తోడొకరుండిన - సుంకర వి హనుమంత రావు .

todokarundina

దేవీ రేణుకా మేడం !అమ్మాయినేమైనా కదిలించావా?నెక్స్ట్ వీక్ ఇరవై అయిదు దాటిపోతోంది.దాని పెళ్లి చేసేస్తే పెద్ద బాధ్యత తీరిపోతుంది.”
భార్య అందించిన కాఫీ సిప్ చేస్తూ అడిగాడు ధర్మారావు ..రిటైర్డ్ హెడ్ మాస్టర్ .దేవీ! అంటూ నన్ను కాకా పట్టేబదులు దాన్నే అడగండి. అయినా అది నేనేది అడిగినా నోరిప్పడం ఎప్పుడో మానేసింది.మళ్ళీ అడిగాననుకోండి రుసరుసలు బుసబుసలు.మీ యిద్దరి మధ్య నేను నలిగిపోతున్నాను.ఈసారి మీరు అడగండి.తండ్రికూతుర్లమధ్య నేనెందుకు దేవరా ?”

భర్త అశక్తత తెలిసి కూడా చెప్పింది.

“నేను నాబంగారుతో మాట్లాడలేనని తెలిసి అంటున్నావా?టెస్ట్ చేస్తున్నావా?”

“నేను మిమ్మల్ని టెస్ట్ చేయడమా?వింటే ఎవరైనా నవ్విపోతారు.” నవ్వేసింది రేణుకా దేవి.

“అదికాదు నేను అసలు పెళ్లి చేసుకోనని ఎప్పుడో చెప్పేసిందని నాకూ తెలుసు.అయినా మనం దాని మనసు తెలుసు కోవాలి కదా ?తన ప్రోబ్లం ఏమిటో ఎప్పుడైనా అడిగావా ?”

“ఆ సంబరం అయిపోయింది.కారణం చెప్పలేదు గానీ ..యిలా మరోసారి విసిగించావంటే లేడీస్ హాస్టల్లో చేరిపోతానని తెగేసి చెప్పింది.అయినా అడగమంటే మరోసారి అడుగుతాను.” రేణుకా దేవి తన నిస్సహాయతను వ్యక్తం చేసింది.

“ఆపని మాత్రం చేయకు..దాని పట్టుదల నాకు తెలుసు.”

“అవును మరి చిన్నప్పటి నుండి నెత్తికెత్తుకొని పెంచారు.నేనేమైనా అంటే పిల్లల పెంపకం గురించి పెద్ద ఉపన్యాసం చెప్తారు.స్కూల్లో ఏది చెప్పినా అమాయకులైన విద్యార్ధులు వినే వారు.అవే విషయాలు ఇంట్లో కూడా చెప్తే నేను వినలేను..ఏమైనా చెప్పాలనుకుంటే ముద్దుల కూతురికి చెప్పండి.అదే మీకు తగిన జోడి.ఆ తాగిన కప్పిలా యిస్తే తరించి పోతాను.” భార్య వుక్రోషాన్ని చిరునవ్వుతో చూస్తూ ..

“ఇవ్వాళ సాటర్ డే కదూ?సంజన యీసరికే రావాలి ..ఏమయ్యిందో..నా సెల్ యిలా యివ్వు కనుక్కుంటాను.”“అక్కర్లేదు అది యివ్వాళ తన ఫ్రెండ్ వాణీయింటికి వెళ్ళి కొంచం ఆలస్యం గా వస్తానని చెప్పింది.”

“అదుగో మాటల్లోనే వచ్చేసింది .”

ఇంటిముందు ఆగిన కారుని చూస్తూ చెప్పాడు ధర్మారావు.

“అది వాణి కారు కాదు..ఎవరో యువకుడు కారు దిగి వస్తున్నాడు.” గేటు తీయడానికి వెళ్తూ చెప్పింది.

దాదాపు ముప్పై సంవత్స రాల యువకుడు వినయంగా వచ్చి యిద్దరికీ నమస్కరించాడు. “ఎవరు కావాలి బాబూ!”
ఎదురుగా వున్న కుర్చీ చూపిస్తూ అడిగాడు ధర్మారావు.

“మీరే కావాలి అంకుల్..మీతో మాట్లాడాలి.ఆంటీ మీతో కూడా.” రిక్వెస్టింగా అడిగాడు.

“నువ్వు నా స్టూడెంట్ వా?” గుర్తు చేసుకుంటూ అడిగాడు ధర్మారావు.

“కాదంకుల్..అయినా మీ గురించి గొప్పగా విన్నాను. అంకుల్ !..నాపేరు సత్య ..సంజన గారు పనిచేస్తున్న ఆఫీఎస్ లోనే నేనుకూడా ఉద్యోగిని.

తన కంటే మూడు సంవత్సరాల సీనియర్ని .నా స్వస్థలం రాజమండ్రి.అమ్మా నాన్న అక్కడే వుంటారు.ఇక్కడ నేను మాసిస్టర్ ఉంటాము.తనపేరు సత్యసిరి..బీటెక్ చేస్తోంది.నాన్న గారిపేరు కృష్ణం నాయుడు.వృత్తి వ్యవసాయం.అమ్మ లెక్చరర్ .”

