సరైన నిర్ణయం - పద్మావతి దివాకర్ల

perfect decision

'ఉద్యోగవిరమణకి సరిగ్గా ఇంక నెలరోజులుంది.' అని మనసులోనే అనుకోసాగాడు రఘురాం.  ఇలా ఆ రోజు అతను అనుకోవడం అది ఏ ఇరవైయ్యో సారో మరి.  అసలు రిటైర్మెంట్‌కి ఒక సంవత్సరం ఉండగానే కౌంట్‌డౌన్ మొదలెట్టేసాడు.  అలా ఎదురుచూసి ఎదురుచూసి ఆ రోజు ఇక దగ్గరకొచ్చేసింది.  ఇప్పుడు సరిగ్గా నెల రోజులే ఉంది.  ఆ నెల రోజుల పూర్తైన తర్వాత తను సర్వ స్వతంత్రుడు.  గత ముప్ఫై అయిదేళ్ళగా బ్యాంక్‌లో అవిశ్రాంతంగా పని చేసి ఉండటంవల్ల అప్పటికే బాగా విసుగుచెంది ఉన్నాడు.  పైగా బ్యాంక్‌లో పని చేయటంవల్ల ప్రతీ రెండు మూడేళ్ళకొకసారి తప్పనిసరిగా బదిలీలు అయి సరిగ్గా రెండేళ్ళ క్రితమే ఈ ఊరు వచ్చాడు.  ఇప్పటికే బదిలీ మీద పదహారుసార్లు ఊళ్ళు మారాడు రామారావు.  అందులో కొన్ని ఏజెన్సీ ప్రాంతాలూ ఉన్నాయి.  సరైన ఇల్లూ, కావలసిన సదుపాయాలు లేక ఇబ్బంది పడ్డాడు కూడా.  ఉద్యోగవిరమణకి  సరిగ్గా రెండేళ్ళ క్రితమే తన స్వంత ఊరికి బదిలీ మీద వచ్చాడు.  కొడుకులిద్దరూ చదువులు పూర్తిచేసి ఎవరిమానాన వాళ్ళు వేర్వేరు ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసుకుంటున్నారు.  ఇద్దరి పెళ్ళిళ్ళూ కూడా అయ్యాయి.  చెప్పుకోవాలంటే రఘురాం బాధ్యతలన్నీ ఉద్యోగవిరమణకి ముందే పూర్తయ్యాయి.  ఇప్పుడు ఇంట్లో తను, భార్య వాణి ఇద్దరే ఉంటున్నారు.  అయితే నెలరోజులు ఎంత త్వరగా పూర్తయి ఈ ఉద్యోగ బాధ్యతలనుండి విముక్తుడనవుతానా అని ఎదురుతెన్నులు చూస్తున్నాడు రఘురాం.

ఇన్నాళ్ళూ ఉద్యోగబాధ్యతలతో తలమునకలుగా ఉన్న తను రిటైర్‌మెంట్ తర్వాత సమయం ఎలా గడపాలా అని ఆలోచించసాగాడు.  రిటైర్‌మెంట్ తర్వాత జీవితం సరిగ్గా ప్లాన్ చేసుకోమని చాలామంది సలహాలైతే ఇచ్చారుగాని, ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలో ఒక్కరూ సరిగ్గా చెప్పలేకపోయారు. ఆ విషయమే తీవ్రంగా ఆలోచించసాగాడు రఘురాం.  ఏ విధంగా ప్లాన్ చేసుకుంటే బాగుంటుందో అని ఎంత ఆలోచించినా తట్టక, ఈ విషయమై తన సహద్యోగులను సంప్రదించి సరైన సలహా తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు.  తనకన్న ముందు రిటైర్ అయిన తన సహోద్యోగులను సలహా అడిగాడు.  తలోరకంగాసమాధానాలు చెప్పారు.

రఘురాం సీనియర్ అయిన రామారావు రిటైర్ అయ్యి ఆర్నెల్లైంది.  ఉద్యోగ విరమణ అయిన వెంటనే అతను బ్యాంక్‌లోనే ఇంటర్నల్ అడిటర్‌గా చేరిపోయాడు.

