అతిథిసత్కారం - ఎలక్ట్రాన్

atidhi satkaram

రామారావింటికి ఆరోజు ఉదయం అనుకోకుండా బంధువులొచ్చారు. దగ్గరా, దూరమా అని కాదు కాని చాలా ముఖ్యమైన బంధువులు. కూతురి యిద్దరు అడపడుచులూ వారి భర్తలతో, పిల్లలతోసహా ముందు సమాచారం లేకుండా రావడంతో దంపతులిద్దరూ కంగారూ పడిపోయారు. రామారావు పై అధికారికి ఫోన్లో చెప్పి సెలవుతీసుకొన్నాదు. దగ్గరలోనే ఉన్న రైతుబజారుకి పోయి దండిగా కూరలూ, కిరాణా దుకాణానికి పోయి దండిగా సరుకులూ తీసుకొన్నాడు. వారు రాగానే కాఫీలందించి, స్నానాలూ అవీ ముగిసిన తర్వాత, పదింటికి వేడివేడిగా, పుష్కలంగా జీడిపప్పు దట్టించిన కమ్మటి ఉప్మా అందించింది. కూరలంటే అనుకోవచ్చుకాని, పదోతారీఖుకే యింట్లో సరుకులు లేకపోవడం వారికి వింత అనిపించి కూతురి అదపడుచులు చాటుగా బుగ్గలు నొక్కుకొన్నారు.

ఆ తర్వాత రామారావు వారిని తన కారులో ఊరి పొలిమేరల్లో ఉన్న భావనారాయణస్వామి ఆలయానికి తీసుకు వెళ్ళాడు. అక్కడికి మరో పది కిలోమీటర్ల దూరంలో ఉన్న దొంగల గుహల్ని చూపించి, గంధకం ఊటజలాల్లో స్నానాలు చేయించి తిరిగి వచ్చేసరికి ఒంటిగంట దాటింది. రామారావు భార్య రెండు కూరలు, రెండు పచ్చళ్లు,పప్పు, సాంబారు, గడ్డపెరుగులతో భోజనం తయారుచేసి బల్ల మీద అందంగా అమర్చింది. ఆడపడుచుల భర్తలు ఎంతగా బలవంత పెట్టినా రామారావు దంపతులిద్దరూ వారికి వడ్డించడంలోనే ములిగిపోయారు తప్ప, కలిసి భోజనం చెయ్య లేదు.భుక్తాయాసంతో వారు కునుకులు తీసే సమయంలో రామారావు దంపతులు వంట గదిలోనే తమ భోజనం ముగించారు.యిది చిన్నాడపడుచు గమనించి, అక్క చెవిలో ఊదింది.
సాయంత్రం రామారావు వారికి మరికొన్ని ప్రదేశాలని చూపించి చీకటి పడినతర్వాత యింటికి తీసుకు వచ్చాడు. ఏదైనా హోటల్లో అందరూ కలిసి భోజనం చేద్దామన్నారు అదపడుచుల భర్తలు.

‘వంట చేసేశాను. భోజనం సిద్ధంగా ఉంది. హోటలెందుకు?’ అంది రామారావు భార్య. రాత్రి వంటకూడ భారీగానే ఉంది. రామారావు దంపతులిద్దరూ మధ్యాహ్నంలాగే వారితో కలిసి భోజనం చేయ్యలేదు. హాయిగా మాటలు చెబ్తూ, వడ్డన చేస్తూ కాలం గడిపేశారు. ‘మాతో కలిసి భోజనం చెయ్యకుండా, మీరు అతిగా అతిథి మర్యాదలు చేసి మమ్మల్ని యిబ్బంది పెడ్తున్నారు!’ అంది కూతురి పెద్దాడపడుచు లీలగా కాస్త వ్యంగ్యాన్ని జోడిస్తూ. రామారావు దంపతులు చిరునవ్వు నవ్వి మౌనంగా ఉండిపోయారే తప్ప ఏ సమాధానమూ యివ్వలేదు. వారందరికీ డాబామీద ఆరుబయట మడత మంచాలు వేసి పడకలు ఏర్పాటు చేశాడు.‘వారి కూతుర్ని మనమెక్కడ తక్కువగా చూస్తామనేనేమో, అతి చేస్తున్నట్టుగా ఉంది!’అని అక్క చెల్లెళిద్దరూ గుసగుసలాదుకొన్నారు.

పెద్దాడపడుచు భర్తకి రాత్రి భోజనం చేసిన తర్వాత, ఓ సిగరెట్ కాలుస్తూ కాస్త దూరం నడవడం అలవాటు. రామరావూ, అతనూ కలిసి కాస్త దూరంలో ఉన్న కిళ్లీ దుకాణం వైపు దారితీశారు.’బాబాయ్ గారూ, రేపు మనందరము బయట భోజనం చేద్దాం. పిన్నమ్మగారికి శ్రమ యిచ్చేస్తున్నాం!’అన్నాడతను.

‘మీ మొహమాటాన్నీ, యిబ్బందినీ గమనించక కాదు. మాకూ అందరితో కలిసి సరదాగా భోజనం చేయాలనే ఉంటుంది. కానీ, మాకిద్దరికీ అధికస్థాయిలో మధుమేహవ్యాధి ఉంది. మేము మెతుకులు కొరుకుతూ తిన్నా, లేదా దంపుడుబియ్యపు పత్యం భోజనం నలుగురిమధ్యా పెట్టుకొని తిన్నా, పక్కన తినేవాళ్ళకి యిబ్బంది కదా? పత్యం చేసేవాడికి పదిమందిలో భోజనం పెడ్తే అంతకు మించిన శిక్ష ఉండదని లోకోక్తి ఉండనే ఉంది! అందుకనే విందుభోజనాలకి బఫే ఉంటే తప్ప మేము వెళ్ళేది లేదు. మా ఆహార నియమాల్ని సడలించుకోలేక, అప్పుడప్పుడూ యిలాంటి పరిస్థితుల్లో, అతిథి సత్కారానికి భంగం కాకుండా మసులుకుంటూనే, చిరునవ్వులను జోడించి వడ్డన చేయడం అలవాటైపోయింది. అతిథులు భోజనం చేసిన తర్వాతే ఆతిథ్యమిచ్చేవారు భోజనం చెయ్యాలన్నది ప్రాచీన సంప్రదాయమేకదా?’ అన్నాడు రామారావు.‘ మీ నియమపాలన మెచ్చుకోదగ్గది బాబాయ్ గారూ! పదండి వెనక్కి పోదాం. ఈ క్షణం నుండీ నా ఈ సిగరెట్ కాల్చే అలవాటుకి స్వస్తి!’ అన్నాడతను.

మరిన్ని కథలు

Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ
Chandruniko noolu pogu
చంద్రునికో నూలు పోగు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Anaadha atidhyam
అనాథ అతిథ్యం
- - బోగా పురుషోత్తం
Vibheeshana Sharanu
విభిషణుని శరణు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి