సౌందర్యం - కొయిలాడ రామ్మోహన్ రావు

soundaryam

సౌందర్యక్క వచ్చినదన్న మాట వినబడగానే, చేస్తున్న హోమ్ వర్క్ ఆపేసి, ఉత్సాహంగా లేచి నిలబడ్డాడు సందీప్. విస్తుపోతూ నిరాశగా సందీప్ వంక చూసాడు వెంకట్. వాళ్లిద్దరూ ఏడవ తరగతి చదువుతున్నారు. వెంకట్ లెక్కల్లో వీక్. సందీప్ దగ్గర కూర్చుని లెక్కల హోమ్ వర్క్ పూర్తిచేద్దామని అనుకుంటున్న సమయంలో సందీప్ అతన్నిలా అర్ధాతరంగా వదిలేసివెళ్లిపోవడం చాలా బాధించింది. హోమ్ వర్క్ చెయ్యకపోతే లెక్కల టీచర్ చితక బాదడం ఖాయం. అది గుర్తు తెచ్చుకొని భయంతో వణికి పోతూ," ఒరేయ్ సందీప్ లెక్కల హోమ్ వర్క్ అయ్యాక వెళ్ళారా, బాబ్బాబు" అంటూ బతిమాలాడు. " సారీరా. వెళ్ళాలి ఎంత? గంటలో వచ్చేస్తాను" అంటూ బయల్దేరబోతుంటే "వీడు ఇప్పట్లో రాడు. ఏ రాత్రికో తిరిగి వస్తాడు. వేరే దారి చూసుకోవాలి' అనుకుంటూ నిరాశగా అక్కడినుంచి కదిలాడు.

సందీప్ కి వాళ్ళ నాన్న పుణ్యమా అని, అన్న, తమ్ముడు, చెల్లి ఉన్నారు. దేవుడిచ్చిన సంతానాన్ని వద్దనడం మహాపాపం అంటూ నలుగురు పిల్లలకు జన్మనిచ్చేసాడు. ఇంట్లో నలుగురు పిల్లలున్నా, సందీప్ కి అక్కలేని కొరత స్పష్టంగా కనిపించింది. అన్న, చెల్లి,తమ్ముడు అందరూ ఉన్నారు, అక్కే లేదు అంటూ వాపోతుంటాడు. ‘నా ఫ్రెండ్స్ అందరికి అక్కలున్నారు. వాళ్లు తమ్ముళ్లను ఎంత బాగా చూసుకుంటారో!....నాక్కూడా అక్క ఉంటే ఎంతబాగుంటుందో’ ...అనుకోవడం ఎనిమిదో ఏట మొదలయింది. ఆ సమయంలో వరుసకు అక్క అయిన సౌందర్య వాళ్ళ ఊరికి రావడం జరిగింది. ఆమె సందీప్ కి తండ్రి వైపు బంధువు. ఏదో ఫంక్షన్ కొచ్చి, వాళ్ళింట్లో రెఒడ్రోజులుంది. ఆ రెండ్రోజుల్లో సందీప్ ఆమెకు చాలా దగ్గరయ్యాడు. ' అక్క ఎంత అందంగా ఉంటుంది!' అని తరచు అనుకుంటూ ఉండేవాడు.

* * * * * * *

'ఒరేయ్ కొంచెం టిఫిన్ తిని వెళ్ళారా' అంటూ అరుస్తున్న తల్లి మాటలు పట్టించుకోకుండా, సౌందర్య దగ్గరికి పరిగెత్తాడు. అతను వెళ్లే సరికి ఆమె స్నేహితురాళ్లను సాగనంపుతూ, " ఓకే.. ఫస్ట్ షో సినిమా కెళదాం. ఇదిగో మా తమ్ముడొచ్చాడు. మనకు టిక్కట్లు తెచ్చిపెడతాడు "అంటుంటే ఆనందంగా బుర్ర ఊపాడు.' అక్క చెపితే ఆకాశాన్నయినా దించేస్తాను' అనుకుంటూ. సిటీ నుంచి తెచ్చిన పెన్ అందిస్తూ, వాడి చదువు గురించి అడిగింది. సమాధానం చెప్పి, దివినుంచి దిగి వచ్చిన దేవ కన్యలా ఉన్న సౌందర్యను ఆరాధనగా చూస్తూ,"అక్కా నువ్వు కాస్త ముందుగా పుట్టి ఉంటే, నీ కూతుర్ని నేను పెళ్లి చేసుకునే వాడిని కదా?" అంటే సౌందర్య నవ్వుతూ" ఇంకా నయం, కాస్త లేటుగా పుడితే, నన్నే పెళ్లిచేసుకుంటావనే వాడివేమో!' అనగానే ఆ సందీప్ మొహం మాడిపోయింది. " అలా ఎలా అనుకున్నావక్కా? నిన్ను అమ్మలాగే ఊహించుకుంటానెప్పుడూ" అన్నాడు బాధగా." సారీరా తమ్ముడు. ఏదో జోక్ చేసాను" అని అపాలజి చెప్పినా వాడి మూడ్ మారలేదు. సందీప్ ని మాటల్లో పెట్టి, వాడి మూడ్ మార్చింది.

సందీప్, సౌందర్య కోసం ప్రాణాలయినా ఇచ్చేస్తాడు. ఆమె అంటే అంత ఇష్టం వాడికి. ఆమె ఎప్పుడు వాళ్ళ ఊరికి వస్తుందా? అని ఎదురుచూస్తూ ఉంటాడు. ఆమెకి ఇష్టమైన పనులన్నీ చేయడానికి ఎప్పుడూ ముందుంటాడు. అక్కకు జామకాయలంటే చాలా ఇష్టం అని, చిటారు కొమ్మలదాకా ఎక్కి, కాయలుకోసే సాహసం చేస్తాడు. ఆమెకు పూతరేకులంటే ఇష్టమని, పన్నెండు కిలోమీటర్ల దూరాన్ని లెక్కచేయకుండా సైకిల్ మీద వెళ్లి తెస్తాడు. ఆమె ఇష్టపడే అందమైన ఎర్ర కలవపూలను కోయడానికి కోయడానికెళ్లి చెరువులో మునిగిపోయి ప్రమాదంలో ఇరుక్కుపోతే ఎవరో కాపాడారు. సౌందర్య కోసం ఇవన్నీ చేయడం సందీప్ తల్లి లక్ష్మి కి ఇష్టంలేదు. పిచ్చిప్రేమతో వాడేదైనా ప్రమాదంలో ఇరుక్కుంటాడేమోనన్న భయం ఒక కారణం. సౌందర్య కుటుంబమన్నా, వారి మనస్తత్వాలన్నా ఆమెకు నచ్చకపోవడం మరో కారణం. ఎంత కంట్రోల్ చేసినా వాడిని, సౌందర్య నుంచి దూరం చేయలేకపోయింది. సందీప్ తండ్రి ప్రకాశానికి ఆమె బంధువు కావడం వల్ల అతను పెద్దగా పట్టించుకోలేదు.

" పోన్లేవే ..ఆ అమ్మాయి వచ్చేది ఏడాదికి రెండు మూడు సార్లు. దానికే ఎందుకలా గింజుకుంటావు"అని భార్యను కసిరేవాడు.
సందీప్ టెన్త్ క్లాస్ కి వచ్చినా, అక్కమీద ప్రేమ చెక్కు చెదరలేదు. సౌందర్యకు పెళ్లి ఫిక్స్ అయిందని తెలియగానే ఆనందంతో గంతులేశాడు. పెళ్లి వివరాలు తెలిసాక, అతని ఉత్సాహమంతా నీరుగారిపోయింది. " ఎందుకక్కా ఈ పెళ్లికి ఒప్పుకున్నావు? రెండో పెళ్ళివాడిని చేసుకోవాల్సిన కర్మేంటి?" అని బాధగా అన్నాడు. " “ఆయన పేరు భానోజి.ఆయన నాకు, మా అమ్మా నాన్నకు చాలా కాలంగా తెలుసు. చాలా మంచి వ్యక్తి . భార్యను ఎంతో ప్రేమగా చూసుకునే వారు. ఆమె కేన్సర్ వచ్చి చనిపోతే, రెండో పెళ్లి చేసుకోనని మొండికేస్తే, కూతురు నీలిమ కోసమైనా పెళ్లి చేసుకోమని బంధువులంతా పోరితే ఆఖరికి ఒప్పుకున్నారు. అయితే ఆ ఇంట్లోకి ఎలాంటి మనిషి వస్తుందో, నీలిమను ఎలా చూస్తుందోనని నేను , నాన్న గాభరా పడ్డాం. ఎంతో ఆలోచించిన మీదట, నేనే ఆ ఇంట్లో అడుగు పెట్టాలనే నిర్ణయం తీసుకున్నాను. అమ్మా,నాన్నా వ్యతిరేకిస్తే, కష్టం మీద వాళ్ళను ఒప్పించాను. నేను చేసింది తప్పంటావురా?" అని అడిగేసారికి, లేదన్నన్నట్లు అడ్డంగా తలూపాడు. ఆమె ఎంతో ఎత్తుకు ఎదిగిపోయినట్లనిపించింది. ఇప్పుడామె అందం రెట్టి౦పయినట్లనిపించింది.

***********

సౌందర్యకు భానోజితో పెళ్లయిపోయింది. పెళ్లయిన కొన్నాళ్ళకు, ఆమె కూడా బిజినెస్సులో పాలుపంచుకోవడం మొదలుపెట్టింది. ఇంటర్ చదువు కోసం సిటీకి మారి, హాస్టల్లో ఉంటున్న సందీప్ అడపాదడపా భానోజి ఇంటికొస్తూ ఉండేవాడు. భానోజి కలుపుగోరుతనం, అతను చూపించే ఆప్యాయత సందీప్ ని ముగ్ధున్ని చేశాయి. సందీప్ అందం, తెలివితేటలు భానోజిని ఆకర్షించాయి. సౌందర్య వచ్చిన తర్వాత వ్యాపారం ఎలా అభివృద్ది చెందిందో చెపుతూ " మీ అక్కది నాకన్నా పెద్ద బిజినెస్ బుర్రోయ్" అంటుంటే సందీప్ తెగ ఆనందపడేవాడు.
నీలిమకు సందీప్ అంటే మహా ఇష్టం. అతనొచ్చాడంటే ఆమెకో పండుగలా ఉండేది. అతనికిష్టమైన డ్రింకో, ఐస్ క్రీమో, స్వీటో రెడీ చేసి అతను తీసుకునే దాకా ఊరుకునేది కాదు. అతను విసుక్కున్నా, చిరాకు పడినా, కోప్పడినా లెక్కచేసేది కాదు.అతనికి మాత్రం నల్లగా ఉన్న నీలిమ అన్నా, ఆమె ఒలకబోసే ప్రేమన్నా గిట్టేదికాదు. పరిచయం అయిన కొత్తలో అతన్ని 'మావయ్యా' అనిపిలుస్తుంటే, " మావయ్యేమిటి? ఎవడో పెద్దవాడిని పిలచినట్లు?" అంటూ గయ్యిమన్నాడు." వరుసకు మావయ్య వేగా? పోన్లే కోప్పడకు, బావా అని పిలుస్తానులే "అని అంటే, " ఈ వరసలెందుకు? శుభ్రంగా సందీప్ అని పిలు చాలు" అన్నాడు చిరాగ్గా. " అమ్మో పేరు పెట్టి పిలవడమే!!" అంటూ కళ్ళు తిప్పింది. " ఏం? ఎందుకు పిలవకూడదు? నిన్ను కట్టుకున్న మొగుడి ని కాదు కదా?" అని వేళాకోళం ఆడితే, "పో బావా ఏమిటామాటలు?" అంటూ సిగ్గుపడుతూ తుర్రుమంది. "దీనికిలా అర్ధమైందా?"అనుకుంటూ విస్తుపోయాడు." ఈ వయసులోనే ఇది పెళ్లి వరకు ఆలోచించేస్తుందా?" అనుకుంటూ ఆశ్చర్యపడ్డాడు.

సందీప్ అంటే నీలిమకు మహాయిష్టం అని గ్రహించిన భానోజి ఆమెను సందీప్ కి ఇచ్చి పెళ్లిచేస్తే బాగుంటుంది అనుకునేవాడు. అయితే ఇంకా చాలా టైమ్ ఉందికనుక, సౌందర్య దగ్గరకూడా బయటపడలేదు.

