బోధన (పిల్లల కథ) - చెన్నూరి సుదర్శన్

Teaching (children's story)

                ఆరాధ్య టీచర్ మనసులో అదే సంఘటన  పదే, పదే గుర్తుకు వస్తోంది. ఆవేదనతో ఆరవ తరగతి గదిలో అడుగు పెట్టింది. పిల్లలంతా లేచి అభివాదము చేశారు. ఆరాధ్య ప్రతి అభివాదము చేస్తూ.. అందరిని కూర్చోమంది.

               ఆరోజు చెప్పాల్సిన పాఠం పేరు ‘ఏనుగు’ అని నల్ల బల్ల మీద వ్రాస్తుంటే కళ్ళు చెమ్మగిల్లాయి. పిల్లలు గమనించకుండా ఎడం చేతి రెండు వేళ్ళతో కళ్ళద్దాలు పైకి లేపి కళ్ళు ఒత్తుకొని, వెనుదిరిగి పుస్తకం తెరచింది.

సుమేధ చాలా చురుకైన విద్యార్థిని. టీచర్ బాధ పడ్తున్నట్లు గమనించింది.    

             ఆరాధ్య పుస్తకం తెరచి ఏనుగు పాఠాన్ని చెప్పడం ప్రారంభించింది.

            “ఏనుగు ప్రమాదకరమైన జంతువు కాదు. దానిని మచ్చిక చేసుకుంటే సాధు జంతువులా మారిపోయి మనకెన్నో పనులు చేసి పెడ్తుంది. దారి సరిగ్గా లేని అడవి ప్రాంతాలలో ఇంటి కలప కోసం  ఉపయోగించే భారీ వృక్షాలను కూల్చడానికి, తరలించడానికి సహాయపడ్తాయి.      

            సర్కస్­లో ఏనుగు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. మహారాజుల కాలంలో ఏనుగులను యుద్ధాలలో వాడుకునే వారు.

           దేవతల కాలంలో గూడా ఏనుగుకు ఎంతో ప్రాముఖ్యమున్నది. క్షీరసాగర మథనంలో పుట్టిన తెల్లని ఏనుగు దేవేంద్రుని వాహనం. పార్వతీ తనయునికి ఏనుగు తల శివుడు అతికించాడని పురాణాలు చెబుతున్నాయి. అతనిని విఘ్నేశ్వరుడుగా పూజిస్తున్నాం.

           గజలక్ష్మి, అష్టలక్ష్మిలలో ఏనుగు ఒకటి. గజేంద్ర మోక్షంలో విష్ణువు తన సుదర్శన చక్రంతో మొసలిని సంహరించి గజేంద్రుని  రక్షిస్తాడు.  

           నేటి ఉత్సవాలలో గూడా దేవుని ప్రతిమలను గజేంద్రునిపై ఊరేగిస్తున్నాం. ఏనుగుకు కరి, గజము, గజేంద్రుడు, దంతి మరియు హస్తి అనే తదితర పేర్లు ఉన్నాయి.

          ప్రతి సంవత్సరం ఆగస్టు 12వ, తేదీని ప్రపంచ ఏనుగుల దినోత్సవం జరుపుకుంటున్నాం. అలా ఎంతో  ప్రశస్తమైన ఏనుగును దాని విలువైన చర్మం కోసం, దంతాల కోసం నేడు మానవులు మట్టుబెడ్తున్నారు. ఏకారణమూ లేకుండా నిన్నటి దినం..” అనగానే ఆరాధ్య కళ్ళల్లో నీళ్ళు ఉప్పెనలా పొంగి పొర్లాయి. పాఠంలో లీనమైన విద్యార్థులు ఒక్క సారిగా కంపించి పోయారు. వారిని గమనించి ఆరాధ్య వెంటనే తేరుకుని గొంతు సర్దుకుంది.

           “పిల్లలూ నిన్నటి వార్త విన్నారా.. ఒక ఆకతాయి పిల్లవాడు పనసపండులో దీపావళి మందు కూర్చి ఆకలితో అలమటిస్తున్న ఒక ఏనుగుకు ఆహారంగా ఇచ్చాడు. పాపం..! మానవుని ద్రోహ బుద్ధి అర్థం చేసుకో లేని ఆ మూగ జీవి ఆశగా నోట్లో పెట్టుకుని కొరికింది.

           పనసపండు పేలి ఏనుగు నాలుక దవడలను ఛిద్రం చేసింది. అది బాధను తట్టుకోలేక నీళ్ళతో గొంతు తడుపుకుందామని నీళ్ళ కోసం ఊరంతా కలియ తిరిగిందే  గాని ఎవరినీ హాని చెయ్యలేదు. చివరికి ఊరి చివర వాగులోకి వెళ్లి నీరు త్రాగింది. అయినా  గొంతులోని ఆరని మంటలతో కాసేపటికే చనిపోయింది. 

           అటవీ అధికారుల ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. వైద్య పరీక్షల్లో ఏనుగుకు మరి కొద్ది రోజుల్లో ఒక బుల్లి ఏనుగు పుట్టేదని తెలిసింది. తన బిడ్డను చూసుకోకుండానే కన్ను మూసింది. ఎంత ధారుణం.. ఇది మాహాపాపం. వాణ్ణి గుర్తించి సరియైన శిక్ష విధిస్తేనే గాని ఏనుగు ఆత్మకు శాంతి కలుగదు. ఏనుగుల మీద  ఇలాంటి ఘోరాలు మళ్ళీ జరుగకుండా ఉంటాయి” అంటూ చెబుతుంటే పిల్లల ముఖాలలో  వాడు దొరికితే చంపేస్తాం అన్నంత కోపం కనబడుతోంది.

