నిర్ణయం - బొడ్డేడ బలరామస్వామి

decision

"ఎక్కడికమ్మా యీ ఎండలో?"

చెప్పులు తొడుక్కుంటుంటే మా అమ్మాయి అడిగింది. ఒక్క క్షణం ఏం చెప్పాలో బోధపడలేదు.

"ఇక్కడికే.‌ ఇప్పుడే వచ్చేస్తాను. నువ్వు టీవీ చూస్తూ వుండు" అని చెప్పి బయటపడ్డాను.‌ లాక్ డౌన్ కారణంగా నిత్యం హడావుడిగా వుండే వీధులు, నిర్మానుష్యంగా వున్నాయి. నోటికి చీరకొంగు అడ్డం పెట్డుకుని నడుస్తున్నాను. కరోనా మహమ్మారి ప్రజా జీవనాన్ని అస్తవ్యస్తం చేస్తోంది. వేసుకున్న ప్రణాళికలను, కన్న కలలను, ఆశలను అన్నిటినీ ఛిద్రం చేస్తోంది. సమయం పదిన్నరే అయినా ఎండ గట్టిగానే కాస్తోంది. నడుస్తున్నానే గాని మనసంతా చిందరవందరగా వుంది. ఏం చేయాలో, ఈ స్థితిలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కావడంలేదు. మా పక్క వీధిలో వుండే మా వారి స్నేహితుడు తులసీరావును సలహా అడుగుదామని బయలుదేరాను.‌ ‌ నేను వెళ్లేటప్పటికీ తులసీరావు వాకిట్లో కూర్చుని పేపరు చదువుతున్నాడు. నేను కాస్త ఎడంగా అరుగుమీద కూర్చున్నాను. తులసీరావు పేపర్లోంచి తల బయటకు పెట్టి నన్ను చూశాడు. పలకరింపుగా నవ్వి పేపరు మడత పెట్టాడు.
"పెద్ద సమస్య... నీ సలహా అడుగుదామని వచ్చాను" అన్నాను ఉపోద్ఘాతంగా. ఏమిటన్నట్టు ఆందోళనగా, ఆసక్తిగా నావైపు చూశాడు తులసీరావు. ‌‌‌‌ ‌‍‌‌‌ "అనుకున్న ముహూర్తానికే ఎవర్నీ పిలవకుండా సింపుల్ గా పెళ్లి జరిపించేద్దామని పెళ్ళికొడుకు తరుపువారు వత్తిడి చేస్తున్నారు. పెళ్లి వాయిదా వేద్దామంటే ససేమీరా ఒప్పుకోవడం లేదు" అన్నాను నెమ్మదిగా. "శివాజీ లేకుండానే...! " అన్నాడు విస్తుపోతూ. "విమానాలన్నీ రద్దయ్యాయి, ఆయన రావడానికి వీలు కాదు, పెళ్లి వాయిదా వేద్దామని బ్రతిమాలాను. అయినా వారు వినడం లేదు. పెళ్లి ఆపడం అమంగళమంటూ ఏవేవో చాదస్తపు కబుర్లు చెప్తున్నారు. జరిపించవలసిందేనని మంకుపట్టు పడుతున్నారు. అంతా సద్ధుమణిగాక వీలైతే ఆయనొచ్చాక వీలైతే రిసెప్షన్ పెడదామంటున్నారు. కాదూ కూడదంటే సంబంధం వదులుకుంటామని బెదిరిస్తున్నారు"
"మరి శివాజీకి ఫోన్ చేసి ఏం చేద్దామో... అడగాల్సింది కదా..." ‌‌‌‌‌ "ఆయన గురించి మీకు తెలియనిదేముంది. అడిగితే కచ్చితంగా చేసేయమంటారు. కాని ఆయన లేకుండా పెళ్లి చేయడం నాకిష్టం లేదు. ‌ ఒక్కగానొక్క కూతురు! దానికి ఘనంగా పెళ్లి చేయడం కోసం ఆయన ఎన్నో కలలు కన్నారు. అందుకోసమే ఇంతకాలం మాకు దూరంగా దుబాయ్ లో వుండి కష్టపడుతున్నారు. అలాంటిది ఆయన లేకుండా పెళ్లా? ఊహిస్తేనే దుఃఖమొస్తోంది" "అయితే మరేం చేద్దామని?" "ఏం జరిగినా... ఆయన లేకుండా పెళ్ళి ‌జరగానికి నేనొప్పుకోను. వాళ్ళ మొండిపట్డు కూడా నాకు నచ్చలేదు. అందుకే ఈ పెళ్లి మాకిష్టం లేదని చెప్పేద్దామని!" "మరి నీ నిర్ణయాన్ని జ్యోతితో చెప్పావా?". "ఇంకాలేదు. నీ సలహా విన్నాక చెపుదామని ఆగాను" తులసీరావు కుర్చీలో వెనక్కివాలి కళ్ళు మూసుకొన్నాడు. కొన్ని క్షణాల తర్వాత తెరిచి, నావైపు సూటిగా చూస్తూ "ప్రపంచమంతా భయం గుప్పెట్లో కొట్టుమిట్టాడుతున్న యీ తరుణంలో శుభాకార్యం జరుపుకోవడం సమంజసం కాదని నా ఉద్దేశం! అదీకాక ఒక్కగానొక్క కూతురి పెళ్లి దగ్గరుండి జరిపే, చూసే భాగ్యం తండ్రికి లేకుండా... " అని నిట్టూర్చాడు. "నిర్ణయం తీసుకునేముందు జ్యోతి అభిప్రాయం కూడా తెలుసుకో... ఇది ఓ ఆడపిల్ల జీవితానికి సంబంధించినది కదా" అన్నాడు ఇక తను చెప్పడానికేమీ లేదన్నట్టు పేపరు మడత తిరిగి విప్పుతూ.‌ అతడి సలహా విన్నాక తేలికపడిన మనసుతో ఇంటిదారిపట్టాను. ఈ విషయం జ్యోతికి ఎలా చెప్పాలా అని ఆలోచిస్తూ నడుస్తున్నాను. చెప్పాక, తను ఎలా స్పందిస్తుందోనని ఓ పక్క చిన్నగా భయం కూడా పట్టుకుంది.
"జానకమ్మ" అన్న పిలుపు లీలగా వినిపించి ఆగాను. కాస్త దూరంలో చెట్టు నీడన రాములయ్య దిగులుగా కూర్చుని కనిపించాడు.‌ అతడు నిలువనీడలేని ఓ అనాథ! కనిపించినప్పుడల్లా భోజనం చేయమని డబ్బులిస్తూ వుంటాను. దగ్గరికెళ్లి "ఏం తాత?" అని అనునయంగా అడిగాను. "ఆకలి... పేనం తోడేతుందమ్మ. ఎవురింటికెళ్లినా కరోనా భయంతో రావద్దని కసురుకుంటున్నారు. తినటానికి కాస్త అన్నముంటే తెచ్చమ్మ. నీకు పుణ్యముంటాది" దీనంగా అన్నాడు రాములయ్య. అది విని నా గుండె కలుక్కుమంది. బాధతో కళ్లు చెమ్మగిల్లాయి. "తప్పక తెస్తాను తాత! దిగులు చెందకు" అంటూ రాములయ్యకు అభయమిచ్చి, వడివడిగా ఇంటివైపు అడుగులు వేశాను. మాయదారి కరోనా... ఎక్కడ పుట్టి, ఎక్కడకు చొచ్చుకొచ్చింది. అందరి జీవితాలను తలక్రిందులు చేసింది. రాజుపేద అనే భేదభావం లేకుండా, ఆ దేశం ఈ దేశమనే తేడా లేకుండా అందరినీ, అంతటినీ వణికించేస్తోంది. ఈ రాకాసి మూలంగా రాములయ్యలాంటి ఎందరు నిర్భాగ్యులు తిండికి లేక ఇబ్బందులు పడుతున్నారో కదా... అనుకుంటూ ఇంటికి చేరుకున్నాను. "అమ్మా... పెళ్ళికొడుకు నాన్న .. అదే మా మావయ్యగారు ఫోన్ చేశారు. నువ్వు లేవని చెప్పాను. వచ్చాక వెంటనే ఫోన్ చేయమని చెప్పారు" అంది జ్యోతి.‌ కాల్ కలిపి నాకు ఫోన్ అందించింది.‌

విషయం పాతదే... పెళ్ళికి ఒప్పుకోమని వత్తిడి!... ఆఖరి అస్త్రంగా బెదిరింపు! కాసేపట్లో తిరిగి కాల్ చేస్తానని కట్ చేశాను. జ్యోతితో ఎలా చెప్పాలా అని సతమతమవుతుంటే తనే అడిగింది. "ఏమిటమ్మ విషయం?" అంటూ.
వెంటనే దాచుకోకుండా అంతా చెప్పాను. "నీ నిర్ణయమేమిటో చెప్తే, దానిని బట్టి వారికే విషయమూ చెప్పడానికి వీలవుతుంది" అన్నాను తన వైపే తీక్షణంగా చూస్తూ. జ్యోతి ముఖం కోపంతో ఎర్రబడింది. "బుద్ధుందా వాళ్ళకు? మానవత్వం లేని మూర్ఖుల్లా ప్రవర్తిస్తున్నారే? దేశం... ప్రపంచం... జీవన్మరణ సమస్యతో‌ అల్లల్లాడుతుంటే... వేలాదిగా జనం పిట్టల్లా రాలిపోతుంటే...ఈ విపత్కర సమయంలో పెళ్ళా?... శుభకార్యాలు, వేడుకలు జరుపుకునే సమయమా ఇది?...మానవాళిపై దాడి చేస్తున్న కరోనా రాక్షసిపై అంతా ఉమ్మడిగా పోరాడవలసిన సమయం!... అందరి బాధ మన బాధగా భావించి, ఒకరికొకరు ధైర్యం చెప్పుకోవలసిన సమయం!... ‌ప్రభుత్వానికి సహకరిస్తూ, సంఘీభావం తెలియజేయాల్సిన సమయం!... పౌరులుగా ఇది మన విధి!" అంది గట్టిగా. మళ్లా వెంటనే " అమ్మా... క్షణమాలస్యం చేయకుండా ఈ పెళ్లొద్దని చెప్పేయ్" అంది దృఢంగా, కోపంగా.
జ్యోతి చూపిన తెగువ, స్ఫూర్తి నాకు కొండంత ధైర్యాన్నిచ్చింది. ఫోన్ చేసి, ఈ పెళ్లి మాకిష్టం లేదని ముఖమ్మీద కొట్టినట్టు చెప్పేశాను. మనసు దూదిపింజెలా తేలికైంది.‌ రాములయ్య దీనమైన మొహం గుర్తుకొచ్చింది. చేయవలసిన కర్తవ్యం బోధపడింది. ఈ ఆపద్కాలంలో నిలువ నీడలేని, రెక్కాడితే డొక్కాడని పేదలను ఆదుకోవడం సాటి మనుష్యులుగా మన బాధ్యత! ఈ గండం గట్టేక్కే వరకూ రాములయ్యలాంటి కొందరి అభాగ్యులకైనా ఆకలి తీర్చే అమ్మను కావాలని గట్టిగా నిర్ణయించుకున్నాను. స్టౌవ్ ముట్టించి ఎసరు పెట్టాను. జ్యోతి నా సంకల్పాన్ని మెచ్చుకుంటూ, సంతోషంగా కూరగాయలు తరగడం మొదలుపెట్టింది.

మరిన్ని కథలు

Vibheeshana Sharanu
విభిషణుని శరణు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి
Pramod Pesarattu
ప్రమోద్-పెసరట్టు
- వీరేశ్వర రావు మూల
Atanu aame madilo
అతను ఆమె మదిలో
- బొబ్బు హేమావతి
Atani kannu aame meeda padindi
అతని కన్ను ఆమె మీద పడింది
- బొబ్బు హేమావతి
Kottha ugadhi
కొత్త ఉగాది
- తాత మోహనకృష్ణ