మనోగతం చేసిన మార్పు - కొత్తపల్లి రవి కుమార్

Manogatham chesina marpu

ఆహ్లాదకరమైన ఉషోదయానికి స్వాగతం పలుకుతున్నట్లుగా సుధ తయారు చేసే కాఫీ వాసన ముక్కుకు తగలగానే ఒక్క సారిగా ప్రాణం లేచి వచ్చినట్టయ్యింది మోహన్ కి. ప్రాణం పోయేటట్టు పది సార్లు బెడ్ కాఫీ గురించి అరిస్తేనే గాని వంట గదికి చేరుకోని సుధ ఈ రోజు ఉదయాన్నే కాఫీతో ఎందుకు ఎదురు వస్తోందో అర్ధం కాలేదు మోహన్ కి. కాఫీ తాగిన తర్వాత తీరుబడిగా ఆలోచించగా నిన్న రాత్రి జరిగిన సంఘటన గుర్తుకు వచ్చింది మోహన్ కి. దీన్ని బట్టి అర్ధమయ్యింది తను ఎంత పని ఒత్తిడిలో ఉన్నాడో, అదీ నిన్న రాత్రి జరిగిన సంఘటన కూడా మరచిపోయేంతగా. * * * "ఏమండీ! పిల్లలకు సెలవులిచ్చారు. నాకూ రిక్వెస్ట్ హాలీడేస్ పది రోజులిచ్చారు. మీరు కూడా ఆఫీసుకి సెలవు పెడితే హాయిగా ఈ పండుగ కి మన ఊరు వెళ్ళి రావచ్చు. పైగా మీ నాన్నగారి రిటైర్మెంట్ ఫంక్షన్ తర్వాత మరల మనం వెళ్ళలేదు. ఏడాది దాటిపోయింది" అని అంది సుధ. ఆ మాట విన్న మోహన్ సుధపై గుర్రుగా చూస్తూ "నీకు నా ఆఫీసు గురించి గానీ, నా ఉద్యోగం గురించి గానీ తెలియనిది కాదు. నీ ఉద్యోగంలా ఎప్పుడు పడితే అప్పుడు సెలవులు పెడితే కుదరదు. ఇప్పుడసలే పీక్ టైమ్. క్లియర్ చేయాల్సిన టార్గెట్ లు చాలా ఉన్నాయి. నాకు కుదరదు. కావాలంటే పిల్లలను తీసుకుని నువ్వు హాయిగా తిరిగి రా" అన్నాడు. అది విన్న సుధ "మీకు ఎప్పుడు కుదిరిందని గనుక! మిమ్మల్ని అడిగాను చూడండి నా పిచ్చి గానీ. ఎప్పుడూ చూడండి బిజీ, క్షణం తీరిక లేదు, టార్గెట్ లు ఉన్నాయి, పీక్ టైమ్ ఇవే మీ నోటమ్మటి నుండి వచ్చే పదాలు. ఎన్నాళ్ళయ్యింది నన్ను, పిల్లల్ని బయటకు తీసుకెళ్లి. నా మాట సరే. ఆదివారమయినా మా నాన్న మమ్మల్ని బయటికి తీసుకెళ్తారని ఎన్నో సార్లు ఎదురు చూసిన ఆ పిల్లల మనసుల డిక్షనరీలో ఆ ఎదురు చూడటం అనే పదాన్ని కూడా లేకుండా చేసేసారు. నన్ను, పిల్లల్ని సుఖంగా ఉంచలేకపోయిన ఈ బిజీ ఉద్యోగం చేసినా, చేయకపోయినా ఒకటే. ఆఖరిసారిగా అడుగుతున్నాను. మీరు ఈ సారైనా మమ్మల్ని తీసుకెళ్తారా, లేదా? " అని మోహన్ పై ఎన్నాళ్ళనుంచో ఉన్న ఆక్రోశాన్నంతా ఒక్కసారిగా వెళ్ళగక్కింది. ఎప్పుడూ సాఫ్టుగా ఉండే