పూర్ణయ్య పౌరోహిత్యం - హైమా శ్రీనివాస్

poornaiah pourohityam

"అయ్యో! ఇదేం ఖర్మరా బాబూ! నాకు పెళ్ళి మంత్రాలు రావంటే నమ్మరేమయ్యా!"

"అదెట్టా నమ్మతాం బామ్మడా!!! ఊరూరంతా పిల్కాయకాడ్నుం సీసెప్తా ఉంటేనూ! నన్నుగానీ మోసం సేద్దారని ఎత్తేత్తుండావేమో జాగరత్త. నాకసలే కోపవెక్కవ" అని ఆ ’కుల’ పెద్ద బెదిరించాడు, కొయ్యకత్తి చూపి. ఆకత్తి చూడగానే గుండెల్లో దిగినంత భయమేసింది పూర్ణయ్యకు, చెమటలు క్రిందికికారి పంచె తడిసి పోయింది. మంచులో బట్టల్లేకుండా కూర్చున్నట్లు వడవడా వణక సాగాడు.

వణుకుతూ నే నోరుపెగల్చుకుని మాట్లాడాలని ప్రయత్నించసాగాడు. 'ఇదెక్కడిగోలరా దేవుడా! నా ‘జంబాల’ మాటలవల్లే నాకీ కీడుమూడింది. నోరుంది గదాని కోతలుకోశాను, నాపూర్వీకులగురించీ గొప్పలు చెప్పాను. ఇప్పుడేం చేతున్రాదేవుడోయ్!' అంటూ దిక్కుచూపమని దేవుడ్ని వేడుకోసాగాడు.

ఆ ఆటవిక ‘కుల’ పెద్ద "యామాయె బామ్మడా!! ఆమంత్రగా లేవో పైకే సెప్పే రాదేంటా!, పెల్లవుద్ది, లేపోతే నీపానం నాసేతుల్లో పోద్ది" అని మరోమారు బెదిరించాడు. పూర్ణయ్య తలపట్టుక్కూర్చున్నాడు, తనబుధ్ధిపొరపాటుకు తానపుడు పడుతున్నపాట్లకు చెంపలు పటాపటావాయించేసుకున్నాడు. ఇంతకూ జరిగిందేమంటే..!

బరంపురంలో పూర్ణయ్యను తెలీనివారుండరు. ఏ ఇంటివారినడిగినా, ఏపిల్లగాడినడిగినా "ఓఆ ‘డంబాల’ పూర్ణయ్యా! "అనో" వేద మంత్రాల పూర్ణయ్యా అనో " "జొల్లుమాటల పూర్ణయ్యా!" అనో చెప్తారు... అసలు విషయానికొస్తే, పూర్ణయ్య పూర్వులు 'వేద పండితులుట!’, అదీనీ పూర్ణయ్య చెప్తేనే అందరికీనీ తెలిసింది. "మాతాతలు నేతులు త్రాగారు, ఆ అజీర్తి ఇంకా మాకు తగ్గలేదు, అందుకే మేం నెయ్యివాడం, కావలిస్తే మామూతులు వాసనచూడండి నేతివాసనేయట్లా?!" అనేవాడు పూర్ణయ్య.

ఎవరైనా భోజనానికి పిల్చి నెయ్యివడ్డించేసమయంలో "మాపూర్వులు నమకంచమకం, వేదం చదువుతూంటే ఆ ఈశ్వరుడలావచ్చి నిల్చునేవాట్ట! మంత్రోఛ్ఛారణ అంటే మాపూర్వులదే సుమండీ! వారు మంత్రం చదివితేనే ఎక్కడైనాపెళ్ళిజరిగేది! వీళ్ళంతా లొల్లాయి మంత్రగాళ్ళు. వీరి మంత్రాలూ మంత్రాలే! పొట్టకూటి మంత్రాలు." అని అందర్నీవిమర్శించేవాడు. తన అప్రస్తుత ప్రసంగాలతో అందరితలలూ తినేవాడు, తన బడాయిమాటలతో తెలీకుండానే ఊరి పండితులనూ, వైదిక బ్రాహ్మణులనంతా విరోధులను చేసుకున్నాడు. పూర్ణయ్య సోది తెలీనివారు ఆఊర్లోనే లేరని చెప్పాలి. ఇంతాచేసి మాటలుతప్ప ఏనాడూ ఏసందర్భంలోనూ ఒక్కమంత్రం చదివిన పాపానపోలేదు.
ఎక్కడైనా పెళ్ళిళ్ళూ, పేరంటాలూ జరుగుతుంటేనూ, గృహప్రవేశాలూ, వ్రతాలూ, నోములూ జరుగుతుంటేనూ పిలవకుండానే పేరంటానికి ‘గండు ముత్తైదులా’, ‘పోతు పేరంటాల్లా’ హాజరయ్యేవాడు. పోనీ గదా వెళ్ళినవాడు ఊరికే ఉంటాడా అంటే అయ్యో అదీలేదు! వాళ్ళు పెట్టిందింత తిని బయట పడితే బావుండేది. అబ్బేఅలాచేస్తే అతడు పూర్ణయ్యెందుకవుతాడూ!

“వల్లిస్తే మావాళ్ళే వల్లించాలి, వాళ్ళేచేయాలి ఏకార్యమైనా, ఇతర్లకేం వచ్చుమంత్రాలూ! ఇలాగేం చదవటం, హవ్వ! వత్తులేవీ?, పొర్లులేవీ?, మంత్రం సరిగ్గా పలక్కుంటే అర్ధమే మారిపోదూ!" అని వ్యాఖ్యనాలు చేస్తూనే ఉండేవాడు. కార్యక్రమం పూర్తయ్యేవరకూనూ. అటు పురోహితునికీ, ఇటుఇంటి వారికీ పెద్దతలనొప్పై పోయేది పూర్ణయ్యతో. బ్రాహ్మడాయె వెళ్ళిపొమ్మని చెప్పలేక భరించేవారంతా. "పోనీ తమరే వచ్చి చదవండి పూర్ణయ్యగారూ! మాకొచ్చిందింతే! మాకు నేర్పిన గురువులిలాగే చెప్పారు." అని ఆవైదికులంటే "హయ్యో! హయ్యో! నేను పొఠ్ఠలు కొట్టేవాడిననుకున్నారా! మీ ఒరుంభడి నేనెందుకు కాజేస్తును? చూస్తూ ఉండలేక షవరింఛా నంతే!" అనేవాడు. అందరూ కట్టకట్టుకుని వీడిపొగరు అణగే మార్గమేదైనా రాక పోదని' ఎదురుచూడసాగారు.

ఓమారు ఆఊరి ఓ కుర్రాడికి పెళ్ళయ్యాక గృహప్రవేశమై అరాత్రి గర్భాదానం, అంటే తొలిరేయన్నమాట! జరుగుతున్నదని తెల్సుకుని అక్కడ ప్రత్యక్షమయ్యాడు మన పూర్ణయ్య, ఇతడ్ని చూడగానే అంతా ముఖముఖాలు చూసుకున్నారు, దక్షిణకై పిలువగా వచ్చిన బ్రాహ్మణులు 'వీడెక్కడ దాపురించాడురా! మనకూ అనుకున్నారు. తతంగం మొదలవగానే పూర్ణయ్య అందుకున్నాడు. "గర్భాధానం మంత్రాలిలాగేనా చెప్పటం, గర్భాధానమంటే ఏంటో తెల్సామీకసలు? వేధ మేధీ!! హోమ మేదీ! ఊరికే పండ్లూపాలూ, స్వీట్లూ పెట్టి లోనికి పంపడమేనా గర్భాధానమంటే!" అనగానే ఆడవారంతా కిసుక్కున నవ్వగా, మొగవారు ముఖాలు వంచుకున్నారు.

ప్రధాన పురోహితుడు "పూర్ణయ్యా! నాకు నలుగురు కొడుకులు, మీకే పదేళ్ళైనా సంతులేరు." అన్నాడు కోపం పట్టలేక.

ఆ ఇంటిపెద్ద ఇహ ఉండలేక "పూర్ణయ్యగారూ! ఇలారండి" అని అతడ్నిరెక్క పుచ్చుకు పక్కకు లాక్కెళ్ళాడు." సమయాసమయాలు లేకుండా ఇదేంటండీ! ఇలామాట్లాడుతారు! చదువుకున్న పిల్లలు అసలే సిగ్గుపడుతుంటేనూ, మీవివరణ మరోమారు చెప్పించుకుంటాం గానీ ఈ దక్షిణపుచ్చుకుని ఈరోజుకు కదలండి" అంటూ గేటు బయటకు పంపించాడు. పూర్ణయ్య భార్య "ఇదేం విడ్డూరమండీ! పిల్చినా పిలవకున్నా అన్ని సందర్భాలకూ వెళ్ళి రచ్చచేయటమే! అంతా నాముఖాన నవ్వుతున్నారు, ఇలా చేస్తే ఒక్క నిముషం నేనుండను ఇంట్లో మా పుట్టింటికెళతాను" అంటూ ఇంట్లోరచ్చచేసి, బెదిరించడంతో అప్పటిక్కాస్త తగ్గాడు. ఇదో ఇంతలోనే ఈ ఆపద ముంచుకొచ్చింది పూర్ణయ్యకు.

ఆ అమావాస్య రాత్రి ఒక నల్లని ముసుగేసుకున్న కాటుక రంగు కోయవాడు ఊళ్ళోకొచ్చి "ఇక్కరెవురైనా పెల్లి మంత్రగాలు వొచ్చినోరుండరేంటి?" అని ఒకింటి తలుపుతట్టి అడగ్గానే, ఆ ఇంటాయన ఒక వైదిక పండితుడు గనుక వెంటనే పూర్ణయ్య ఇల్లు గుర్తుచెప్పి "మహ బాగా పెళ్ళితో పాటు గర్భాదాన మంత్రాలూ వచ్చిన వారాయన" అనిచెప్పటం, ఆకత్తీ, బాణాలూ పట్టుకున్న కోయవాడు పూర్ణయ్య ఇంటితలుపుతట్టి, బలవంతంగా తీసుకెళుతుండటం క్షణాల్లో జరుగుతుండగా చాటునుండీ ఊరి వైదికులంతా చూసి ఆనందించారు. తిక్కతిరిగి దారికొస్తాడని సంతోషించారు.

*********

"యాం పంతులయ్యోయ్! సస్తవా సదూతవా! తేల్సుకో!" హుంకరించాడు కులపెద్ద, ఆ అరుపుకు పూర్ణయ్య గుండె జలదరించి, వాస్తవానికి వచ్చాడు. చుట్టూ వున్న వారిని చూసి భయంతో పూర్ణయ్య నాలుక పిడచకట్టుకుపోయింది." పెళ్ళిమంత్రాలే చదువుతాను" అన్నాడు ఎలాగో ధైర్యం కూడ దీసుకుని. నిముషాల్లో పూర్ణయ్యను వేదిక వద్దకు తీసుకెళ్ళారు.

"యాం పంతులయ్యోయ్! నీ మంత్రగాలు మాగు తెలిసీలాగూ సదూ!.” ఆ ఉరుముకు ఝడిశాడు పూర్ణయ్య.
'ఈ అమావాస్య రోజున పెళ్ళేంటి వీళ్ళపిండాకూడు' అనుకుంటూ, తలనిండా ఈకలూ, పూసల దండలతో ఉన్న ఆ వధూవరుల ఎదుట కూర్చున్నాడు. ఆకొండజాతి వారంతా పగటి వేషగాళ్ళలా, సినిమాల్లో చూసే ఆటవిక విలన్లలా భయంకరంగా ఉన్నారు, చుట్టూ వలయంలా చేరారు. తప్పించుకుపోయే దారేలేదు. ఇహ విధిలేక పూర్ణయ్య మంత్రాలు మొదలెట్టాడు. "ఓం హ్రాం హ్రీం ఈపిలగాడు ఈకుల పోల్ల పిల్లను పెల్లాడాల్చిందే, పెల్లాడాల్చిందే, పెల్లాడాల్చిందే! ఓంహ్రాంహ్రీం ఈపిలగాడు ఈపిల్లకు దండేయాల్చిందే దండేయాల్చిందే, దండేయాల్చిందే, ఓం హ్రాం హ్రీం ఓకూనా పిలగానికి దండెయ్యమ్మా!" అనగానే ఇద్దరూ దండలు మార్చుకున్నారు. ఢమరుకాలూ, డ్రమ్ములూ, బూరలూ పెద్దగా ఊదారు కోయలంతా. ఆశబ్దాలకు పూర్ణయ్య గుండె జారింది. “కులపెద్ద కూన ఈపిలగాని నెత్తిన బెల్లం - జీలకర్ర యెట్టాల్చిందే ఎట్టాల్చిందే! ఎట్టాల్చిందే! యెట్టమ్మా ఎట్టు" పిల్ల పిలగాని తలపై చేయి పెట్టింది.

“ఓం హ్రాం హ్రీం పిలగా నీవూ ఎట్టు" ఇద్దరూ తలలపై పెట్టుకున్నాక, తాళితీసి అందరికీచూపి, అందరి చేతా తాకించినాక,"హూం హూమ్హాం హాం ఔం ఔం శ్రీం ఈతాళిబొట్టు పిలగాడు కూన మెళ్ళో కట్టాల్సిందే కట్టాల్సిందే! కట్టాల్సిందే" అని మంత్రం చదవగానే పిలగాడు తాళికట్టాడు, డ్రమ్ములు తెగమోగాయి. వెదురుబియ్యం లో పసుపు, నూనె, ఎర్ర రంగు కుంకుమ కలిపి "ఓం హ్రాం హ్రీం ఈ తలంబ్రాలు పిలగాడూ కూనా ఒకరితలపై ఒకరు పోచుకోవాల్చిందే పోచుకోవాల్చిందే పోచుకోవాల్చిందే ఓం హ్రాం హ్రీం" అని పూర్ణయ్య అనగానే, పోసుకున్నారు. "హూం హూమ్హాం హాం ఔం ఔం శ్రీం... కులపెద్ద కాల్లకి పిలగాడూ పిల్లా దండవెట్టాల్చిందే దండవెట్టాల్చిందే, దండవెట్టాల్చిందే!," అనగానే వధూవరులిద్దరూ దండాలుపెట్టారు.

పూర్ణయ్య "అయ్యా! దొరా పెళ్ళి ఐపోయింది." అని ఊపిరిపీల్చుకున్నాడు. "బామ్మడా!ఎంతిదిగా అర్ధగవయ్యేట్టు సదివావొయ్యా మంత్రగాలు, మాకు పెల్లి మంత్రగాలు సదివే పక్కూరి బామ్మడు ఊర్కి పోయిండ్రు, ఈ అమాసకే పెల్లిసేయాల్సొచ్చి నిన్ను తెచ్చినం యామనుకోకుయ్యాయ్! రావన్నావ్గా బాగా సదివినవులే మంత్రగాలు" అంటూ పూర్ణయ్య కాళ్ళకు మొక్కాడు "ఓరి నారీ! ఈబామ్మణ్ణి ఇంటికాడ ఒదిల్రా! బామ్మడా! మల్లా పిలత్తాం ఇగ నీవే మాకు బేమ్మడివి! మా పిలగాని పెల్లి వచ్చే అమాసకి" అంటూ ఓబస్తాడు వెదురు బియ్యం, తేనెడబ్బా, చింతపండు, కుంకుళ్ళూ, అరటిగెలలూ ఇచ్చిపంపాడు, కులపెద్ద.

ఇల్లుచేరిన పూర్ణయ్య, భయంతో చచ్చిపోతూ అప్పటికపుడు ఏసయ్య బండికట్టించుకుని, "అర్జంటుగా మామగారింటికెళ్ళాలని" చెప్పి సామానంతా సర్దుకుని ఇల్లు ఖాళీచేసేసి భార్యామణితో మామగారింటికి మకాం మార్చేసుకున్నాడు. అంతటితో పూర్ణయ్య పౌరోహిత్యం ముగిసింది. ఊరివారికీ పూర్ణయ్య పోడు తప్పింది.

మరిన్ని కథలు

Sammohanastram
సమ్మోహనాస్త్రం
- బొబ్బు హేమావతి
Abhimanam khareedu
అభిమానం ఖరీదు
- మద్దూరి నరసింహమూర్తి,
Nirvika
నిర్విక
- బొబ్బు హేమావతి
Anji marindoch
అంజి...మారిందొచ్
- కాశీ విశ్వనాథం పట్రాయుడు
Moodu vupayalu
మూడు ఉపాయాలు
- డా.దార్ల బుజ్జిబాబు
Ayyo sankaram mastaaru
అయ్యో! శంకరం మాస్టారు
- తటవర్తి భద్రిరాజు (949 3388 940)
Second hand
సెకండ్ హ్యాండ్
- బొబ్బు హేమావతి