అదొక పోలీస్ స్టేషన్.
ఉదయం దాదాపు ఎనిమిది గంటలు కావస్తోంది. ఇంటి నుండి అప్పుడే వచ్చిన ఎస్సై గుండయ్య హడావుడిగా తన ఛాంబర్ వైపు నడుస్తున్నాడు. వినాయకుని పండుగ సందర్భంలో పోలీసులకు డ్యూటీ నిర్వహణ బాధ్యతలు అప్పగించాలని మనసులో ప్రణాళికలు రచిస్తున్నాకొద్ది అతని అడుగుల వేగం పెరుగసాగింది.
“సార్..! సార్..!” అని పిలుస్తూ తన వెనుకాలే రోడ్డు రోలర్ కదులుతున్నట్టుగా వస్తున్న ఆసామిని ఎగాదిగా చూసుకుంటూ ఎడం చేత్తో తన గదిలోకి రమ్మన్నట్టు ఇషారా చేశాడు. గుండయ్య కుర్చీలో కూర్చోని లిప్తకాలం విశ్రమించాడు. ఆసామి గుమ్మంలో అడుగు పెడుతుండగానే..
“ఏం పేరు” అని తన సహజశైలిలో అడిగాడు గుండయ్య. అది పోలీసుల నైజం. అలా అడిగితేనే పోలీసులకు విలువ ఉంటుందని అతని ప్రగాఢ విశ్వాసం.
“నాకు చాలా పేర్లు ఉన్నాయి సార్. మీరు గణపతి అని పిలుస్తే చాలు” అంటూ సవినయంగా చేతులు కట్టుకున్నాడు. ఒక్క తొండం లేనట్టే గాని అచ్చం వినాయకుడిలా కాస్త పొట్టి, దానికి వ్యతిరేకంగా పెద్ద బొజ్జ, బొడ్డు కనబడేలా పైకి ఎగబాకిన చొక్కా, చేటలంత చెవులు, ధృఢమైన కాళ్ళూ చేతులూ చూస్తుంటే ఫక్కున వచ్చే నవ్వును ఠక్కున ఆపుకుంటూ..
“చాలా పేర్లు అంటున్నావు. అవునులే.. ఇంట్లో ఒక రకంగా బయట స్నేహితులు మరో రకంగా పిలువడం సహజమే. గణపతీ! ఇంతకు నువ్వు వచ్చిన పని ..” అంటూ కళ్ళు పెద్దవిగా చేసుకొని తలెగరేసాడు గుండయ్య.
“సార్.. ఒక ఫిర్యాదు ఇద్దామని వచ్చాను” అంటూ పక్క జేబులో నుండి మడత కాగితం తీసి, ముడతలు సరి చేసి.. మడతలు విప్పి, గుండయ్య చేతికందించాడు గణపతి.
దాన్ని చూడగానే కళ్ళు తేలేసాడు గుండయ్య. చటుక్కున తేరుకొని కాలింగ్ బెల్ నొక్కి స్టేషన్ రైటర్ రంగయ్యను పిలిపించాడు. అతడు రాగానే గణపతి ఫిర్యాదు కాయితమిచ్చి చదువమన్నాడు.
రంగయ్య ఉత్తరాన్ని పైనుండి కింది దాకా చూస్తుంటే కళ్ళ నుండి ధారాళంగా కన్నీటి దారలు జలపాతాల్లా దుముకసాగాయి. గుండెలు తీసే మొనగాడని పేరు గాంచిన గుండయ్య గుండె సైతం జారిపోయింది. అతని సర్వీసులో అలా జావగారి పోవడం అదే తొలిసారి.
“ఏముంది రంగయ్యా..” ఎవరో గణపతి అమ్మాయిని మానభంగం చేసి ఉంటారన్నంత అందోళనగా అడిగాడు గుండయ్య.
“సార్..” అంటూ భోరురుమన్నాడు రంగయ్య. గుండయ్యకి గుండె ఆగినంత పనయ్యింది. తన అనుమానం నిజమే అన్నట్టు లేచి రంగయ్య భుజం తట్టుతూ శాంతింప చేసాడు. రంగయ్య బిక్కు, బిక్కు మంటూ గుండయ్యను చూస్తూ..
“సార్.. ఇది హిందీ అనుకోని చదువబోయాను కాని ఒక్క ముక్కా అర్థం కావడం లేదు”
“సారీ సార్.. అలవాటులో పొరబాటుగా సంస్కృతంలో” రాసాను అని నాలుక కరుచుకున్నాడు గణపతి. రంగయ్య, గుండయ్య గుడ్లప్పగించి వాటికి మద్దతుగా.. నోరు తెరచి మ్రాన్పడి పోయారు.
“సార్.. మరో కాగితం ఇప్పిస్తే తెలుగులో రాసిస్తాను. లేదా దాని వెనుకాలే రాసిమ్మన్నా రాసిస్తాను” అంటూ
బతిమాలే ధోరణిలో ముఖం పెట్టాడు గణపతి.
“అలవాటులో పొరబాటు అంటున్నావు.. సంస్కృతం మీడియంలో చదువుకున్నావా? ఎక్కడ.. మనదగ్గర ఉన్నట్టు గుర్తు లేదే..!” అంటూ టోపీ తీసి, సుతారముగా బుర్ర గోక్కోసాగాడు గుండయ్య.
“నేను దేవలోకంలో చదువుకున్నాను” అనగానే వీడెవడో పిచ్చాసుపత్రి నుండి తప్పించుకొని వచ్చాడని నిర్థారించుకొని గుండయ్య చెవి కొరికాడు రంగయ్య. అదే విషయం నిజమైతే తోలు ఒలుస్తాను అన్నట్టు గణపతి వంక ఉరిమి చూసాడు గుండయ్య. తన అనుభవాన్నంతా రంగరించి నిజం రాబట్టుదామన్నట్టుగా..
“సరే! సరే! ఇంతకూ విషయం ఏంటో చెప్పు గణపతీ. మా రంగయ్య రాసుకొస్తాడు తరువాత సంతకం పెడుదువు గాని” అంటూ నెమ్మదిగా ఆరా తీసాడు గుండయ్య.
“అలాగే సార్” అంటూ గొంతు సవరించుకున్నాడు గణపతి. అతని ఆయాసం పసిగట్టి కుర్చీలో కూర్చోమని కుర్చీ చూపించాడు గుండయ్య. రంగయ్య మంచి నీళ్ళ గ్లాసు అందించాడు. గణపతి గ్లాసు సగం ఖాళీ చేసి కుర్చీలో కూర్చుంటూ..
“అది అంత అల్లాటప్పా విషయం కాదు సార్. నా పేరు చెప్పుకొని ప్రజలను పీడిస్తూ.. బలవంతంగా డబ్బులు లాక్కుంటున్నారు. ప్రభుత్వ రోడ్డు కంట్రాక్టర్లు ఖర్చు పెట్టినట్టు వచ్చిన డబ్బులో కనీసం ఇరవై శాతం గూడా నాకోసం ఖర్చు పెట్టకుండా తిన్నంత తిని మిగిలింది వెనుకేసుకుంటున్నారు. ఇలా దోచుకోవడం అన్యాయం కాదా!. క్రిమినల్ కేసు పెట్టి ఉరికంబం ఎక్కించండి” అంటూ ఆవేశంగా ఊగిపోసాగాడు గణపతి. అతని ఆవేశం చూసి రంగయ్య బిత్తర పోయాడు. గుండయ్యకు ఇంకా పూర్తిగా విషయం అర్థం గాక..
“నీ పేరు చెప్పుకొని డబ్బులు లాక్కుంటున్నారా.. ఎవరు? ఎందుకు? కాస్త వివరంగా చెప్పు. అదే నిజమైతే.. ఎంత పలుకుబడి ఉన్నవారైనా సరే.. లోపలేస్తాను. నీకు న్యాయం జరిగేలా చూస్తాను” అంటూ అభయమిచ్చాడు గుండయ్య.
చేతిలో ఉన్న గ్లాసులోని నీళ్ళు సాంతం తాగాడు గణపతి. ఖాళీ గ్లాసును టేబుల్ మీద పెట్టి..
“సార్. మీ పోలీసు వాళ్ళేమీ తక్కువ తినలేదు. అయినా పాపం! మీ చేతుల్లో ఏముంది? మీరు ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మలు. ఎవరిని అరెస్టు చేయమంటే వారిని చేస్తారు”
“అదేంటి గణపతీ!.. తిరిగి, తిరిగి ఫిర్యాదును మా మీద రుద్దుతున్నావు?” వీడు నిజంగా పిచ్చోడే ఇక వీని పని పట్టాల్సిందే! లోపలేసి వీపు సాపు చేస్తే గాని దారికి రాడు అని మనసులో అనుకుంటూ వచ్చిన కోపాన్ని కళ్ళల్లో ప్రతిబింబిస్తూ చూసాడు గుండయ్య. ఇదేదో సస్పెన్స్, థ్రిల్లర్ సినిమా అన్నట్టు ముఖం పెట్టాడు రంగయ్య.
“లేకుంటే ఏంది సార్? నన్ను పూజించాలీ అంటే ముందుగా శుభ్రమైన మట్టితో నా ప్రతిమను తయారు చేయాలి. భక్తితో నిండిన హృదయంతో ప్రతిఫలాపేక్ష లేకుండా స్మరించుకోవాలి. సంఘంలో అదర్శవంతమైన జీవనం కొనసాగిస్తామని ప్రతిన బూనాలి. అదే నాకు భక్తులు సమర్పించుకునే కుసుమాలు, నైవేద్యాలు. నేను సంతుష్టుడనవుతాను. కాని ఈకంలో జరుగుతున్నదేమిటి?” అంటూ ప్రశ్నార్థకంగా చూసాడు గణపతి. రంగయ్య, గుండయ్య ముఖాలు తెల్లబడడం గణపతిలో ఉత్సాహం రెట్టింపయ్యింది. గొంతు మరో మారు సవరించుకున్నాడు.
“జనమంతా తప్పుల మీద తప్పులు చేస్తున్నారు. మొదటగా మట్టి గణపతి ప్రతిమలు గాకుండా నీటిలో అరగని, కరగని విషపూరిత పదార్థాలతో గణపతిని తయారు చేస్తున్నారు. అదీ బలవంతంగా ప్రజలనుండి చందాలు
వసూలు చేసి. అలా భయపెట్టి బలవంతంగా డబ్బులు లాక్కోవడం తప్పు కాదా? ఆ డబ్బు ప్రజాసౌకర్యాలకు ఖర్చు చేయకుండా దాచుకుంటున్నారు. ఇది సమంజసమేనా? పోటీతత్వం పెంచుకొని గణపతిని ప్రతీ సవత్సరం అడుగుల మీద అడుగులు పెంచుకుంటూ పోతున్నారు. కొన్నాళ్ళకు ప్రతిమలు మా దేవలోకం అంచులు తగిలేలా ఉన్నాయి.
ఇక రెండవ తప్పు.. వాటిని ఇంట్లో పెట్టడం కుదురదు కనుక వీధుల్లో నిలదీస్తున్నారు. శబ్ధ కాలుష్యంతో బాటు చెవులు చిల్లులు పడేలా గ్రాంఫోన్ రికార్డులు.. ఇంకా జనులను ఆకట్టుకోవాలని అసభ్యకరంగా రాత్రుళ్లు రికార్డింగ్ డాన్సులు. ఇది సరియైనదేనా? పాపం కొందరు వృద్ధులు గుండె ఆగి పైలోకానికి టపా కడుతున్నారు. అవేవీ పట్టించుకోకుండా అనుమతుల మీద అనుమతులు ఎవరిస్తున్నారు. మీ పోలీసు వాళ్ళు కాదా? ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉందా?
ఇక పోతే మూడవ తప్పు.. బాగా మందు కొట్టి జుగుప్సాకరంగా నృత్యాలు చేస్తూ.. జనాలకు కడు ఇబ్బందులు పెడుతూ నన్ను ఊరేగిస్తున్నారు.. కలుషితమైన నీటిలో నిమజ్జనం చేస్తున్నారు. నేను ఆ వాసన భరించలేక పోతున్నాను. ఇదేమన్నా న్యాయంగా ఉందా?
ఇదంతా నా మీద ఉన్న భక్తిభావమేనా? ఇదేనా సనాతనధర్మం? చెప్పండి సార్.
నాకిదంతా నచ్చదు సార్. నా పూజలు ఇళ్ళల్లో మాత్రమే జరగాలి.. వీధుల్లో కాదు. ఇంట్లో పూజ అనంతరం మీ ఇంట్లోని బావిలో గాని, బావి లేకుంటే ఒక బక్కెట్టు నీటిలో గాని నిమజ్జనం చేయాలి. నేను అంతర్థానమయ్యాక ఆనీటిని చెట్లకు పోయండి. ఇది నా కోరిక.
ఇక మీరు నా ఫిర్యాదును రాసుకు రండి నేను సంతకం చేసి సెలవు తీసుకుంటాను. అంటూ రంగయ్య వంక చూశాడు గణపతి.
“గణపతి గారూ.. మీరు చెప్పిందంతా రికార్డు చేసాను” నా పని అదే కదా! అన్నట్టు చిరునవ్వుతో గణపతి ముందుంచాడు రంగయ్య,
గుండయ్య కుర్చీ వెనుకాలకు ఒరిగి సుదీర్ఘ ఆలోచనలో పడ్డాడు. తన మనసులోని మాటలను గణపతి వల్లె వేసినట్టుగా ఉంది. గణపతి ఫిర్యాదులో రవంత దోషం లేదు. వినాయకుని ఉత్సవాల నేపథ్యంలో జరుగుతున్నవన్నీ తనకు నేరాలు, ఘోరాలుగానే కనబడుతున్నాయి. కాని తాను ఎలా సంస్కరించగలడు. నుదురు నిమురుకుంటూ కళ్ళు మూసుకున్న గుండయ్య, గణపతి తన ఫిర్యాదు మీద సంతకం చేసి వెళ్ళడం గూడా గమనించలేదు.
“సార్.. ఎవరో వచ్చారు” అన్న రంగయ్య పిలుపుతో ఆలోచనల నుండి తేరుకున్నాడు గుండయ్య. లోపలికి పంపించమని ఆదేశించాడు.
ఇద్దరు పిల్లలతో ఒక పెద్దావిడ లోనికి వస్తూనే సవినయంగా రెండు చేతులు జోడించి నమస్కరించింది. ఆమెతో వచ్చిన పిల్లలు గూడా నమస్కరించారు. వారి వినయవిధేయతలు గుండయ్యను కట్టి పడేసాయి. పిల్లలను చూడగానే గణపతి పిల్లలని పోల్చుకున్నాడు.
“సార్ నా పేరు వరమ్మ. గణపతి అత్తయ్యను. వీళ్ళు నందుడు, వినోద గణపతి పిల్లలు” అంటూ పరిచయం చేస్తుంటే..
“ఏం చదువుతున్నారు” అని మధ్యలోనే అడిగాడు గుండయ్య.
“నేను ఆరవ తరగతి” అని నందుడు అనగానే .. “నేను నాలుగు” అంటూ చటుక్కున చెప్పింది వినోద. వారి హావభావాలకు ముగ్ధుడయ్యాడు గుండయ్య.
“సార్ మా అల్లుణ్ణి వెతుక్కుంటూ వస్తున్నాం. పోలీసు స్టేషన్ వైపు వెళ్ళాడని ఒకతను చెప్పాడు” అని వరమ్మ చెబ్తుంటే నందుడి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. సన్నగా ఏడ్చుకుంటూ “నాన్న రాలేదా సార్” అంటూ అడిగాడు నందుడు. వరమ్మ పిల్లలను దగ్గరికి తీసుకుంటూ సముదాయించింది.
“వీళ్ళ తల్లి రాలేదా..” అంటూ వరమ్మ వంక ప్రశ్నార్థకంగా చూసాడు గుండయ్య.
“సార్.. నా బిడ్డ చనిపోయింది” అంటుంటే ఆమె దుఃఖం ఆగలేదు. కండ్లు కన్నీటి కడవలయ్యాయి. పిల్లలు వరమ్మ వంక బిక్కు, బిక్కుమంటూ చూడసాగారు. వరమ్మ కడకొంగుతో నోటిని ఒత్తుకుంటూ.. తమాయించుకుంది. కన్నీటిని తుడ్చుకుంటూ.. విషయం క్లుప్తంగా చెప్పసాగింది.
“సార్ మా అల్లుడు సంస్కృతంలో గొప్ప పండితుడు. వినాయకుని దేవాలయంలో అర్చకునిగా పనిచేసే వాడు. ఈడు ముదురుతున్నా.. పెళ్లి చేసుకోనని.. దేవునికే తన జీవితం అంకితమని నిర్ణయించుకున్నాడు.
నాకు ఒక్కర్తే కూతురు. ఆమె పుట్టగానే మా ఆయన కాలం చేసాడు. పొట్ట కోసం తిప్పలు తప్పవన్నట్లు నేను కొందరి ఇండ్లల్లో పాచి పని చేసే దాన్ని. నా కూతురు గుడి సహాయకురాలిగా పనిలో చేర్పించాను. దైవ నిర్ణయం కాబోలు.. మా అమ్మాయి పరిచయమయ్యాక పెళ్లి చేసుకొంటానన్నాడు. తల్లిదండ్రులకు దూరమయ్యాడు. వారి కులాంతర వివాహం నిరాడంబరంగా జరిగింది. గుడి ప్రక్కనే దాతలు ఇచ్చిన ఇంట్లో కాపురం పెట్టారు. రత్నాల్లాంటి ఇద్దరు పిల్లలు పుట్టారు. గుడిలో వచ్చే ఆదాయంతోనే పొదుపుగా సంసారం సాగేది. ‘మనమొకటి తలిస్తే దైవమొకటి తలుచును’ అన్నట్టు విధి చిన్న చూపు చూసింది. గత సంవత్సరం అల్లుని కళ్ళ ముందే ప్రమాద వశాత్తు దేవాలయ వాహనం కింద పడి మా అమ్మాయి కాలంచేసింది.
ఆ రోజునుండి మా అల్లుని మతి స్థిమితం తప్పింది. పిల్లలను నేను చూసుకుంటున్నాను కాని అల్లునితోనే తిప్పలు తప్పడం లేదు” అంటూ మరో మారు భోరుమని ఏడ్చింది వరమ్మ.
రంగయ్యతో బాటు పోలీసు కఠినత్వం కలిగిన గుండయ్య సైతం కన్నీరు కార్చాడు. కర్చీఫ్ తో కన్నీళ్లు ఒత్తుకొని..
“వరమ్మా.. గణపతి ఇక్కడకు వచ్చాడు. మనం జరుపుకునే వినాయకుని ఉత్సవాల నిర్వహణ గురించి ఫిర్యాదు చేసాడు. అతని ఫిర్యాదులో ఆవగింజంతైనా దోషం లేదు. ఫిర్యాదు మీద సంతకం చేసి ఇప్పుడే వెళ్ళాడు. పద మనం వెతుకుదాం” అంటూ జీపు తీయమని డ్రైవర్ కు చెప్పమన్నట్టు రంగయ్యకు ఆదేశమిచ్చాడు.
“నేను గణపతిని మానసిక చికిత్సాలయంలో చేర్పిస్తాను. తప్పకుండా నయమవుతుంది. పిల్లలను హాస్టల్ లో చేర్పిస్తాను. మీరు నిశ్చింతగా ఉండండి” అంటూ భరోసా ఇచ్చాడు. ‘మానవ సేవయే మాధవ సేవ’ అన్నట్టు వరమ్మను, పిల్లలను తీసుకొని జీపు వైపు కదిలాడు గుండయ్య.
వినాయక మండపాల డ్యూటీల కంటే ముందు గణపతిని వెతకాలి అని మనసులో అనుకుంటూ జీపు డ్రైవరుకు సూచనలిచ్చాడు.
గణపతి మార్గాన్ని వెతుక్కుంటూ జీపు ముందుకు పరుగు తీసింది. *