సుధలో ఇంత వయలెంట్ విలన్ ఒక్కసారిగా బయటికి వచ్చేసరికి ఆశ్చర్యపోయాడు మోహన్. ఆలోచించగా సుధ చెప్పిన దానిలో కూడా నిజం లేకపోలేదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో తన బాస్ తనకు లీవ్ ఇస్తాడా? ఇవ్వడా? ధైర్యం చేసి ఎలాగ అడగడం అని తనలో తాను మధనపడ్డాడు. * * * ఎప్పుడూ చిర్రు బుర్రు లాడే తన బాస్ పరంధామయ్యని చూసేసరికి ముచ్చెమటలు పట్టాయి మోహన్ కి. లీవ్ అడుగుదామా, వద్దా అనుకుంటూ ఎలాగోలా ధైర్యం తెచ్చుకుని డోర్ తెరచి, "ఎక్స్ క్యూజ్ మి సార్! మే ఐ కమ్ ఇన్? " అని అడిగాడు. అప్పుడే ఆముదం తాగిన వాడిలా ముఖం పెట్టి, "ఏం మోహన్? పని ఎగ్గొట్టి నా చుట్టూ తిరుగుతున్నావు. ఏమిటి అంత ముఖ్యమైన పని నాతో? " అని గద్దించాడు పరంధామయ్య. "ఏం లేదు సార్! నాకు 10 రోజులు లీవ్ కావాలి. " అని తడుముకుంటూ అన్నాడు మోహన్. "వాట్? " అంటూ అంత ఎత్తున లేచిన పరంధామయ్య. "ఏమిటీ ? 10 రోజులు లీవ్ కావాలా నాయనా? నువ్వు చేసేది గవర్నమెంట్ జాబ్ కాదు. అయినా ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ లు కూడా మన ప్రయివేట్ జాబ్ ల కన్నా స్ట్రిక్ట్ గానే ఏడ్చాయి. అది తెలుసుకో ముందు. " అని తన లెవెల్లో చెప్పాడు మోహన్ కి. ఎలాగైనా బాస్ దగ్గర లీవ్ తీసుకుని వెళ్ళాలన్న కృతనిశ్చయంతో లోపలికి వచ్చిన మోహన్ ఆ మాటలు విని చేతిలోచాక్లెట్లు లాక్కున్న పిల్లాడిలా నోరు వెళ్ళ బెట్టాడు. అయినా సరే ఎలాగైనా లీవ్ తీసుకోవాలని "సార్! నా ఈ నాలుగేళ్ళ సర్వీసులో నేను తీసుకున్న లీవ్ లు వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చు. అయినా ఈ పండుగ కి మా పేరెంట్స్ దగ్గరకు వెళ్దామనుకుంటున్నాను. ప్లీజ్ సార్! ఈ సారికి లీవ్ ఇవ్వండి సార్ !" అని అన్నాడు. మోహన్ చెప్పేది అతిశయోక్తి కాదనిపించింది పరంధామయ్యకి. ఎందుకంటే ఆఫీసులో మోస్ట్ సిన్సియర్ వర్కర్ మోహన్. అప్పజెప్పిన పని అయ్యేవరకు ఇంటి విషయం గురించి గానీ, ఇంటి మనుషుల గురించి గానీ ఆలోచించడు. ఇంతటి సిన్సియర్ వర్కర్ కి లీవ్ ఇవ్వడం తప్పు లేదని ఏ మూలనో మోహన్ పై సింపథీ ఏంగిల్ ఉన్న పరంధామయ్య "సరే! ఈ సారికి ఇస్తున్నా. మరల ఏడాది వరకు లీవ్ అన్నావో జాగ్రత్త. " అని మళ్ళీ తన గాంభీర్యాన్ని ప్రకటించాడు పరంధామయ్య. తన ఫేవరెట్ హీరో సినిమా బెనిఫిట్ షో కి టికెట్ దొరికినంత ఆనందమేసింది మోహన్ కి. లీవ్ దొరికిందన్న ఆనందంలో రెట్టించిన ఉత్సాహంతో ఆ రోజు ఆఫీసు పని ముగించుకుని ఇంటికి బయల్దేరాడు మోహన్. * * * ఆ రోజు ఎన్నాళ్ళకో సొంతూరి కి వెళ్తున్నామన్న ఆనందంతో అందరూ త్వరగా బయలుదేరి అరగంట మందుగానే రైల్వే స్టేషన్ చేరుకున్నారు. ఎప్పటి లాగే అసలు టైమ్ కన్నా అరగంట లేటుగానే వచ్చింది వాళ్ళు ఎక్కవలసిన రైలు. రిజర్వ్ చేసుకున్న సీట్లలో కూర్చున్నారు అందరూ. రైలు కదిలి ఊరి పొలిమేరలు దాటుతోంది. మోహన్ కళ్ళు మూసుకుని కూర్చున్నాడు. రైలు తన వేగం పెంచి సూపర్ ఫాస్ట్ స్పీడ్ లో దూసుకుపోతోంది. అంతే స్పీడ్ లో గోదారమ్మ ఒడిలో ఒదిగి పోయిన తన చిన్ననాటి జ్ఞాపకాలు తన కళ్ళ ముందు కదలాడాయి. తన స్వగతం తనకే చెబుతున్నట్టుగా అనిపించింది. * * * మా సొంత ఊరు గోదావరి జిల్లాలో ఒక అందమైన పల్లెటూరు. పల్లెటూళ్ళు పట్టణాలకు పట్టుకొమ్మలు అని ఇలాంటి ఊళ్ళని చూసే అంటారేమో. ఎటు చూసినా పచ్చని పైటతో పలకరించే పొలాలు. పొలాలను వెంబడించే కొబ్బరి చెట్లు. కొబ్బరి చెట్ల మధ్య నుంచి తొంగి చూసే తుంటరి సూరీడు. ఆ సూర్యుడి పలకరింపు కోసం చూసే కల్మషం లేని మనసుతో నవ్వుతూ ఉన్న పువ్వులు. ఆ పువ్వుల పూజ కోసం ఎదురు చూసే దేవుళ్ళు. ఆ దేవుళ్ళకు జనాలు కట్టిన గుళ్ళు. ఆ గుళ్ళ లోంచి వినబడే సుప్రభాతాలు. ఆ సుప్రభాతాలను మోసుకొచ్చే పవనాలు. ఆ పవనాలు వీచేటప్పుడు చేసే హోరులు. ఆ హోరులకు నాట్యమాడే గోదావరి అలలు. ఇవీ ప్రతినిత్యం మోహన్ ఊళ్ళో కనువిందు చేసే దృశ్యాలు. మా ఇల్లు ఆ ఊళ్ళో ఒక చిన్న పెంకుటిల్లు. కొబ్బరి చెట్లు, అరటి చెట్లు, పూల మొక్కలు, కాయగూరల పాదులతో ఎంతో అందంగా ఉన్న పొదరిల్లు అది. మా ఇంటికి దగ్గరలోనే శివాలయం, రామాలయం, ఆ రెండింటి నడుమ ఒక పెద్ద చెరువు ఉన్నాయి. ఉదయాన్నే ఆ గుళ్ళ మైకుల నుండి వచ్చే దేవుడి స్తోత్రాలతో నిద్ర లేవడం, గబగబా ఆ చెరువులో స్నానం చేసి గుడిలో కెళ్ళి దేవుడి దర్శనం చేసుకుని ఇంటికి చేరడం నా దినచర్య. ఇదంతా ఉదయం ఆరు గంటల లోపే జరిగిపోయేది. మా నాన్న గారు గోపాలరావు గారు ఆ ఊళ్ళోనే గవర్నమెంట్ హైస్కూల్ లో లెక్కల మాస్టారు. ఆయన బాగా చెప్తారని పేరుండటంతో ఆ స్కూల్లో ఎక్కువ మంది పిల్లలు ఆయన దగ్గరికే ట్యూషన్ కి వచ్చేవారు. ఉదయం ఆరు గంటలకు ట్యూషన్ మొదలయ్యేది. అందరితో పాటు నేను కూడా ట్యూషన్ లో కూర్చునేవాడిని. ఎనిమిదింటికి ట్యూషన్ అయ్యేది. ఆ తర్వాత గబగబా చద్దన్నం తిని స్కూల్ కి బయల్దేరి వెళ్ళేవాడిని. స్నేహితులతో మాట్లాడుకుంటూ నాలుగు కిలోమీటర్లు దూరంలో ఉన్న స్కూల్ కి నడిచి వెళ్ళేవాడిని. స్కూల్ కి వెళ్ళడం, రావడం నడకే అయినా ఎంతో ఆనందంగా ఉండేది. ఇప్పుడు పిల్లలను కారులో దింపినా, ఎసి రూమ్ ల స్కూల్ లో ఆ ఆనందాన్ని ఇసుమంతైనా అందించలేకపోతున్నాము. మా స్కూల్ లో టీచర్ లందరూ పాఠాలు కూడా బాగా చెప్పేవారు. చిన్న తప్పు చేసినా, ఇచ్చిన హోమ్ వర్క్ చేయకపోయినా గోడకుర్చీ వేయించడం, బెత్తంతో చితక్కొట్టడం చేసేవారు. అయినా కిక్కిరమనకుండా టీచర్లు ఏది చెప్తే అది చేసే వాళ్ళం. మాస్టారు కొట్టారని ఇంట్లో తెలియకుండా జాగ్రత్త పడే వాళ్లం. ఎందుకంటే తెలిస్తే నువ్వు ఏ తప్పు చేయకపోతే మాస్టారు ఎందుకు కొడతారని ఇంకో నాలుగు తగిలిస్తారని. ఇప్పుడు ఎవరినీ కొట్టక్కర్లేదు, చిన్న మాట అంటే వాళ్ళ నాన్న పది మందిని వేసుకొచ్చి స్కూల్ లో గొడవ పెడ్తున్నాడు. నేనే నా పిల్లలను ఇప్పటికొచ్చి ఏ మాట అనలేదు, మీరు అంటారా అని వాగ్వాదానికి దిగుతున్నాడు. స్టూడెంట్ యూనియన్స్ తో కూడా స్కూల్ ముందు రసాభాస చేయిస్తున్నారు. మా చిన్నప్పుడు రెండు, మూడు నెలలకో సారి పరీక్షలు జరిగేవి. వాటికి ఎంతో మంచి ప్రణాళికతో చదివించే వారు. ఆ పరీక్షల్లో ఫస్ట్ రావడం కోసం మాలో మేము పోటీ పడేవాళ్ళం. మా మధ్య ఎంతో ఆరోగ్య కరమైన పోటీ ఉండేది. ఎటువంటి ఒత్తిడి లేకుండా చదివేవాళ్ళం. ఇప్పుడు వారాంతపు పరీక్షలు పెట్టి రుద్దినా ఎవరూ ఆ స్ధాయి కి చదవట్లేదు. ఇంకా చదవమని చెప్తే, ఒత్తిడి చేసామంటున్నారు. ఎక్కువ చదివిస్తే, కొంతమందైతే ఇంట్లోంచి పారిపోతామని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. మరికొందరైతే ఏకంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఏదైనా అంటే జనరేషన్ గ్యాప్ అంటున్నారు. మనం పిల్లల్ని అర్ధం చేసుకోవట్లేదు అంటున్నారు. ప్రతిరోజూ టైమ్ టేబుల్ లో డ్రిల్ పీరియడ్ ఉండేది. ఆ స్కూల్ గ్రౌండ్ లో ఒళ్ళంతా చెమటలు పట్టేటట్టు ఆడేవాళ్ళం. ఆ డ్రిల్ పీరియడ్ తో ఎంతో మానసిక ఉల్లాసం పొందేవాళ్ళం. ఇక ఒత్తిడి అనే మాటకు మా దగ్గర చోటేముంటుంది. మార్చి, ఏప్రిల్ నెలలలో ఒంటిపూట బళ్ళు పెట్టేవారు. ఉదయం ఏడున్నర నుండి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు స్కూల్ పెట్టేవారు. మధ్యాహ్నం పడుకోవడం, లేచి కాసేపు ఆడుకోవడం, తర్వాత చదువు కోవడం. ఇలా ఏ మాత్రం ఒత్తిడి లేకుండా ప్లాన్ చేసుకునే వాళ్ళం. ఇక వేసవి సెలవలు వచ్చాయంటే చాలు. ఇక మా ఆనందానికి పట్టపగ్గాలు ఉండేవి కావు. తెల్లవారుజామునే లేచి గోదావరికి వెళ్ళి మధ్యాహ్నం వరకు ఆ గోదావరిలో ఈతలు కొడుతూ స్నానం చేసే వాళ్ళం. మరల సాయంత్రం కూడా అంతే. ఆ గోదావరి ఇసుక తిన్నెల్లో గూళ్ళు కట్టుకుని ఆడుకునే వాళ్ళం. ఎంత ఆడి అలసిపోతే అంతగా గోదావరిలో స్నానం చేస్తూ సేద తీరేవాళ్ళం. రాత్రి భోజనాలు చేసి ఆరుబయట చెట్ల మధ్యలో చందమామను చూస్తూ నిద్రపోయేవాళ్ళం. ఆ అనుభూతులు, ఆనందాలు వెల కట్టలేనివి. ఇప్పటి జనరేషన్ కి ఆ అనుభూతులు ఏవి? వేసవి సెలవల్లో కూడా స్పెషల్ క్లాసెస్ అంటూ వాళ్ళకి ఒక్క రోజు కూడా ఊపిరి ఆడనివ్వట్లేదు. ఏమైనా అంటే ర్యాంకుల్లో వెనకబడి పోతారంటున్నారు. ఫ్యూచర్ పాడై పోతుందని అంటున్నారు. ఎంతసేపు పుస్తకాలతో కుస్తీలు, పరీక్షల కోసం శిక్షణలు, ర్యాంకుల రేసులో నెగ్గాలంటూ ఆంక్షలు, ఒకటేమిటి ఎందుకూ పనికిరాని ఒత్తిడిని పిల్లలపై మనమే రుద్దుతున్నాము. మన పిల్లో, పిల్లాడో ఆ స్ధాయి ఒత్తిడిని తట్టుకోగలరా లేదా అని కూడా ఆలోచించట్లేదు. మన అభిప్రాయాలను, మన కోరికలను వాళ్ళపై రుద్దుతున్నాము. వాళ్ళు ఒత్తిడి లోకి వెళ్ళక ఏం చేస్తారు? వాళ్ళు ఈ ఒత్తిడిని భరించలేక, మనకు చెప్పలేక సతమవుతూ ఆత్మహత్యలు చేసుకోక ఎలా బతుకుతారు? మనమే ఈ వ్యవస్థను పాడు చేసాము. పిల్లలకు బుక్ నాలెడ్జే గానీ ప్రాక్టికల్ నాలెడ్జి నేర్పట్లేదు. ఏం? మనం చదువుకునే రోజుల్లో ఎంతోమంది ఇంజనీర్లు అవ్వలేదా? డాక్టర్లు కాలేదా? టీచర్లుగా రాణించలేదా? ఆ రోజుల్లో కూడా చదువుకుని బాగు పడిన వాళ్ళున్నారు, చదువుకోక చెడిపోయిన