“నీ బయోగ్రపి బాగుంది.మాకెందుకు చెపుతున్నావు?” ధర్మారావు సాలోచనగా ప్రశ్నించారు.

“చెపుతాను అంకుల్..దానికంటే ముందు సంజన గురించి తెలుసుకోవాలి.”

“బాబూ..సత్యా !తను కంప్యూటర్ ఇంజినీర్ .నువ్వు చేసే కంపెనీ లోనే పనిచేస్తోంది.నాకు ఏకైక కుమార్తె ఇంతకంటే యింకేమి వివరాలు కావాలి?తన వయసు ..”

“నాకు తెలుసు అంకుల్.కంపెనీలో వున్న తన రెజ్యూమ్ చూసాను.”

“బాబూ!ఒక్కమాట అడగనా?”

“అయ్యో అడగండి ఆంటీ.”

“జనాభా లెక్కల్లా యిన్ని వివరాలు తెలుసుకున్నావు.అసలు నీ ఉద్దేశం ఏమిటి?”

“వస్తున్నాను ఆంటీ..అక్కడకే వస్తున్నా.నేను సంజనాను ప్రేమిస్తున్నాను..కాని నాది మూగప్రేమ ..

ఆవిషయాన్ని మా అమ్మానాన్నలకు ..తప్ప మరెవరికి చెప్పలేదు.యిప్పుడు మీకు చెపుతున్నాను.”

“అంటే ?సంజనాకు చెప్పలేదా?”

తెగ ఆశ్చర్యపోతూ అడిగింది రేణుకాదేవి.

“లేదాంటీ ..తన వ్యక్తిత్వం ముందు నామనసు, ప్రేమను వ్యక్తం చేయాలంటే భయపడిపోయాను.

సంజన క్లోజ్ ఫ్రెండ్ వాణి నడిగి తనగురించి కొంత తెలుసుకున్నాను.వాణి చెప్పిన షాకింగ్ వార్తవిన్నాక సంజనాను కదిలించాలంటే గుండె గొంతుకులోకి వచ్చేస్తుందన్న ఫీలింగ్ తో మీతో నాబాధ పంచుకోవాలని వచ్చాను.”

వాపోయాడు ఇరవై ఏడు వయసున్న సత్య ద గ్రేట్ ఐటి ఇంజినీర్.

“బాబూ !వాణి చెప్పిన షాకింగ్ న్యూస్..మాక్కూడా చెప్పి పుణ్యం కట్టుకో వచ్చుగా?”

మిచ్చివస్ గా అడిగింది రేణుక చిరునవ్వుతో.

“ఆంటీ..యిదేమైనా గుడ్ న్యూస్ అయితే ఆనందంగా షేర్ చేసుకోవచ్చు.గుండెల్లో గునపాలు దింపిన వార్త.”

మరోసారి వాపోయాడు సత్య.

“బాబూ!గుండెల్లో గునపాలు ఎందుకు దిగాయో మాతో షేర్ చేసుకొని గునపాల్ని నెమ్మదిగా తీసేసుకో వచ్చుగా?”

“అంటే? ఆంటీ! ..మీకు మీకు ముందే తెలుసన్నమాట ?”

నోరు తెరిచేసాడు సత్య.

“బాబూ! నీగుండెలో దిగింది గునపాలే..మాగుండెల్లో ..పేలింది అగ్నిపర్వతం.యెంత అడిగినా కారణం చెప్పదు..ఒకటే మాట నేను పెళ్లి చేసుకోను.”

“ఆంటీ! కన్నతల్లి మీరు ..మీ ముందు దాచుకోవలసిన రహస్యాలు ఏముంటాయి?

“లవ్ ఫెయిల్యుర్” ? కాదు.అవకాశమే లేదు..తన వ్యక్తిత్వం ముందు ప్రేమ చిన్న అణుమాత్రం.”

“బాబూ!కనిపెంచిన మాకే అర్ధం కాని రహస్యం ..మూగ ప్రేమికుడివి నీకు అర్ధమయ్యే అవకాశమే లేదు.అయినా ప్రయత్నిస్తే తప్పు లేదు.సంజన వచ్చే టైం అవుతోంది.నాపతి దేవుడు తనముందు నోరిప్పరు.

నేను అరచినా లెక్కచేయదు.ఇక మిగిలింది నువ్వు మాత్రమే.

మేము చేయలేని పని నువ్వు చేసి చూపించు.అది కొంచం మొండి పిల్ల .కాలేజీ కొచ్చేంత వరకు కొంగు పట్టుకునే తిరిగేది.తర్వాత ఏమయ్యిందో పూర్తిగా “ఇంట్రావర్ట్” అయిపోయింది. నేను దాని మౌనాన్ని దూరం చేయాలని శతవిధాల ప్రయత్నించి ఓడిపోయాను. వయసొచ్చిన పిల్లతో మరీ కఠినంగా ప్రవర్తించ లేకపోయాను.ఆయన పైకి చెప్పుకోలేక మనసులోనే ఘర్షణ పడుతుంటారు. ప్రేమ కోసం యుద్ధాలు జరిగాయి.హత్యలు జరుగుతున్నాయి.ఆరెండు చేయమని అడగడం లేదు. ధైర్యంతోసాహసం చెయ్యి..సంజన కరిగి కరుణిస్తుం దేమో?ఐదు వర్షాల నీ మూగ ప్రేమకు మాటలు నేర్పు .చేతల సంగతి మాటలే పరిష్కరిస్తాయి.”నాటకీయ ధోరణిలో ధైర్యాన్ని నూరిపోసింది ..రేణుకా దేవి .ఇద్దరి సంభాషణ ఆసక్తిగా వింటున్న ధర్మారావు గారు ఆల్ ది బెస్ట్ అన్నట్లు వేలెత్తిచూపిస్తూ..నెమ్మదిగా జారుకున్నారు వస్తున్న కారు వాణీదని కన్ఫం చేసుకుంటూ.

“బాబూ!చూసావుగా సంజనా జనకుడి..ధోరణి . ధైర్యమే చేస్తావో ?హాయ్ చెప్పి జారుకుంటావో నీ ప్రేమ తీవ్రత మీద.. ఆధార పడివుంటుంది.మీమధ్య నేను వుంటే ఇబ్బందిగా వుంటుంది మీకు .నాకు పక్కింట్లో పేరంటం వుంది.పునర్ దర్శనం, నీ కుడిచేతి బొటన వేలు మీద ఆధారపడివుంటుంది.నీమీద నమ్మకం మొదటి చూపులోనే కలిగింది.అమ్మ మనసు అర్ధమయ్యింది అనుకుంటాను. అయినా నీవంటి వ్యక్తి వెంటపడి వివాహం చేసుకుంటాను అంటే సంజన తప్పకుండా తన నిర్ణయాన్ని మార్చుకుంటుంది.స్త్రీ హృదయం నాకు తెలుసు.బీ బ్రేవ్.”

సంజన జనకురాలు చల్లగా జారుకుంది.మహాకాళి ముందు చేతిలో ఖడ్గం తో నిలబడిన విక్రమాదిత్యుని వలే మిగిలిపోయాడు ..సత్య
ద గ్రేట్ ఐటిఇంజినీర్.కాని రేణుకా దేవిగారు యిచ్చిన మనో ధైర్యం తనకు తోడుగా ఉంటుందని తనకు తానే ధైర్యం చెప్పుకున్నాడు.
తనఫ్రెండ్ వాణీ కి బై చెప్పి గేటు తీసుకొని వస్తూ తన ఆఫీస్ కొలీగ్ సత్యను చూస్తూనే అవాక్కయ్యింది అన్న లెవెల్లో క్షణ కాలం నివ్వెర పోయింది.సంజన.

“హలో !సత్యా గారూ!మీరు ? యిక్కడ?”

విష్ చేస్తూ వచ్చి మరో కుర్చీలో కూర్చుండి పోయింది.

ఒక్కసారిగా లేచి నిలబడిపోయాడు సత్య.

అప్పుడే పక్కింటి పేరంటానికి తయారై వచ్చిన రేణుక సత్య లోని తత్తరపాటును గమనించి..

“అమ్మా!నేను పేరంటానికి వెళ్తున్నాను.డాడీ నిద్రలో వున్నారు.సత్యకి కాఫీ యిచ్చి మాట్లాడుతూ వుండు ..నేను యిప్పుడే వచ్చేస్తాను.బాబు సత్యా !నీకు కనీసం కాఫీ కూడా యివ్వకుండా వెళుతున్నాను.అమ్మాయి కాఫీ యిస్తుంది మొహమాట పడకు.తను నీ కొలీగేగా ..రోజు ఆఫీస్ లో కలుస్తూనే వుంటారు కదా?” బై చెప్పి బయలుదేరిపోయింది..రేణుకాదేవి.అప్పటికి మనసును కొంచం కుదుటపరుచుకొని కుర్చీలో కూర్చుండి పోయాడు సత్య.“జస్ట్ ఫైవ్ మినిట్స్ నేను ఫ్రెషప్పై వస్తాను.”మరోమాటకు తావీయకుండా లోపలికి వెళ్ళిపోయింది సంజన.
రేణుకా దేవిగారు నూరిపోసిన “ధైర్యగంధాన్ని” గుండెలకు పూసుకుంటూ ఆలోచనలో పడిపోయాడు సత్య.

“చెప్పండి సత్యా గారూ!డాడీతో పనిపడి వచ్చారా ?”

“కాదు..మీతోనే మాట్లాడాలని వచ్చాను.”

గుండెల్లో ధైర్యాన్ని మాటల్లో కి తెచ్చుకుంటూ ధైర్యం చేసాడు.

