ద క్రిటికల్ మ్యాచ్ - చింతపెంట వెంకట సత్య సాయి పుల్లంరాజు,

The critical match

విశ్రాంత క్రికెట్ క్రీడాకారుడిని నేను. ప్రస్తుతం ఆరు సిక్సర్ల నాలుగు బౌండరీల వయసు నడుస్తోంది. ధోనీ ఎత్తిన ప్రపంచ కప్ ని చూడకుండానే, నా జీవితంలో నుండి నా భార్య జారి పోవడంగొప్ప విషాదకర సంఘటన. ప్రేక్షకులు లేని స్టేడియంలో, ఇన్నింగ్స్ ఆడుతున్న క్రీడాకారుడి పోరాటంలా వుంది నా జీవితం.
మంచి రోజుల కోసం ఎదురు చూస్తూ, సమస్యల్ని ఓపికగా ఎదుర్కొంటున్నా, జీవితం మేడెన్ ఓవర్ లాగానే సాగుతోంది.
బాధాకరమైన సంగతి ఏమంటే, నిరుద్యోగి కొడుకు, ఇంటి టీం లో ఫార్మ్ లో లేని క్రీడాకారుడులా వున్నాడు.
ఇటీవల వాడు, హ్యాట్రిక్ సాధించిన బౌలర్ లా, నా దగ్గరకు వచ్చి, ఇంటర్వ్యూ లెటర్ చూపించాడు.క్రిటికెల్ మ్యాచ్ లో సెంచరీకి దగ్గరగా వచ్చిన బ్యాట్స్ మన్ లా కనబడ్డాడు నా కళ్ళకి వాడు ఆ క్షణంలో.
ఐతే,ఆ ఆనందం కూడా అట్టే నిలువ లేదు వాడికి . బౌన్సర్లు మీద బౌన్సర్లు వేస్తూ, హెల్మెట్ పగులగొట్టి,బాడీ లైన్ తో, భయపెట్టినట్లు వుందట ఇంటర్వ్యూలో ప్రశ్నలడిగిన వైనం. అసలే నా పుత్రరత్నం, టీం లో టైలండర్ లాంటి వాడు.
సెంచరీ చేయాలనే పట్టుదలతో వెళ్లి,ఫస్టుబాల్ కే క్లీన్ బౌల్డ్ అయ్యిన బ్యాట్స్ మన్ లా ఏడ్చాడు నా దగ్గరకు వచ్చి.
చెప్పద్దు,నాకు కోపం చిర్రెత్తుకు వచ్చి,"ఆటరాని వాడు, పిచ్ ని ఆడిపోసుకొన్నాడుట. నేర్పువున్నవాడు, నిదానంగా ఆడుతూ తన సత్తా చూపిస్తాడు.విజయం సాధిస్తాడు, నీలా ఏడ్వడు."అన్నాను.
"అది కాదు నాన్నా !......."అంటూ ఏదో చెప్పబోయాడు, ఓడిపోయిన కెప్టెన్ , బోర్డుకి సంజాయిషీ ఇస్తున్నట్లు.
ఇంతలో,డెడ్ బాల్ లాగా అక్కడికి వచ్చిన కూతురు, థర్డ్ అంపైర్ కేసి అసహనం గా చూస్తూన్న బౌలర్ లా, మాకేసి చూసి,"ఏమయ్యింది మీకు? టీ20-20 లో, ఈజీ క్యాచ్ మిస్సయ్యిన వాడిలా మొఖం పెట్టుకున్నాడు వాడు"అంది.కాఫీలు అందిస్తూ.
అంత బాధ లోనూ నవ్వు వచ్చింది నాకు,దాని వెటకారానికి. కానీ వాడు మాత్రం మొహం కందగడ్డలా పెట్టుకొని,దాని కేసి గుర్రుగా చూసాడు.స్టంప్ ఔట్ చేయడం చేతకాక,చతికిల పడ్డ ఫీల్డర్ లా.
బయటకు వెళ్లి తిరిగి వద్దామనిపించి, కొంచెం దూరం నడిచి, పార్క్ లోకి వెళ్లి కూర్చొన్నాను.ఎదురుగా రమాకాంత్ , నా కేసి చూస్తున్నాడు.ఏదో చెప్పాలన్నట్లు. ఇప్పుడు అతను ఏమి చెప్పినా నాకు వినే మూడ్ లేదు.