వాళ్ళున్నారు. ఈ రోజుల్లో కూడా అంతే. కానీ ఆ రోజులకి, ఈ రోజులకి తేడా కాలంతో పరిగెట్టడం. అప్పడైనా, ఇప్పుడైనా కాలంలో మార్పు లేదు. ఎప్పుడైనా రోజుకి ఇరవై నాలుగు గంటలే. కానీ కాలానుగుణంగా మన బుద్ది ప్రవర్తనలో మార్పు వచ్చింది. ప్రక్కవాడు పరిగెడుతున్నాడు, మీరెందుకు పరిగెట్టరు అనే మీమాంసే తప్ప ఆ పరుగుకి మన కాళ్ళు సహకరిస్తాయో లేదో చూడట్లేదు. మన పిల్లలు ఏమి చదవడాన్ని ఇష్టపడతారో అది చదవనివ్వాలి. ఏ రంగానికి మొగ్గు చూపిస్తున్నారో అటువైపు దారి చూపించాలి. అలాగని పిల్లలకే పూర్తి నిర్ణయాధికారాన్ని ఇవ్వమని కాదు. ఏ రంగంలో వెళ్తే ఏ లోటుపాట్లు ఉన్నాయి, ఎందులో పయనిస్తే విజయావకాశాలు ఉన్నాయని విపులంగా చెప్పి మరీ వారిని సరైన దారిలో పెట్టాలి. ఇవన్నీ చేసేముందు మనం మారాలి. అవును మారాలి. ముందు మనలో మార్పు రావాలి. వ్యవస్థలో మార్పు రావాలంటే, ముందు మన ఆలోచనల్లో, ఆశయాల్లో పరివర్తన మొదలవ్వాలి. అప్పుడే మనం కోరుకున్న మన పిల్లల ఉజ్వల భవిష్యత్ కనబడుతుంది. సంతృప్తైన, మానసికోల్లాసమైన జీవితం ఆవిష్కృతమవుతుంది. మా నాన్నగారు నన్ను పెంచిన దానిలో పదోవంతు నా పిల్లల్ని పెంచినా నేను బాగా పెంచినట్టే. వారికి తిరుగులేని జీవితాన్ని అందించినట్టే. తప్పకుండా ఆ దారిలోనే వెళ్తాను. అలాగే పెంచుతాను. * * * "నాన్నా! స్టేషన్ వచ్చింది. లే నాన్నా!" అన్న తన కొడుకు అరుపు విని ఉలిక్కిపడి లేచాడు మోహన్. ఇదంతా తన మనోగతమా అని ఒక్క క్షణం ఆశ్చర్యానికి లోనయ్యాడు. తన తక్షణ కర్తవ్యమే తన మనోగతంగా వినిపించిందని మనసులోనే ఆనందించాడు మోహన్. రైల్ దిగి తన ఇంటి వైపు అడుగులు వేసాడు, తను అనుభవించిన ఆనందాలను తన వారికి అందించాలన్న ఆశతో, కొత్త ఆశయాలతో. *** సమాప్తం ***

మరిన్ని కథలు

Tappevaridi
తప్పెవరిది
- మద్దూరి నరసింహమూర్తి
Pandaga maamoolu
పండగ మామూలు
- Madhunapantula chitti venkata subba Rao
Maanavatwam
మానవత్వం!
- - బోగా పురుషోత్తం
Prema pareeksha
ప్రేమ పరీక్ష
- శరత్ చంద్ర
Swayamvaram
స్వయంవరం
- తాత మోహనకృష్ణ
Maatruhrudaya mahattu
మాతృహృదయ మహత్తు!
- చెన్నూరి సుదర్శన్
Simhavalokanam
సింహావలోకనం
- మద్దూరి నరసింహమూర్తి