“ఆఫీస్ లో మాట్లాడ వచ్చుగా?”

ఆచ్చర్య పోతూ అడిగింది.

“ఆఫీస్ లో మాట్లాడేది కాదు.పర్సనల్ .”

“పర్సనలా?నాతో పర్సనలా?”

మరోసారి ఆచ్చర్య పోయింది.

“అవును సంజనా గారు..మీతోనే..” తొణక్కుండా చెప్పాడు.“అయితే చెప్పండి..”

తనుకూడా తయారైపోయి అడిగింది.

“తప్పయితే క్షమించండి..యిష్టం లేకపోతే గెటవుట్ అనండి..యేనిర్ణయమైనా కొంచం ఆలోచించి తీసుకోండి.మీరు మాత్రం హర్ట్ కాకండి.”
“చెప్పండి ..మీరు నాకు సీనియర్ ..మరీ మీరు అనుకుంటున్నట్లు కఠినాత్ము రాలిని కాదు.”ఆసమాధానంతో సత్య కుదుటపడి సంజనను సూటిగా చూస్తూ “నామనసును మీముందు ఉంచుతున్నాను.ఆశ అనుకోండి అత్యాశ అనుకోండి..దాదాపు మీరు ఆఫీస్లో అడుగుపెట్టింది మొదలు మూగవాడిలా ఆరాధిస్తున్నాను.సూటిగాచెప్పాలంటే ...

“సంజనగారూ! ఐ లవ్ యూ..మీరు అంగీకరిస్తే పెళ్లి చేసుకుంటాను.”

ఒక్కసారి మ్లానమైపోయింది సంజన ముఖం.జవాబు చెప్పలేక తల దించుకుంది.

“సారీ సంజన గారూ!మిమ్మల్ని బాధ పెట్టి వుంటే క్షమించండి. నాముఖం చూడలేక పోతే చెప్పండి.

రేపటి నుండి ఆఫీస్ లోకూడా కనిపించను.చిన్నబోయిన మిమ్మల్నిచూస్తూ భరించలేను.ట్రాన్స్ఫర్ చేయించుకుంటాను లేదా జాబ్కు రిజైన్ చేసి మా ఊరు వెళ్ళిపోతాను.”

సత్య మాటలకు రియాక్ట్ అయినట్లు నెమ్మదిగా తలెత్తి చూసింది.కళ్ళలో కనిపించిన దైన్యానికి చలించిపోయాడు సత్య.

“సారీ సంజనగారు.మిమ్మల్ని యిలా బాధపెట్టాలనికాదు.మీ మీద వున్న ప్రేమ నన్ను మాట్లాడించింది.దేనికైనా అర్హత ఉండాలన్న కనీస జ్ఞానాన్ని విస్మరించాను.వస్తాను సెలవ్ .” అంటూ లేవబోయాడు.

“సత్యా గారు ..కూర్చోండి.నేను చెప్పేది విని అర్ధం చేసుకోడానికి ప్రయత్నించండి.నేను అందరిలాగే సాధారణ మైన ఆడపిల్లనే.కానీ..పెళ్లి చేసుకోను.. అందుకు తగిన కారణాలు నాకు వున్నాయి.

“లవ్ ఫెయిల్యూరా?మగజాతి అంటే అసహ్యమా ?అమ్మానాన్నలు కట్నకానుకలు యివ్వలేరన్న అనుమానమా?”అని అడగకండి..యివేమీ కారణాలు కాదు.నేను పడుతున్న స్ట్రగుల్ మీకు వివరించలేను.క్షమించండి.” “మీరు చెప్పినవేమీ కారణాలు కాదంటే నేనంటే యిష్టం లేదా?మీ ఫ్రెండ్ వాణి గారినడిగి అన్ని విషయాలు తెలుసుకున్నాను.మాదీ మీ కులమే.ఆస్తి పాస్తులు అవసరాలకు మించినంత.. నాన్నగారు మోతుబరి రైతు..అమ్మ లెక్చరర్.ఒకే ఒక చెల్లి ఇంజినీరింగ్ లోవుంది.” తన వివరాలు చెపుతున్న సత్యాని చూస్తూ

“మీగురించి మీరు తక్కువచేసి మాట్లాడకండి.ఒక అమ్మాయి కోరుకునే అన్ని లక్షణాలు మీలో వున్నాయి.”

“మరయితే మీ ప్రోబ్లం ఏమిటి?ఎందుకు స్ట్రగుల్ పడుతున్నారు ?”

సూటిగా అడిగాడు సత్య.

తలవంచుకుంది సంజన.

