ఔదార్యం - పేట యుగంధర్

Helping Nature

పొద్దున్నే నిద్ర లేచి, ఇంట్లో పనులన్నీ చక్కబెట్టింది సాయమ్మ. రెండిళ్ళలో పనిచేస్తే గానీ ఇల్లు గడవదు సాయమ్మకు. పదేళ్లక్రితమే సాయమ్మ మొగుడు పైలోకాలకు పోయాడు. అప్పటినుండి ఎంతో కష్టపడింది. ఎవరు ఏ పని చెప్పినా కాదనకుండా చేసేది. వారిచ్చే తృణమో, పణమో పుచ్చుకొనేది. ఒక్కగానొక్క కూతుర్ని పెంచి పెద్ద చేసి ఒక అయ్య చేతిలో పెట్టింది. ఉన్నోడు కాదు గానీ, అల్లుడు మంచోడే. ఆటో నడుపుకుంటూ బిడ్డను మంచిగానే చూసుకుంటూ ఉన్నాడు. పెళ్లయ్యి ఆర్నెల్లు అయినా బిడ్డను ఇప్పటివరకూ పల్లెత్తు మాటకూడా అనలేదు.

మార్చినెలలో చుట్టం చూపుగా వచ్చిన సాయమ్మ కూతురు, అల్లుడు లాక్-డౌన్ కారణంగా తిరిగి వెళ్లలేకపోయారు. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు, లాక్ డౌన్ నిబంధనల కారణంగా సాయమ్మను పనికి రాకూడదన్నాడు కాలనీ ప్రసిడెంటు. చెవిపోగులు తాకట్టుపెట్టి కూతురు, అల్లుడికి ఇంతకాలం మర్యాదలు చేసింది సాయమ్మ. లాక్–డౌన్ సడలించడంతో ఇప్పుడిప్పుడే తిరిగి పనిలోకి వెళ్ళగలుగుతోంది. మరో వైపు కూతురు, అల్లుడు కూడా తమ ఊరికి వెళ్ళడానికి సమాయత్తమవుతున్నారు. “నాకు, ఆయనకు కొత్త బట్టలు పెట్టి పంపు. లేకుంటే అత్తారింట్లో నా మర్యాదకు లోటొస్తుంది" అని సాయమ్మను గోముగా అడిగింది కూతురు. ఇద్దరికీ బట్టలు పెట్టి, దారి ఖర్చులు ఏర్పాటుచేయ్యాలంటే మూడువేలయినా కావాలి.

నాలుగు రోజుల క్రితమే శర్మగారిని మూడువేలు అప్పుగా అడిగింది సాయమ్మ. “చూద్దాం లే!” అన్నారు తప్ప మరోమాట మాట్లాడలేదు శర్మగారు. పదేళ్లుగా వారింట్లో నమ్మకంగా పనిచేస్తోంది. శర్మగారు కూడా సాయమ్మను పనిమనిషిలా కాకుండా సొంత తోబుట్టువులా చూసుకొంటారు. డబ్బు రూపంలోనో, మాట రూపంగానో సాయమ్మ సహాయం అడిగిన ప్రతిసారీ, లేదనకుండా చేస్తారు. అర్చకత్వం చేసే శర్మగారికి, భక్తులు హారతి పళ్ళెంలో వేసే కానుకలే జీవనాధారం. లాక్–డౌన్ కారణంగా భక్తులను దేవాలయాలకు అనుమతించడం లేదు. అందుకేనేమో నాలుగురోజులైనా సాయమ్మ అడిగిన డబ్బుల గురించి నోరుమెదపలేదు శర్మగారు.

ఈ రోజు ఎలాగైనా శర్మగారిని ప్రసన్నం చేసుకుని, వారి నుండి తనకు అవసరమైన మూడువేల రూపాయాల్ని రాబట్టుకోవాలని నిర్ణయించుకొంది సాయమ్మ. పొద్దున శర్మగారి ఇంటికి వెళ్ళేసరికి ఆయనపై చిందులు వేస్తోంది ఆయన భార్య అవనాక్షమ్మ. పెళ్ళినాడు అవనాక్షమ్మ పుట్టింటివారు పెట్టిన ఉంగరాన్ని శర్మగారు ఎక్కడో పోగొట్టుకొని వచ్చిన కారణంగా శర్మగారిపై అవనాక్షమ్మ అగ్గిమీద గుగ్గిలమవుతోంది సాయమ్మకు అర్ధమైంది. పరిస్థితిని గమనించిన సాయమ్మ శర్మగారిని డబ్బులు అడగలేకపోయింది. పరధ్యానంతోనే శర్మగారి ఇంట్లో పనులన్నీ చేసింది. శర్మగారు తనను పిలిచి, డబ్బులు ఇస్తాడని ఆశపడింది. కానీ ఆ ఆలోచనే లేదన్నట్టు, వరండాలో వాలుకుర్చీ పరచుకొని, రేడియోలో వస్తున్న భక్తి పాటలు వింటూ తన్మయత్వంలో మునిగిపోయారు శర్మగారు. అవనాక్షమ్మ అరుపులు సైతం ఆయన చెవికెక్కడం లేదు. శర్మగారి వాలకం చూసిన సాయమ్మ నిరాశ చెందింది. ఒట్టి చేతుల్తో కూతుర్ని, అల్లుడ్ని పంపాల్సి వస్తున్నందుకు తనలో తానే మదనపడింది. నాలుగురోజులుగా మూడువేల రూపాయలు అవసరం ఉందని తను అడిగినప్పటికీ, అసలు ఆ విషయమే గుర్తులేనట్టు పరధ్యానంగా పాటలు వింటున్న శర్మగారిపై సాయమ్మకు మొట్టమొదటి సారి కాస్తంత కోపం కలిగింది కూడా.

పనులన్నీ పూర్తి చేసిన సాయమ్మ వెళ్తూవెళ్తూ శర్మగారి కనికరం కోసం ఆయన వైపు చూసింది. సాయమ్మ కోసమే ఎదురుచూస్తున్నట్టు, రేడియో క్రింద దాచిపెట్టిన మూడువేల రూపాయాల్ని సాయమ్మ చేతిలో పెట్టారు శర్మగారు. "ఉంగరం ఎక్కడా పోగొట్టుకోలేదు. ఈ మూడువేల రూపాయల కోసం దాన్ని తాకట్టుపెట్టాను. డబ్బుకోసం ఉంగరాన్ని తాకట్టు పెట్టానని తెలిస్తే అమ్మగారు బాధపడుతారు. అందుకే ఉంగరం పోగొట్టుకొన్నానని అమ్మగారికి అబద్దం చెప్పాను. డబ్బులు సర్ధుబాటయ్యాక ఉంగరాన్ని విడిపించి అమ్మగారికి అసలు విషయాన్ని నేనే చెబుతాను." అంటూ సాయమ్మకు రహస్యంగా చెప్పారు శర్మగారు.

చేతిలో డబ్బు లేకున్నా, తన అవసరం తీర్చడం కోసం పెళ్ళినాడు అత్తారింటి వాళ్ళు పెట్టిన ఉంగరాన్ని శర్మగారు తాకట్టు పెట్టారని తెలియగానే సాయమ్మ ఆశ్చర్యపోయింది. పనిమనిషైన తనను సొంత చెల్లిలా చూసుకొనే శర్మగారి ఔదార్యం ఆమెను కదిలించింది. శర్మగారిని అపార్ధం చేసుకొన్నందుకు మనసులోనే వారికి క్షమాపనలు చెప్పుకొంది.

మరిన్ని కథలు

Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి
Pramod Pesarattu
ప్రమోద్-పెసరట్టు
- వీరేశ్వర రావు మూల
Atanu aame madilo
అతను ఆమె మదిలో
- బొబ్బు హేమావతి
Atani kannu aame meeda padindi
అతని కన్ను ఆమె మీద పడింది
- బొబ్బు హేమావతి
Kottha ugadhi
కొత్త ఉగాది
- తాత మోహనకృష్ణ
Pallavi
పల్లవి
- తటవర్తి భద్రిరాజు
Suhasini
సుహాసిని
- బొబ్బు హేమావతి
Pelli
పెళ్లి
- Madhunapantula chitti venkata subba Rao