అతణ్ణి అడిగితే, "మన వయసు అరవై ఏళ్ళైందని ఉద్యోగ విరమణ చేయించారుగానీ, లేకపోతే నాకింకా ఓ పదేళ్ళు పనిచేసే సామర్థ్యం ఉంది.  ఇన్నాళ్ళూ బ్యాంక్‌లో చాలా బిజీగా పని చేసి, ఇప్పుడు ఇంట్లో గోళ్ళు గిల్లుకుంటూ కూర్చోవాలంటే పరమ బోర్‌గా ఉంటుంది.  రిటైరైన వాళ్ళకు మన బ్యాంక్‌లోనే వివిధ రకాల విధుల్లో తిరిగి చేర్చుకుంటున్నారు కదా!  నేను అడిటర్‌గా చేరినట్లే నువ్వు కూడా ఏదో దానిలో చేరిపో.  డాక్యుమెంట్స్ చెక్ చేయడానికో, అడిటర్‌గానో, లేక కొత్త ఉద్యోగస్థులకి ట్రైనర్‌గానో నీ అభిరుచిని బట్టి చేరిపో!  నీకు టైం పాస్ అవడమే కాక, నెలకింత అని పారితోషికం లభిస్తుంది.  పెన్షన్‌తో పాటు ఈ డబ్బులు దర్జాగా జీవించడానికి పనికివస్తాయి." అన్నాడు

అయితే ఇది రఘురాంకి నచ్చలేదు. "ఇంతకాలం ఊడిగం చేసింది చాలక మళ్ళీ అక్కడే పని చేయడమా?  ముప్ఫై అయిదేళ్ళుగా పొద్దున్న నుండి రాత్రి వరకూ గానుగెద్దులాగా పని చేసి ఇప్పుడు విముక్తి దొరికితే మళ్ళీ అందులోనే  చేరడమా, నాకైతే ఇష్టం లేదు" అన్నాడు.

"ఎవరి ఇష్టం వారిది.  ఆర్థికంగా మాత్రం ఇది చాలా బాగుందిఅందుకే నేను ఇందులో చేరాను.  నాకు ఇది మాత్రం చాలా బాగుందనిపిస్తోంది.  మనకి అలవాటైన పనే కదా మరి!" అన్నాడు రామారావు.

ఆ తర్వాత కిందటి నెల ఉద్యోగ విరమణ చేసిన అప్పారావునడిగాడు సలహా.  "నీకూ తెలుసుకదా నేను ముందునుండి మా ఆవిడ పేర ఎల్.ఐ.సీ. ఏజంట్‌గా చేస్తున్నానని.  ఇప్పుడు పూర్తి ధ్యాసంతా దానిమీదే పెడతాను.  అంతే కాక, మిగతా ఫైనాన్స్ కంపెనీ ఏజెన్సీ కూడా ఇకముందు తీసుకుంటాను.  చిట్ ఫండ్ కూడా!  నువ్వుకూడా అలాంటి పనులే చేయవచ్చు రిటైర్ అయిన తర్వాత.  అందులో చాలా కిట్టుబాటు కూడా." అన్నాడు అప్పారావు.

"అలాంటివాట్లో నాకేమీ అనుభవం లేదు, అసలే డబ్బుతో వ్యవహారం.  పైగా ఇంట్రెస్ట్ కూడా లేదు."  అన్నాడు రఘురాం.

"ఇన్నాళ్ళూ బ్యాంక్‌లో పనిచేసాం కదా, మరి డబ్బుతో వ్యవహారం అంటావేంటీ?  బ్యాంక్‌లోనూ డబ్బుతోటే కదా మన పని?"  అన్నాడు అప్పారావు రఘురాం వైపు విస్మయంగా  చూస్తూ.

"నిజమే, కానీ ఫైనాన్స్ కంపెనీ విషయంలో మాత్రం ఎవర్నీ నమ్మలేము.  మనం ఎంతమందిని చూడలేదు ఫైనాన్స్ కంపెనీలో డబ్బులు పెట్టి సర్వం కోల్పోయిన వారిని?  బ్యాంక్‌లో ఫిక్స్‌డ్ డిపాజిట్ చెయ్యమంటే బ్యాంక్ వడ్డీ తక్కువని చెప్పి, ఎక్కువ వడ్డీ ఎర వేసిన సంస్థల్లో తమ కష్టార్జితం దాచి డబ్బులు కావలసిన సమయంలో దొరకక అవస్థల పాలైన వాళ్ళెంతమందో?  ఆ తర్వాత బోర్డుతిప్పేసిన వారి మీద కేసు వేసి కోర్టుల చుట్టూ చెప్పులరిగేలా తిరిగిన వారెంతమందో?  అలా అమాయక ప్రజల ఉసురు పోసుకోవడం నాకిష్టం లేదు." అన్నాడు రఘురాం నిర్మొహమాటంగా.

"ప్రతీ సారి అలా బోర్డ్ తిప్పేసిన వాళ్ళే ఉంటారా?  మన అదృష్టం బాగులేకపోతేనే గానీ అలాంటివి సాధారణంగా జరగవు.  నా కందులో రిస్కేమీ కనిపించలేదు." అన్నాడు అప్పారావు.

"నాకు మాత్రం అలాంటివి అసలు ఇష్టం లేదు, అంతకన్న ఇంట్లో గోళ్ళు గిల్లుకుంటూ కూర్చుంటేనే నయం." అన్నాడు రఘురాం.

"నీ ఖర్మ!  బాగుపడటం ఇష్టం లేనివారికి ఏం చెప్పినా ఒకటే!" అని అనేసి తనదారిన వెళ్ళిపోయాడు అప్పారావు.

అప్పుడు రఘురాంకి ఇంకో ఆర్నెల్లలో రిటైరవబోతున్న కనకారావు గుర్తుకువచ్చాడు.  కనకారావు అన్ని విషయాల్లో కచ్చితంగా వ్యవహరిస్తాడు.  ప్రతీ చిన్నపనికి నిర్దిష్టమైన ప్లాన్ వేసుకుంటాడు.  ఆ ప్లాన్ కచ్చితంగా అమలు చేసుకుంటాడు.  ఆఫీస్ పనైనా, స్వంత పనైనా ఒక పద్ధతిగా చేయడం ముందునుండీ అలవాటు.  అతనెలాగూ త్వరలో రిటైర్ అవబోతున్నాడు, అందుకే రిటైర్మెంట్ తర్వాత ఎలా జీవితం గడపాలో ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చి ఉంటాడు.  అందుకే కనకారావుని అడిగితే సరైన దారి చూపగలుగుతాడని ఊహించి అతన్ని కలుసుకున్నాడు రఘురాం.

రఘురాం వచ్చిన పని తెలుసుకుని, "చూడు రఘురాం!...రిటైర్మెంట్ తర్వాత ఏం చేయాలో నేనెప్పుడో ప్లాన్ చేసేసుకున్నాను.  అయితే, నేను ఎంచుకున్న మార్గం నీకు ఏ మాత్రం పనికిరాదు సుమా!" అన్నాడు కనకారావు.

"నీ అంత ప్లాన్‌గా నేను పని చేయలేకపోయినా, కొద్దిగానైనా ఆ బాట నేను నడవగలను. నీవేమైనా నాకు తగిన సలహా ఇస్తావేమోనని నీ వద్దకు వచ్చాను." అన్నాడు.

"ప్లాన్ విషయం సరే!  నేను ఎంత ప్లాన్‌డ్‌గా వ్యవహరిస్తానో అంతే నిర్మొహమాటస్తుడ్ని కూడా.  నిర్మొహమాటంలో కూడా ప్రత్యేక పద్ధతి పాటిస్తాను.  అందుకే ఉద్యోగ విరమణ తర్వాత బిజినెస్ చేద్దామనుకుంటున్నాను.  రియల్ ఎస్టేట్ రంగంలో కూడా ప్రవేశిద్దామని అనుకుంటున్నాను.  డబ్బు విషయంలో నువ్వు అసలే మొహమాటస్థుడివి.  అందుకే, ఇలాంటిది నీకు పనికిరాదు.   నీ సంగతి నాకు బాగా తెలుసు, ఈ రంగంలో అసలు రాణించలేవు."  అన్నాడు కనకారావు సూటిగా.

'నిజమే తనని కనకారావు బాగానే అంచనా వేసాడు.' మనసులో అనుకున్నాడు రఘురాం. "అవును నువ్వు సరిగ్గా చెప్పావు, నేను బిజినెస్‌కి పనికిరాను.  అయితే రిటైర్ అయిన తర్వాత ఖాళీగా కూర్చోకుండా ఏదైనా చెయ్యాలని ఉంది, కానీ ఏం చేయాలో మాత్రం తోచడం లేదు." అన్నాడు కనకారావుతో.

కనకారావు చిన్నగా నవ్వి, "నీకు కైలాసరావు తెలుసుకదా!  ఈ విషయలో నీకు కైలాసరావు సహాయపడగలడు.  నీకు కావలసిన సరైన సలహా ఇవ్వగలడు.  ఎంతైనా మనకి సీనియర్ కదా!  పైగా అనుభవఙుడు కూడా!" అన్నాడు. 

ఆ మరుసటిరోజు ఉదయం ఆదివారం రోజు కైలాసరావు ఇంటికి వెళ్ళాడు రఘురాం.  అందరూ ఒకే ఊళ్ళో పుట్టిపెరిగిన వాళ్ళవడం చేత ఒకరికొకరు బాగా తెలుసు.  అంతేకాక కైలాసరావు ఉద్యోగంలో ఉన్నప్పుడు అతని వద్ద రఘురాం పనిచేసాడు కూడా.  మనిషి చాలా సరదాగా ఉంటాడు.  కైలాసరావు ఉద్యోగవిరమణ చేసి అయిదేళ్ళు దాటింది.

రఘురాం వెళ్లే సమయానికి కైలాసరావు డైనింగ్ టేబిల్ వద్ద కూర్చొని కూరలు తరుగుతున్నాడు.  రఘరాంని చూడగానే చేస్తున్న పని ఆపి, "రావోయ్ రఘరాం!  రా!  వచ్చి కూర్చో!  సమయానికి వచ్చావు.  నేను చేసిన టిఫిన్ రుచి చూద్దూవుగాని."  అని వంటింటోకి వెళ్ళి రెండు ప్లేట్లతో ఉప్మా తీసుకువచ్చి, రఘరాంకి ఒకటి ఇచ్చి తనొకటి తీసుకున్నాడు. 

రఘరాం ప్లేట్ అందుకొని, "సార్!  వదినగారు ఊళ్ళో లేరా, ఏమిటి?  కూరలు తరుగుతున్నారు.  ఉప్మా కూడా మీరే చేసారు మరి!  ఈ సమయంలో వచ్చి మీకు ఇబ్బంది కలిగించినట్లు ఉన్నాను." అన్నాడు రఘురాం.

కైలాసరావు ఏదో చెప్పబోయేలోగానే, అతని భార్య కనకం రెండు గ్లాసులతో మంచినీళ్ళు తెచ్చి డైనింగ్ టేబుల్‌మీద పెట్టి, "ఏం చెప్పమంటావయ్యా బాబూ!  ఈయన రిటైర్ అయిన దగ్గర నుండి నన్ను ఏ పని చెయ్యనివ్వకుండా ఉన్నారు.  ప్రతీ పనిలోనూ కలుగజేసుకుంటారు.  మీకెందుకంటే వినరు.  ఇన్నాళ్ళూ నువ్వు ఇంట్లో కష్టపడ్డావు కదా, ఇప్పుడైనా నీకు సహాయం చెయ్యనీ, నేనెలాగూ ఖాళీగా ఉన్నా కదా అంటారు!   ఇలా మాటిమాటికి కలుగజేసుకుంటూంటే నాకు చాలా విసుగ్గా ఉంది.  నువ్వైనా ఇతనికి కాస్త నచ్చచెప్పు బాబూ, నీకు పుణ్యం ఉంటుంది." అందామె.

రఘురాం నవ్వుతూ, "మీకు సహాయమే కదా చేస్తున్నారు వదినా!  చెయ్యనివ్వండి.  మా స్నేహితులు కొంతమందైతే భార్యాబిడ్డలను కూడా పట్టించుకోకుండా ఇరవైనాలుగు గంటలూ పేకాటలోనూ, బార్‌లోనూ గడుపుతున్నారు.  కైలాసరావుగారికైతే మీ మీద అంతులేని ప్రేమ.  అందుకే మీకు అన్నింటిలోనూ సహాయపడుతున్నారు.  మీ ఆదర్శ దాంపత్యం చూస్తే నాకు చాలా ముచ్చటేస్తోంది."  అన్నాడు.

"చూసావా!  నామీదైతే మీ వదిన ఇంటికి వచ్చిన వారందరికీ కంప్లైంట్ చేస్తుంది, మరి తన మీద నేనెవరికి చెప్పాలి?" అన్నాడు కైలాసరావు. 

"నా మీద అసలు కంప్లైంట్ చేయడానికి విషయమేమైనా ఉండాలి కదా!" అందామె నవ్వుతూ.

"ఎందుకు లేదు?  పత్రికలకి పంపే ముందు నేను రాసిన కథలు చదివి వినిపిస్తే నువ్వు రకరకాల కామెంట్లు చేయడంలేదూ?  ఇలా రాయడం బావులేదు, అలా రాయడం బావులేదు అనడం లేదూ?".

"అవును మరి!  నేను సద్విమర్శలే చేసాను కదా!  నేను సూచించిన మార్పులు చేయడంవల్లే మీకు కొన్ని కథలకి బహుమతులు కూడా వచ్చాయి కదా!  ఆ విషయం మర్చిపోయారా?  మీరు రాసే కథలనన్నింటినీ తిరిగి ఫెయిర్ చేసేదీ నేనే కదా!  నా దస్తూరీ చాలా బాగుంటుందనీ నా చేతే రాయించారు కూడా!  కొన్ని కథలు నా పేరు మీదే పత్రికలకి పంపారు కూడా." అందామె.

"నిజమే మరి!  నేను ఒప్పుకుంటున్నాను.  నువ్వు ప్రోత్సాహం ఇవ్వకపోయి ఉంటే నేను ఇప్పుడు ఓ మంచి రచయితని కాకపోదును.  నా విజయం వెనుక నీ కృషి కూడా చాలా ఉంది." ఒప్పుకున్నాడు కైలాసరావు.

"నిజమే కదా!  అయినా ఇప్పుడు మీ గురించి నేను మాత్రం ఏం కంప్లైంట్ చేసాను అన్నయ్యగారికి?  వంటపని, ఇంటిపనిలో మీకెందుకు శ్రమ అని నా బాధంతా?  హాయిగా వాలకుర్చీలో కూర్చొని ఏ పుస్తకాలో చదువుతూ, కథలు రాస్తూ ఈ రిటైర్మెంట్ లైఫ్ అనుభవించ వచ్చు కదా అని నా తాపత్రయం, కాదంటారా అన్నయ్యగారూ" అంది కనకం రఘురాం వైపు చూస్తూ.

"నాకేం ఆరోగ్య సమస్యలు లేవు కానీ, నీకు మాత్రం అధిక రక్తపోటు, మధుమేహం ఉన్నాయి కదా, మరి నీకు నేను పనుల్లో సహాయం చేస్తే తప్పేమిటి?"  అన్నాడు కైలాసరావు తనను సమర్థించుకుంటూ.

"చూసారా అన్నయ్యగారూ!...ఇదీ ఇతని వరస!"  అంటూ వంటిట్లోకి వెళ్ళిందామె కాఫీ కలిపి తేవటానికి.

భార్యాభర్తల మధ్య సంభాషణ వింటూ వాళ్ళ అన్యోన్య దాంపత్యానికి అచ్చెరువొందాడు రఘురాం.  ఆ దంపతులిద్దరికీ ఒకళ్ళంటే ఒకళ్ళకి అంతులేని ప్రేమని తెలుసుకున్నాడు.  కైలాసరావు దంపతుల మధ్య ఉన్న అనుబంధానికి, అనురాగానికి రఘురాం ముచ్చట పడ్డాడు.  ఆదర్శ దాంపత్యమంటే అలా ఉండాలని మనసులో అనుకున్నాడు.  వాళ్ళ ప్రవర్తనలోనే తనకి కావలసిన సమాధానం లభించిందనిపించింది రఘురాంకి.  కైలసరావు రచయిత అయితే తను కూడా కాలేజీలో చదివే సమయంలో కవితలు రాసేవాడు.  కొన్ని పత్రికలలో అచ్చయ్యేయి కూడా.  ఉద్యోగంలో చేరినకొత్తలో కూడా తన కవితా వ్యాసంగాన్ని కొనసాగించాడు.  అయితే, ఆ తర్వాత ఉద్యోగ బాధ్యతలు పెరగడంతోపాటు కుటుంబ బాధ్యతలు కూడా తోడవటంతో తన కవితలు అటకెక్కాయి.  ఇప్పుడు ఉద్యోగవిరమణ తర్వాత మళ్ళీ తన వ్యాసంగాన్ని పునఃప్రారంభించవచ్చు.  తన భార్య వాణి కూడా ఇంటిబాధ్యతలవల్ల అంతకుముందు చేసే సంగీత కచేరీలు, పిల్లలకు సంగీత పాఠాలు ఇప్పుడు మళ్ళీ మొదలెట్టవచ్చు.  ఆ విధంగా తమ ఇద్దరి చిరకాల ఆశయాలు నెరవేరతాయి.  ఒకరికొకరు సహాయపడి, తమ ఆశయ సిద్ధి గావించుకొని తన విశ్రాంత జీవితాన్ని సుఖమయం చేసుకోవచ్చని మనసులో అనుకున్నాడు.

భార్య అందించిన కాఫీ తాగుతూ, "ఏ మాటకా మాటే చెప్పుకోవాలి రఘురాం.  నేనింత బాగా కాఫీ కలపలేను కానీ, తను మాత్రం కాఫీ చేస్తే అమృతం కూడా దీని ముందు దిగదుడుపే!" అని ఆమెను మరో సారి మెచ్చుకొని, "అవునూ...నువ్వు ఏదో పనిమీద వచ్చేవనుకుంటాను, నీ సంగతి పూర్తిగా మరిచిపోయి మేమిద్దరం ఒకళ్ళమీద ఒకళ్ళు నీకు ఫిర్యాదు చేసుకుంటున్నాం.  చెప్పు?... ఏదైనా పని మీద వచ్చావా?" అన్నాడు కైలాసరావు.

"ఏమీలేదు.  నేను ఈ నెలే రిటైరవబోతున్నాను.  తెలిసిన అందరి సహోద్యోగుల ఇంటికి వెళ్ళి ఓ సారి కలుద్దామని బయలుదేరాను.  మీ ఇంటికి రావడం, మీ దంపతుల అన్యోన్యత కళ్ళారా చూడటం నా భాగ్యంగా భావిస్తున్నాను.  నా విశ్రాంత జీవితంకూడా సుఖంగా సాగాలని దీవించండి సార్!" అన్నాడు రఘురాం.

"నీకు తెలియనిదేముంది?  భార్యాభర్తలు కలసిమెలసి ప్రతీ సమస్యని ఎదుర్కోవడమే కాక ఒకరికొకరు అండదండలుగా నిలబడినప్పుడే అది అన్యోన్య దాంపత్యమవుతుంది.  ఒకరినొకరు అర్థం చేసుకొని, పరస్పరం గౌరవించడంలోనే పరమార్థముంది.  సెకెండ్ ఇన్నింగ్స్ హాయిగా సరదాగా గడపాలన్నదే నా పాలసీ, ఇదే నా రిటైర్మెంట్ ప్లాన్ కూడా!  నువ్వు కూడా త్వరలో మా విశ్రాంత ఉద్యోగుల సమూహంలో చేరుతున్నందు నాకు చాలా అనందంగా ఉంది.  నీ విశ్రాంత జీవితం కూడా ఎలాంటి ఒడుదొడుకులు లేకుండా ప్రశంతంగా సాగాలని ఆ దేవుణ్ణి మనసారా ప్రార్థిస్తున్నాను." అన్నాడు కైలాసరావు రఘురాంతో కరచాలనం చేస్తూ.

తను కూడా కైలాసరావు అడుగుజాడల్లో నడిచి విశ్రాంత జీవితంలోని మాధుర్యం అనుభవించాలని నిర్ణయం తీసుకొని ఆ దంపతులనుండి సెలవు తీసుకొని ఇంటికి బయలుదేరాడు రఘురాం.

**** **** **** ****

ఇంటికి తిరిగి వచ్చిన రఘురాం ఉత్సాహంగా, “ఎక్కడున్నావు ఓ వాణీ!  నువ్వే నా హృదయరాణి!!” అని గుమ్మం దగ్గరనుండే భార్యని పిలిచాడు.  అప్పుడే అక్కడికి వచ్చిన వాణి అతని మాటలకి విస్మయం చెందింది. ఆమెని చూసి, "ఇవాళ సాయంకాలం సరదాగా బీచ్‌కి వెళ్ళి రాత్రి మంచి హోటల్‌లో డిన్నర్ చేసి తిరిగి వద్దాం. సరేనా  నా హృదయరాణి!" నవ్వుతూ అని బాత్‌రూంలో కెళ్ళి కాళ్ళూ చేతులూ కడుక్కొని వచ్చి డైనింగ్ టేబులు పైన ఉంచిన బటాణీ కాయలు వలవసాగాడు.  అసలే రఘురాం మాట్లాడిన భాషకి విస్మయం చెందిన వాణి ఈసారి అతని చేష్టలకి మరింత ఆశ్చర్యానికి లోనయ్యింది. 

"మీరు… మీరేనా?!..." అంది ఆశ్చర్యంగా రఘురాం వైపే చూస్తూ.  ఇంట్లో ఎప్పుడూ పూతికపుల్ల కూడా ముట్టుకోని భర్త అలా బాటాణీ కాయలు బుద్ధిగా వలవడం ఆమెకి నమ్మశక్యంగా లేదు.  పైగా సాయంకాలం బీచ్‌లో షికారు, హోటల్‌లో భోజన కార్యక్రమం కూడా ఉంది మరి!  ఇవన్నీ కూడా షాకులే ఆమెకి!

"నేను నేనే!  ఇవాళ నుండి నువ్వు వద్దన్నా నీకు అన్ని పనుల్లో సహాయపడ దల్చాను.  నీకో సంతోషకరమైన విషయం!  ఇకముందు నువ్వుకూడా నీ పాత వ్యాపకమైన సంగీత కార్యక్రమాలు మళ్ళీ మొదలెట్టవచ్చు.  దానికి నీకు కావలసిన ఏర్పాట్లన్నీ చేస్తాను.” అన్నాడు  రఘురాం.  తను వలిచిన బాటాణీ గింజలు ఒక పక్క ఉంచి, ఆ పక్కనే ఉన్న కుక్కర్‌లోని ఉడికించిన దుంపల తొక్కలు తీయసాగాడు.

ఇంకా షాక్‌నుండి తేరుకోని వాణి ఆశ్చర్యంగా నోరు తెరిచింది. 

“హా!...ఇంకో ముఖ్యవిషయం!  నేను కూడా ఇకముందు కవితలు మళ్ళీ రాయబోతున్నాను.  నేనో ప్రముఖ కవి కావాలన్నది నా ఆకాంక్ష.  నా మొదటి పాఠకురాలివి కూడా నువ్వే!  ఇదే నా రిటైర్‌మెంట్ ప్లాన్.  ఈ విషయంలో మాత్రం నీ ప్రోత్సాహం, సహకారం నాకు అందివ్వాలి సుమా!" అన్నాడు.

రఘురాం అన్న మొదటి సంగతికి ఆమె ఎంత సంతోషించిందో, ఆ తరవాత అన్న మాటలకి ఆమె  అంత బెంబెలెత్తిపోయింది.

తెల్లగా పాలిపోయిన ఆమె మొహం వైపు చూసి నవ్వుతూ, "వాణీ!...నా కవితల గురించి నువ్వేం బెదరక్కరలేదు!  నన్ను నమ్ము! నా కవితలు విన్న తర్వాత నీకు ఆ విషయం స్పష్టమవుతుంది, సరేనా!  రిటైరైన తర్వాత నా సెకెండ్ ఇన్నింగ్స్ హాయిగా, ఉత్సాహంగా ఆరంభించాలి. అదే నా కోరిక." అన్నాడు.

అతను సంజాయిషీ ఇస్తున్న తీరుకి ఆమె మనసులో శంక తీరిపోగా ఫకాలున నవ్వింది.

మరిన్ని కథలు

hidden money
గుప్తధనం
- పద్మావతి దివాకర్ల
wedding invitation
పెళ్ళిపిలుపు
- డాక్టర్ చివుకుల పద్మజ
grand sari from mother house
పుట్టింటి పట్టుచీర
- మీగడ.వీరభద్రస్వామి
ashadam sales
ఆషాఢం సేల్స్
- పద్మావతి దివాకర్ల
large line
పెద్ద గీత
- గంగాధర్ వడ్లమన్నాటి
hard working old woman
శ్రమించే ముసలమ్మ
- కృష్ణ చైతన్య ధర్మాన
crow interest
కాకి కుతూహలం
- కృష్ణ చైతన్య ధర్మాన