*******

పదేళ్లు గడిచాయి. సందీప్ కు ఇప్పుడు ఇరవైఆరేళ్లు. లండన్ లో మంచి ఉద్యోగంలో సెటిల్ అయ్యాడు. సౌందర్య బిజినెస్ ని బాగా డెవలప్ చేసింది. నీలిమ డిగ్రీ చదువుతుంది. వాళ్లకు దూరమైపోయినా, వీలు దొరికినప్పుడల్లా సౌందర్య కుటుంబాన్ని కలుస్తూ టచ్ లో ఉంటున్నాడు. ఒకరోజు హఠాత్తుగా ఒక దుర్వార్త వినాల్సి వచ్చింది. భానోజి కి అకస్మాత్తుగా బిపి పెరిగి స్ట్రోక్ వచ్చి, కుడి చెయ్యి, కుడి కాలు చచ్చుపడిపోయాయన్న వార్త సందీప్ ని కుదిపేసింది. తనకెంతో ప్రియమయిన వారికింత కష్టం రావడం అతన్ని చాలా బాధించింది. అంతకన్నా పెద్ద బాధ, ఆఫీస్ పని ఒత్తిడి వల్ల, వెంటనే బయల్దేరలేకపోవడం. ఫోన్లలోనే వాళ్ళను ఓదార్చి ధైర్యం చెప్పడం తప్ప అతనేమి చేయలేకపోయాడు.

ఎంత ప్రయత్నించినా మరో రెండు నెలలకు గాని అతను స్వదేశం రాలేకపోయాడు ఇండియా లో అడుగు పెడుతూనే, అమ్మా , నాన్నల దగ్గరికి కాకుండా నేరుగా భానోజి ఇంటికే వెళ్ళాడు. ఇంట్లోకి అడుగు పెడుతూనే ఎంతో మార్పు గమనించాడు. ఎప్పుడూ ఎంతో కళకళ లాడుతూ ఉండే ఆ ఇల్లిప్పుడు కళావిహీనంగా ఉండడం చూసి అతనికెంతో బాధనిపించింది. నౌకర్లు ఎదురుపడి కంటతడి పెట్టుకుంటుంటే అతని హృదయం ద్రవించింది. లోపల హాల్లో, క్షీణించిపోయి, పుల్లలా అయిపోయి, మాసిన గెడ్డంతో కాలు,చేయి కదపలేని స్థితిలో ఉన్న భానోజిని చూడగానే, అతని ప్రాణం విల విల లాడింది.

అతికష్టం మీద తన్నుకొస్తున్న దుఃఖాన్ని అదుపులో పెట్టుకున్నాడు. హాయిగా ఆడుతూ పాడుతూ ఉండాల్సిన నీలిమ, తండ్రికి అన్నిరకాల సపర్యలు చేస్తూ, అతన్ని కంటికి రెప్పలా కాపాడుకోవడం అతన్నెంతో కదిలించింది. "చూడవయ్యా...నా చిట్టితల్లి నా మాట వినడంలేదు. నా పనులన్నీ నౌకర్లు చూసుకుంటారు. నువ్వు కాలేజికెళ్లి చక్కగా చదువుకో అంటే, మొండి పట్టు పడుతూ, తానే ఈ పనులన్నీ చేస్తానని భీష్మించుకుని కూర్చుంది. నువ్వయినా చెప్పు " అంటూ బతిమాలుతుంటే, కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోయాడే తప్ప, ఆమెకు సలహా ఇవ్వలేకపోయాడు. దానికి రెండు కారణాలున్నాయి. మొదటిది ఆమెనెప్పుడూ స్నేహపూర్వకంగా చూడలేదు. 'ఎప్పుడూ చీదరించుకొనే తనకి సలహా ఇచ్చే హక్కు ఎక్కడుంది?'అనుకున్నాడు. రెండవది, తండ్రి పై అపారమైన ప్రేమగల నీలిమ, ఈ విషయంలో తనమాటే కాదు ఎవరి మాటా వినదని అతనికి గట్టినమ్మకం. సడన్ గా అతనికి సౌందర్య గుర్తొచ్చింది. ఆమె కోసం అటు ఇటూ చూస్తూ"అక్క ఎక్కడ? తనుండగా నీలిమ చదువు మానేసి, మిమ్మల్ని చూసుకోవాల్సిన అవసరం ఏముంది?"అని ప్రశ్నిస్తూ ఉంటే తండ్రి, కూతుళ్లు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు.

అక్కడే ఉన్న డ్రైవర్ పరమశివం " అమ్మగారికి తీరికెక్కడిదండి .....అంటూ ఏదోచెప్పడానికి ప్రయత్నిస్తుంటే, అతన్ని బయటకెళ్లమని గసిరాడు భానోజి. వెంటనే బయటకు వెళ్లిపోయాడతను. తండ్రీ కూతుళ్లు ఏదో విషయం దాస్తున్నారని అతనికి అర్థమైపోయింది. దాదాపు గంటసేపు కూర్చున్నాడక్కడ. ఎంతసేపు నీలిమ ఎంతో శ్రద్ధతో చేస్తున్న సేవలనే గమనించాడు. ఆమెను చూస్తుంటే మదర్ థెరిసా,నైటింగేల్ గుర్తొచ్చారు.మొట్టమొదటి సారిగా ఆమె అతనికి అందంగా కనిపించింది.ఆమెనే ఆరాధనగా చూస్తున్న సందీప్ ని చూడగానే భానోజి హృదయం ఆనందంతో ఉప్పొంగింది.

" తమ్ముడూ ఎప్పుడొచ్చావురా?" అంటూ పలకరిస్తూ ఇంట్లోకి అడుగుబెట్టిన సౌందర్యను చూస్తూ ‘అక్క అందమంతా ఏమైపోయింది? పెరుగుతున్న వయసును కప్పిఉంచడానికి చేసే ప్రయత్నం వల్ల ఆమెలో మునుపటి అందం కరువైందేమో!' అనుకున్నాడు." అబ్బబ్బ... షాపులో క్షణం తీరిక ఉండడంలేదురా? ఒక్కదాన్ని అయిపోయాను. అన్నీ నేనే చూసుకోవాలి. ఇదిగో ఇన్ కంటాక్స్ వాళ్లొచ్చారు. డాక్యుమెంట్లు ఇక్కడున్నాయి. అవి తీసుకొని మళ్ళీ పరిగెత్తాలి" అంటూ నీలిమ వైపు చూసి " నాన్నకు అన్నం పెట్టావా? మందులేసావా? రాత్రి కూడా నువ్వే అన్నం పెట్టెయ్.నేను రావడం లేటవుతుంది. వెళ్ళొస్తానండి, మీ ఆరోగ్యం జాగ్రత్త," అని భర్తతో అంటూ,సందీప్ వైపు తిరిగింది." సారీరా తమ్ముడు నీతో మాట్లాడలేకపోతున్నాను.రాత్రికి ఉండిపో.రేపు ఫ్రీ గానే ఉంటాను" అంటుంటే, " ఫర్వాలేదక్కా నేను మళ్ళీ కలుస్తాను" అన్నాడు.

* * * * * *

తండ్రి,కూతుళ్లు దాస్తున్న విషయం తెలుసుకోవడానికి వెంకట్ ఒక్కడే మార్గం' అనుకున్నాడు. తన క్లాస్ మేట్ వెంకట్ తండ్రి అర్ధాంతరంగా చనిపోతే, సందీప్, భానోజి షాపులో ఉద్యోగం ఇప్పించాడు.

వెంకట్ ని కలిసాక చాలా విషయాలు తెలిశాయి. " మీ బావగారు ఇలా అయిపోవడానికి కారణం నువ్వు ఊహించలేవు" అని వెంకట్ అంటుంటే, ఆశ్చర్యంగా చూసాడు. " మీ అక్కే కారణం" అంటుంటే, " నేను నమ్మను, మతి ఉండే మాట్లాడుతున్నావా?"అరిచాడు. చిన్నగా నవ్వాడు వెంకట్. " అనుకున్నాను, నువ్వు నమ్మవని. ఎందుకంటే నువ్వు ఆమె అసలు రూపాన్ని ఎప్పుడూ గమనించలేదు. అంత చిన్న వయసులోనే నాకు ఆమె స్వభావం అర్థమైపోయింది. అక్క మీదున్న అపారమైన ప్రేమవల్ల నీకు వేరే ఆలోచనే రాలేదు. ఒక్కసారి ఆలోచించు.ఆమెకు ఇష్టమని, పెద్దచెట్టెక్కి చిటారు కొమ్మల్లో ఉన్న జామకాయలు కోసితెచ్చేవాడివి. అదెంత ప్రమాదం? నీ మీద ప్రేమ ఉంటే, అలాంటి సాహసం చేయనిస్తుందా? ఆమెకు ఇష్టమైన కలువ పూలు తేవడానికెళ్ళి, చెరువులో మునిగి చావబోయావు. నీ మీద నిజంగా ప్రేమ ఉంటే, ఆతర్వాత మరోసారి తెచ్చినపుడు నిన్ను గట్టిగా మందలిఒచాలి. ఆ పని చెయ్యకుండా, ని సాహసాన్ని మెచ్చుకుంటుంటే నీకు ఛాతి పొంగేదిగాని, అసలు నిజం గ్రహించే తెలివి ఉండేది కాదు.

పూత రేకులఒటే ఎంత ఇష్టమైనా చిన్నకుర్రోడిని వాటికోసం కోసం, సైకిల్ మీద పన్నెండు కిలోమీటర్ల దూరం పంపుతారా ఎవరైనా? తను మన ఊరు వచ్చినపుడు బస్టాండ్ లో సామాన్లు మోస్తూ, రిసీవ్ చేసుకోవడానికి, వెళ్ళేటప్పుడు బస్సెక్కించడానికి, సినిమా టిక్కెట్లు తీయడానికి నిన్ను శుభ్రంగా వాడుకొనేది.ఈ విషయాలన్నీ తెలిసిన మీ అమ్మ కట్టడి చేయబోతే, నువ్వు లొంగేవాడివి కాదు. పాపం ఆవిడ తన గోడు నాతో చెప్పుకొనేది. అన్ని తెలిసి మౌనంగా ఊరుకునేవాడిని,అంతా చెప్పినా నువ్వు నా మాటవినవని. మీ అక్క, ఆమె తల్లితండ్రులు డబ్బు మనుషులని, దగ్గరైన వాళ్ళను బాగా ఉపయోగించుకుంటారని మీ అమ్మ చెప్పేది. భానోజి గారిని పెళ్లి చేసుకొని, గొప్ప త్యాగం చేస్తుందని, నువ్వు చెప్పినపుడు మనసులోనే నవ్వుకున్నాను. ఆయన ఆస్తులు చూసి చేసుకుంటుందని మీ అమ్మతో పాటు చాలామంది గ్రహించారు. నీలిమను ఎప్పుడూ ఆమె సవతి తల్లిలాగే చూసింది.

పైకంతా నటనే. వ్యాపారంలో దిగాక, పై చేయి ఆమెదే అయ్యింది. భానోజి గారి సెక్రెటరీ రాజు గాడి సలహాలతో, షాపులో మూడొంతులు డూప్లికేట్ సరకు దింపేసింది. అడ్డంగా డబ్బు సంపాదించేయడానికి, ఆ వెధవతో కలసి, అన్ని దార్లు వెదికింది. ఎంతో నిజాయితీగా వ్యాపారం చేసే భానోజి గారు, విషయం తెలిసి ఉగ్రులయిపోయారు. అయినా ఆమె లెక్క చేయలేదు. చివరకు భానోజి గారే దిగివచ్చి, నచ్చజెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. అయినా ఫలితం లేకపోయింది. అప్పటికే తన జుట్టు ఆమె చేతికిచ్చి, ఆమె చేతిలో కీలుబొమ్మ అయిపోయారు. అయినా తట్టుకున్న భానోజి గారు, చివరకు తట్టుకోలేని పరిస్థితి వచ్చింది," అంటూ ఆగాడు. వెంకట్ కాస్సేపు మాట్లాడకుండా ఉండిపోయాడు. "ఏమైంది? చెప్పు, ఆపేసావేం?"అంటూ కుదిపేసాడు సందీప్. సందీప్ కి సస్పెన్స్ పెరిగిపోతుంది. కొంతసేపు తటపటాయించి, నోరువిప్పాడు. " మీ అక్కకు ఆ రాజు గాడికి అక్రమ సంబంధం ఉన్నదన్న విషయం మీ బావకి తెలిసిపోయింది" అంటూ ఆపాడు. "నో..నేను నమ్మను" గట్టిగా అరిచాడు సందీప్. " అంతా ఖచ్చితంగా తెలిసినవాడ్ని నేను. నిజం నిష్టూరంగా ఉండొచ్చు. కానీ నేను చెప్పేది వాస్తవం. ఆ వార్త తెలియగానే ఆయనకు స్ట్రోక్ రావడం, కాలు చెయ్యి పడిపోవడం జరిగింది.

నిజం తెలిసిన తర్వాత నువ్వే తట్టుకోలేకపోతున్నావు. భానోజి గారి పరిస్థితి ఎలా ఉండి ఉంటుందో ఒక్కసారి ఊహించు. అంత జరిగినా మీ అక్కలో మార్పు లేదు. ఆయన్ని నౌకర్లమీద వదిలేసి బలాదూర్ తిరుగుతుంటే, పాపం నీలిమే ఆయన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తుంది. ఆ పిల్లే లేకపోతే భానోజి గారు మనకు దక్కేవారు"అంటూ ముగించాడు. సందీప్ కళ్ళమ్మట నీళ్లు గిర్రున తిరిగాయి.

* * * * *

రెండ్రోజుల తర్వాత మళ్ళీ భానోజి ఇంటికి వెళ్లాడు సందీప్. ఈసారి సౌందర్య కూడా ఇంట్లో ఉంది. ఇప్పుడు ఆమె మరీ అందవిహీనంగా ఉన్నట్లు తోచిందతనికి. అదే సమయంలో కాఫీ కప్పు పట్టుకొచ్చిన, నీలిమ అందంగా ఉన్నట్లు అనిపించింది. ఆమె చూపుల్లో ప్రదర్శితమవుతున్న ప్రేమ, అభిమానం ఆమె అందాన్ని రెట్టింపు చేసినట్లు అనిపించిందతనికి. ఎప్పుడూ సౌందర్యతోనే ఎక్కువగా మాట్లాడే సందీప్, ఈసారి నీలిమతోను, భానోజితోను ఎక్కువగా, చనువుగా మాట్లాడడం విచిత్రంగా తోచింది సౌందర్యకి.

సందీప్ భానోజి దగ్గర కూర్చొని, అతని చేయి పట్టుకొని" బావా నీకు, నీలిమకు అభ్యంతరం లేకపోతే, నేను నీలిమను పెళ్లిచేసుకుందామనుకుంటున్నాను" అనగానే భానోజి కళ్ళ వెంబడి ఆనంద భాష్పాలు రాలాయి. సందీప్ చేయి పట్టుకొని, ఉద్వేగంతో వణికిపోతూ, కళ్ళతోనే తన సమ్మతి తెలిపాడు. నీలిమ ఆనందానికి అంతేలేదు. సిగ్గుపడుతూ లోపలికి పరిగెత్తింది.
ఆ హఠాత్పరిణామానికి సౌందర్యకు నోట మాటరాలేదు.సందీప్ అల్లుడుగా ఇంట్లో అడుగుపెడితే తన ఆటలు సాగవని ఆమెకు అర్ధం కావడంతో కళ వెల పడింది." ఆ ఏముందిలే ..పెళ్లిచేసుకొని, నీలిమను తీసుకొని లండన్ వెళ్లిపోతాడులే. వాడి వల్ల వచ్చే ఇబ్బంది తాత్కాలికమే"అని ధీమా పడుతున్న సమయంలో బాంబ్ పేల్చాడు సందీప్ " మీ కూతురు దూరమయిపోతుందేమోనని భాధపడకండి. నీనిక్కడే ఉద్యోగం చూసుకొని మీకు దగ్గర్లోనే ఉంటాను" అని సౌందర్య వైపు తిరిగాడు.

" అక్కా... ఏమిటలా మాటా పలుకు లేకుండా అయిపోయావు? సంతోషమేకదా? ఇప్పుడు నీ అల్లుడినైపోతున్నాను. ఒంటరి దానివైపోయావని దిగులు పడకు. నేనొచ్చేసానుగా. అన్నీ నేనే చూసుకుంటాను"అంటూ భావగర్భితంగా మాట్లాడుతున్న తమ్ముడి మాటల్లో శ్లేష గమనించలేని మూర్ఖురాలు కాదామె. ముఖాన్న నవ్వుపులుముకొని ఆనందాన్ని నటించింది. భానోజి రాబోయే మంచిరోజుల గురించి కలలు కంటూ వెనక్కి వాలాడు.

మరిన్ని కథలు

Vimanam lo kalakalam
విమానంలో కలకలం
- తాతా కామేశ్వరి
Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ
Chandruniko noolu pogu
చంద్రునికో నూలు పోగు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Anaadha atidhyam
అనాథ అతిథ్యం
- - బోగా పురుషోత్తం
Vibheeshana Sharanu
విభిషణుని శరణు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల