తల్లి మాత్రం ఈ పెళ్లికి మొదట్లో అంతగా ఇష్టపడలేదు.పెళ్లయ్యాక సుధీర్ తల్లిని తమ దగ్గరికి వచ్చి ఉండమని అడిగాడట. కానీ కోడలిని మనస్ఫూర్తిగా అంగీకరించలేకో, ఇక్కడికి వస్తే పనులు చేయాల్సి వస్తుందనో... “నేను ఊర్లోనే ఉంటాను” అని చెప్పిందట.

భారతమ్మ మాత్రం అప్పటినుంచి దీపకు చేదోడువాదోడుగా నిలిచింది.కానుపు సమయంలోనూ, ఆ తర్వాత దీపకు ఏ అవసరం వచ్చినా తానే ముందుండేది.సుధీర్ తల్లి మాత్రం రాలేదు.

“మా అమ్మ గారాబంగా పెరిగింది. ఏ పనీ చేతకాదు. చాలా సుకుమారం” అని ప్రతిసారీ సుధీర్ తల్లిని వెనకేసుకొచ్చేవాడు.భారతమ్మకు ఆ మాటలు గుర్తొచ్చాయి.

అమ్మ అయితే సుకుమారం... ఆడపిల్ల తల్లి అయితే మాత్రం బాధ్యత.

ఇప్పుడు సుధీర్ తల్లి ఊర్లో ఉండలేని పరిస్థితి వచ్చింది.ఆమెను తమ ఇంట్లోకి తీసుకొస్తే, తన ఉనికి అడ్డుగా మారుతుందేమో!“ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవు” అన్న సామెత గుర్తొచ్చింది భారతమ్మకు.కానీ తన నిర్ణయం అప్పటికే తీసుకుంది.దీపకు తాను భారం కాకూడదు.

ఇక్కడికి వచ్చే ముందే ఊరిలోని శాంతిసేవాశ్రమంలో తన శేషజీవితం గడపాలని నిర్ణయించుకుంది. అక్కడి వాళ్లతో మాట్లాడి వసతి కూడా ఏర్పాటు చేసుకుంది.

అక్కడ అనాథలు ఉన్నారు. జీవితంలో ఎన్నో మలుపులు చూసిన మహిళలు ఉన్నారు. వయసు చివరి దశలో ఉన్నవాళ్లు ఉన్నారు.కొన్నిసార్లు అక్కడికి వెళ్లి వాళ్లతో మాట్లాడేది భారతమ్మ.అక్కడికి వెళ్లాలన్న తన నిర్ణయాన్ని దీపకు ఎలా చెప్పాలో మాత్రం తెలియలేదు.

కానీ ఈ రోజు సుధీర్ మాటలు విన్నాక.తాను తీసుకున్న నిర్ణయం తప్పు కాదని ఆమెకు మరింత గట్టిగా అనిపించింది.

మరుసటి రోజు తెల్లవారింది.దీప ఇంకా నిద్రలోనే ఉంది.భారతమ్మ మాత్రం లేచి బయటకు వచ్చింది.

మొక్కలకు నీళ్లు పోస్తూ ఉండగా లోపల నుంచి దీప, సుధీర్ మాటలు వినిపించాయి.

“రేపు మా అమ్మ వస్తే...”

“అదేంటి? నా అమ్మ కూడా ఇక్కడే ఉంటే బాగుంటుంది కదా!”

“అది కాదు సుధీర్...”

భారతమ్మ అక్కడినుంచి నెమ్మదిగా దూరంగా నడిచింది.

తన కూతురు ఇంట్లో తనకోసం స్థలం లేదని బాధపడటం లేదు.

తనకు కావలసింది కేవలం ఒక గది కాదు... తనకు తానుగా ఉండే ఒక జీవితం.

పెళ్లి అయ్యే వరకు తండ్రి సంరక్షణలో, పెళ్లయ్యాక భర్త మీద, చివరికి కొడుకు మీద ఆధారపడటమే తన తరం స్త్రీల జీవితమని అనుకుంది ఇన్నాళ్లూ.

