హ్యాపీ డేస్ - నారంశెట్టి ఉమామహేశ్వరరావు

Happy Days Telugu Story

తన చేతిలోకి వచ్చిన ఏ వస్తువునైనా జాగ్రత్తగా వాడడం బాబూరావు కి అలవాటు. పదేళ్ళ క్రితం పెళ్ళిలో అత్తవారు ఇచ్చిన వాచీని ఈరోజుకీ కొత్తగా ఉంచాడంటే అతడి వాడకం ఎలాంటిదో తెలుస్తుంది. అయిదేళ్ళ క్రితం కొన్న బైకూ, ఆఫీసు వాళ్ళిచ్చిన ల్యాప్ టాపూ… ఇవే కావు…. ఏ వస్తువైనా … ఎన్నాళ్ళ తర్వాతైనా…. కొత్తదిగానే కనిపిస్తుంది అతడి దగ్గర.

అలాంటిది ఈ మధ్యనే కొన్న సామ్ సంగ్ గెలాక్సీ మొబైల్ ఫోన్ గురించి ప్రత్యేకంగా చెప్పాలా? దానిమీదున్న ప్లాస్టిక్ తొడుగుకూడ తియ్యకుండా, గీతలు పడకుండా నీటుగా వాడుతున్నాడు.

“డాడీ! కొత్త గేము వచ్చిందట. ఒక్కసారి ఇవ్వు డాడీ. ప్లీజ్ డాడి. గేము ఆడి ఇచ్చేస్తాను” కిరణ్ బ్రతిమలాడాడు.

”కావాలంటే వీడియో గేమ్సు షాపులో కెళ్ళి ఆడుకో. ఎంత కావాలో చెప్పు. డబ్బులిస్తాను” అన్నాడు తప్ప మొబైల్ ఇవ్వలేదు బాబూరావు. కిరణ్ అంటే బాబూరావు ఏకైక సంతానం.

“‘ ఒక్కసారి ఫోనిస్తే అమ్మకి కాల్ చేస్తాను. ఇవ్వండి” గోముగా అడిగిన శ్రీమతికి మతి పోగెట్టేలా చేసాడు.

“నా డార్లింగువి కదూ. మొబైల్ మాత్రం అడక్కు. ల్యాండ్ లైన్ నుండి చేసుకో!చాలా కాల్సు మిగిలి పోయాయి. ప్లీజ్’ సున్నితంగా ముద్దు ముద్దు మాటలతో చెప్పాడు తప్ప సెల్లివ్వలేదు. ఎవరిచేతిలోనైనా పొరపాటున చేయి జారిపడితే గీతలు పడి మొబైల్ అందం పాడవుతుందని అతగాడి భయం.

‘బాబూరావ్ ఒక్కసారి ఫోనివ్వు. నాది బ్యాటరీ డౌనయింది. అర్జెంట్ కాల్ చెయ్యాలి’ ఆఫీసులో పక్క సీటు పరశురామ్ అడిగాడు.

‘ఇదిగో రూపాయి. కోయిన్ బాక్సు దగ్గరికెళ్ళి చేసుకో. మొబైలు మాత్రం అడక్కు. సారీ” మారు ఆలోచించకుండా చెప్పాడు బాబూరావు. అంత జాగ్రత్తగా కాపాడుకొస్తున్నాడు మొబైల్ ని.

అర్జెంటుగా హెడ్డాఫీసుకి వెళ్ళి పని చూడమని ఆఫీసు వారు పంపిస్తే హైదరాబాదు వెళ్ళాడు బాబూరావు. అబిడ్స్ దగ్గర్లోని అతిథి రెసిడెన్సీ లో దిగాడు. నాంపల్లికి వెళ్ళే సిటీ బస్సెక్కినప్పుడు చేతివాటం చూపించాడు జేబు దొంగ. అతి భద్రంగా దాచుకున్న మొబైల్ పోయేసరికి బాబూరావు అనుభవించిన బాధ చెప్పలేము.

‘అప్పుడే పుట్టిన పిల్లాడిని చూసినంత మురిపెంగా ఎంతో అపురూపంగా చూసుకున్న మొబైలుని ఇప్పుడెవడో దొంగిలించాడు. దాన్ని కొట్టేసినవాడు తనలాగా వాడతాడా? ఖచ్చితంగా వాడుకోడు. సెకండ్ హేండు ఫోన్ కింద అమ్మేస్తాడు తప్ప సొంతానికి వాడుకోడు.” అనుకున్నాడు బాధగా. వెంటనే మరొక మొబైల్ కొన్నాడు. అది కూడ ఖరీదైనదే. ఇంకా కొత్తమోడల్. ఈసారి మరెవ్వరూ దొంగిలించకుండా జాగ్రత్త పడడం ప్రారంభించాడు.

‘డాడీ అర్జెంటుగా నోట్ బుక్స్ కొనాలి. మార్కెట్ కి వెళ్దాము. త్వరగా రెడీ అవ్వండి’ బాబూరావు ఆఫీసు నుండి ఇంట్లో అడుగుపెట్టగానే చెప్పాడు కిరణ్. వాడిప్పుడు టెంత్ చదువుతున్నాడు. ఏ విషయమైనా తొందరగా గ్రహించేస్తాడు. కొడుకు బాగా చదువుతాడని వాడికి కావాలసినదాన్ని ఆలస్యం చేయకుండా అందిస్తాడు బాబూరావు.

తొందరగా బాత్రూము కెళ్ళొచ్చి రెడీ అయ్యాడు బాబూరావు. బైక్ వెనకాల కిరణ్ ని కూర్చోబెట్టుకుని బండి స్టార్ట్ చేసాడు బాబూరావు. అక్కడి నుండి మర్కెట్ నాలుగు కిలోమీటర్ల దూరం. తిరిగి ఇంటికి వేగం రావాలన్న ఉద్దేశ్యంలో వేగంగా డ్రైవు చేస్తున్నాడు బైకు. మధ్య దారిలో ఉండగా బాబూరావు సెల్ రింగయింది. హెల్మెట్ లేకుండా బాబూరావు డ్రైవింగు చెయ్యడు. హెల్మెట్ తీసి దారిలో మాట్లాడడం ఎందుకనుకున్నాడు బాబూరావు. జేబులోని మొబైలుని కుడిచేత్తో తీసి కిరణ్ చేతిలో పెట్టేసి ‘కాల్ ఆన్సర్ చేసి డ్రైవింగులో ఉన్నానని చెప్పు. ఫోను నీ జేబులో ఉంచు. బండి దిగాక మాట్లాడతానులే’ అన్నాడు బాబూరావు. బాబూరావు చెప్పినట్టే సెల్లుని షర్టు మీద జేబులో పెట్టాడు.

వీళ్ళు మాట్లాడే దృష్టిలో ఉండగా ఎదురుగా రోడ్డు మీద స్పీడ్ బ్రేకరు వచ్చింది. ఆటోమేటిగ్గా బ్రేకుపై కాలేసి నొక్కాడు బాబూరావు. సడన్ బ్రేకు పడింది. అయినా స్లో కాకుండా స్పీడ్ బ్రేకర్ మీదకి ఎక్కి ముందుకి కదిలింది బండి. దాంతో పెద్దకుదుపు కుదిపింది. ఆ కుదుపుకి వెనకున్న కిరణ్ ముందుకొచ్చి బాబూరావు వీపుకి గట్టిగా గుద్దుకున్నాడు. అప్పుడు కిరణ్ షర్టు మీద జేబులోని సెల్ ఎగిరి రోడ్ మీద పడింది. పడిన ప్లేసులో నుండి రోడ్డుని మీద రాపిడి చేసుకుంటు చాలా దూరం జరిగింది.

‘డాడీ మొబైల్ కింద పడింది’ గట్టిగా అరిచాడు కిరణ్.

బైకు పూర్తిగా స్లోచేసి రోడ్డు ప్రక్కన ఆపాడు బాబూరావు. బండి దిగి వెళ్ళి సెల్ల్ తెచ్చాడు కిరణ్. ఇంకా అదృష్టమేమంటే మరే వాహనం దాన్ని తొక్కుకుంటూ వెళ్ళలేదు. అయితే మొబైలు నిండా ధూళి, ఇసుక అంటుకున్నాయి. చేతిలోకి తీసుకుని జాగ్రత్తగా కర్చీఫ్ తో శుభ్రం చేశాడు బాబూరావు. స్క్రీన్ అద్దం పగిలింది. చాలా స్క్రాచెస్ పడ్డాయి.

ఓరకంటితో డాడీ చేతిలోని మొబైల్ చూసిన కిరణ్ గుండె వేగం పెరిగింది. డిసిప్లెయిన్ కి ప్రతిరూపం బాబూరావని బాగా తెలుసు వాడికి. మంచిగా ఉన్నప్పుడు ఎంత ప్రేమ చూపుతాడో కోపమొచ్చిన పని చేస్తే మటుకు తాటతీస్తాడు. అందుకే సింహాన్ని చూసిన లేడిపిల్లలా వణికిపోయాడు. బండి ముందర రాడ్ లాగి దాంతో కొట్టి చంపేసి పెద్దగొయ్యి తీసి కప్పేస్తాడేమో అన్నంత భయపడ్డాడు కిరణ్.