“సంజనగారు..చెప్పకూడదు అనుకుంటే బలవవంతం చేయను.నన్ను ఒక స్నేహితునిగా భావించి చెప్పాలనుకుంటే చెప్పండి.మీరు చెప్పిన విషయం నాపెదవి దాటదు.మీ అమ్మగారికి కూడా చెప్పను.నా మదర్ మీద ఒట్టు పెట్టి చెతున్నాను .నమ్మకముంటే చెప్పండి.”
“ఇంత వరకు అమ్మకు కుడా చెప్పలేదు.చెప్పి వాళ్ళ కు క్షోభను కలిగించలేను.యిప్పుడు మీకు చెప్పి మిమ్మల్ని బాధ పెట్టలేను”..
నెమ్మదిగా పెదవులు కదపబోయి ఆగిపోయి హఠాత్తుగా లేచి ఇంటి లోపలి వెళ్ళిపోయి చిన్న పేపర్ తెచ్చి చేతిలో పెట్టి మౌనముద్ర దాల్చింది.
సత్య ఆపేపర్ చూసి జేబులో పెట్టుకొని..“సంజనగారు!పారిపోతున్నానని అపార్ధం చేసుకోకండి.కాలేజి నుండి చెల్లిని పికప్ చేసుకునే టైమయ్యింది.రేపు ఆదివారం.ఇద్దరికీ ఆఫీస్ వుండదు.కరక్ట్ గా పదిగంటలకు మీ ముందు వుంటాను.ఆలోచించి..ఒక నిర్ణయానికి వద్దాము.బై.” చిరునవ్వుతో తన కారు వద్దకు నడిచాడు సత్య. అర్ధమైపోయింది సత్య మనసు సంజనకు.విరక్తిగా నవ్వుకుంది.

ఉదయం తొమ్మిది గంటలకే ధర్మారావు రేణుకలు తయారై ఎవరిదో పెళ్లిచూపుల కార్యక్రమముందని బయటకు వెళ్లిపోయారు. షిడ్నీ షెల్డన్ పాత నావెల్ “అదర్ సైడ్ ఆఫ్ మిడ్నయిట్” చదువుకుంటూ హాల్లో కూర్చుంది సంజన.గోడకున్న గడియారం పదిగంటలు కొట్టింది.అదే టైంకు ఇంటిముందు ఆగిన సత్య “ఐట్వంటీ క్రిమ్సన్ రెడ్ కార్” చూస్తూనే నిలబడిపోయింది సంజన.గేటు తీసుకొని వస్తూనే..“హాయ్ సంజనాగారూ !గుడ్ మార్నింగ్ .”విష్ చేసాడు సత్య.“వెరీ గుడ్ మార్నింగ్ ..ప్లీజ్ కం ..”కుర్చీ చూపించింది సంజన.“నిన్న మిమ్మల్ని హర్ట్ చేసి వుంటాను.”
నవ్వుతూ అడిగింది.

“అబ్బే అదేం లేదు..మీరు రాసి యిచ్చిన ఐదక్షరాలు ఫోటో తీసి నా లేప్ టాప్లో అపూర్వంగా భద్ర పరుచుకున్నాను.”

“సత్య గారూ!జోకులాపి నిజం చెప్పండి.” “నిజంగా నిజమండి ..మొత్తానికి నోరు విప్పారు..అదే పెద్ద విజయం.

నన్ను ఓస్నేహితునిగా భావిస్తే చెప్పండి.మనసులో బాధ మనిషితో పంచుకుంటే గుండెల్లోని భారం తగ్గుతుందంటారు.”

“ఒప్పుకుంటాను..సంతోషాన్ని కలిగించే దయితే షేర్ చేసుకోవచ్చు.కాని యిది మరొకరితో పంచుకోలేని విషయం.అమ్మతో పంచుకోవాలని చాలాసార్లు ప్రయత్నించాను.కాని తల్లి మనసు తట్టుకోలేదని విరమించుకున్నాను.అమ్మా నాన్నల్ని నాబాధలు చెప్పుకొని మానసిక వ్యధకి గురిచేయలేను.అందుకే మనసు చంపుకొని దూరంగా ఉంటున్నాను. ”

“మీరు ఆఫీస్ లో చేరినప్పటినుండి నాప్రవర్తన గమనించే వుంటారు.నాకు నేను జంటిల్ మన్ అనిచెప్పుకోను.కాని వ్యక్తిత్వం లేని మనిషిని మాత్రం కాదు.పెళ్లి సంగతి ప్రస్తుతానికి వద్దు.మీ బాధను పంచుకుంటే పరిష్కారాన్ని వెదుకుదాం.మొదటి సారి మిమ్ముల్ని ఆఫీస్ లో చూసి ఎంతగా ప్రేమించానో..మీసమస్య తెలిసాక అంతకుమించి ప్రేమిస్తాను .మీకు పెళ్లిమీద యిష్టం లేదంటే వద్దు..మీకష్టసుఖాల్లో పాలు పంచుకునే భాగ్యాన్ని కలిగించండి. కనీసం ఒక స్నేహితునిగా,శ్రేయోభిలాషిగా భావించి షేర్ చేసుకోండి.”సంజన మౌనంగా వుండిపోయింది. మనసులో చెలరేగుతున్న అలజడి ముఖంలో ప్రతిబింబిస్తోంది. ఒక్కసారిగా లేచి ఫైవ్ మినిట్స్. అంటూ లోపలి వెళ్లి రెండు కాఫీ కప్పులతో వచ్చింది.

ఏడ్చిన ఆనవాళ్ళు ముఖంలో కొట్టొచ్చినట్లు కనిపిస్తుంటే కామయిపోయి కాఫీ సిప్చేయడం మొదలు పెట్టాడు సత్య.“సారీ సంజనగారు ..మీ మనసు కష్ట పెట్టినందుకు క్షమాపణలు .ఇప్పటికే అనవసరంగా వాగి మీ బుర్ర తినేశాను. యిష్టం లేని విషయాన్ని పదేపదే అడగడం..సభ్యతకాదు.రేపు ఆఫీస్ లో కలుద్దాం”లేవబోయాడు సత్య.“చెప్తాను ..నామనసులో బరువు తగ్గించుకోడానికైనా చెప్పాలి.”
ఒక నిర్ణయానికి వచ్చింది సంజన.జీవితంలో సంభవించిన ఆ ఘోరాన్ని ఎవరికీ చెప్పకుండా జీవితాంతం ఎలా భరించ గలను?తప్పదు.మనసులోని వ్యధను బయటకు చెప్పి బరువు తగ్గించు కోవాలనే స్థితికి వచ్చేసింది సంజన..“సత్యాగారూ!నాకు యుక్తవయసు వచ్చే వరకు నాబ్రతుకు ప్రేమను పంచే అమ్మానాన్నలతో ..అందమైన కాలేజ్ జీవితంతో హాయిగా సాగిపోయింది.కాని అందమైన కలలా సాగిన జీవితం ఒక్కసారిగా అంధకారం అయిపోయింది.” వుబుకుతున్న కన్నీటిని కట్టడి చేసుకుంటూ మౌనంగా ఉండిపోయింది. మనసులో సంజన పడుతున్న స్ట్రగుల్ చూస్తుంటే ..అనవసరంగా బాధ పెట్టానన్న గిల్టీ ఫీలింగ్ తో
సతమత మై తల వాల్చేశాడు..సత్య.

“నాఎడమ తొడ మీద..తెల్లటి మచ్చ కనిపించింది.”గట్టిగా ఏడ్చేసింది సంజన.

ఆహాల్లో నిశ్శబ్దం మౌనదీక్ష పూనింది.

అయిదు నిమిషాల తర్వాత నీటితో నిండిన కాసారంలో ఎర్రగా విరిసిన పద్మాలవంటి కనులెత్తి చూసింది సంజన.తలవంచుకుని తపోదీక్షలో వున్న మౌనిలా వున్నాడు సత్య. “అందుకే ఈ విషాధాన్ని ఎవరితో షేర్ చేసుకోలేదు..” మౌనాన్ని భగ్న పరిచింది సంజన.“వన్ మినిట్ ప్లీజ్ .” హఠాత్తుగా లేచి బయట వున్న తన కార్ దగ్గరకు దూసుకుపోయాడు సత్య.అయోమయంగా చూస్తూ వుండిపోయింది సంజన.
చేతిలో తన “లేపీతో” తిరిగొచ్చి ..ఓపెన్ చేసి “మిమ్మల్ని కన్సోల్ చేయడానికి చేసే ప్రయత్నం కాదు నాది.వాస్తవాలను మీకు చూపించాలనేదే
నాప్రయత్నం .కేన్సర్ సోకిన సోనియా గాంధీ,మనీషాకోయిరాలా ,యువరాజ్ సింగ్ .,లేటెస్ట్ గా సోనాలీబెంద్రే ..ధైర్యంగా పోరాడి జీవితాల్ని గెల్చుకున్నారు.ధైర్యం, కృషి వుంటే మనిషి సాధించ లేనిది ప్రపంచంలోఏదీ లేదు.మీకు వచ్చిన ఈవ్యాధి కేన్సర్ ముందు పమాణువు లాంటిది.ఇదిగో ఈ ఫోటో చూడండి ..వీడి పేరు సంజయ్..నా బెస్ట్ ఫ్రెండ్.మనలాగే సాఫ్ట్ వేర్ ఇంజినీర్. ఈఅమ్మాయి వీడి భార్య..సునయన.వీడి పెళ్ళైన సంవత్సరానికే సునయనకు లూకో డెర్మ ఎఫెక్ట్ అయ్యింది.యిద్దరు బెదిరిపోలేదు.యునాని ..హోమియోపతి డాక్టర్లను సంప్రదించారు.చివరకు ముంబై లో వున్న“హోమియోపతి డాక్టర్ రాజేష్ షా” అడ్రస్ సంపాదించి కన్సల్ట్ అయ్యారు.లాంగ్ ట్రీట్మెంట్ అవసరమవుతుంది అంటే వాడు ముంబై ఆఫీస్ కు ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు.సంజయ్ నాక్లోజ్ ఫ్రెండ్.వాడితో బాటు నేనుకూడా డాక్టర్ని కలిసాను .ఎంతోమంది పేషెంట్స్ ను కలుసుకున్నాను.