కానీ కాలం మారింది.ఆడపిల్లలు చదువుకుంటున్నారు. ఉద్యోగాలు చేస్తున్నారు. తమ జీవితాలను తామే నిర్ణయించుకుంటున్నారు.అయితే తల్లుల జీవితాలు మాత్రం ఇంకా పిల్లల ఇళ్లలో ఖాళీగా ఉన్న గదుల మీదే ఆధారపడాలా?భారతమ్మ మనసులో చిన్న చిరునవ్వు వచ్చింది.

“కాదు... ఇక వద్దు.”తనకు ఎవరిపైనా కోపం లేదు.దీప మీద అసలే లేదు.తన జీవితానికి చివరి నిర్ణయం కూడా తానే తీసుకోవాలనుకుంది అంతే.

“అమ్మా...” ఉదయం దీప పిలుపుతో ఆలోచనల నుంచి బయటకు వచ్చింది భారతమ్మ.

“ఏమిటమ్మా?”“నిన్న రాత్రి సుధీర్ అన్న మాటలు... నువ్వు విన్నావా?”భారతమ్మ కాసేపు కూతురి ముఖం చూసింది.

“విన్నాను.”దీప కళ్లలో నీళ్లు తిరిగాయి.

“నువ్వు బాధపడకు అమ్మా...”భారతమ్మ కూతురి చెయ్యి పట్టుకుంది.

“నేను బాధపడటం లేదు తల్లీ. నాకు ఒక చోటు దొరికింది. అక్కడికి వెళ్తాను.”

“ఎక్కడికి?”

“శాంతిసేవాశ్రమానికి.”

దీప ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది.“అమ్మా!”

“భయపడకు. నిన్ను వదిలి వెళ్తున్నానని అనుకోకు. నీకు అవసరం వచ్చినప్పుడు నీ అమ్మగా ఉంటాను. కానీ నా మిగిలిన జీవితాన్ని కూడా నేను నా ఇష్టానుసారం గడపాలి కదా!”

దీప తల్లి చేతులను గట్టిగా పట్టుకుంది.ఆమె కళ్లలోని నీటిని చూసి భారతమ్మ తల నిమిరింది.

“నువ్వు నా కోసం చాలా చేశావమ్మా. ఇక నా గురించి నేను చూసుకుంటాను.”అంతే.

ఆమె గొంతులో ఎక్కడా బాధ లేదు.ఒక ప్రశాంతత మాత్రమే ఉంది.

బయట సూర్యుడు నెమ్మదిగా పైకి వస్తున్నాడు.లేత కిరణాలు ఇంటి గుమ్మం దాటి లోపలికి వస్తున్నాయి.

భారతమ్మ తన చిన్న సంచీ సర్దుకుంది.తలుపు దగ్గరికి వచ్చి ఒక్కసారి వెనక్కి చూసింది.

ఈ ఇంట్లో తాను గడిపిన రోజులు గుర్తొచ్చాయి.కూతురి బాల్యం.,ఆమె పెళ్లి,మనవరాలి పుట్టినరోజు...అన్నీ కళ్ల ముందు కదిలాయి.

ఆమె కళ్లలో నీళ్లు తిరిగాయి.కానీ పెదవుల మీద చిరునవ్వు.

తన జీవితాన్ని ఎవరో నిర్ణయించే రోజులు ముగిశాయి.

తన కోసం తానే ఎంచుకున్న దారిలో అడుగు వేసింది భారతమ్మ.బయటికి అడుగుపెట్టిన ఆమెకు ఆ ఉదయపు వెలుగు మరింత ప్రకాశంగా కనిపించింది.వెలుగు వైపు పయనించింది భారతమ్మ.

మరిన్ని కథలు

Chirigina Note book
చిరిగిన నోటుబుక్
- డా:సి.హెచ్.ప్రతాప్
Amma korika
అమ్మ కోరిక
- మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Teeyani bandhavyalu
తీయని బాంధవ్యాలు
- కామేశ్వర రావు రాపాక
Pisinikottu
Pisinikottu
- మోహనరావు మంత్రిప్రగడ
Vuchithalatho anardham
ఉచితాలతో అనర్ధం
- డా:సి.హెచ్.ప్రతాప్
Dayyaala Meda
దయ్యాల మేడ
- డా:సి.హెచ్.ప్రతాప్
Chivari chitram
చివరి చిత్రం
- డా:సి.హెచ్.ప్రతాప్