మాస్కేన కోవిడ్ నాస్తి - పి. వి. రామ శర్మ

Maskena covid naasti

వదినా! నాన్నగారికెలాఉంది? అనడిగింది అవతల ఫోన్లో సుమతి ఆడపడుచు దమయంతి. మా నాన్నగారికేం బానే ఉన్నారు? అంది సుమతి. “అబ్బా! నాన్నగారంటే మీ నాన్నగారని కాదొదినా, మా నాన్నగారని! మీ నాన్నగారైతే మీ... చేర్చేదాన్నిగా.” అంది దీర్ఘం తీస్తూ ఆడపడుచు. ఓహో! కోర్టు భాష లాగా.. నాన్నగారు అంటే హియర్ ఇన్ ఆఫ్టర్ కాల్డ్ ఏజ్ మామగారు అన్నమాట! ఒకే! ఇకపై ఫాలో అవుతాలే.” అంది సుమతి నవ్వుతూ. “ఇంతకీ నాన్నగారికెలా.. అదే మీ మామగారికెలా ఉందో చెప్పనే లేదూ..” అని మళ్ళీ దీర్ఘం.. అట్నుండి ఫోన్లో.

“ ఓహ్! మామగారు బాగానే ఉన్నారు. మొన్న బాత్రూమ్ లో జారీ పడినతర్వాతనుండీ ఫ్రాక్చర్లు ఏం కాలేదు గానీ, భయానికో ఏమో బాగా నీరసంగా ఉన్నారు., మునపటి ఓపిక తగ్గింది. కాస్త ఈ కరోనా భయం తగ్గాక, ఓసారి టెస్టులు చేయించాలి.” అంది సుమతి.

“ఫర్లేదంటావా వదినా!” ఈసారి ఆడపడుచు గొంతు ఆడపడుచు ఆధార్టీ దీర్ఘాలు తగ్గి, దీనంగా వినిపించింది.

“ప్రస్తుతానికి ఫర్లేదులే. అయినా పెద్దవయసు కదా, ఎప్పుడెలా ఉంటుందో చెప్పలేం!” ఛాన్స్ దొరికిందికదాని.. కాస్త భయపెట్టింది సుమతి.

“అమ్మో! అలా అనకు వదినా. సరే! నాన్నగార్ని చూడ్డానికి రేపుదయాన్నే బయల్దేరి వస్తాం లే!” అని ఫోన్ పెట్టేసింది దమయంతి. “నేరకపోయి భయపెట్టాను. ఇప్పుడీవిడగారు పిల్లల్తో వచ్చిసెటిలైపోతే సేవలు చేయలేక చావాలి!అసలే మాయదారి కరోనా రోజులు.” అని సణుక్కుంది సుమతి. “మీ చెల్లెలు మీ నాన్నగారిని, అదే మా మామగారిని చూడ్డానికి వస్తుందిట! ఈ కోవిడ్ టైమ్ లో ఆవిడ గారు రావడం అవసరమంటారా!” అని భర్త ప్రకాశం తో ఫిర్యాదింది. అయినా అతను మాస్క్ లేకుండా బయట తిరిగేవాడిలా, నిర్లక్ష్యంగా “ ఆ పోన్లెద్దూ! తనింటినుండేగా వచ్చేదీ. ఇంతలోనే కోవిడ్ వెంటబెట్టుకువచ్చేస్తుందా ఏం!” అని బయటికి పోయాడు, మాస్క్ రహితంగా. ఆయనో నిర్లక్ష్యపు మనిషి. గత కోవిడ్ సీజన్లో మాస్కు లేదని పోలీసులు మూడుసార్లు వెంటతరిమినా, తన పద్ధతి మార్చుకోనంత నిర్లక్ష్యం. మెయిన్ రోడ్లు వదిలి సందులు గొందుల్లో పడి బజారుకి, ఆఫీసుకి వెళ్తాడు తప్ప, హెల్మెట్, మాస్క్ పెట్టుకోడు.

ఆ తర్వాత వరసగా సుమతి మరిది “వదినా నాన్నకెలా ఉంది” అని, పినమామగారు “ఏం అమ్మాయ్! మా అన్నకెలా ఉంది అని.. ఇక ఇతర స్నేహితులు, దూరం దగ్గరా కానీ బంధువులు వరస ఎంక్వరీలతో సుమతికి వరస ఫోన్లు చేశారు. ఇంతమందికీ సమాధానాలు చెప్పుకుంటూ, ఇంటికి వస్తామన్నవాళ్లని రావద్దని చెప్పలేక, మానలేక, ఇంట్లో పిల్లలమీద, మొగుడిమీద రోజూ ప్రభుత్వాన్ని తిట్టే ప్రతిపక్షంలా విరుచుకుపడేది.

