ఏడు రంగుల జెండా - డా .నీరజ అమరవాది

seven colors flag

అనగనగా నేను . నా పేరు రవి . నేను నా కథని అంటే నాలాంటి చిన్నారుల కథని చెబుతున్నా . నేను రోజుల , నెలల బుజ్జి బాబుగా ఉన్నప్పుడు నన్ను అమ్మానాన్నలతో పాటు బామ్మ , అత్త , పిన్ని , మామయ్య , తాతయ్య అలా అందరు ఎంతో ముద్దుగా చూసుకున్నారు . నేను ఏడవకపోయినా ఎత్తుకుని కథలు చెప్పేవారు . జోలపాటలు పాడి బజ్జో పెట్టేవారు .

ఎప్పుడూ నా చుట్టూ చాలామంది ఉండేవారు . నాకు మాటలు రాకపోయినా అమ్మమ్మ , తాతయ్య రోజూ మాట్లాడేవారు . నేను వచ్చీరాని ఉంగా భాష మాట్లాడినా ఆనందపడేవారు . బాల్యం అంటే రోజూ పండగ లాగ ఉంటుందనుకున్నాను . అంతలో నాకు మూడో సంవత్సరం వచ్చిందని , అక్షరాభ్యసం చేసారు . ఇంక ఆ రోజు నుండి బడికి వెళ్లాలట . అది ఆడుకునే బడి . పుస్తకాలు లేని బడి . చిన్న , చిన్న గేయాలు , అభినయంతో నేర్పించేవారు . మట్టిలో ఆటలు . బొమ్మలకు రంగులు వేయడం....అబ్బో ఎంత బాగుందో . ఎప్పుడైనా ‘ అ ,ఆ ‘ లు , ‘ ఎ , బి ,సి , డి ‘ లు కూడా నేర్పించేవారు . పరీక్షలు ఉండవు . బెత్తాలతో పనే లేదు . ఒక పూటే బడి . అన్నం తినే సమయానికి ఇంటికి వెళ్లేవాడిని . రెండేళ్లు ఆ బడికే వెళ్లాను . నా మాటలని , పాటలని అందరూ మెచ్చుకునేవారు .

అప్పుడు ఒక రోజు అమ్మ నాతో ‘ నీకు మాటలు వచ్చేసాయి . పెద్దవాడివి అయ్యావు . నిన్ను ఇంకో మంచి , పెద్దస్కూల్లో చేర్పించామని ‘ చెప్పింది . నేను స్కూల్ డ్రస్ వేసుకుని , పుస్తకాల సంచితో బడికి వెళ్లాలి . రెండు పూటలబడి . ఇప్పుడు నేను అన్నయ్యని . ఎందుకంటే ఉయ్యాలలో చిట్టి చెల్లి కూడా ఉంది . చెల్లిని ఎత్తుకుందామంటే , చిన్నవాడివి పడేస్తావంటారు .

కొత్తబడిలో ఎప్పుడూ చదవటం , రాయడమే . లెక్కలకో టీచర్ , సైన్స్ కి వేరే టీచర్ , ఇంగ్లీష్ కి మరో టీచర్ ఇలా గంట కొట్టినప్పుడల్లా ఒక్కో టీచర్ రావడం . ఎన్నో గొప్ప విషయాలు నాకు నేర్పిస్తున్నారు . పరీక్షలు కూడా ఉంటాయట . అన్నం కూడా బడిలోనే . డబ్బాలో అమ్మ పెట్టింది తినాలి . కింద పడేస్తే ‘ ఆయమ్మలు ‘ తిడతారు . తిన్న తర్వాత పడుకోకూడదు . మళ్లీ పాఠాలే .

అందుకే ఈ బడికి పోను అంటే అమ్మ నువ్వు నాన్నలాగా పెద్ద ఉద్యోగం చేయాలంటే ఇలాగే చదువుకోవాలని చెప్పింది . ఇది వరకులా నాతో ఎవ్వరూ ముచ్చట్లు చెప్పడం లేదు . నా మాటలకి నవ్వడం లేదు . నాకు చాలా దిగులుగా ఉంది . చదివి , చదివి అలిసి పోతున్నా ! రాసి , రాసి చేతులు కూడా నొప్పులు . సాయంత్రాలు ఆడకోకూడదు . అప్పుడు ట్యూషన్ కి వెళ్లలిగా .

ఇలా నా కష్టాల గురించి ఆలోచిస్తూ ముందు గదిలో కూర్చున్నాను . అప్పుడు పక్కవాటాలోని తాతయ్య (ఎప్పుడూ ఏ కష్టాలు లేనట్లు) నవ్వుతూ పలకరించాడు . ఓ నేస్తం దొరికాడనుకొని నా చదువు కష్టాలను చెప్పుకున్నాను . నా మాటలకి తాతయ్య పకపకా నవ్వాడు . అప్పటి వరకు వాతావరణం చాలా వేడిగా ఉంది . అంతలో ఉరుములు , మెరుపులతో పెద్ద వర్షం పడింది . ఒక్కసారిగా వర్షం తగ్గిపోయింది . ఆకాశంలో ఇంద్రధనస్సు కనిపించింది . ఎండా,వానా కలిసి వస్తే ఏడు రంగుల ఇంద్రధనస్సు ఆకాశంలో కనిపిస్తుందని మా సైన్స్ టీచర్ చెప్పింది . తాతయ్యకి కూడా రంగుల ఇంద్రధనస్సుని ఆనందంగా చూపించాను.

తాతయ్య నా వేపు చూసి , “ రవీ నువ్వు చిన్నపిల్లవాడివే . కాని చెల్లి కన్న పెద్దవాడివి . నువ్వు ఆకాశం ఎండను భరించినట్లుగా , పాఠాలు నేర్చుకుంటూ , పరీక్షలు రాస్తూ పై తరగతులకు వెళ్లాలి . అప్పుడు సూర్యుడు లాగా వెలిగిపోతావు . హోం వర్క్ లు చేయాలి , చదువు కోవడం కష్టం అని వర్షపు చినుకులలాగా ఏడవకూడదు . ఎండావానలను లెక్కచేయక బాగా టీచర్లు చెప్పినట్లు వింటే ఇంద్రధనస్సులాగా మంచి పేరు తెచ్చుకుంటావు . అప్పుడు నీ పేరు ,అమ్మానాన్నల పేర్లు కూడా జాతీయపతాకంలాగా కీర్తితో రెపరెప లాడతాయని “ చెప్పాడు . ఆ మాటలను అర్ధం చేసుకున్న రవి తాను ‘ ఏడు రంగుల జెండా ‘ లాగా ఎగరాలనుకుని ఎంతో ఇష్టంగా చదువుకుంటున్నాడు . అందరూ వాడిని చూసి ఆనందపడతున్నారు .

******************************

మరిన్ని కథలు

Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ
Chandruniko noolu pogu
చంద్రునికో నూలు పోగు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Anaadha atidhyam
అనాథ అతిథ్యం
- - బోగా పురుషోత్తం
Vibheeshana Sharanu
విభిషణుని శరణు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి