పిసినారి ధనగుప్తుడు - సరికొండ శ్రీనివాసరాజు‌

Pisinari dhanagupthudu

రత్నాపురం గ్రామంలో ధనగుప్తుడు అనే వ్యాపారి ఉండేవాడు. అతడు ధనవంతుడు అయినా పిల్లికి బిచ్చం పెట్టడు. బిచ్చగాడు ఎవరైనా అడుక్కోవడానికి వేస్తే నాలుగు గంటల పాటు ఏదైనా పని చేయించుకొని ఐదు రూపాయలు ఇచ్చేవాడు. అందుకే బిచ్చగాళ్ళు ఆ ఇంటి ఛాయలలోకే రాకపోయేవారు. ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే మంచినీళ్ళు కూడా ఇవ్వలేక పోయేవాడు. ఎవరైనా దగ్గర బంధువు తన ఇంటికి వచ్చి, నాలుగు రోజులు ఉంటే తాను విధిగా వాళ్ళ ఇంటికి వెళ్ళి పది రోజులు ఉండేవాడు. అందుకే బంధువులు కూడా రావడం మానేశారు. ఏదైనా మంచి కార్యానికి చందా ఇవ్వాల్సి వస్తే పది రూపాయలు రాసేవాడు. పుణ్య క్షేత్రాలకు వెళ్ళేటప్పుడు ఎవరైనా బంధు మిత్రులు దేవుని హుండీలో వేయమని డబ్బులు ఇస్తే అవి దగ్గర ఉంచుకునేవాడు.

బంధువులు, స్నేహితులు ఎవ్వరు తమ ఇండ్లలో జరిగే ఎలాంటి వేడుకలకైనా కుటుంబం మొత్తాన్ని తీసుకుని వెళ్ళేవాడు ధనగుప్తుడు. అక్కడ మూడు పూటలా తినేవారు. కానీ కానుకలు ఏమీ ఇవ్వకపోయేవాడు. పైగా ఆక్కడి పిండివంటలు మొదలైనవి మూట కట్టుకుని తీసుకు వచ్చేవాడు. మిగతా సమయాల్లో ఎవరినీ పట్టించుకునేవాడు కాదు. ఇలా కాలం గడిచింది. ఇటీవల ధనగుప్తుడు ఎన్నడూ లేని విధంగా అందరితో కలుపుగోలుగా ఉంటున్నాడు. కనబడ్డ ప్రతి వ్యక్తినీ స్నేహ పూర్వకంగా పలకరిస్తూ వారి క్షేమ సమాచారాలను విచారిస్తున్నాడు. ఏ సహాయం కావాలన్నా చేస్తానన్నాడు. ధనగుప్తునిలో వచ్చిన ఈ మార్పును ఎవరూ నమ్మలేక పోతున్నారు. ధనగుప్తుడు తనకు అంతంత మాత్రమే పరిచయం ఉన్నవారి ఇంట్లో పెళ్ళికి తన కుటుంబంలో తాను ఒక్కడే వెళ్ళి, వెయ్యి నూట పదహారు రూపాయలు కానుకగా ఇచ్చాడు. ఈ విషయం చాలా మందికి తెలిసింది. తానూ చాలా చోట్ల తన గొప్పతనాన్ని ప్రచారం చేసుకున్నాడు.

రోజులు గడుస్తున్నాయి. ధనగుప్తుడు తన కూతురి పెళ్ళికి, దగ్గర దూరపు బంధువులు, మిత్రులు, ఏ మాత్రం పరిచయం ఉన్నా‌ వారందరినీ పిలిచాడు. దాదాపు పిలిచిన ప్రతి ఒక్కరూ తమ కుటుంబంతో సహా పెళ్ళికి వెళ్ళారు. ఒక్క రూపాయి కూడా కానుకగా ఇవ్వలేదు. ఎన్నడూ లేని విధంగా జనం అందరిలో ధనగుప్తుడు కలిసిపోవడం, ఒక పెళ్ళిలో కానుకగా వెయ్యి నూట పదహార్లు ఇచ్చి అంతటా చెప్పుకోవడం వెనుక బలమైన కారణం ఉందని ముందే ఊహించారు జనం. తన కూతురికి మరిన్ని విలువైన కానుకలు ఆశించే ఈ పని చేశాడని, ఎక్కువ మందిని పిలిపిస్తే తనకు కానుకల రూపంలో ఎక్కువ లాభం రాబోతుందని ధనగుప్తుడు ఆశించాడని జనం గ్రహించారు. అందుకే ధనగుప్తుని మార్గాన్నే అనుసరించారు. ధనగుప్తుడు లబోదిబోమన్నాడు.

మరిన్ని కథలు

The roadless travelled
ది రోడ్ లెస్ ట్రావెల్డ్
- రాపాక కామేశ్వర రావు
Veyyi roopayala jaree cheera
వెయ్యి రూపాయిల జరీ చీర
- పూర్ణిమ పెమ్మరాజు
Peddarikam
పెద్దరికం
- Prabhavathi pusapati
KARMA VADALADU
కర్మ వదలదు
- తాత మోహనకృష్ణ