ఆడవాళ్ళా.. మజాకా..! - చెన్నూరి సుదర్శన్

Aadavaalaa majaakaa

బూటుకాలితో గంపను గట్టిగా ఒక తన్ను తన్నగానే.. గంప ఫుట్ బాల్­లా గాలిలోకి ఎగిరి, సికింద్రాబాదు పరేడ్ గ్రౌండు ఫెన్సింగ్ పోల్­కు ఊగిసలాడుతోంది. అందులోని గంగరేగు పండ్లన్నీ ఫుట్ పాత్ పైన చెల్లాచెదురయ్యాయి.

గజ్జున వణకింది వనజ. ఎదురుగా ట్రాఫిక్ పోలీసు కానిస్టేబుల్ కనకారావు. బుర్ర మీసాలు దువ్వుకుంటూ.. మా సార్ తో చెప్పి చలాన్ వ్రాయిస్తానన్నట్లు బెదిరిస్తున్నాడు.

“సార్.. ఏమయ్యింది..” అంటూ భయం, భయంగా అడిగింది వనజ.

“పబ్లిక్ నడిచే దారిలో గంప పెట్టి అమ్ముకుంటూ.. ఏమయ్యింది అంటున్నావు బద్మాష్. దమాక్ ఖరాబయ్యిందా..!” అంటూ పోలీసు తిట్ల పంచాంగం విప్పాడు కనకారావు.

“సార్ నీ కాళ్ళు మొక్కుతా.. దారిన పోయే వారికి ఇబ్బంది కలుగ కుండా ఒక పక్కగా కూర్చొని అమ్ముకుంటున్నా..” అంటూ రెండు చేతులా దండం పెడుతూ రేగు పండ్లను దగ్గరగా ప్రోగు చెయ్యసాగింది వనజ.

కనకారావు రెచ్చి పోయాడు. ఉరిమి, ఉరిమి చూస్తూ.. బూటు కాళ్ళతో రేగు పండ్లును కసా,, పిసా.. తొక్కసాగాడు. వనజ చేతివ్రేళ్ళు బూటు కింద పడి నలిగి పోయాయి. కీసుమంది వనజ. కనకారావుకు కాసింతైనా కరుణ కలుగ లేదు.

ప్రక్కనే వివిధ రకాల పండ్లు అమ్ముకునే ఆడవారంతా విస్తుపోయి చూడసాగారు. ఇది వారికి మామూలే. అప్పుడప్పుడు ట్రాఫిక్ పోలీసులు తమ మీద జులుం ప్రదర్శించడం ఇదేమీ కొత్త కాదు.

“నేనొక్కదాన్నే అమ్ముతున్నానా? వాళ్ళంతా అమ్మడం లేదా..! నామీదనే కన్ను పడిందా..!!” అంటూ కాస్త ధైర్యం తెచ్చుకుని కోపంగా అంది వనజ.

“అవునే ఎర్రంగ, బుర్రంగ ఉన్నవని అందరి కండ్లు నీమీదనే ఉన్నాయి. ధనబాబు మాట వినడం లేదట.. ఏంటీ నీ సంగతి. ధనబాబును కాదని నువ్వు బతికి బట్ట కట్ట లేవు ఖబడ్దార్” అని చూపుడు వ్రేలుతో బెదిరిస్తూ వెళ్ళిపోయాడు కనకారావు.

వనజ నివ్వెర పోయింది. విషయమంతా ఆమెకు అర్థమయ్యింది. ‘అయితే ఇదంతా ధనా చేయిస్తున్నాడన్న మాట. చివరికి చిరు వ్యాపారం కూడా చేసుకోకుండా తన శక్తి సామర్థ్యాలన్నీ ప్రయోగిస్తున్నాడు’ అని మనసులోకి రాగానే హతాషురాలయ్యింది. కాళ్ళూ, చేతులూ నిస్సత్తువగా వాలిపోయాయి. అలాగే అచేతనంగా.. ఆసరాగా చేసుకుని కూర్చున్న ఫెన్సింగ్ స్థంబానికి ఒరిగి పోయింది. గత ఆరు నెలలుగా ఆమె మనసు పడుతున్న ఆవేదన హృదయాన్ని చీల్చుకుని బయటకు రాసాగింది. ఆరోజు జరిగిన ఘటన ఆమె కళ్ళల్లో ఇంకా కదలాడుతూనే వుంది.

***

“నీతో వేగడం ఇక నా వల్ల కాదు” అంటూ వనజ పుల్ల విరిచినట్టుగా చెప్పింది.

“వేగక ఏం చేస్తావే. మొగుడూ.. పెళ్ళాం అన్నాక సర్దుకు పోవడం తప్పదు” వెటకారంగా, పళ్ళికిలిస్తూ.. అన్నాడు అనంతయ్య.

“ఎంత కాలం సర్దుకు పోవడం. పెళ్ళాం సంపాదిస్తూ తెస్తుంటే.. కూర్చొని తింటున్నావు. తప్ప తాగి పంటున్నావు. మనిషన్నాక కొంచెమైనా మానాభిమానాలు ఉండాలి. థూ.. సిగ్గులేని పుట్టుక” అంటూ తుపుక్కున వాకిట్లోకి ఉమ్మేసింది వనజ.

“సిగ్గెందుకే పెళ్ళామా!. నేనేమన్నా మంది పెళ్ళాలు తెచ్చి పెడ్తుంటే తింటున్నానా..! నా పెళ్ళాం తెచ్చింది తింటున్నాను.. తాగుతున్నాను” అంటూ ఎడంచేతి చిటికెన వేలుతో మీసాలు దువ్వుకోసాగాడు.

“అదంతా ఎందుకు.. నిన్ను కాల్చుకుని తినడానికే పుట్టాను అనరాడూ..! ఛీ..ఛీ” అంటూ నెత్తి సుతారముగా కొట్టుకోసాగింది వనజ.

“నాలుగు అక్షరాలు నేర్చుకున్నావనే కదా.. ఈ తలబిరుసు తనం. నేను ఆనాడే అన్నాను. చదువుకున్న పిల్ల నాకొద్దని. అయినా మా అమ్మా.. మీ నాన్న, మేన సంబంధం వదులుకోవద్దని బతిమాలి నిన్ను నాకు అంటగట్టారు”

“ఆ నాలుగు అక్షరాలే కదా..! నన్నొక ప్రైవేటు కంపెనీలో ఆశ్రయం కల్పించింది. అది పెడ్తున్న భిక్షే కదా..! మనం బతుకీడుస్తున్నది”

“అయితే ఇప్పుడేంటి? నన్నూ సంపాదించమంటావు. అంతేనా..”

“ఉద్యోగం పురుష లక్షణం.. అనే లోకోక్తి తెలియదా..! ఇద్దరం కలిసి కష్టపడుదాం. ఇప్పుడు ఇద్దరమే.. నాలుగు రోజులు పోతే ముగ్గురమవుతాం. పైసా వెనుక వేయకపోతే మున్ముందు ఎలా బతుకుతాం”

“అది నీకే తెలియాలి.. నేను మగాణ్ణి. ఎలాగైనా బతికేస్తాను”

“సంపాదనలో మగతనం చూపించాలి”

“అంటే.. ఇప్పుడు నాలో మగతనం లేదా.. ఒళ్ళు కొవ్వెక్కి మాట్లాడుతున్నావు ” అంటూ బూతులు తిడుతూ వనజ మీదకు లంఘించాడు. వీపు మీద పిడిగుద్దుల వర్షం కురిపించసాగాడు.. తన మగతనం చూడమన్నట్టు.

వనజ ఏడ్పు తారా స్థాయికి చేరింది. అది ఎవరికీ వినరాకుండా వీధి గుమ్మం దభాల్న మూసేసి బయట పడ్డాడు అనంతయ్య.

వనజలో సహనం చచ్చి పోయింది. చెయ్యి చేసుకోవడమూ మొదలు పెట్టాడు. అంటే ఇక తన బతుకు బండలయ్యినట్లే.. ఆలోచనలో మునిగి పోయింది. మదిలో మెదిలిన ఒక ధృఢ నిర్ణయం.. ధనబాబు ఇంటికి దారి తీసింది.

ధనబాబు బాల్యంలో తన క్లాసుమేటు. ఆరవ తరగతి వరకు కలిసి చదువుకున్నారు. తన మెడలు వంచి పెళ్లి పీటలమీద కూర్చో బెట్టారు పెద్దలు. కాని ధనబాబు వాళ్ళు ధనవంతులు. చదువు కొనసాగించాడు. న్యాయవాది అయ్యాడు. సిటీలో మంచి పేరు సంపాదించుకున్నాడు. అప్పుడప్పుడు తన కష్టసుఖాలు అడిగి తెలుసుకుంటాడు గూడా..

అదే నమ్మకంతో అతని ఆఫీసులో అడుగు పెట్టింది వనజ.

“వనం.. మళ్ళీ గొడవ పడ్డారా..!” అంటూ నెమ్మదిగా అడుగుతూ.. తన అసిస్టెంట్ అనితను బయటికి వెళ్ళమన్నట్లు చేతితో సైగ జేశాడు ధనబాబు.

అవునన్నట్టు మౌనంగా తలూపి కన్నీరు పెట్టుకోసాగింది వనజ.

“ఈ రోజు చెయ్యి గూడా చేసుకున్నాడు ధనా..” అంటుంటే ఆమె గొంతు గద్గదిక మయ్యింది.

వెంటనే లేచి వచ్చి ఆమె ప్రక్కనే ఆసీనుడయ్యాడు ధనబాబు. వనజ కన్నీరు తుడుస్తూ..

“ఇప్పుడేం చేద్దామనుకుంటున్నావు వనం.. నాకు చాలా క్లోజ్ ఫ్రెండు పోలీస్ ఎస్సై ఉన్నాడు. అతనికి చెప్పి అనంతయ్య మీద కేసు పెడదామా..”

“కేసులు.. గీసులు వద్దు. నాకు విడాకులు కావాలి ధనా” అంటూ తలెత్తి అంది వనజ.

“బాగా ఆలోచించుకునే ఈ నిర్ణయానికి వచ్చావా.. మరొకసారి ఆలోచించుకో వనం”

“ఇంకా ఆలోచించేది ఏమీ లేదు ధనా”

“నువ్వు తల్లివి కాబోతున్నావు కదా..”

“అందుకే గట్టి నిర్ణయం తీసుకున్నాను. నా బిడ్డను నేను పోషించుకోగలను ధనా. అతనితో ఉంటే నాకు ఆర్ధిక ఇబ్బందులే గాకుండా మరెన్నో రకాలుగా చిక్కులు.. చికాకులూనూ”

బూరె విరిగి నేతిలో పడ్డట్టు సంబరపడ్డాడు ధనబాబు. వెంటనే అనితను పిలిచి కావాల్సిన కాగితాల మీద సంతకాలు తీసుకొమ్మంటూ పురమాయించాడు.

ఈ విషయం తెలుసిన అనంతయ్య అగ్గిమీద గుగ్గిలమయ్యాడు. ఆ రాత్రి విపరీతంగా తాగి వచ్చి..

“నన్నే వద్దనుకున్నప్పుడు నీ కడుపులోని నా బిడ్డ ఎందుకు” అంటూ విచక్షణా రహితంగా గొడ్డును బాదినట్టు బాదాడు.

దెబ్బలకు తాళలేక హాస్పిటల్ పాలయ్యింది. ఎన్ని జాగ్రట్టాలి తీసుకున్నా వనజకు అబార్షన్గాక తప్ప లేదు. కాని ఆమెకు అర్థం కాని విషయం ఒక్కటే.. అంత తొందరగా అనంతయ్యకు విడాకుల సంగతి ఎలా తెలిసిందని..!

ఆమెకు దాదాపు నెల రోజుల పాటు ఆఫీసు సెలవు మంజూరు చేసింది. హాస్పిటల్ నుండి డిశ్చార్జయ్యాక అనిత ఇంటి చిరునామా సంపాదించి కలిసింది. ఆమె విషయమంతా క్షుణ్ణంగా వివరించే సరికి విభ్రాంతికి లోనయ్యింది వనజ. కాని నమ్మశక్యం గాలేదు. ఈ రోజుల్లో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మగూడదోనని అయోమయంలో పడింది.

ఎందుకైనా మంచిదని, ఆడవారి హాస్టల్లో జాయినయ్యింది వనజ. అదే రోజు రాత్రి అనంతయ్య హాస్టల్ గేటు ముందు వీరావేషం వేశాడు. అనిత చెప్పిన విషయం కొంత మేరకు అవగహనమయ్యింది.

ఆమరునాడు ధనబాబు ఆఫీసుకు వెళ్ళింది.

వనజను చూడగానే ధనబాబు ముఖం వికసించింది.

“నా విషయమంతా అనంతయ్యకెలా తెలుస్తున్నది ధనా.. విడాకుల విషయం.. నేను చేరిన హాస్టల్ విషయం క్షణాల్లో అనంతయ్యకు తెలిసి పోతోంది. నాకర్థం కావడం లేదు. ఎవరో నన్ను ఫాలో చేస్తున్నారనిపిస్తోంది” అంటూ తన ఆవేదన వ్యక్త పర్చింది వనజ.

“నిజం చెప్పమంటావా వనం..” అంటూ ఆమెకు దగ్గరికి వచ్చి భుజాలపై చేతులు వేశాడు. వనజ దిగ్గున లేచి నిలబడి విదిలిమ్చుకుంది. కోపంగా ధనబాబును ఉరిమి చూడసాగింది.

“నీ చూపులేవీ పనిచెయ్యవు వనం.. ఈ రోజు అనిత గూడా రాలేదు” అంటూ చిరునవ్వుతూ కన్ను గీటాడు.

చెళ్ళున చెంప మీద కొడదామని చెయ్యెత్తింది వనజ. ఆ చెయ్యినలాగే పట్టుకుని..

“ఇక నీ ఆట కట్టు వనం,, నన్ను తక్కువగా అంచనా వేశావు”

“ధనా.. నా బతుకు పూల బాట చేసుకోవాలని ప్రయత్నిస్తుంటే.. నువ్వు ముళ్ళు పరుస్తున్నావు. ఇది నీకు న్యాయం కాదు” అంటూ దీనంగా చూడసాగింది వనజ.

“వనం.. నువ్వంటే నాకు పిచ్చి వ్యామోహం. ఎలా దక్కించు కోవాలా అని ప్లాన్లు వేశాను. మీ ఇంట్లో చిచ్చు పెట్టిందీ నేను. అనంతయ్య తాగడానికి డబ్బులిస్తూ.. బుట్టలో వేసుకున్నదీ నేను. బాల్యం నుండీ నీ నైజం తెలిసిన నేను నిన్ను నీ మొగనితో కొట్టిస్తే.. విడాకుల కోసం నాదగ్గరికి వస్తావని పథకం వేశాను. విజయం సాధించాను.

నీకు తెలియని విషయం మరొకటి ఉంది. అనంతయ్యతో విడాకుల దరఖాస్తు మీద గూడా తాగిన మత్తులో సంతకం చేయించాను. ఇద్దరు ఒప్పుకున్నారు కాబట్టి తొందరగానే విడాకులొస్తాయి. అది మన మచి కోసమే. మంచి మాటగా లొంగి పో.. మనం సహజీవనం చేద్దాం. లేదంటే నీకు ఎక్కడా ఆశ్రయం లేకుండా చేస్తాను” అంటూ అల నాటి జానపద సినిమాలలో రాజనాల నవ్వినట్టు నవ్వసాగాడు.

అనిత చెప్పింది అక్షరాల జరుగబోతోందని గ్రహించింది. ధనబాబును బెదిరించినా లాభం లేదనుకుంది. దేనికైనా సమయం రావాలి చూద్దాం.. అన్నట్టు సమయస్ఫూర్తిగా ఆపూటకు తప్పించుకోవాలనుకుంది,

“ధనా.. నాకు కొంత సమయం కావాలి” అంటూ బతిమాలుతూ.. “ఎప్పుడు విడాకులు మంజూరైతే అప్పుడే నా నిర్ణయం చెబుతాను”

భళ్ళున నవ్వాడు ధనబాబు.

“మీ దరఖాస్తులు నా వద్దనే పదిలంగా ఉన్నాయి. కొన్ని దొంగ పత్రాలు సృష్టిస్తే గాని కేసు నమోదు చెయ్యను. అందుకోసం పోలీసు ఎస్సై.. మరొక డాక్టరును సంప్రదిస్తున్నాను. ఏదైనా నువ్వు సై అంటేనే ముందుకు కదిలేది”

వనజకు పూర్తిగా అర్థమయ్యింది. తనను అందరికీ ఎరవేయాలని చూస్తున్నాడని గ్రహించింది.

“సరే ధనా.. రాత్రంతా ఆలోచించి రేపు చెబుతాను” అంటూ బయట పడింది.

తనకు హాస్టలే సురక్షితమనుకుంది. కాని రెండు రోజుల్లోనే హాస్టలు యజమానురాలు రెండు చేతులూ జోడించి ఖాళీ చెయ్యుమని వేడుకుంది. దాంతో చేసేది లేక తనతో బాటుగా ఆఫీసులో పని చేసే స్నేహితురాలు స్నేహ గదిలో రహస్యంగా చేరింది. సెలవులయ్యాక ఆఫీసుకు వెళ్ళగానే.. మేనేజరు అప్పటి వరకు రావాల్సిన డబ్బులు లెక్క గట్టి ముట్ట జెబుతూ.. ఉద్యోగం నుండి తొలగించాల్సి వచ్చిందని తన నిస్సహాయతను వ్యక్తపర్చాడు.