ఆలోచనలు పేస్ బౌలింగ్ మానలేదు. కూతురు పెళ్ళి చేయాలి. ఆడపిల్ల పెళ్ళంటే మాటలా! వన్డేమ్యాచ్ లాంటిది.ఆడపిల్ల తండ్రి,కాట్ అండ్ బౌల్డ్ చేయగల బౌలరంత సమర్ధుడై వుండాలి. చిత్రం ఏమిటంటే, టాస్ ఎప్పుడూ మగపిల్ల వాడి తండ్రి మాత్రమే గెలుస్తాడు. ఆడపిల్ల అంద చందాలు, విద్యాబుద్ధులు కంటే, కట్నమే ప్రధాన సమస్య. జాతీయ జట్టుకి, కొత్తగా ఎంపికయిన బ్యాట్స్ మన్ కి ట్డబుల్ సెంచరీలా కనిపిస్తుంది కట్నం డబ్బు. ఆడిన ప్రతి మ్యాచ్ ఒడిపోతున్నట్టు, కూతురు కి చూసిన ప్రతి సంబంధమూ తప్పిపోతోంది. పిల్లాడికి జాతీయ జట్టులో బర్త్ దొరుకుతుందని నమ్మకమూ కనిపించడం లేదు. ఆలోచనలతో సమయం తెలియలేదు.ఇంటికి సమీపిస్తున్న కొద్దీ ,మనసులో ఏదోతెలియని అలజడి మొదలయ్యింది.
తమ కలల క్రికెట్ హీరోని, ఆటోగ్రాఫ్ కోసం చుట్టిముట్టిన అభిమానులులా, నా ఇంటిని చుట్టిముట్టిన జనప్రవాహం. ఎందుకో,ఒక్క క్షణం, కీడు శంకించింది మనసు.
నోబాలను కొంటుంటే, లెగ్ బిఫోర్ వికెట్ ప్రకటించిన అంపైర్ ని షాక్ తూ చూస్తున్న బ్యాట్స్ మన్ లా జనాల మొఖాలను చూస్తుంటే, పరిగెత్తుకొంటూ వచ్చినకూతురు, నన్ను పట్టుకుని బావురంది. పరిస్థితి అర్ధమయ్యింది.
"నువ్వు కొపడ్డావని,అన్నయ్య ఆత్మ హత్యాయత్నం చేసాడ"ని వెక్కిళ్ల మధ్య ఏడుస్తూ చెప్పింది.
స్టంప్స్ తో నెత్తి మీద ఎవరో కొట్టినట్టు బాధ. నేను తేరుకొనే లోపులో, ఎవరో, అంబులెన్స్ కి ఫోన్ చేసారు కాబోలు, అంబులెన్స్ సిబ్బంది చకచకా రావడం, నిమిషాలు లో ఆసుపత్రిలో చేర్చడం జరిగింది.
ప్రపంచ విజేతగా నిలవడానికి, అంతిమ పోరులో తలబడుతున్న, భారత్ పాకిస్థాన్ మ్యాచ్ లో, స్టేడియంలో, దడదడ లాడుతున్న గుండె ని చేత్తో పట్టుకొని, చివరి ఓవర్ లో ఫలితం కోసం కళ్ళప్పగించి చూస్తున్న క్రికెట్ పిచ్చోడిలా వుంది నా మానసిక పరిస్థితి ఆసుపత్రిలో. దాదాపుగా రెండు గంటల పాటు డాక్టర్లు శ్రమించి, పిల్లవాడికి ప్రమాదం తప్పిందని చెప్పారు. వార్త ఎలా తెలిసిందో కానీ, కొంతసేపటికి మా వాడి స్నేహితులు ఆసుపత్రికి వచ్చారు.
పోలీసులు తో మాట్లాడి,సర్ది చెప్పాను.
"ఇలా వాత పెట్టావేంటి అత్తా! ఆంటే , కావలసినంత కమ్మని వెన్నపూస నా దగ్గర వుంది, దిగులెందుకే కోడలా' అందిట. ప్రస్తుతం మా వాడి స్నేహితుల వైఖరి.
మా వాడి స్నేహితుల, ప్రవర్తన, భాష , మాట్లాడే తీరు, చూస్తుంటే, క్రికెట్ లో ప్రత్యర్థి పతనం కోసం స్లెడ్గింగ్ చేసే క్రీడాకారులు గుర్తుకొచ్చారు. యోగ క్షేమాల విచారణ నెపంతో, వాడి పుండు మీద కారం రాయాలన్న వాళ్ళ ఉద్దేశ్యం గ్రహించాను. అందుకే, వారి ప్రశ్నలకు ముక్తసరి గా సమాధానాలు చెప్పి పంపించేసాను. ఈ సమయంలో వాడ్ని కలవడానికి, డాక్టర్లు ఎవర్నీ అనుమతించడం లేదని చెప్పాను. వాళ్ళ పాచిక పారలేదు. నేను బంతి ని అంతబాగా స్పిన్ చేయగలనని వాళ్లు వూహించలేదు. భారీ అంచనాలతో బ్యాటింగ్కి వచ్చి, డక్ ఔటయ్యి, ఉక్రోషంతో, డ్రెస్సింగ్ రూము వైపు నడిచి పోతున్న క్రీడాకారులు లా వున్నారు వాళ్లు.
ఇంతలో డాక్టర్ పిలిచాడు నన్ను. జరిగిన సంగతులన్నీ వివరంగా వివరించాను.
గది లోకి వెళ్ళి, నిద్ర పోతున్న వాడి నుదురు మీద చేయి వేసాను. నెమ్మదిగా కనులు తెరిచాడు.
ఇద్దరం వర్షిస్తున్న కళ్లనే చూస్తున్నాము. అనర్గళంగా క్రికెట్ కామెంటరీ తో బాటు, సందర్భానికి సంబంధించిన గణాంకాలు ఖచ్చితంగా, చెప్పగల నా నోరు, ఆ క్షణం లో మూగబోయింది.
ముందుగా నేనే తేరుకొని, "ఒరే బాబూ! నేను కోప్పడి తిట్టాను,పొరపాటనుకో, నువ్వు ఇలాంటి పనులు చేయచ్చు రా నాయనా" అన్నాను కంపించిన స్వరంతో. "నేనేమి చేయను నాన్నా! ఎంత ప్రయత్నించినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా, అదృష్టం కలిసి రావడం లేదు.స్నేహితులు కూడా ఐరన్ లెగ్ గాడంటన్నారు. నాకు బ్రతకాలని కూదా లేద"న్నాడు వెక్కిళ్ల మధ్య.

"జీవితమంటే అంతేరా, మనం కోరుకొన్నవి జరగాలని వుండదు. మనం ఊహించని సంఘటనలు చోటు చేసుకొంటాయి.అప్పుడే గుండె నిబ్బరం తో నిలబడాలి. దేశీవాళి మ్యాచ్లో, ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన వాడు,అంతర్జాతీయస్థాయిలో పరమ చెత్త ప్రదర్శనతో,పరువు తీస్తాడు. అంటే, వాడికి ప్రతిభ లేదని కాదు. నీ స్నేహితులుతో నిన్ను పోల్చుకొని, చిన్నబుచ్చుకోకు. జీవిత క్రికెట్ ఆట లో, నువ్వు అద్భుతమైన ప్రదర్శన తో సెంచరీలు చేస్తావని,నేను కలలు గంటుంటే, ఇలా రన్ ఔట్ కి ప్రయత్నించకు.' అన్నాను ఆర్తిగా.
"సరే….నాన్నా...ఎప్పుడూ చేయను….ఏదో తెలియని ఆవేశంలో…."ఆపై మాటలు రాలేదు వాడికి.నాకు వాడి మీద జాలేసింది. "జీవితం లో వచ్చిన అవకాశాల బంతుల్ని, జాగ్రత్తగా గమనించి,తగ్గట్లుగా ఫుట్ వర్క్ చేస్తూ,షాట్స్ కొట్టాలి. అంతేకానీ, ప్రతి బంతిని హిట్ చేద్దామంటూ, ఆవేశపడితే, హిట్ వికెట్ అవ్వడమో, పొంచివున్న మృతువు లాంటి, వికెట్ కీపర్ వాత పడటమో జరుగుతుంది. మంచి స్టాండింగ్ ఇస్తావన్న ఆశతో వున్నానురా.రిటైర్డ్ హర్ట్ గా మధ్యలో నన్ను వదిలేసి వెళ్లకురా" అన్నాను అభ్యర్ధనగా. "జీవితమంటే, గుగ్లీబాల్ ఆడటమే కాబోలు, డిఫెన్సు ఆడాలి కానీ, హార్డు హిట్టింగ్ కి అవకాశం లేదు." వేదాంతి లా నవ్వుతూ చెప్పాడు వాడు అంత వేదన లోనూ. కొంచెం సేపు నిశ్శబ్దం అలుముకొంది గదిలో. వాడికి రేపటి మ్యాచ్ సంగతి గుర్తుకు వచ్చింది.
నాకు ఇంట్లో ఒంటరిగా వున్న కూతురు గుర్తుకు వచ్చింద దాని విషయమే మర్చిపోయినందుకు, నా మీద నాకే కోపం, వేసింది. "నాన్నా! రేపటి మాచ్ కి కామెంటేటరు, నువ్వే కదూ' అన్నాడు కర్తవ్యాన్ని గుర్తు చేస్తూ.
"ఒక్క గంట జాగ్రత్తగా వుండు,ఇంట్లో నీ చెల్లెలు ఎంత కంగారు పడుతోందో, వెళ్ళి దాన్ని తీసుకొని వస్తాను.
నర్స్ తో నిన్ను కనిపెట్టుకొని వుండమని చెబుతా"అని చెప్పి, వాడి సమాధానం కోసం కూడా ఎదురు చూడకుండా గబ గబా రోడ్డెక్కాను. వేగంగా అడుగులు పడుతున్నాయి.ఏదో తెలియని నిరాశ, గుబులు, పరితాపం చుట్టు ముడుతున్నాయి. ఒకవైపు వయసు వచ్చిన పెళ్ళికాని కూతురు, మరోవైపు జీవితంలో స్థిరపడని కొడుకు. బ్యాటింగ్ లోనూ, బౌలింగ్ లోనూ, ఫీల్డింగ్ లోనూ విఫలమై ఓటమి అంచున నిలబడిన కెప్టెన్ లా వున్నాననిపించింది. వీధి మలుపు తిరిగాను.ఇందాకటి దృశ్యమే కనబడుతోంది మళ్లీ నా కళ్ళకి, ఇంటి ముందు లైట్లు వెలుగులో. ఆ వాతావరణమంతా సందడిగా వుంది. ఎవరో జనాలు గట్టిగానే మాట్లాడుతున్నారు. నా కూతురు ఏదో చెబుతోంది ఎవరితోనో. నాకు అడుగులు పడటం లేదు. మెదడు మొద్దు బారిందోమో తెలియదు.
ఇంతలో నా రాకని గమనించి,ఆ గుంపులో వున్న ఒకడు, గట్టిగా అరిచాడు."ఇదిగో ఆయన ఇక్కడికే వచ్చారు. రండి….రండి".అంటూ.
ఆ ప్రదేశమంతా తప్పట్లతో మారుమ్రోగిపోతోంది. బాణాసంచా కాలుస్తున్నారు కొందరు. నా నోట్లో మిఠాయిలు కుక్కుతున్నారు. మెడలో దండ వేశారు . సంతోషం పట్టలేక కాబోలు నా కూతురు, స్నేహితులతో డాన్సు చేస్తోంది.
అంత హడావుడిలోనూ, నా చూపు, కిటికీ గుండా టీవీ మీద పడింది. రాబోయే ఇంగ్లాండ్ సీరీస్ కి ఎన్నికయిన ఆటగాళ్ల జాబితా ప్రకటించారు . మా వాడి పేరు, ఫోటో పెద్దగా కనిపిస్తోంది. రమాకాంత్ తో కలిసి నా కూతురు ఎత్తిన త్రివర్ణ పతాకం గాలిలో రెపరెప లాడుతూ మెరుస్తోంది.

మరిన్ని కథలు

Maatruhrudaya mahattu
మాతృహృదయ మహత్తు!
- చెన్నూరి సుదర్శన్
Simhavalokanam
సింహావలోకనం
- మద్దూరి నరసింహమూర్తి
Mana garden
మన గార్డెన్
- తాత మోహనకృష్ణ
Andari bandhuvuluu
అందరి బంధువులు
- భానుశ్రీ తిరుమల
Teeram cherchina parugu
తీరం చేర్చిన పరుగు
- షామీరు జానకీ దేవి
Vimanam lo kalakalam
విమానంలో కలకలం
- తాతా కామేశ్వరి
Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ
Chandruniko noolu pogu
చంద్రునికో నూలు పోగు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు