ఒంటరి బతుకు - యనమండ్ర ప్రసన్న కుమార్ , కువైట్

lonely life

రాత్రి భోజనం చేసిన తర్వాత రామచంద్రం విశ్రాంతిగా మంచంపై మేను వాల్చినా నిద్రాదేవి ఎంతసేపటికీ అతన్ని కరుణించలేదు. అతని మదిలో అంతులేని ఆలోచనలు! ఎంతకీ తెగని ఆలోచనలు మనసుని కల్లోల పరుస్తున్నాయి. రిటైరై పదేళ్ళు దాటింది. తనకా వయసు పైబడింది, పైగా ఒంటరితనం తీవ్రంగా బాధిస్తోంది. అయిదేళ్ళ క్రితం వరకూ భార్య సీతమ్మ తోడుగా ఉండటంవల్ల రామచంద్రానికి ఏ కష్టమూ తెలియలేదు. ఆమె గతించిన తర్వాత అతనికి ఈ లోకమే శూన్యమైపోయింది. భార్య బతికి ఉండగా తెలియలేదు కానీ ఆమె పోయిన తర్వాత ఆమె లేని కొరత కొట్టొచ్చినట్లు కనిపించసాగింది రామచంద్రానికి. ఉన్న ఒక్కగానొక్క కొడుకు నాగేశ్వర్ దేశాంతరాల్లో ఉన్నాడు. పై చదువు పూర్తిచేసిన తర్వాత ఆస్ట్రేలియాలో మంచి జాబ్ వచ్చింది. ఆ వెళ్ళడమే వెళ్ళడం! తల్లి చనిపోయినప్పుడు మాత్రం ఒకసారి వచ్చాడు. ఆ తర్వాత మరి ఇక రానేలేదు. అక్కడే తనకి నచ్చిన అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాడు కూడా. వాళ్ళిద్దర్నీ ఇక్కణ్ణుంచే ఆశీర్వదించక తప్పింది కాదు రామచంద్రానికి. ఇప్పుడు వాళ్ళకో అబ్బాయి కూడా.

ఫోన్లో కొడుకుతో మాట్లాడినప్పుడు ఒకసారి రమ్మని చెప్పాడు కాని, అదిగో ఇదిగో అని రోజులు గడిపేస్తున్నాడు నాగేశ్వర్. తనా అక్కడకి వెళ్ళలేడు. వాళ్ళొచ్చి తనదగ్గర ఉంటే బాగుండునని తలవని రోజులేదు, అలా జరిగే అవకాశం లేదని తెలిసి కూడా.

అయినా తన ఆశ, పిచ్చిగాని, విదేశాల్లో చక్కని సదుపాయాలు, మంచి జీతం వచ్చే ఉద్యోగం వదులుకొని ఇక్కడికెందుకు వస్తారు వాళ్ళు అసలు? అయినా ఆశతీరక వాళ్ళకోసం ఎదురుచూపులు చూస్తూనే ఉన్నాడు. స్వంత ఊరైనా అందరితో కలివిడిగా ఉండే మనస్తత్వం కాదు రామచంద్రానిది. అసలే మొహమ్మాటస్థుడు. ఉదయం, సాయంత్రం వాకింగ్‌కి వెళ్ళడం, తెలిసిన ఒకరిద్దరితో కొద్దిగా మాట్లాడటం, అంతే. ఆ తర్వాత నుండి ఇల్లే అతని లోకం, పుస్తకాలతోనే కాలక్షేపం అంతా! కాకపోతే, తన అవసరాలు చూడటానికి కొడుకు ఒక మనిషిని ఏర్పాటు చేసాడు. అతడే సూర్యం అనే ఒక అనాథ. అతను తనకి ఇంటిపని, వంటపని చేసి పెట్టడానికే కాక, వేళకి సరిగ్గా మందులు వేసుకుంటున్నాడో లేదో కూడా కనిపెడతాడు. ప్రస్తుతం తన ఒంటరి జీవితానికి వాడొక్కడే ఆలంబన. తన ఒంటరి బతుకుకు తోడుగా నిలిచిన సూర్యంలోనే కొడుకును చూసుకుంటూ బతుకుని వెళ్ళదీస్తున్నాడు. తన ఒంటరితనం పారదోలడానికి సూర్యం బాగానే కృషి చేస్తున్నాడు. వాడే లేకపోతే తనెప్పుడో పిచ్చివాడై పోయేవాడు మరి. ఈ సమయంలో ఒంటరితనం ఎంతటి శాపమో తనలాంటి వారికి మాత్రమే తెలుస్తుంది. తను అసలు కొడుకు, కోడలు, మనవణ్ణి చూడకుండనే గతించిపోతానేమోననే బెంగ కూడా ఉంది. తన వయసు గలవాళ్ళందరికీ ఇలాంటి పరిస్థితి తప్పదేమో ఎప్పటికైనా! అసలే కాలక్షేపంలేని రామచంద్రానికి కరోనా వల్ల విధించిన ఈ లాక్‌డౌన్ ఓ ఆశనిపాతంలా తోచింది. ఇప్పుడు ఎక్కడికీ వెళ్ళడానికి కూడా లేదు. వాకింగ్‌కి కూడా ఇప్పుడు వెళ్ళడంలేదు. తనలాంటి పెద్దవయసుగల వారికి ఈ కరోనా ప్రాణంతకమైనది మరి. నాలుగు గోడలూ చూస్తూ చదివిన పుస్తకాలే చదివి విరక్తిగా కూడా ఉంది. గతస్మృతులంతా నెమరువేసుకుంటూ ఏ అర్ధరాత్రికో నిద్రపట్టింది అతనికి.

ఉదయం నిద్రలేచి బ్రష్ చేయగానే కాఫీ కలిపి పట్టుకొచ్చాడు సూర్యం.

వస్తూనే, "బాబుగారూ!..మనకి శుభవార్త! ఇవాళనుండి లాక్‌డౌన్ నియమాలు సడలించారు. మీరు మళ్ళీ మార్నింగ్ వాక్ చేయవచ్చు." అన్నాడు సూర్యం.

టివిలోనూ అప్పుడే ఈ వార్త వస్తోంది. అదివిని, "ప్రభుత్వం లాక్‌డౌన్ నియమాలు సడలించింది కానీ, కరోనా ఈ ప్రపంచం మీద తన పట్టు ఇంకా సడలించలేదురా! పైగా ఇప్పుడే పట్టు బిగిస్తోంది కూడా. అందుకే ఇకముందు కూడా మనం జాగ్రత్తగానే మసలాలి సుమా!" అన్నాడు నవ్వుతూ.

"మీరన్నది నిజమే బాబుగారూ." అని ఒప్పుకున్నాడు సూర్యం.

కాఫీ తాగుతూ టివిలో వార్తలు చూస్తున్నారు. నాలుగో విడత లాక్‌డౌన్‌లో చాలా సడలింపులు ఉన్నాయి. దేశ ఆర్థిక స్థితి పట్టాలపైకి తేవడానికి మెల్లమెల్లగా ఒక్కో నిబంధన సడలిస్తున్నారు. తొలుత వ్యవసాయంపై నిబంధనలు ఎత్తివేసిన ప్రభుత్వం ప్రస్తుతం రైళ్ళ రాకపోకలు పునరుద్ధరిస్తోంది. త్వరలో విదేశాలనుండి విమానయానం కూడా అనుమతించబోతున్నారు.

ఆ వార్త విని నిట్టూర్చాడు రామచంద్రం. 'పోనీ, ఇప్పుడైనా తన కొడుకు నాగేశ్వర్ కుటుంబంతో వస్తే బాగుండును.' అని మనసులో అనుకున్నాడు.

అతని మనసులోని మాట గ్రహించాడేమో సూర్యం, "బాబుగారూ!...మీ అబ్బాయి ఇప్పుడు రావచ్చేమో!" అన్నాడు.

"ఒరేయ్! నీ మాటలతో నాలో ఆశలు రేకెత్తిస్తున్నావురా! అయితే వాళ్ళు అక్కడ ఉద్యోగాలు వదులుకొని రాగలరంటావా!" అన్నాడు రామచంద్రం.

అతని ప్రశ్నకి జవాబేమీ చెప్పలేకపోయాడు సూర్యం.

ఆ తర్వాత టివిలో వలస కూలీల వెతలు, వాళ్ళని గమ్య స్థానం చేర్చడం కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల మీద సమీక్షా కార్యక్రమం వస్తోంది.

**** **** **** ****

సరిగ్గా పదిహేను రోజుల తర్వాత, ఆ రోజు ఉదయం పూర్తిగా తెల్లారకుండానే తలుపు తట్టిన చప్పుడు వినిపించి తలుపు తీసిన సూర్యానికి కలిగిన ఆశ్చర్యం ఇంతా అంతా కాదు. వెంటనే, హడావుడిగా లోపలికెళ్ళి రామచంద్రాన్ని లేపాడు, "బాబుగారు!...చూడండి ఎవరొచ్చారో?" అంటూ.

వాడి హడావుడికి విస్తుబోతూ లేచి కూర్చున్నాడు రామచంద్రం. అప్పుడే ఇంట్లోకి ప్రవేశించిన వారిని చూసి ముందు సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాడు. తన కళ్ళని తానే నమ్మలేకపోయాడు. ఎదురుగా కొడుకు నాగేశ్వర్, కోడలు, ఆమె భుజం మీద మనవడు ఉన్నారు.