ఈ ఫోటో చూడండి వ్యాధితో వున్న సునయనది.ఒక స్టేజి లో ముఖం మీద స్కార్ఫ్ లేకుండా బయటకు అడుగు పెట్టేదికాదు.ఈఫోటో ..ఐదు సంవత్సరాల ట్రీట్మెంట్ తర్వాత సునయన. నుదిటిమీదకు వ్యాపించిన తెల్లని మచ్చ తోబాటు శరీరమంతా వ్యాపించిన మచ్చలన్నీ మాయమైపోయాయి.ఇది సునయన పర్సనల్ ఫోన్ నంబర్.నాపేరు రిఫర్ చేసి మాట్లాడండి.సంజయ్ తో యిప్పుడే మాట్లాడుతాను . “డాక్టర్ రాజేష్ షా” అపాయింట్ మెంట్ తీసుకుంటాడు.ఫ్లైట్ లో వెళ్ళి వద్దాం.మేటర్ ఆఫ్ టుడేస్.మీరు అనవసరంగా ఆలోచించి గోరంత విషయాన్ని కొండంతలుగా వూహించుకొని మధన పడిపోతున్నారు.మీకు ఒక ముఖ్య విషయం చెప్పాలి. .వ్యాధి పూర్తిగా క్యూర్ అయినా ..సంతానానికి సంక్రమించే అవకాశము వుందని డాక్టర్ చెప్పిన సూచనను అనుసరించి..సంజయ్ దంపతులు అనాధ పాపను దత్తత తీసుకొని పాపకో జీవితాన్ని ప్రసాదించారు.

ఇప్పుడు నామనసు మీముందు ఉంచుతున్నాను.మీరు ఔనంటే నేను మీ పాణిగ్రహణానికి రెడీ. ముందు జీవితాన్ని..పంచుకుందాం.తర్వాత నేను మీబాధను పంచుకుంటాను.నాకు పిల్లలంటే అత్యంత ప్రేమే.కాని ఆ పిల్లలు నాపిల్లలే కావాలనే దురాశ లేదు..ఇక పిల్లల విషయం మీయిష్టం.మీజబ్బు విషయం అమ్మా నాన్నలకు చెప్పకండి.మన మధ్యే సమాధి చేద్దాం.మీరు ఒప్పుకుంటే యిద్దరం మన కంపెనీ ముంబై హెడ్ ఆఫీసుకు ట్రాన్స్ ఫర్ చేయించు కుందాం.వీలుకాకపోతే రిజైన్ చేసి మరో కంపెనీలో జాబ్ సంపాదించు కుందాం.సంజయ్ వున్నాడు..అతిగా వూహించుకుంటున్నాను.

ఎక్కువమాట్లాడివుంటే క్షమించండి.” తలెత్తి చూసిన సత్య కన్నీటి ధారలతో తననే తధేకంగా చూస్తున్న సంజనాను చూసి తికమకపడిపోయాడు.తెల్లముఖం పెట్టేసాడు. “మీరు చీమంత విషయాన్ని ఏనుగంత చేసుకొని మీరు బాధపడి అమ్మానాన్నల్ని బాధ పెట్టేస్తున్నారు.నేను మీకు లేనిపోని ఆశలు కల్పించి చెప్పడంలేదు.కళ్ళముందు జరిగిన వాస్తవాన్ని చెపుతున్నాను.
పెళ్లి వద్దనుకుంటే కనీసం హితునిగా..స్నేహితునిగా నైనా స్వీకరించండి.” “తనను..తనతోబాటు సమస్యను కుడా స్వీకరిస్తాను అని ముందు కొస్తున్న సత్య సంజన మనసుకు ఆపద్బంధువులా భాసించాడు.ఐదు సంవత్సరాలనుండి తనప్రేమకోసం సత్య పడుతున్న ఘర్షణ ప్రతి నిత్యం బ్రాడ్ కాస్ట్ చేసిన వాణి మాటలు మనసులో ప్రతిధ్వనిస్తుంటే ..ప్రేమల పేరుతో మోసపోతున్న ఎందరో అమ్మాయిల జీవితాలు గుర్తొచ్చాయి.తను కూడా మోసపోతే?కాని తనముందు వున్న వ్యక్తి తనతో బాటు తన సమస్యను కూడా స్వీకరిస్తానంటున్నాడు. ఐదు సంవత్సరాలనుండి ఆఫీస్ అమ్మాయిలతో మర్యాదగా ప్రవర్తించిన వ్యక్తి.తనను ఎంతగా ప్రేమిస్తున్నాడో ..అంతగా తన జబ్బును తెలుసుకొని కూడా ప్రేమిస్తున్నాడు.జీవితంతో బాటు సమస్యను కూడా స్వీకరిస్తాను అంటున్నాడు.అతను కోరుకుంటే తనకంటే ఎందరో అందమైన అమ్మాయిలు అతనితో జీవితాన్ని పంచుకోడానికి సిద్ధంగా వుంటారు.అందాన్ని పంచుకునే అబ్బాయిలు వుంటారు.కాని సమస్యను తెలుసుకుని జీవితాన్నే పంచుకుంటానంటున్నాడు సత్య.అటువంటి ఆస్తి అంతస్తులు,ఆదర్శ భావాలున్న సత్య దొరకడం నిజంగా తన అదృష్టమే.నడుచుకుంటూ వచ్చిన అవకాశాన్ని కాలదన్ను కోవడం మూర్ఖత్యమే అవుతుంది”

ఒక గట్టి నిర్ణయానికి వచ్చింది సంజన.“మిస్టర్ సత్యా!నాకు పెళ్లిమీద కోరిక లేదు.కాని మీ మాటలు వింటుంటే జీవితం మీద ఆశలు చిగురిస్తున్నాయి. సునయన ఫోటోలు చూశాక ..మనోధైర్యాన్ని యిచ్చే మీమాటలు విన్నాక నేనెందుకు జీవితం కోసం పోరాటం చేయలేను ?అనిపించింది.మీ అండతో తప్పకుండా పోరాడుతా నా జీవితం గురించి అమ్మానాన్నలు పడుతున్న మనోవ్యధకు స్వస్తి పలుకుతా.”
దృఢ మైన నిర్ణయంతో కుడిచేతిని అందిస్తున్న సంజనను అపురూపంగా చూస్తూ..తన చేతిని అందించాడు సత్య. “సంజనా !మై లైఫ్..ఇదికలకాదుకదా?” అంటూ సంజన చేతిని గుండెల కు హత్తుకున్నాడు. “వెరీ స్మార్ట్ సత్యా !నీకుడిచేతి బొటనవేలెత్తి చూపించమంటే అమ్మాయిపాణినే గ్రహించి పాణి గ్రహణం చేసేసావు.కంగ్రాట్స్.”అప్పుడే ప్రవేశించిన రేణుకా దేవి ఆనందాన్ని వ్యక్తం చేస్తుంటే సంజనా సత్యాలు వచ్చి ధర్మారావు రేణుకా దేవి పాదాలకు నమస్కరించారు.

******

నెల రోజుల తర్వాత ముంబై బయలు దేరిన సంజనా సత్యలకు యిద్దరి అమ్మానాన్నలతో బాటు ఆఫీస్ స్టాఫ్ శంషాబాద్ విమానాశ్రయంలో డిపార్చర్ లాంజ్ లో ఘనమైన వీడ్కోలు చెప్పారు.“ఏయ్ సంజు డియర్! ముంబై వెళ్ళి నీ బెస్ట్ ఫ్రండ్ వాణిని మర్చి పోవుకదూ?”
మురిపెంగా ముద్దుపెట్టుకుంటూ అడిగింది వాణి.“అదంతా మీ బావగారు సత్తెకాలపు సత్తయ్యను అడుగు.”“ఐస్ బెర్గ్ సంజనాను రెండు రోజుల్లో కరిగించి కాజేసిన బావగారు సత్య కాలం సత్తయ్య ?పెళ్ళంటూ చేసుకుంటే మీ బెస్ట్ ఫ్రెండ్ సంజనానే చేసుకుంటాను.కావాలంటే బెట్.అనిశపధం చేసి పంతం నెగ్గించు కున్న సత్య నీ దృష్టిలో సత్తెకాలపు సత్తయ్య? అయితే రెండే రెండు రోజుల్లో వ్రతభంగం చేయించుకొని పాణిని సత్తయ్యకు అందించిన నిన్ను ఏమనాలి? పప్పుముద్ద అనాలా?సత్తెకాలపు సత్తమ్మ అనాలా? అయినా రెండే రెండు రోజుల్లో నీరు గారిపోయిన నిన్ను నాఫ్రెండని చెప్పుకోడానికే సిగ్గుగావుంది.” “వాణీ..నాముద్దుల రాణీ! నాకు క్లోజ్ ఫ్రెండ్ గా వుంటూ నువ్వు మీబావగారికి రహస్యంగా అందించిన రోజువారీ సమాచారం నాకు తెలీదనుకోకు.ఒకవిధంగా మమ్మల్ని కలిపింది నువ్వే.నిన్ను నా క్లోజ్ ఫ్రెండని చెప్పుకో డానికి గర్వంగా వుంది.బై యు ఆల్.” మరోసారి “ఏడు అడుగులు” వేస్తూ యిద్దరు ఫ్లైట్ ఎక్కడానికి ముందుకుసాగారు..నవ దంపతులు..సత్య సంజనాలు.

మరిన్ని కథలు

Vimanam lo kalakalam
విమానంలో కలకలం
- తాతా కామేశ్వరి
Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ
Chandruniko noolu pogu
చంద్రునికో నూలు పోగు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Anaadha atidhyam
అనాథ అతిథ్యం
- - బోగా పురుషోత్తం
Vibheeshana Sharanu
విభిషణుని శరణు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల