శక్తి - నారాయణి

shakthi

నిన్న పొద్దుట కూరలకోసమని మార్కెట్కి వెళ్ళాను, మార్కెట్ పక్కనే అర్పిత వాళ్ళ ఇల్లు, అర్పిత నా చిన్న నాటి స్నేహితురాలు. కలిసి చాలా రోజులు.. ఉహు నెలలే అయ్యింది, ఇంట్లో ఉందో లేదో అని ఒకసారి ఫోన్ చేశా. తను ఇంట్లోనే ఉన్నా రమ్మని చెప్పింది.

అర్పిత ఇంట్లోకి అడుగెడుతుంటేనే ఒక పర్ణశాలలోకి అడుగుపెడుతోన్న అనుభూతి, ఇంటి ముందు మెళికల ముగ్గు, చల్లటి చెట్ల గాలి, తను ఇల్లు సద్దే విధానం చూసి ఇంకా ముచ్చటేస్తుంది. ఇల్లు ఇప్పటికి ఎన్ని సార్లు చూసినా కొత్తగా అనిపిస్తుంది. విశ్మయముతో ఇల్లు చూస్తూ ఉన్నా, ఇంతలో "ఇంక ఇంట్లోకి వస్తావా" అన్న అర్పిత పిలుపుతో ఈ లోకములోకి వచ్చా.

కాసేపు పిచ్చాపాటి కబుర్లు అయ్యాక దసరా నాటి బొమ్మలకొలువు ఫొటోలు చూపించింది. అసలు తినకి అంత ఓపిక ఎక్కడిది, ఇంటి పని, వంట పని, తోట పని, ఇవి సరిఫొనట్టు పేయింటింగ్, అల్లికలు, బొమ్మల కొలువుకి బొమ్మల్ని తయ్యారు చేయడం, ఒక గజేంద్రమోహక్షము, గోపికలు కృష్ణుని గట్టాలు తీర్చిదిద్దిన విధానానికి మెచ్చుకోకుండా ఉండలేకపోయా. మెచ్చుకున్నా, పొగిడినా అది ఒక పెద్దపనేనా అని సున్నితంగా తోసిపారేస్తుంది తను.

"దసరా బాగా జరుపుకున్నట్టున్నావే " అని అడిగా...

ఒక చిరునవ్వు నవ్వుతూ... " నవరాత్రులలో అమ్మవారిని రోజుకొక అలంకారము చేసి, పూజ చేశాను. దగ్గరలోనే అమ్మవారి గుడికి తీసుకెళ్ళమని ఆయనతో నవరాత్రులు మొదలవ్వక ముందే చెప్పాను. తీరా నవరాత్రి మొదలయిన రోజే ఇంటికి చుట్టాలు వచ్చారు. మా ఆడపడుచు, పిల్లలు. ఆడపడుచుకి ఈ ఊరిలో ఏదో ఆఫీస్ పని ఉందని పిల్లలతో సహా వచ్చి పిల్లలని నాకు వదిలి తాను ఆఫీస్ పని లో బిజీ అయ్యింది. మొదటి రోజంతా ఆడపడుచు పిల్లలతోటే సరిపోయింది. ఇక రెండో రోజూ ఆడపడుచు తరఫు చుట్టాలు ఆవిడని పిల్లల్ని చూడటానికి వచ్చారు. ఆ రోజు వాళ్ళకి వంట, టీలు, టిఫినీలతో సరిపోయింది.

ఇంట్లో పిల్లలు, చుట్టాలు పని తెమలడమే కష్టంగా ఉంటే మూడో రోజు సాయంత్రము శ్రీవారు వీణ కచేరి చేయమని పురమాయింపు, అందరి ముందు అడిగారు ఇంక కాదనలేక ఒక కీర్తన వాయించాను. వచ్చిన వాళ్ళు తెగ ముచ్చట పడిపోయారు. ఇంక మూడో రోజు కూడా అమ్మవారు దర్శనానికి తీసుకెళ్ళలేదు.

ఆ మరునాడు ఆడపడుచు పిల్లలు స్కూల్లో ఇచ్చిన హోం వర్కులు బయటకు తీసి నా దగ్గరకు వచ్చారు. ఇంక ఆ రోజు వాళ్ల చేత హోం వర్కులు చేయించడములో బిజీ అయ్యా. వాళ్ళకిచ్చిన ప్రాజెక్టులు చేయించడములో సాయము చేయడముతో సమయం ఎలా గడచిందో తెలియకుండా సాయంత్రము ఏడయ్యిపోయింది, ఈయన సాయంత్రము లేట్ గా రావడంతో ఆ రోజు గుడికి వెళ్ళలేకపోయాము.

ఇలా నవరాత్రులు హడావిడిగా గడచిపోతూ వచ్చాయి. ఇంక నవమి రోజు పిల్లల్ని, చుట్టాలని తయ్యారు చేసి తీరా గుడికి వెళ్దామనుకుంటే మా పనిమనిషి రత్తాలు ఏడుస్తూ మొహనికి రక్తం కారుతూ, చంటి పిల్లని కౌగిలించుకొని రొప్పుతూ, ఏడుస్తూ వచ్చింది. దాని మొగుడు మూడోసారి కూడా దానికి ఆడపిల్ల పుట్టిందని ఆ చంటి పిల్లని ఎవరికో అమ్మడానికి తీసుకెళ్తున్నాడని, అడ్డం వచ్చిన రత్తాలుని కొట్టాడని చెప్పింది. అంతే ఎక్కడ లేని కోపం వచ్చింది. మా కజిన్ పోలీస్ డిపార్ట్మెంట్లో పని చేస్తొన్న వాడిని వెంటనే పిలిపించి... రత్తాలు ని తీసుకొని ఇంటికి వెళ్ళి, రత్తాలిని కొట్టినా, పిల్లలని అమ్మినా పోలీస్ స్టేషన్ లో పెట్టిస్తానని కాస్త గడ్డి పెట్టి వచ్చాము. అసలు ఆడపిల్లంటే అంత అలుసా? అని ఆ రోజంతా మనసు అల్లకల్లోలం అయ్యింది. ఆ గొడవ అయ్యేటప్పటికి రాత్రి 10 అయ్యింది. ఇంక గుడికి వెళ్ళాలి అన్న ఆలోచనే మరచిపోయాము.

ఇంక దసరా రానే వచ్చింది. ఇంటి నిండా జనాలతో పండగ వాతావరణము భలేగా అనిపించింది. సాయంత్రము బొమ్మలకొలువుతో పేరంటాల్లతో చాలా బిజీ అయ్యాము. సాయంత్రము ట్రైన్ కి వచ్చిన చుట్టాలందరు ఎవరిల్లకు వారు వెళ్ళిపోయారు. అప్పుడేనా కనీసం గుడికి తీసుకెళ్తారేమో అని ఆయన్ను అడిగితే..

"ఇప్పుడు గుడికి ఎందుకోయ్" అని అడిగారు.

చాలా ఉక్రోషం వచ్చేసింది.

"నవరాత్రులలో ఒక్క రోజు కూడా అమ్మవారిని దర్శించుకోలేదు, ఈ రోజు చివరి రోజు, ఈ రోజు కూడా తీసుకేళ్ళరా?" అని నిలదీసా...

"నువ్వు చూడలేదేమో కానీ, నేను మాత్రం రోజు దర్శించుకుంటూనే ఉన్నాగా" అని అన్నారు..

"అంటే నన్ను తీసుకెళ్ళకుండా మీరొక్కరే వెళ్ళొచ్చేశారా?" అని అడిగా...

అందుకు ఆయన చిద్విలాసంగా... "నవరాత్రులలో మొదటి రోజు ఇంటికి చుట్టాలొచ్చినప్పుడు.. వాళ్ళని ఆప్యాయతగా పలకరించి అన్నము పెట్టేటప్పుడు నీలో అన్నపూర్ణాదేవిని చూశాను, పిల్లలతో ఆడుతూ పాడుతూ వాళ్ళల్లో కలిసిపోయినప్పుడు బాల త్రిపుర సుందరిని చూశా, వాళ్లకి చదువు చెప్తోనప్పుడు ఒక గాయత్రిని చూశా, వీణపాణిగా ఉన్న నీలో సరస్వతినీ చూశా, కోపం వచ్చినప్పుడు నీలో ఒక దుర్గ, మహిషాసురమర్ధినినీ చూశా... ఇంక రోజు సౌందర్యలహరిని చూస్తూనే ఉన్నా..." అంటూ నవ్వారు...

ఈ విషయము చెప్తోన్న అర్పిత కూడా సిగ్గుతో నవ్వింది. ఇలా ఒక పొగడ్త విసిరేసి మొత్తానికి నన్ను నవరాత్రులలో గుడికి మాత్రం తీసుకేళ్ళలేదు ఆయన అని చెప్పింది.

"నిజమే కదా అర్పితా, స్త్రీ ఒక శక్తిస్వరూపిణి... కొందరికి సౌందర్యలహరి, కొందరికి మహిషాసురమర్ధిని " ని అనేసి అలా ఇంటి దారి పట్టాను.

***

మరిన్ని కథలు

Chandruniko noolu pogu
చంద్రునికో నూలు పోగు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Anaadha atidhyam
అనాథ అతిథ్యం
- - బోగా పురుషోత్తం
Vibheeshana Sharanu
విభిషణుని శరణు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి
Pramod Pesarattu
ప్రమోద్-పెసరట్టు
- వీరేశ్వర రావు మూల