           ఇంతలో పాఠశాల చివరి గంట మ్రోగింది. ఆరాధ్య క్లాసు నుండి వెళ్లి పోతుంటే పిల్లలంతా ఎంతో బాధతో భారంగా లేచి నిలబడ్డారు. త్వరగా పుస్తకాలు సర్దుకొని పరుగెత్తాలనే ధ్యాసే వారిలో లేదు.

           సుమేధ బడి గేటు దాటి మైదానంలోని ఒక చెట్టు కింద కూర్చుని సన్నగా ఏడుస్తోంది. ఆ చిన్నారి మనస్సు  ఆలోచనలతో సతమత మవుతోంది. ఏనుగుకు పనసపండు ఎవరిచ్చారో తనకు తెలుసు. పనసపండులో దీపావళి మందు కూరుస్తుంటే అదొక రకమైన ఆట అనుకుంది. పేలినా పెద్దగా పట్టించుకోలేదు. అది పరుగెడుతుంటే సంబరపడింది. ఏనుగు గొప్పదనం తెలిశాక.. అది చనిపోయిందని తెలిశాక సుమేధలో బాధతో గూడిన భయం  ఆవహించింది.

           ‘నేరం చేసిన వారి కంటే దాన్ని కప్పిపుచ్చే  వారే మహా దోషులు. నేరం చేసిన వాళ్ళు మనవాళ్ళా.. పరాయివాళ్ళా.. అనే తారతమ్యం చూపొద్దు. ప్రహ్లాదుడు తన కన్నతండ్రి దుశ్చర్యలను సహించక దైవాన్ని ప్రార్థించి శిక్షించేలా చూశాడు’ అని చెప్పే ఆరాధ్య టీచర్ నీతి బోధలు జ్ఞప్తికి వచ్చి  సుమేధ ధైర్యాన్ని కూడగట్టుకో సాగింది.

           ఉపాధ్యాయులంతా సుమేధను చూసీ చూడనట్టుగానే వెళ్ళిపోయారు. చివరగా బయలు దేరిన ఆరాధ్య టీచర్ సుమేధను చూస్తూనే దగ్గరికి పరుగెత్తింది. ఆమెను చూడగానే  సుమేధ బిగ్గరగా ఏడుస్తూ.. అమాంతంగా  హత్తుకుంది.  ఆరాధ్య నివ్వెర పోయింది.  

           “ఏమయ్యిందిరా.. “ అంటూ బుజ్జగిస్తూ అడిగింది.

           కొద్ది సేపటికి తేరుకుని.. సుమేధ వెక్కి, వెక్కి ఏడుస్తూ నెమ్మదిగా నోరు విప్పింది.

            “టీచర్ మనం పోలీసు స్టేషన్­కు వెళ్దాం. ఏనుగును చంపింది ఎవరో నాకు తెలుసు” అనగానే నిర్ఘాంత పోయింది.  “నిజమా.. నువ్వు చూశావా” అంటూ ఆశ్చర్యంగా అడిగింది ఆరాధ్య.  

           “అవును టీచర్.. నేను ఎస్సై గారికి జరిగిందంతా చెబుతాను. నన్ను తీసుకు వెళ్ళండి” అంటూ ఏడ్పును ఆపుకోలేకే పోతోంది.

            సుమేధను  ఓదార్చుతూ.. ఆటోలో  పోలీసు స్టేషన్­కు తీసుకు వెళ్లింది ఆరాధ్య.

            “సుమేధా.. భయపడకమ్మా.. నువ్వు చూసింది చెప్పురా” అంటూ ఆరాధ్య ధైర్యం చెప్పింది.

           “ఎస్సై గారూ.. పనసపండులో దీపావళి లక్ష్మీ బాంబు పెట్టి ఏనుగుకు ఇచ్చింది ఎవరో కాదు.. కాలేజీలో చదివే మా అన్నయ్యనే. నేను మా అమ్మ గారి సెల్­ఫోన్­తో కొన్ని ఫోటోలు.. వీడియోలు  గూడా తీశాను” అంటూ సాక్ష్యాధారాలతో సహ చెబుతుంటే.. ఆరాధ్య మ్రాన్పడి పోయింది.

           “సెహభాష్.. సుమేధా.. ! నీ వంటి వాళ్ళేనమ్మా ఈ దేశానికి కావాల్సింది. స్వంత అన్నయ్యని చూడకుండా నేరస్తుణ్ణి పట్టిస్తున్నావు” అంటూ సుమేధ ధైర్యాన్ని  మెచ్చుకుంటూ.. “టీచర్.. నీ బోధనలతో పిల్లలను తీర్చి దిద్దుతున్నందుకు నా హృదయ పూర్వక అభినందనలు” అంటూ రెండు చేతులా నమస్కరించాడు ఇనస్పెక్టర్

మరిన్ని కథలు

Why forceful
బలవంతుడ నాకేమని
- మీగడ.వీరభద్రస్వామి
Strange flower.
విచిత్ర పుష్పం.
- కనుమ ఎల్లారెడ్డి
Asparagus
తోటకూర
- మల్లాది ఉష
tailoraa majaakaa
టైలర్ మజాకా
- రేణుక జలదంకి
APOHA
అపోహ
- పద్మావతి దివాకర్ల
గోరింటాకు
గోరింటాకు
- శింగరాజు శ్రీనివాసరావు
arere gundu
అరెరే గుండు
- రవి మంత్రి
Nasty famine with hard work
కృషితో నాస్తి దుర్భిక్షం
- శ్రీమతి దినవహి సత్యవతి