అవ్వ చెప్పిన బాట - అఖిలాశ

path shown by grandma

“అబ్బా.., అబ్బా.., అబ్బా.., మీతో పడలేకపోతున్న! ఎందుకురా నన్ను పీక్కు తింటాండారు.” మీ నాయనేమో ఆదివారం వచ్చిందంటే సాలు ఊరిపై పడి తిరుగుతాడు. ఆదివారమే పిల్లోళ్లు ఇంట్లో ఉండారే అదొకటే సమాళించుకోలేదు ఇంటికాడుండి కాస్త సాయం చేద్దామనే ధ్యాసే లేకపాయే. ప్రదీది నేనే సూసుకోవాలంటూ పదేళ్ల వఫా, ఆరేళ్ల ఇషాన్ పై తల్లి షహనాజ్ గట్టిగా అరిచింది.

తల్లి కేకలతో ఇంట్లోనే సైకిల్ తొక్కుకుంటున్న వఫా సైకిల్ దిగి సోఫాలో కిక్కురుమనకుండా కూర్చొంది. వఫాకు బాగా తెలుసు అమ్మిజాన్ గొంతు ఆ స్థాయిలో పెరిగిందంటే ఆ తర్వాత చేతులకి పని చెప్తుందని.

ఆరేళ్ల ఇషాన్ మాత్రం తల్లిని ఏమాత్రం లెక్క చేయకుండా తన గిన్నెలో ఉన్న బొరుగులను ఇల్లంతా చల్లుతున్నాడు. ఇషాన్ పది నిముషాలు కూడా కూర్చోడు. “తల్లి ఇంటిని ఎంత సర్దిన ఇల్లు పీకి పందిరి వేస్తూనే ఉంటాడు.” ఆదివారం వచ్చిందంటే సాలు కనీసం నాలుగు, ఐదు సార్లు తల్లి చేతిలో దెబ్బలు తింటూ ఉంటాడు.

బొరుగులు ఇల్లంతా చల్లి తానూ కూడా దీది పక్కన సోఫాలో కూర్చొన్నాడు. కూర్చొన్న కాసే పటికే దీది చేతిలో రిమోట్ లాక్కున్నాడు. ఇషాన్ కు పోగో చూడటమంటే ఇష్టం. వఫాకేమో డిస్కవరీ ఛానల్ లో జంతువులను చూడటం ఇష్టం. టీవీ ముందు కూర్చొంటే వీరిద్దరి మధ్య జరిగే అతి సాధారణమైన గొడవే అది. రిమోట్ విషయంలో గొడవ జరిగి దీదిపై పిడి గుద్దులు కురిపించాడు ఇషాన్. చూడటానికి చిన్నవాడే కాని సున్నిత మనస్కురలైన దీదిపై తన ప్రతాపాన్ని చూపుతూనే ఉంటాడు.

“ఇషాన్ చేతిలో దెబ్బలు తిన్న వఫా ఏడ్చుకుంటూ వంటగదిలో ఉన్న అమ్మిజాన్ దగ్గరికి పోయి ఫిర్యాదు చేసింది.” షహనాజ్ అంతెత్తు లేచి ఒక ఉదాటున హాల్ రూమ్ లోకి చేరుకొని “నీకు మీ నాయనకు నేను నా కూతురంటే భయమే లేకుండా పోయింది. దీదిని ఎందుకు కొట్టావని తన భర్తపై ఉన్న కోపాన్ని పిల్లవాడిపై చూపించింది.

ఇషాన్ మాత్రం నేనేమి దాన్ని కొట్టలేదు అదే ముందు నన్ను కొట్టింది అందుకే నేను కూడా కొట్టానని ఏమాత్రం భయం లేకుండా కళ్ళు పెద్దవి చేసి చెప్పాడు.

“ఏందిరా దీదిని పట్టుకొని దాన్ని దీన్ని అంటావా నువ్వు కూడా మీ నాయనలా తయారైతాండవని నాలుగు దెబ్బలేసింది.”

గోంగెలు పెట్టి ఏడుస్తూ నాయన వచ్చాక మీ సంగతి చెప్తానులే అంటూ చూపుడు వేలు చూపించాడు ఇషాన్.

అంతలోనే మధ్యాహ్న భోజనం కోసం వచ్చిన మహబూబ్ బాషా “ఏందే నా పిల్లోన్ని కొట్టినవాని నా బుజ్జే నా పండుగాడే అని ఎత్తుకున్నాడు.” ఏడుస్తూనే అమ్మి, దిది కలిసి నన్ను కొట్టినారు నాయన అమ్మి నిన్ను కూడా తిట్టిందని ఉన్నవి లేనివి చెప్పాడు.

పిల్లవాడు ఎందుకు ఏడుస్తున్నాడు? ఏమి జరిగిందనే విషయాలు పట్టించుకోకుండా ఎందుకే నన్ను పిల్లోన్ని తిట్టినావంటా అని గద్దించాడు.

ముందే పని ఒత్తిడిలో ఉన్న షహనాజ్ కళ్ళు ఉరిమి నువ్వేమో ఆదివారం బజార్లో బలాదూర్ తిరుగుతావు. వాడెమో ఇంట్లో ఆడిది ఈడికి ఈడిది ఆడికి పీకి ఇల్లంతా చెల్లాచెదురు చేస్తాడు. నేను ఒక్కదాన్నే చేసుకోలేక చస్తున్నానని వదిరింది.

“చిన్న గొడవ కాస్త చిలికి గాలి వానలా తయారైతోంది.” భార్యాభర్తలిద్దరూ గట్టిగ అరుచుకుంటున్నారు. ఆ శబ్దాలు విన్న పక్కింటి షరీఫా ఇంట్లోకి వచ్చి ఏమైంది బాషా భార్యను అలా తిడుతున్నావని అడిగింది.

షరీఫాకు అరవై ఏళ్ళు ఉంటాయి. పదేళ్లుగా షహనాజ్ కుటుంబంతో మంచి స్నేహం ఉండటంతో ఇంట్లో జరిగే ప్రతి విషయాలను షహనాజ్.., షరీఫాతో పంచుకుంటూ ఉంటుంది. భార్యాభర్తలు జరిగిన విషయం మొత్తం చెప్పి న్యాయం చెప్పమన్నట్లుగా చూశారు.

“చూడమ్మా షహనాజ్ భర్త మీద కోపాన్ని చిన్నపిల్లగానిపై చూపించకూడదు.” అనవసరంగా తండ్రి ప్రవర్తన వచ్చిందని పిల్లవాడిని దూరం చేసుకుంటున్నావు. పిల్లల ప్రవర్తన మన పెంపకం మీద ఆధారపడి ఉంటుంది. ఇద్దరు పిల్లలు గొడవ పడటం సహజం తల్లిగా తప్పు ఎవరు చేశారో వారికి అర్థమయ్యేలా చెప్పాలి గాని గట్టిగా అరిస్తే పిల్లలు మనపట్ల వ్యతిరేకత పెంచుకుంటారు.

ఇషాన్ నీ పట్ల వ్యతిరేకత పెంచుకుంటూ తండ్రికి దగ్గర అవుతున్నాడు. పిల్లల గొడవలను స్త్రీ పురుషుల అధిక్యతలతో పోల్చడం తప్పు పిల్లలకి అవన్నీ తెలియవు. కానీ నువ్వు మాత్రం పిల్లవాడిని ఆ విధంగా చూస్తున్నావని షహనాజ్ కి వివరించింది.

బాషా నువ్వు కూడా జరిగిన విషయం తెలుసుకోకుండా పిల్లవాడు నిజం చెప్పాడా అబద్ధం చెప్పాడా తెలుసుకోకుండా భార్యపై అలా నోరు పారేసుకోకూడదు. పిల్లోలను తలిదండ్రులు సమానంగా చూడాలి. భార్యాభర్తలుగా మీరిద్దరూ ఒక మాటపై నిలబడి పిల్లోలను పెంచాలి. పిల్లోలు మీరిద్దరూ ఒకటేనని అనుకోవాలి. అలా కాకుండా మీరిద్దరే ఇలా గొడవ పడితే పిల్లోలు తప్పుదోవ పడతారు. ఇంట్లో పిల్లోలు ఉన్నప్పుడు ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలే తప్ప ఇలా మీరిద్దరు గొడవ పడితే ఆ ప్రభావం పిల్లలపై పడుతుంది. అలోచించి సరైన నిర్ణయం తీసుకోండని చెప్పి ఎల్లిపోయింది షరీఫా.

తమ తప్పులు తెలుసుకున్న భార్యాభర్తలిద్దరు ఒకరికొకరు క్షమాపణ చెప్పుకున్నారు. ఇద్దరు కలిసి ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకొని పిల్లోలను సరైన విధంగా పెంచాలని నిర్ణయించుకున్నారు. ఎలాంటి ఘర్షణలు పిల్లోల ముందు చేయకూడదని, ఏదైనా సరే ఇద్దరు మాట్లాడుకొని సరైన నిర్ణయాలు తీసుకోవాలనుకున్నారు. బాషా షహనాజ్ ని గట్టిగా కౌగిలించు కోవడంతో ఇషాన్ గట్టిగా చప్పట్లు కొట్టాడు. వఫా మాత్రం తనకేమి తెలియనట్లుగా కునుకు తీస్తోంది.

మరిన్ని కథలు

Vibheeshana Sharanu
విభిషణుని శరణు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి
Pramod Pesarattu
ప్రమోద్-పెసరట్టు
- వీరేశ్వర రావు మూల
Atanu aame madilo
అతను ఆమె మదిలో
- బొబ్బు హేమావతి
Atani kannu aame meeda padindi
అతని కన్ను ఆమె మీద పడింది
- బొబ్బు హేమావతి
Kottha ugadhi
కొత్త ఉగాది
- తాత మోహనకృష్ణ