ఇవన్నీ ధనబాబు పన్నాగాలే అనుకుంది. అయినా ఆరాక్షసుని ఉచ్చులో పడొద్దని గట్టి నిర్ణయం తీసుకుంది.

చేతిలో డబ్బులున్నప్పుడే ఏదైనా చెయ్యాలనుకుంది. కట్టూ, బొట్టూ మార్చి.. ఈ మధ్యనే సికింద్రాబాదు వచ్చి ఫుట్ పాత్ మీద పండ్లు అమ్ముకుంటోంది.

అయినా ధనబాబు విశ్వరూపం ఇక్కడా వెలిసింది.

“వనజా.. లే.. పరుగెత్తు. ట్రాఫిక్ పోలీసు వ్యాను వస్తోంది..” అంటూ తన తోటి మిత్రురాలు అరిచినట్లుగా చెప్పేసరికి ఈ లోకానికి వచ్చింది వనజ.

ఇంకా సహనం వహించడం మంచిది కాదనుకుంది. మెదడుకు పదును పెట్టింది. ఆలోచిస్తూ.. అనిత ఇంటికి వెళ్ళింది. ఇద్దరు కలిసి స్నేహ గదికి వెళ్ళారు.

***

రాత్రి దాదాపు పదకొండు కావస్తోంది..

ఒక కేసు తాలూకు పాయింట్స్ వ్రాసుకుంటున్నాడు ధనబాబు. ఇంతలో వాట్సాప్ లో సందేశం రావడంతో ఆన్ చేసి చూశాడు. అది వనజ నుండి వచ్చింది. దానికి అనుబంధమైన వీడియో తెరచి చూశాడు. కళ్ళు బైర్లు కమ్మాయి. ‘రేపటి దినపత్రికలో నీ నిజస్వరూపం చూసుకో..’ అంటూ వనజ హెచ్చిరిక కొసమెరుపులో కనబడింది.

జీవితంలో మొదటి సారిగా ధనబాబుకు వణకు పుట్టింది.

చేతిలోని ఫైలు విసిరేసి నుదురు పట్టుకున్నాడు. ఇంతలో మరో వాట్సాప్ సందేశం వచ్చింది.

అది తన అసిస్టెట్ అనిత నుండి. వనజ పంపిన వీడియో గురించి వివరాలేమైనా పంపించిందేమో..! నని అతృతగా ఆన్ చేసి చూశాడు. అనిత రికార్డింగ్ చేసి పంపిన సందేశమది. ప్లే చేశాడు. అందులోని సంభోదనతో నివ్వెర పోయి బల్ల మీద ఫోన్ గిరాటు వేశాడు. అయినా అందులో నుండి మాటలు స్పష్టంగా వినవస్తూనే ఉన్నాయి.

“ఒరేయ్ ధనబాబు.. నువ్వొక మేకవన్నెపులివని.. నీ గురించి వివరంగా వనజకు ఆరోజే చెప్పాను. బాల్యస్నేహానికి విలువ ఇచ్చి తను ఎంతగానో ఓపిక పట్టింది. నువ్వు స్నేహానికి తిలోదకాలిచ్చి నాజీవితం నాశనం చెయ్యడమే గాకుండా వనజనూ వలలో వేసుకుందామని చూశావు. కాని నేను చెయ్య లేని సాహసం వనజ చేస్తోంది. ఆమె లోని కాళికామూర్తి రూపం నీకు తెలియదు. నువ్వు చెబుతావు. ఆమె చేసి చూపిస్తుంది. రేపటి దినపత్రికలో నీ భండారమంతా ఋజువులతో సహా వస్తుంది. దాని ఒరిజినల్ కాపీలన్నీ నా మద్దతుతో చేరాల్సిన చోటికి చేరాయి. అన్ని గ్రూపులకూ పంపిస్తున్నాము. తెల్లారే సరికి నీ జీవితం తెల్లారి పోతుంది. ఈ వీడియోలు చూడు. వీటిని తీయడంలో సహకరించింది.. వనజకు తన గదిలో ఆశ్రయమిచ్చిన స్నేహ. ఆమె అన్నయ్య పత్రికా విలేఖరి” కంగుతిన్నాడు ధనబాబు.

వీడియో రికార్డింగ్ ధనబాబు షాక్ తిన్నట్లు ఆగిపోయింది. వీడియో చూడాలంటే గుండె దడ.. దడ మంటోంది. కాసేపయ్యాక గ్లాసు మంచినీళ్ళు త్రాగి.. వీడియో ఆన్ చేశాడు.

అందులో వనజను తను బెదిరిస్తున్న దృశ్యాలున్నాయి. వనజ విడాకుల పత్రాల ఫైలు వివరాలున్నాయి.

రెండవ వీడియోలో.. ‘ధనబాబు రాసక్రీడలు’ అనే టైటిల్ తో ఆరంభమయ్యింది. శృంగార క్లిప్స్ దాదాపు ఇరవై వరకు ఉన్నాయి. ధనబాబు గుండె వేగం తగ్గింది.. శ్వాస మందగించింది.

ఇక మూడవ వీడియో ప్లే చేసే ధైర్యం చాలక కుప్పలా కూలిపోయాడు. రాత్రంతా నిద్ర లేమితో.. అనిత, వనజల ప్రణాళికలను ఎలా వమ్ము చెయ్యాలా..! అని పథకాల రచనలో మునిగి పోయాడు. ఇవి తనకు ‘వెన్నతో పెట్టిన విద్య’ అనుకున్నాడు. ఎంతైనా క్రిమినల్ లాయరు గదా..!

తెల్లవారు ఝామున ఎర్ర బడిన కళ్ళతో.. మూడవ వీడియో చూడాలని ఫోన్ తీశాడు. ఇంతలో గుమ్మం ముందు దినపత్రిక పడ్డట్లు శబ్దమయ్యింది. వెంటనే గుమ్మ తెరచి పేపరందుకున్నాడు. ఫోన్ పక్కకు పెట్టి పేపరు తెరిచాడు. మెయిన్ పేపర్లో ఏమీ లేదు. కాసేపు హాయిగా గాలి తీసుకున్నాడు. జిల్లా అనుబంధం తీయగానే మొదటి పేజీలో ‘ధనబాబు న్యాయవాది అన్యాయాలు’ అనే శీర్షికతో దాదాపు సగం పేజీ నిండా వ్రాశారు. ముఖ్యంగా ఆడవారు న్యాయం కోసం వస్తే తగిన న్యాయం చేస్తానని, వంచించి వశపర్చుకునే వాడని.. చివరగా వనజ అనే బాధితురాలు అతని ఆట కట్టించడానికి సాహసించి అనిత అనే ధనబాబు సెక్రెటరీ సాయంతో ఆధారాలు.. వీడియోలు సేకరించి నేరుగా రామచంద్రయ్య జడ్జి గారికి సమర్పించుకుంది. తన బాధను వెల్లబోసుకుంది.

జడ్జి గారు దాన్ని సుమోటాగా తీసుకుని కేసు నమోదు చెయ్యాల్సిందిగా పోలీసు అధికారులను ఆదేశించినట్లు వివరంగా వ్రాశారు.

గజ, గాజా వణకిపోసాగాడు ధనబాబు. అతని సెల్ ఫోన్ మెసేజ్­లతో దేదీప్యమానంగా వెలుగుతూనే ఉంది. వాటిని ఓపెన్ చెయ్యకుండా.. అనిత పంపిన మూడవ వీడియో ఆన్ చేశాడు.

అది ధనబాబు భార్యకు వనజ, అనితలు కలిసి తన భాగోతాన్ని వివరిస్తూ.. వీడియోలు అందజేస్తున్న దృశ్యాలు.

మూర్చ పోయాడు ధనబాబు. *

మరిన్ని కథలు

Simhavalokanam
సింహావలోకనం
- మద్దూరి నరసింహమూర్తి
Mana garden
మన గార్డెన్
- తాత మోహనకృష్ణ
Andari bandhuvuluu
అందరి బంధువులు
- భానుశ్రీ తిరుమల
Teeram cherchina parugu
తీరం చేర్చిన పరుగు
- షామీరు జానకీ దేవి
Vimanam lo kalakalam
విమానంలో కలకలం
- తాతా కామేశ్వరి
Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ
Chandruniko noolu pogu
చంద్రునికో నూలు పోగు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Anaadha atidhyam
అనాథ అతిథ్యం
- - బోగా పురుషోత్తం