==========

అన్నట్టుగానే, ఆడపడుచు పిల్లల్తో దిగబడింది. వాళ్ళ నాన్నని చూసి కళ్ళనీళ్లు పెట్టుకుంది. నాకేమే! బానే ఉన్నా. ఏదో కాస్త నీరసం అంతే అని ఆ పెద్దాయన, కామేశ్వరరావు తిరిగి దమయంతినోదార్చేడు. అనుకున్నట్టు గానే దమయంతి ఓ రెండ్రోజులు ఆడపడుచురికం చేసి మరీ కదిలింది. వెళ్ళేముందు దాకా మళ్ళీ తన తండ్రితో దగ్గరగా గడిపింది లేనేలేదు. టీవీలో అన్నివేళలా అన్ని ఛానెల్స్ లో వచ్చే సీరియల్స్ ఒకదాని తరువాత ఒకటి రోజాల్లా చూస్తూ వదిన్ని అడిగిమరీ చేయించుకున్న జంతికలు అలా నోటిమిల్లు ఆడిస్తూ కాలం గడిపేసింది. వెళ్ళేముందు తండ్రి దగ్గరికి వెళ్ళి, “వెళ్లొస్తా నాన్నగారు. మీ ఆరోగ్యం జాగ్రత్త. అన్నెలాగూ పట్టించుకోడు, మీరే ఏం కావాలన్నా వదిన్ని అడిగిమరీ చేయించుకోండి.” అని ఓ ఉచిత సలహా పడేసింది. “నువ్వసలు ఈ రెంద్రోజులు ఇక్కడే ఉన్నావేంటే? వచ్చినరోజు కనబడి పలకరించిపోతేనూ, నువ్వెళ్లిపోయావనుకున్నాను.” అన్నాడు ముసలాయన ఆశ్చర్యంగా, ఒకింత కోపంగా. తండ్రివేపు గుర్రున చూసి, బయల్దేరింది దమయంతి. బ్రతుకు జీవుడా అనుకుంది సుమతి. ఈ రెండ్రోజులు మామగారితో పాటు ఆడపడుచుకీ, ఆమె పిల్లలకీ సపర్యలు చేసేసరికి, మంత్రి గారు వచ్చి వెళ్ళేదాకా, గెస్ట్ హౌస్ దగ్గర డ్యూటి పడిన కానిస్టేబుల్ లా అయింది ఆమె పరిస్థితి.

========

ఆ తర్వాత నుండీ కోవిడ్ భయం కోవిడ్ దే, మా తిరుగుళ్లు మావే అన్నట్టు, “పెదనాన్నగారు ఎలా ఉన్నారో చూద్దామని వచ్చా అనీ, ఏం సుమతీ.. మీ మామగారికి బాలేదట? ఏంటి సుస్తీ అని ఇంరుగుపొరుగు ఫ్లాట్ల వాళ్ళు, “అన్నయ్యా! ఎలా ఉందిప్పుడు. బాగా చిక్కిపోయావుస్మీ!” అనీ, “ ఏరా! కాముడూ.. ఏమిటి సుస్తీ నీకూ?” అని కామేశ్వరరావు ని పరామర్శించడానికి చుట్టాలు, స్నేహితులు వరసగా బాచ్ లు బాచ్ లు గా వచ్చిన వాళ్ళందరూ మాస్కులు పెట్టుకొచ్చినా, వాటిని గెడ్డాల కిందకి దించేసి మరీ కబుర్లాడేవాళ్లు. అలా వాళ్ళందరికీ మర్యాద కోసం టీ కాఫీ టిఫిన్లందించేసరికి సుమతికి తలప్రాణం తోకకొచ్చేది. హోటల్లో సర్వరు కన్నా అధ్వాన్నం అయిపోయింది నా బ్రతుకు. వాడైనా ఓ ఎనిమిది గంటల డ్యూటి చేసి, తర్వాత రెస్ట్ తీసుకుంటాడేమో గానీ, నాకదీ లేదు అని వాపోయింది. పైగా వచ్చిన వాళ్ళందరికీ ఆయన బాత్రూమ్ లో ఎలా ఎందుకు జారిపడ్డారు, ఆతర్వాతేమైంది అన్న విషయాలు చెప్పే ఓపిక లేక, ఓ వాట్సాప్ మెసేజ్ రాసిపెట్టుకుని, వచ్చినవాళ్లందరి సెల్స్ కి ఆ మెసేజ్ ఫార్వర్డ్ చేసి, చదువుకోమనేది. వాళ్ళలో కొందరు పెద్దవాళ్లైతే, “అదేంటమ్మాయ్, ఆపాటి విషయం మర్యాదకైనా నోటితో చెప్పొచ్చుగా” అనేవారు నిర్మొహమాటంగా. ఆ కోపం,విసుగు పిల్లమీద, మొగుడిమీద చూపిస్తూ, జనావాసాల్లోకివచ్చిన చిరుతలా ఇంట్లో తిరిగేది. ప్రకాశంరావు మాత్రం “పోన్లెద్దూ! వచ్చినవాళ్లు ఏవో పళ్ళు తెస్తున్నారు కదా.. కొన్నాళ్లు ఈ పళ్ళు కొనే ఖర్చు తప్పుతుంది మనకి. నువ్విచ్చే కాఫీ, టీలకి ఇవి కాంపెన్సేషన్ అనేవాడు. భర్త నిర్లక్ష్యానికి, వచ్చే పోయేవాళ్ళ తాకిడికి ఏం చేయాలో తోచక తలపట్టుకుంది సుమతి.

============

సడెన్ గా ఓ రోజు ప్రకాశం పరుగు పరుగున ఆఫీసు నుండి మధ్యలోనే ఇంటికొచ్చి, తన సెల్ లో మెసేజుల్ని భార్యకు చూపించాడు. దాంట్లో, “సారీ టు హియర్ ది న్యూస్. విష్ యు స్పీడీ రికవరీ అని, ఓహ్! జాగ్రత్త. గదిదాటి బయటికిరాకండి..…ఆవిరి బాగాపట్టండి, పసుపు కలిపినపాలు, దాల్చిన చెక్క పొడి వాడుతూండండి…..ఓ వారం రోజులు చూసి తగ్గకపోతే హాస్పిటల్ లో అడ్మిట్ అవడం బెటర్, డబ్బుకు చూడకండి. ప్రాణాలు ముఖ్యం కదా,…. ధైర్యం గా ఉండండి. అసలు మనోధైర్యమే కరోనాకు అసలు మందు అంటారు!... మీరు అనవసరంగా హాస్పిటల్లో చేరి లక్షల లక్షలు తగలేసుకోకండి... అసలు ఆనందయ్య మందుకోసం ఎందుకు ట్రై చెయ్యకూడదూ?...” లాంటి మెసేజ్ లు కోకొల్లలున్నాయి. “ఏమిటీ? నాకు కోవిడ్ పాజిటివ్ అని అందరూ తెగ సానుభూతి, సలహాల మెసేజీలు పెట్టేస్తున్నారు. నాకేం ! దుక్కలా ఉన్నాను. నాకు కోవిడ్ ఏమిటీ!?” అని భయం తో సుమతి దగ్గర వాపోయాడు, అంతరంగంలో ఏదో భయం పట్టుకుందతన్ని. అతనిలో ఏనాడూ భయం చూసెరుగని సుమతికి అతన్ని చూస్తే జాలెసింది.

అతని జుట్టు నిమురుతూ, “చావుకి పెడితే కానీ, లంఖనానికి రారన్న” సామెత వాడాను. ఈ కోవిడ్ టైమ్ లో మీనాన్నగారిని పరామర్శ చెయ్యడానికి అందరూ తెగ వచ్చి పడిపోతుంటీ..వాళ్ళందరికీ టైమ్ కేటాయించలేక, టీకాఫీల్లాంటి మర్యాదలు చేయలేక నానా యాతన పడ్డాను. వాళ్ళల్లో ఎవరినుండి మనింటికి ఆ మాయదారి కరోనా వచ్చిపడుతుందో తెలీదు. అసలే మీ నాన్నగారిది ముసలి ప్రాణం. మన చేతులారా ఆయన ప్రాణానికి హాని తలపెట్టలేం కదా? అందుకే మన చుట్టాలు, స్నేహితులందరికీ, “మా మామగారు బాగా కోలుకున్నారు. ఎటొచ్చీ మావారికే కోవిడ్” అని మెసేజ్ పెట్టాను. దెబ్బకి అంతా ఇంటికి రావడంమానేసి, మీకు సెల్ లో ఉచితసలహాలివ్వడం మొదలెట్టారు.భయపడకండి. అదీ సంగతి” అని నవ్వుతూ, అతని చేతికి మాస్క్ ఇస్తూ, “అయినా మీరేమో కరోనా వైరస్ తగులుకుంటుందేమోనన్న భయంకూడా లేకుండా మాస్క్ పెట్టుకోకుండానే గడిపేస్తున్నారు. ఖర్మకాలి కోవిడ్ వస్తే కనుక, మీ పరిస్థితి ఏమిటన్నది మీకవగతమవుతుంది అన్న కీడులాంటి మేలు కూడా ఇందులో ఉందండోయ్. ఇకపై మీరు “మాస్కేన కోవిడ్ నాస్తి!” అన్న కొత్త సామెత గుర్తుచేసుకుంటూ, మాస్క్ పెట్టుకోవడం మానకండి. పన్లో పని.. ఈ సానిటైజర్ కూడా జేబులో పెట్టుకోండి.” అని నవ్వింది సుమతి. “అమ్మో! ఈ మెసేజీలు చూస్తేనే భయంగాఉంది. నిజంగా కోవిడ్ బారినపడితే!!??”అని హడిలిపోతూ మాస్క్, సానిటైజర్ బాటిల్ అందుకున్నాడు ప్రకాశం. ఉభయతారకంగా అటు ఇంటికొచ్చేవాళ్ళకి, ఇటు భర్త నిర్లక్ష్యానికి అడ్డుకట్టపడినందుకు సంతోషించింది సుమతి.

======శుభం======

మరిన్ని కథలు

Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ
Chandruniko noolu pogu
చంద్రునికో నూలు పోగు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Anaadha atidhyam
అనాథ అతిథ్యం
- - బోగా పురుషోత్తం
Vibheeshana Sharanu
విభిషణుని శరణు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి