పంతులమ్మ - చెన్నూరి సుదర్శన్

Pantulamma

‘వర్క్ ఫ్రం హోం’ లో నిమగ్నమై ఉన్నాడు ఉపేంద్ర.

కాలింగ్బెల్ మ్రోగింది. విసుక్కుంటూ.. తలుపు తీశాడు.

“రమణమ్మ పంతులమ్మగారు ఉన్నారా సర్” అడిగాడు వచ్చిన ఆసామి.

“లేరు..” అంటూ ముక్తసరిగా సమాధానమిచ్చాడు ఉపేంద్ర. దభాల్న తలుపులు మూసెయ్యబోయి..

“సర్.. చెక్కు తెచ్చాను” అనే మాట విని సంభ్రమాశ్చర్యాలతో ఆగిపోయాడు.

“పంతులమ్మ గారికి చెక్కు ఇచ్చిపోదా మని వచ్చాను” అంటూ చెక్కు చూపించాడు.

అందులో పది లక్షలు చూసి, ఉపేంద్ర కళ్ళు బైర్లు కమ్మాయి. ఈరోజు ఫైళ్ళన్నీ పూర్తి చేసినా అంత ఆదాయం రాదు. అని మనసులో గణించు కున్నాడు. లిప్తకాలం కళ్ళు మిటకరించుకుని.. అతణ్ణి లోనికి ఆహ్వానించాడు. కూర్చోమంటూ కుర్చీ చూపించి గబ, గబా వెళ్ళి ఫ్రిజులో నుండి నీళ్ళ బాటిల్ తీసుకు వచ్చి ఇస్తూ.. “ముందుగా నీళ్ళు తాగండి. కూల్ డ్రింక్ తీసుకు వస్తాను. యువర్ గుడ్ నేమ్ ప్లీజ్” పెదవులపై చిరునవ్వులు పూయిస్తూ అడిగాడు ఉపేంద్ర.

“డ్రింక్స్ వద్దు సార్.. ముందుగా పంతులమ్మగారిని పిలవండి. నా పేరు సూర్యం” అంటూ మంచినీళ్ళు కాసిన్ని తాగి బాటిల్ టీపాయ్ మీద పెట్టాడు.

“పంతులమ్మ లేదు సూర్యం గారూ.. నేను వారి ఒక్కగానొక్క అబ్బాయిని. నా పేరు ఉపేంద్ర. రెవెన్యూ డిపార్ట్ మెంటులో పని చేస్తున్నాను. చెక్కే గదా.. నేను మా అమ్మగారికి గారికి అందజేస్తాను” అంటూ ఎంతో వినమ్రంగా చేతులు నలుచుకుంటూ.. ఆతృతగా చెక్కు వంక తదేకంగా చూడసాగాడు ఉపేంద్ర.

“సారీ ఉపేంద్రగారూ.. నేను అమృతమూర్తిగారి చేతికి చెక్కు నేరుగా అందజెయ్యాలని ఎంతో ఆశగా వచ్చాను. వారు ఎక్కడికి వెళ్ళారు? వచ్చే వరకు వేచి ఉంటాను” చెక్కును తిరిగి తన హ్యాండు బ్యాగులో సర్దుకుంటూ అన్నాడు సూర్యం.

“మా స్వంత గ్రామానికి వ్యవసాయ పనులు చూసుకోడానికి వెళ్ళారు. మరో పది రోజుల్లో గాని తిరిగి రారు. చెక్కు మా అమ్మ గారి పేరనే ఉంది గదా.. నాకిస్తే నష్టమేంటి?. అయినా చెక్కు ఎక్కడిది? మీరెలా తెచ్చారు.. ఇంతకూ మీరెవరు.. ” అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు ఉపేంద్ర. అప్పటి వరకూ తన ధ్యాసంతా చెక్కును చేజిక్కించు కోవాలనే తాపత్రయమే..

“ఉపేంద్రగారూ.. రమణమ్మ పంతులమ్మగారు బాసర సరస్వతీదేవీ ప్రాంగణంలో నాతో అక్షరభ్యాసం చేయించారు. మా నాన్నగారి బదిలీ దృష్ట్యా మూడవ తరగతిలో ఉండగా వైజాగ్ వెళ్ళాల్సి వచ్చింది. పంతులమ్మ గారి చేతి చలువ వల్ల నాకు చదువు బాగా అబ్బింది. మంచి ఉద్యోగమూ వచ్చింది. దానికి కారణం పంతులమ్మగారేనని నాప్రగాఢవిశ్వాసం. వారికి ఉడతాభక్తిగా ఎంతో కొంత ఆర్థిక సాయం చెయ్యాలను కున్నాను. నా మొదటి జీతాన్ని పంతులమ్మగారి పేరు మీద బ్యాంకులో స్థిర ధరావతు (Fixed Deposit) చేశాను. మున్ముందు పరిస్థితులు ఎలా ఉంటాయో..! చెప్పలేమని, పంతులమ్మగారి పదవీ విరమణ అనంతరం అంద జేయాలను కున్నాను.

ఆంధ్ర, తెలంగాణ విడిపోవడం.. ఈ మధ్యనే నేను తిరిగి నిజామాబాదు రావడంజరిగింది. పంతులమ్మగారు విస్తుపోయేలా చెక్కు అందజేయాలనుకున్నాను.. చిరునామా కనుక్కొని వచ్చాను. వారు లేక పోయేసరికి నిరాశ కలిగింది.. అయినా ఫరవాలేదు మళ్ళీ వస్తాను” అంటూ లేచి నిలబడ్డాడు సూర్యం.

మనసుపడి కుట్టించుకున్న కొత్త చొక్కాను ఎలుకలు కొరికేసినట్లు అనుభూతి చెందాడు ఉపేంద్ర.

“సూర్యంగారూ.. మా అమ్మగారు రాగానే మీకు కబురు పెడతాను. మీ కాంటాక్ట్ నంబరివ్వండి” అంటూ సూర్యం సెల్ నంబరు తీసుకుని వీడ్కోలు పలికాడు.

***

ఉపేంద్ర మైండు బ్లాకయ్యింది. ఆఫీసు ఫైళ్ళను ముట్టుకో బుద్ధికావడం లేదు. అబద్ధమాడినా.. చెక్కు చిక్కక పాయేనని పరి, పరి విధాల మనసు పాదరసంలా కదలాడ సాగింది. పదే, పదే తాను.. తన తల్లిపట్ల చూపిన నిర్దయ చెక్కులో సాదృశ్యంలా కనబడ సాగింది.

వాస్తవానికి రమణమ్మకు ఒక కుమారుడు, ఒక కుమార్తె. భర్త అర్థాంతరంగా కన్ను మూశాడు. బతుక లేక బడి పంతులు జీవనయానంలో.. ఇద్దరి పెళ్ళిళ్ళు చేసింది. వారి జీవితాలూ స్థిర పర్చింది. పదవీ విరమణ అనంతరం వచ్చిన డబ్బులు ఇద్దరికీకీ సమంగా పంచింది. పెద్ద మనుమడు అమెరికాయానం కోసం బ్యాంకు ఋణం రావాలంటే ఆస్తి తన పేరన ఉండాలని లాగేసుకున్నాడు ఉపేంద్ర. నేనుండగా నీకు డబ్బులకేం కొదువ.. అని మాయ మాటలు చెప్పి ఏ.టి.ఎం. కార్డు నొక్కేశాడు.

అత్తాకోడళ్ళ గొడవల కారణాన మనసుకు శాంతి కొరవడిందనే నెపంతో.. ఈ మధ్యనే రమణమ్మను ఒక అద్దెగదిలో ఉంచాడు.

కాలింగ్ బెల్లు మళ్ళీ మోగింది. ఉపేంద్ర చెక్కు మీది ధ్యాసలో నుండి తేరుకొని తలుపు తీశాడు. ఎదురుగా అర్థాంగి. ఆదివారం వస్తే చాలు తేరగా వచ్చి తిని పోతారని ఆడపడుచు సూటి పోటి మాటలు వినలేక వచ్చేశానని చెప్పుకుంటూ గొణుక్కోసాగింది.

అంతకంటే మహా ఘోరం జరిగిందంటూ.. చెక్కు విషయం చెక్కు చెదర కుండా చెప్పాడు ఉపేంద్ర.. భార్య ‘కరణేషు మంత్రీ..’ అని ఊరికే అన్నారా..! మంచి సలహా ఇచ్చింది.

వెంటనే కార్యోన్ముఖుడయ్యాడు ఉపేంద్ర..

ఆఘమేఘాలలో రమణమ్మ గదికి వెళ్ళి తలుపు తట్టాడు. తెరుచుకుంది.. ఎదురుగా రమణమ్మ.

“అమ్మా.. “ అంటూ లేని ఆప్యాతను పులుముకుని ఇంట్లోకి కాలు పెట్టబోయాడు.

“చీ.. దుర్మార్గుడా..” అంటూ కాండ్రించి ఉపేంద్ర ముఖంమ్మీద ఉమ్మేసింది రమణమ్మ.

“మళ్ళీ ఏముఖం పెట్టుకొని వచ్చావురా? నాకు తిండి దండుగ అని.. నా మూలాన మీ ఇల్లు అపరిశుభ్రం అవుతుందని గోల చేసి నన్ను దయ్యాల కొంపలో వదిలేసి వెళ్ళావు కదరా.. నా కోసం వచ్చావా.. లేక నా చెక్కు కోసం వచ్చావా?” అంటూ ప్రశ్నించే సరికి కంగుతిన్నాడు. ‘చెక్కు విషయం ఈ ముసల్దానికి ఎలా తెలిసిందా..!’ అని మనసులో వాపోయాడు.

ఇంద్రజాలంలా రమణమ్మ వెనకాల సూర్యం ప్రత్యక్షమయ్యాడు. ఉపేంద్ర కనుగుడ్లు తేలేశాడు. విషయం అర్థమయ్యింది. వెంటనే వెను దిరిగి కాళ్ళకు బుద్ధి చెప్పబోయాడు.

“ఉపేంద్రగారూ.. ఒక్క క్షణం. పంతులమ్మగారి కథ విన్నాక నా హృదయం చలించింది. మీరంతా పూర్తిగా డబ్బు మనుషులని.. డబ్బు ఎర వేస్తే.. వస్తావనే నా పాచిక పారింది. నీలో పరివర్తన కలిగి పంతులమ్మగారిని తీసుకు వెళ్తావని అనుకున్నాను. కాని పారిబోపోతున్నారు. ఎంత అన్యాయం.. నాకు మాతృసమానురాలైన పంతులమ్మగారు భారమేమీ కాదు. వారి సలహా ప్రకారం ఒక ఆశ్రమం నెలకొల్పబోతున్నాను. ఎందరో విద్యార్థులను తీర్చిదిద్ది, చివరాంకంలో.. ఇలా నిరాశ్రయులయ్యే వారికి ఆశ్రయం కల్పిస్తాను” అంటుండగానే అంతర్థానమయ్యాడు ఉపేంద్ర.

***

ఆ మరునాడు వార్తాపేపర్లో ‘అవినీతి నిరోధక శాఖ వారికి చిక్కిన రెవెన్యూ ఇనస్పెక్టర్ ఉపేంద్ర’ అని తాటికాయంత అక్షరాలు చదివి పంతులమ్మ గారికి చేసిన ద్రోహానికి తగిన శాస్తి జరిగిందనుకున్నాడు సూర్యం.

కాని ఉపేంద్ర సామాన్యుడు కాడు. మళ్ళీ గోల్ మాల్ చేసి కేసు నుండి తప్పించుకునే సామర్థ్యం కలిగిన కాలాంతకుడు. అలా వదలరాదనుకున్నాడు.

తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్‌లను పోషించకుండా నిరాదరణకు గురి చేస్తే,, ‘సీనియర్ సిటిజన్ ఆక్ట్ 2007’ ప్రకారం వారు బిడ్డలకు పంచి ఇచ్చిన ఆస్తులను తిరిగి వెనక్కి తీసుకునే అస్త్రం ప్రయోగించే దిశగా పావులు కదపాలని నిర్ణయం తీసుకున్నాడు సూర్యం. *

మరిన్ని కథలు

Swayamvaram
స్వయంవరం
- తాత మోహనకృష్ణ
Maatruhrudaya mahattu
మాతృహృదయ మహత్తు!
- చెన్నూరి సుదర్శన్
Simhavalokanam
సింహావలోకనం
- మద్దూరి నరసింహమూర్తి
Mana garden
మన గార్డెన్
- తాత మోహనకృష్ణ
Andari bandhuvuluu
అందరి బంధువులు
- భానుశ్రీ తిరుమల
Teeram cherchina parugu
తీరం చేర్చిన పరుగు
- షామీరు జానకీ దేవి
Vimanam lo kalakalam
విమానంలో కలకలం
- తాతా కామేశ్వరి
Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