‘సారీ డాడి. నా వల్లే జరిగింది.’ అన్నాడు కళ్ళ నీరు కక్కుకుంటూ కిరణ్. కిరణ్ ఊహించినట్టు ఏమీ జరగలేదక్కడ. కిరణుని ఏమీ అన్లేదు. అసలు కోపమే చూపించలేదు. ‘ఫర్వాలేదు. వెళ్దాము పద’ సింపుల్ గా చెప్పి బైకు స్టార్ట్ చేసాడు బాబూరావు.

‘డాడీ! మీ వస్తువులు ముట్టుకుంటేనే ఒప్పుకోరు. అలాంటిది మీ మొబైల్ పాడు చేసినందుకు కోపం రాలేదా?’ అడిగాడు కిరణ్. ఆ టైములో అంత ధైర్యం ఎలా వచ్చిందో కిరణ్ కి అర్ధం కాలేదు. బహుశా తండ్రి శాంతం చూసి కాబోలు.

‘ఎందుకు రాలేదూ. చాలా కోపం వచ్చింది.” చెప్పాడు బాబూరావు కూల్ గానే.

‘మరంత శాంతంగా ఉన్నారేం?” మళ్ళీ అడిగాడు కిరణ్.

“ఇప్పుడు కాదు నాన్నా. గతసారి మొబైల్ నా దగ్గర పోయినప్పుడు” చెప్పాడు బాబూరావు.

“ఎవరి మీద. దొంగ మీదా?” మళ్ళీ అడిగాడు కిరణ్.

“నామీదే!” చెప్పాడు బాబూరావు.

‘మీమీద మీకు కోపమా? మీరేం తప్పు చేసారు డాడీ ? ప్రాణం లేని వస్తువులని కూడ బాగా చూసుకుంటారు. మమ్మల్ని ఇంకా బాగా చూసుకుంటారు’ అమాయకంగా అడిగాడు కిరణ్.

‘మొదటిసారి కాస్ట్లీ మొబైల్ కొన్నానని అతిజాగ్రత్తకి పోయి సరదాకి కూడ మిమ్మల్ని ముట్టుకోనివ్వలేదు. దాన్నెవడో కొట్టేసాడు. మీకివ్వకుండా వాడిన మొబైలుని జేబుదొంగ కొట్టెయ్యకుండా అడ్డుకోలేక పోయాను. వస్తువులపై మోజు పెంచుకోకూడదని అప్పుడే తెలిసింది. అప్పుడు మాత్రం నా మీద నాకే కోపం వచ్చింది. మనుషుల ప్రాణాలకే విలువ లేని రోజుల్లో వస్తువు మీద అతిప్రేమ మంచిది కాదని తెలుసుకున్నాను. అందుకే దీని స్క్రీను పగిలినా, గీతలు పడినా కోపం రాలేదు” బాబూరావు చెప్పాడు.

క్రిష్ణుడి గీతోపదేశంతో అర్జునుడికి జ్ఞానోదయమైనట్లు దొంగగారి చాకచక్య దొంగతనం వల్ల బాబూరావుకి జ్ఞానోదయం అయిందని కిరణ్ అనుకున్నాడు. ఇంటికి వెళ్ళి మమ్మీకి చెప్పాడు గొప్పగా. బాబూరావులో మార్పుకి ఇల్లంతా హ్యాపీసే హ్యాపీస్. ఇక ముందన్నీ హ్యాపీడేస్ వాళ్ళకి.

మరిన్ని కథలు

Antataa neeve
అంతటా నీవే
- షామీరు జానకీ దేవి
Ahakaram techhina sapam
అహంకారం తెచ్చిన శాపం
- గొట్టాపు శ్రీనివాస రావు
Donga chetiki taalaalu
దొంగ చేతికి తాళాలు
- కొల్లాబత్తుల సూర్య కుమార్
Aa raatri
ఆ రాత్రి
- జాహ్నవి ప్రియా
Aparichitudu
అపరిచితుడు
- డి.కె.చదువుల బాబు
Ee tappevaridi ?
ఈ తప్పెవరిది ?
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Varaahavataram
వరాహావతారం
- చెన్నూరి సుదర్శన్
Avasaraaniki
అవసరానికి..
- Dr. Lakshmi Raghava