ఉపాయం కావాలి - B.Rajyalakshmi

Vupaayam kaavaali

శాస్త్రిగారు హరికథ చెప్తుంటే జనాలు మైమర్చి వింటారు . ఏ పురాణకథ చెప్పినా శ్రావ్యం గా విపులం గా వినిపిస్తారు . భావాన్ని ,భాషను సామాన్య ప్రజలకు కూడా అర్ధమయ్యె రీతిలో ప్రతి హరికథా కాలక్షేపం వుంటుంది కంచుకంఠం ,అవగాహన ,పచ్చటి శరీరచ్ఛాయ ,కళకళలాడే ముఖవర్చస్సు ,,నుదుట తిరునామం , పట్టుశాలువా ,చేతిలో చిరుతలు ,కాళ్లకు మువ్వపట్టీలు ఆయన్ని చూడగానే భక్తిభావం కలగక మానదు . ఊరివారి మనోభావాలను ఆకళింపు చేసుకుని సమయానుకూలంగా పిట్టకథలు చెప్పేవారు .
వృత్తిరీత్యా అనేక వూళ్ళు తిరుగుతూ ,అప్పుడప్పుడూ ఒకే వూళ్ళో నెలలతరబడి వుండేవారు . అయన యెక్కడ వుంటే అక్కడ వుచిత వసతి ,వుచితభోజనం సన్మానం రోజున ధనం ,మొత్తానికి శాస్త్రిగారికి ,పేరు , ప్రతిష్ట గౌరవం ,,సంపద అన్నీ లభిస్తున్నాయి .
ప్రస్తుతం రంగాపురానికి శాస్త్రిగారు వచ్చారు . రంగాపురం ప్రజలు దైవచింతన ,భక్తిభావం ,,మంచి స్నేహభావం ,,దానధర్మాలలో వుదారులు . ప్రతి పండగా వారి స్థాయి కి తగినట్టుగా వైభవం గా జరుపుకుంటారు ఉగాది పంచాంగ శ్రవణం ,సీతారామ కళ్యాణం ,గణపతి నవరాత్రులు ,,దసరా నవరాత్రులు ,,అన్ని వుత్సవాలు ఐకమత్యంగా జరుపుకుంటారు .ప్రస్తుతం రామాయణం హరికథగా ,శాస్త్రిగారితో చెప్పిస్తున్నారు .
హరికథ జరుగుతుండగా మంగళహారతి పళ్లెం ప్రేక్షకుల దగ్గరకుతీసికెళ్తారు . ప్రజలు తమకు తోచినంత సంతోషం గా వేస్తారు . ఆ సొమ్ము ఆయనకే చెందుతుంది . ఆఖరిరోజు ఘనం గా పర్సుతో కమిటీ వాళ్ళు సన్మానిస్తారు .
ఈ విధంగా ప్రతిరోజూ హరికథ జరుగుతున్న సమయం లో మంగళహారతిపళ్లెం కళకళలాడుతూ గలగలలాడుతున్నది . కథ పూర్తయ్యేనాటికి కొంత అధికంగా ధనం చేకూరుతుందని శాస్త్రిగారికి తృప్తిగా వుంది .
ఇంకో వారం రోజుల్లో హరికథ ముగుస్తుంది . పొరుగూరి వరలక్షమ్మగారు వినడానికి వచ్చారు . సత్రం లో వున్నారు . ఆవిడ పళ్లెంలో డబ్బులు వెయ్యబోయారు .

అదిచూసి కొందరు "మీరు పొరుగూరి నించి వచ్చి వేస్తున్నారు ,,మీదగ్గరే వుంచండి ,మనందరం విడిగా అందర్నీ కలిసి విషయం చెప్పి వాళ్ళు యిచ్చింది తీసుకుందాం . శాస్త్రిగారి సన్మానం రోజు బహుకరిద్దాం " అన్నారు .
మర్నాటినించీ వరలక్షమ్మగారు యిద్దరిని వెంటపెట్టుకుని గడప గడపా తిరిగారు . పొరుగూరి ఆవిడ యింత ఆసక్తిగా ,శ్రమిస్తూ తిరగడం తో అందరూ సంతోషం గా ,గౌరవం గా ఘనం గానే యిచ్చారు . స్త్రీ శక్తిస్వరూపిణి కదా !
హరికథ ముగిసింది . సమాప్తం అయ్యింది . అందరూ సంతోషం గా వున్నారు . మరుసటి రోజు సన్మానం యేర్పాటు చేసారు . వేదికపైన కూర్చున్న కమిటీ పెద్దలు కొందరు శాస్త్రిగారిని గురించి మాట్లాడారు

"పూజ్యులు శాస్త్రిగారికి మా ప్రజలందరి తరఫున మా వందనాలు . నెలరోజులూ మాకందరికీ రామాయణాన్ని వీనులవిందుగా ,మనోహరం గా సరళమైన భాషలో నీతికథలతో వినిపించారు . మా సన్మానం వుడతాభక్తిగా స్వీకరించండి "పట్టుశాలువా కప్పి ,పూలమాల వేసి బరువైన పర్సు కమిటీ తరఫున యిచ్చారు .

" మీ అభిమానం ,ఆదరణ ,మీ ప్రేమ మర్చిపోలేను . నా పూర్వజన్మ సుకృతం . వంశపారంపర్యంగా చెప్తున్న యీ హరికథలు నశించకుండా నిరంతరం సాగిపోవాలనే నా తపన . ఏ కళకైనా సమాజం ఆదరణ లభించాలి . అప్పుడే కళ రాణిస్తుంది . మీకందరకూ నా కృతజ్ఞతలు . ఆశీస్సులు . భగవంతుని కృప ,కరుణా దీవెనలు మీకు సర్వదా వుండాలని ప్రార్ధిస్తున్నాను . "అంటూ చిరునవ్వుతో నమస్కరిస్తూ ముగించారు శాస్త్రిగారు . .
ప్రేక్షకులలో నుంచి ఒక వ్యక్తి వేదిక పైకి వచ్చారు . శాస్త్రిగారికి పాదాభివందనం చేసి మాట్లాడారు .
"మనందరినీ ప్రోత్సాహపరిచి గడప గడపా తిరిగి పొరుగూరి నుంచి వచ్చి శాస్త్రిగారి శ్రావ్యమైన రామాయణ హరికథకు మనవూరి వాళ్ళనుంచి పైకం సమకూర్చిన స్త్రీ మూర్తి శ్రీమతి వరలక్షమ్మగారిని వేదికమీదికి రావలసినదిగా ఆహ్వానిస్తున్నాము . "అన్నారు .
వరలక్షమ్మగారు వేదికపైకి వచ్చారు . శాస్త్రిగారికి పాదాభివందనం చేసారు . ఆవిడ పూలదండ శాస్త్రిగారి చేతికిచ్చారు . డబ్బుతో బరువుగా వున్న పర్సును సమర్పించి నమస్కరించారు
" ఇదంతా యీ ఊరివారి మంచితనం ,సహకారం ,దైవచింతన ,నన్నునడిపాయి . ఇందులో నా ప్రత్యేకత లేదు . శాస్త్రిగారిని గౌరవించడం అంటే పరమాత్ముడిని ప్రార్ధించడమే !"అన్నారు వరలక్షమ్మగారు వినయంగా .
------------------------------------------------------------------------------------------------------------------------------- మరుసటి రోజు శాస్త్రిగారు సంతృప్తిగా సంతోషంగా తనవూరికి ప్రయాణం అయ్యారు . డబ్బు చాలా వచ్చింది . తన సమస్యలు తీరుతాయి . కమిటీ పెద్దలు ఆయనకు నమస్కరించి వీడ్కోలు చెప్పి కారు యెక్కించారు . -------------------------------------------------------------------------------------------------------------------------------
శాస్త్రిగారు వెళ్లిన రెండు రోజుల తర్వాత వరలక్షమ్మగారు తన వూరికి ప్రయాణం అయ్యారు . అందరినీ ఆప్యాయం గా పలుకరించారు . ఆవిడకు చీరె జాకెట్టు పూలు ,పళ్ళు యిచ్చి తమావూరి ఆడపడుచుగా మన్ననతో పంపారు .
------------------------------------------------------------------------------------------------------------------------------- గుమ్మం ముందు ఆటో ఆగింది . అరుగుమీద కూర్చున్న శాస్త్రిగారు నవ్వుతూ భార్య వరలక్షమ్మను చూసారు . చిన్నపెట్టెతో ఆటోదిగిన వరలక్షమ్మగారు కూడా నవ్వుతూ భర్తను చూసారు . ఆ దంపతులకు యిప్పుడు తమ సమస్యకు పరిష్కారం లభించింది . బీటలు బారిన యింటి పైకప్పును యీ డబ్బుతో బాగుచేయించుకోవాలని నిర్ణయించుకున్నారు .
---------------------------------------------

మరిన్ని కథలు

Swayamvaram
స్వయంవరం
- తాత మోహనకృష్ణ
Maatruhrudaya mahattu
మాతృహృదయ మహత్తు!
- చెన్నూరి సుదర్శన్
Simhavalokanam
సింహావలోకనం
- మద్దూరి నరసింహమూర్తి
Mana garden
మన గార్డెన్
- తాత మోహనకృష్ణ
Andari bandhuvuluu
అందరి బంధువులు
- భానుశ్రీ తిరుమల
Teeram cherchina parugu
తీరం చేర్చిన పరుగు
- షామీరు జానకీ దేవి
Vimanam lo kalakalam
విమానంలో కలకలం
- తాతా కామేశ్వరి
Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