"నాన్నా!..." అంటూ పాదాలకి నమస్కరించాడు నాగేశ్వర్. కోడలు కూడా అతని పాదాలకి నమస్కరించింది. కొడుకుని దగ్గరకు తీసుకొని గుండెలకి హత్తుకున్నాడు రామచంద్రం. అతని కళ్ళల్లో ఆనందాశ్రువులు. నోట మాట పెగలడం లేదు. నాగేశ్వర్ పరిస్థితి ఇంచుమించు అలానే ఉంది.

"నాన్నా! ఈ లాక్‌డౌన్‌లో మీరెలా ఉన్నారో అన్న విషయం నన్ను నిలువనియ్యలేదు. చాలా సార్లు మీవద్దకు రావాలని అనుకున్నాను. మీకు తెలియకుండా వివాహం చేసుకున్నందుకు నన్ను క్షమించండి. మీ కోడలు నీలవేణి కూడా అనాథే. ప్రభుత్వం తరఫున వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకొని పై చదువులు చదివి అక్కడ ఉదోగ్యం సంపాదించిందామె. ఆమె నాతో చాలా సార్లు పోరింది మన దేశం తిరిగి వెళ్ళిపోదామని. అందుకే, ఇప్పుడు నిర్ణయం తీసుకొని వచ్చేసాం. మళ్ళీ ఇండియాలో ఉద్యోగం సంపాదించే వరకూ ఈ ఊళ్ళో, ఇక్కడే మీతో పాటే ఉంటాము. మాకు ఉద్యోగాలు రాగానే, మీరు కూడా మాతో పాటే రావాలి. ఇక మీరు ఎంత మాత్రం ఒంటరిగా ఉండడానికి వీలు లేదు. ఇంట్లోనే ఉండి మీ మనవడితో ఆడుకోవచ్చు. మీకసలు ఒంటరితనం దగ్గరకు రానీయడు వాడు. సూర్యం కూడా మనతో పాటే వస్తాడు. అక్కడ మనకి, ముఖ్యంగా మీకు సహాయంగా ఉంటాడు. " అంటూ మనవడ్ని తండ్రికి అందించాడు నాగేశ్వర్.

ఆనందంగా మనవణ్ణి ఎత్తుకొని ముద్దుల వర్షం కురిపించాడు రామచంద్రం. రెండు నిమిషాల తర్వాత కొడుకు వైపు కోపంగా చూసి, "వచ్చే ముందు ఫోన్ చేసి చెప్పొచ్చు కదరా! మీరు వస్తారని ముందే తెలిస్తే చాలా సంతోషించే వాణ్ణి కదా!" అన్నాడు నిస్టూరంగా.

"నిజమే నాన్నా! అది పొరపాటే! కాకపోతే ఫ్లయిట్ టికెట్‌లు దొరకడం ఈ సమయంలో కొంచెం కష్టమైంది. ఎలాగైనా వచ్చేద్దామని పట్టుబట్టి ప్రయత్నించడంతో అది సాధ్యమైంది. టికెట్‌లు వచ్చిన తర్వాత మిమ్మల్ని ఆశ్చర్యపరుచుదామని ఆగిపోయాం. అంతేకాక విదేశాలనుండి ఇక్కడకి వచ్చిన తర్వాత విధిగా క్వారంటైన్‌లో ఉండాలి. మేము వచ్చామని తెలిసిన తర్వాత మీరు ఆత్రత ఆపుకోలేరు కదా! మేము వచ్చామని తెలిసిన తర్వాతైనా కూడా ఒకరికొకరు ఈ సమయంలో కలసుకోలేము కదా! అందుకే చెప్పలేదు. అందుకే క్వారంటైన్ పూర్తైన తర్వాత వెంటనే వచ్చేసాం." అన్నాడు నాగేశ్వర్.

"అవును అదీ నిజమే! ఈ కరోనా వల్ల వచ్చిన పాట్లు మరి అవి. పోనీ, మీరందరూ వచ్చారు. నాకు ఇవాళ చాలా సంతోషంగా ఉంది. ఇక మనకి ప్రతిరోజు పండగే! " అన్నాడు రామచంద్రం.

ఆ ఇంట్లో ఆనందం వెల్లివిరిసింది.

***********

మరిన్ని కథలు

Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి
Pramod Pesarattu
ప్రమోద్-పెసరట్టు
- వీరేశ్వర రావు మూల
Atanu aame madilo
అతను ఆమె మదిలో
- బొబ్బు హేమావతి
Atani kannu aame meeda padindi
అతని కన్ను ఆమె మీద పడింది
- బొబ్బు హేమావతి
Kottha ugadhi
కొత్త ఉగాది
- తాత మోహనకృష్ణ
Pallavi
పల్లవి
- తటవర్తి భద్రిరాజు
Suhasini
సుహాసిని
- బొబ్బు హేమావతి