
"మృదులా....మృదులా..!"అని పిలుస్తూ తలుపు తడుతున్న శబ్దం వినిపిస్తున్నా పరధ్యానంగా వంట గదిలో వున్న మృదుల. "మృదులా..!"అంటూ మరి కాస్త బిగ్గరగా వినపడగానే... "అయ్యో..వస్తున్నా..!"అంటూ వడివడిగా వెళ్ళి తలుపు తీయగానే "ఎన్ని సార్లు పిలవాలి ,అసలేం చేస్తున్నావు ఇంతసేపు తలుపు తెరవకుండా " అంటూ విసుగ్గా బజారు నుండి కొనుక్కొచ్చిన పచారి సామాన్లన్నీ అలా కింద పెట్టేసి సోఫాలో వాలిపోయాడు భర్త ప్రశాంత్. "ఇదిగోండి మంచి నీళ్ళు..!" అంటూ చల్లటి నీళ్ళు చేతికందించింది. గొంతులో చల్లని నీళ్ళు దిగుతుంటే .. సగం తాగి హాయిగా వుందనుకుంటూ రిమోట్ అందుకుని టీవీ ఆన్ చేశాడు. "అందులో వృద్ధ తల్లిదండ్రులకు నగరంలో తప్పని అవస్థలు"అంటూ స్ర్కోలింగ్ లో న్యూస్ చూపిస్తూ ఓ వృద్ధ జంట నడిరోడ్డుపై కింద పడిపోయున్న సంఘటనను పదే పదే చూపిస్తున్నారు టీవి ఛానెల్లో. ఆ దృశ్యం చూస్తూ వీరిని ఎక్కడో చూశానే అనిపించి గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించాడు. "హా...తన కొలిగ్ , జయ వారి అత్తమామలు. యస్.." అని గుర్చొచ్చినవాడల్లా... ఆ మధ్య వారి వెడ్డింగ్ యానివర్సరీ అని పార్టీ ఇచ్చింది తను , అక్కడ చూశాను. బాగా పలకరించి ఆత్మీయంగా మాట్లాడారు ఇద్దరూ. 'అవును... వాళ్ళే... వాళ్ళెందుకు ఇలా నడిరోడ్డుపై పడి వుండటం..ఏమైంది.. ?' మా కోడలు జయ చాలా మంచిది ..బాగా చూసుకుంటుందని చెప్పారు ఆరోజు. ఇప్పుడెందుకిలా, అసలు తనకీ విషయం తెలుసో తెలియదో వాళ్ళు రోడ్డు పై వుండటం. ముందు అది తెలుసుకోవాలని కొలిగ్ జయ ఫోన్ నెంబర్ డయల్ చేశాడు. ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తోంది. భర్త ఎవరికో పదే పదే ఫోన్ చేస్తుండటం ,స్విచ్చాఫ్ రావడం గమనిస్తూ "ఎవరికండి అన్ని సార్లు ఫోన్ చేస్తున్నారంది?" విషయం చెప్పి టీవీ లో చూపించాడు. "నేను కూడా చూశాను....,ఆ ముసలి వాళ్ళు మన కాలనీలోనే ఆఖరి ఇంట్లో వున్న వారు. నిర్దాక్షిణ్యంగా కొడుకు కోడలు గెంటేశారట. " అంది బాధగా. "నీకు తెలుసా.. ?"అనడిగాడు ప్రశాంత్. "ఆ... వారం క్రితమే ఇక్కడికి షిఫ్ట్ అయ్యారట మన పక్కింటి పద్మ చెప్పింది , అత్తమామలను వేరుగా వుండమని చెప్పారట,ఇక్కడ నగరంలో వారికెటు వెళ్ళాలో దిక్కు తోచక ఇది ముందే కాంక్రీట్ జంగిలాయే పాపం నడిరోడ్డుపై పడ్డారు. పల్లెటూళ్ళో ఆనందంగా వున్న వారిని నగరానికి తీసుకొచ్చి ఇలా అనాథల్లా వదిలేయడం ఏమైనా భావ్యమా చెప్పు ప్రశూ..?అంది మృదుల. ప్రశాంత్ ఆలోచిస్తూ.. "అసలు వాళ్ళెందుకు ఒంటరిగా వెళ్ళారు..?"అనడిగాడు. తన కొలిగ్ జయ అలా ఎందుకు పంపేసిందో అనే సందిగ్ధంలో. "వీళ్ళు వచ్చిన నెలరోజులలోనే ఊర్లో వున్న పొలాన్ని అమ్మించేసి ఇక్కడ ప్లాట్ కొని.. అదీ వాళ్ళ పిల్లలకోసమని చెప్పుకున్నారట.. వీళ్ళు మనవల కోసమే కదా మంచిదేలే వయసైపోతుంటే కొడుకు దగ్గర ఏ బెంగ లేకుండా హాయిగా కాలక్షేపం చేసేయచ్చని వున్నదంతా తీసుకొచ్చి వీరి చేతిలో పెట్టారట అంతే ఇంక వారితో పనైపోయిందని రోగమో రొచ్చో వస్తే చూడటానికి మాకు సమయం లేదని చెప్పి మీరు ఇక్కడి నుండి ఎక్కడికైనా వెళ్ళిపోండని రోజూ మాటలతో హింసిస్తుంటే పల్లెటూరి వాళ్ళు అభిమానాన్ని చంపుకోలేక ఇక్కడ వారి సమస్యను ఎవరితో పంచుకోవాలో తెలియక అలా ఒంటరిగా వెళ్ళిపోయ్యుంటారని ఇప్పుడే ఆ ఇంట్లో పనిచేసే రత్తాలు చెప్పింది.. తనకు వారు ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు తెలియదట ముందుగా తెలుసుంటే నీ దగ్గరకు తీసుకువచ్చేదాన్నని ఇప్పుడే నాతో చెప్పి వెళ్ళింది "అన్నది మృదుల. "అవును ,మృదులా..! ఒక్క నిమిషం ఇప్పుడే వస్తాను వుండు" ,అంటూ బైక్ స్ట్రాట్ చేసి వేగంగా వెళ్ళాడు. **** "మృదులా..మృదులా..!"అంటూ తలుపు తట్టిన శబ్ధం వినపడటంతో వడివడిగా వెళ్ళిన మృదులకు ఎదురుగా నడిరోడ్డుపై వున్న వృద్ధ దంపతులతో తన భర్త . వారిని సంతోషంగా చూస్తూనే లోపలికి ఆహ్వానించింది. అదే సమయంలో భర్త కళ్ళలో వెలుగునూ గమనించింది. ఆ వృద్ధులకు మంచి నీళ్ళందించి ...ప్రేమగా వారి వైపు చూసి "అమ్మా ...! మీరిక ఎటూ వెళ్ళకూడదు ఇక్కడే సంతోషంగా వుండండి"అంది. వారు చుట్టూ చూశారు .. తమ లాంటి వారు అక్కడ ఇరవై మంది పైగా వారిని ఆత్మీయంగా చూస్తున్నారు. ఈ మహా నగరంలో లేనిదేమైనా వుంది అంటే అది ప్రశాంతతే.అందుకే ,మీలాంటి వారికోసం మా ఇల్లు ఓ ప్రశాంత నిలయంగా నిర్మించాను అమ్మా..! ఇది కాంక్రీట్ జంగిల్ కాదు కారుణ్యంతో నిండి, నిండు హృదయాలున్న దేవాలయం. మీలాంటి తల్లిదండ్రులకు నిలయం అంటూ మృదుల ప్రశాంత్ ఇద్దరు ఒకేసారి అన్నారు. ఆ వృద్ధ దంపతుల కళ్ళ నిండా ఆనందంతో కూడిన అశ్రువులు జారి వారి కాళ్ళపై పడ్డాయి. "మీరిక ఇక్కడ నిశ్చింతగా మీ ఇంట్లో వున్నట్లే వుండండి "అని చెప్పి వారికి అక్కడున్న గదులను చూపించడానికి తీసుకెళ్ళింది మృదుల. ప్రశాంత్ ,తన కొలిగ్ జయ గురించి ఆలోచిస్తూ భార్యా భర్తలు ఇద్దరూ మంచి ఉద్యోగాల్లో వున్న సంపాదనాపరులు..వారికి తల్లి తండ్రుల బాధ్యత పెద్ద బరువేమి కాదు.. చదువు సంస్కారం వున్న వారే కన్నవారిని ఇలా రోడ్డు పై వదిలేస్తే ఇంకా ఓ సంస్థలో పని చేస్తూ అవసరమైనప్పుడు సంస్థనే వారి అవసరాలకు వాడుకుని వదిలేయరని గ్యారెంటీ ఏమిటని.. తనకు వచ్చిన ఆలోచనను ఆచరణలో పెట్టడానికి సిద్ధపడి వెంటనే హెడ్ ఆఫీస్ వారికి ఓ మెయిల్ పెట్టాడు. .... వారం రోజుల తర్వాత ప్రశాంత్ పని చేస్తున్న కంపెనీలోని ఉద్యోగులందరికీ వచ్చిన మెయిల్ చదివిన వారంతా ఆశ్చర్యంతో.. ఇలా ఎందుకు అని అడిగే సాహసం ఎవరూ చేయలేకపోయారు.. అందులో నిజం వుంది కాబట్టి వారు అడిగిన వివరాలన్నీ పంపడానికి సిద్ధమయ్యారు. ఒక నెలలోపు వివరాలు అందకపోతే టర్మినేషన్ అందుకుంటారనే నిబంధన కూడా జత కలిపి వుండటంతో. *** ఉద్యోగుల మధ్య జరుగుతున్న సంభాషణలకు తెర దించి, కంపెనీ ఏర్పాటు చేసిన సమావేశంలో ఉదారతలోనూ ముక్కుసూటి తనానికి పేరు గాంచిన మేనేజింగ్ డైరెక్టర్ మాధవ్ రావ్ మాట్లాడుతూ .. "ఈ సమావేశం కంపెనీ లావా దేవీల గురించి మాట్లాడటానికి కాదు , మీరు ఇంత వరకు మీ అభిప్రాయాలను మాతో పంచుకోవడానికి సంకోచించి వుండచ్చు. కానీ ఎందుకు మీ వివరాలు తీసుకున్నామో చెప్పాల్సిన బాధ్యత మాకుంది అంటూ మొదలు పెట్టాడు. ఈ ప్రపంచంలో మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల తర్వాతే ఏదైనా అని గొప్పగా చెబుతాను. వారి ఋణం ఈ జన్మలో తీర్చుకోలేనంగా మనల్ని ప్రేమిస్తూ పెంచుతారు. మనం తప్పు చేసినా ఒప్పు గా సరిదిద్దడానికి తాపత్రయ పడతారు. మనం ఎదిగే దశలో వారు సంతోషం తో పొంగిపోతారు. మనం సాధించిన విజయాలను చూసి వారే సాధించినంతగా మురిసిపోతారు. వారికేం కావాలో వారెపుడూ చూసుకోరూ.. మనకు ఏం తక్కువ కాకుండా చూడాలని క్షణక్షణం ఆరాటపడుతుంటారు. మరి అలాంటి తల్లి తండ్రులను నేడు ఎంతమంది రోజు కు ఒక్కసారైనా గుర్తు తెచ్చుకుని పలకరిస్తున్నారు. వారికేం అవసరాలున్నాయో తెలుసుకుని తీరుస్తున్నారు. " అంటూ ఓ నిమిషం పాటు అందరినీ ఆలోచనలో పడేశారు మాధవ్. వారు అలా వుండగానే "ఓ... మనం ఉద్యోగస్తులం వారితో కాలక్షేపం చేయడానికి సమయం లేదు అని అనుకుంటాం కదూ.. మరి ఏ సమయాన్ని మనల్ని పెంచడానికి చదివించడానికి ఉపయోగించుంటారు. మనం ఈ స్థాయికి రావడానికి ఎన్నో నిద్ర లేని రాత్రులు గడిపుంటారు.. మరి వారికి మనమేం చేస్తున్నాం.. మననుంచి ఆశించేది కేవలం ఒక్క మాట కాస్త ప్రేమ అంతే మీ డబ్బు కో పలుకుబడికో ఎదురు చూడరు. అలాంటి వారిని ఈమధ్య కాలంలో నడిరోడ్డుపై నిలబెట్టి వదిలించుకుంటున్న సందర్భాలు కోకొల్లలుగా కనపడుతూ వారి పిల్లలను సమాజం చీదరించుకునేలాంటి ఘటనలు జరుగుతున్నాయి. అందుకే మన కంపెనీలో పని చేస్తున్న వారంతా పని పట్ల నిజాయితీగా నిబద్ధతతో వుంటారో వారి తల్లి దండ్రులపై కూడా ప్రేమ ఆప్యాయత బాధ్యత కలిగి వుండాలని వారి కోసం జీవన భృతిగా ప్రత్యేకంగా మీ జీతంలో నుంచి పదిహేను శాతం వారికి కేటాయించాలని అనుకున్నాం. కంపెనీ నుంచి వారి అకౌంట్లోకే చేరేలాగా..సో.. మీకు ఇప్పుడు బాగా అర్థమైందనుకుంటాను అని అందరి వైపు చూసి వారి జాయింట్ అకౌంట్ బ్యాంకు వివరాలు జీవన ధృవీకరణ పత్రాలను ఆఫీసులో అందజేయమని చెప్పాము. తల్లిదండ్రులు ఇద్దరూ లేకపోతే వారి పేరుతో ఒక అకౌంట్ ఓపెన్ చేసి అందులోని డబ్బుని అనాథ ఆశ్రమాల్లోని వృద్ధులకు ,లేక మన మధ్య పని చేస్తున్న కింది స్థాయి ఉద్యోగుల తల్లి దండ్రులకో వారి అవసరార్థం అనారోగ్య కారణాలతో ఇబ్బంది పడుతున్న వారికోసం కేటాయించాలి. అంతే గాని మీరు సొంత ఖర్చులకు ఉపయోగించకూడదు. మీ తల్లి దండ్రుల ఆస్తిపై వారసులుగా మీకు ఎంత హక్కు వుంటుందో అదే విధంగా మీరు సంపాదించిన డబ్బు పై వారు జీవించి వున్నంత కాలం హక్కు వుంటుంది. ఈ కాలంలో అమ్మాయిలను అబ్బాయిలను సమానంగా చదివించి వారి ఉన్నతికి కారకులయిన అమ్మానాన్నలను చూసుకోవడానికి కూతురు కూడా బాధ్యత కలిగి వుండాలి కాబట్టి మహిళా ఉద్యోగులు కూడా మీకు అన్నదమ్ములు లేకపోతే వారి జీవన భృతికి మీ జీతం నుండే ఇవ్వాల్సి వుంటుంది. మన సంస్కృతిలో తల్లిదండ్రులను గౌరవించడం మన బాధ్యత వారు లేకపోతే మనం లేమని గుర్తుంచుకుని వారిని అనాథలు చేయవద్దని చెప్తున్నాను. కంపెనీలో ఈ వ్యవహారాలను చూసుకోవడానికి ప్రత్యేక డెస్క్ వుంటుంది. ప్రతి నెల మీ తల్లి దండ్రులకు ఫోన్ చేసి వివరాలు సేకరించడం జరుగుతుంది. వాటిలో ఏదైనా తేడా వస్తే మీ ఉద్యోగాలకు మేం బాధ్యులం కాము. ఇది గుర్తుంచుకోండి... అని ఒక లాంటి హెచ్చరికను చేస్తూ... చూడండి .. మన కంపెనీకి ప్రతి ఏడాది వచ్చే లాభాలలో పది శాతం సమాజసేవ పేరుతో ధార్మిక కార్యక్రమాల కోసం అనాథ ఆశ్రమాలకు ,పాఠశాలలోని విద్యార్థులకు వివిధ రకరకాలుగా కేటాయిస్తోంది. అది కంపెనీ యాజమాన్యం గొప్పతనం. అలాంటి సేవా దృక్పథం మనలో కూడా కలిగి వుండాలన్న భావనతోనూ, మనసంస్థలో పని చేస్తున్న ఉద్యోగులే కాదు వారి తల్లిదండ్రులు ఎవ్వరూ కూడా ఇక పై రోడ్డున పడకూడదని కంపెనీ యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది అంటూ జయ , రాహుల్ ,రవీంద్రలను చూస్తూ చెప్పాడు. మాధవ్ రావ్ గారి మాటలకు అందరూ ఆమోదం తెలుపుతూ హాలంతా చప్పట్లతో మారు మ్రోగిందిపోయింది . మరొక్క మాట అంటూ ప్రశాంత్ ను పిలిచి "ఇంత వరకు ఇటువంటి ఉద్యోగిని మన కంపెనీలో ఎప్పుడూ చూడలేదు.. మొదటి సారి ఇతను పెట్టిన మెయిల్ చూసి ఇలాంటి ఆలోచన నాకెందుకు రాలేదనిపించింది. అతను అనాథగా ఓ ఆశ్రమం లో పెరిగి మన కంపెనీ వారు డొనేట్ చేసిన డబ్బు తోనే చదువుకుని ఇప్పుడు ఈ స్థానంలో వున్నాడు. ఉద్యోగం లో చేరిన తర్వాత తనలాంటి అనాథలకు చేయూత గా వుంటానని మాటిచ్చాడు.... కానీ తను ,తల్లిదండ్రులు కని వదిలేసిన పిల్లల కంటే పిల్లలు వదిలేసిన తల్లిదండ్రులే ఎక్కువగా కనపడుతున్నారని .. వారి కోసం తన ఇంటినే ఓ ప్రశాంత నిలయంగా మార్చేశాడు.. అందులో మన కంపేనీ ఉద్యోగులైన జయ అత్తగారు మామగారు , రాహుల్, రవీంద్రల తల్లి దండ్రులు కూడా వున్నారు. మీకు పోషించే శక్తి లేక వదిలేసుంటే కన్నవారు కూడా మిమ్మల్ని కష్టం పెట్టడం ఇష్టం లేక వెళ్ళిపోయేవారు ,కానీ వదిలించుకోవాలనే వయసు మళ్ళిన వారిని రైల్వే స్టేషన్లో లోనో బస్టాపుల్లోనూ విడిచి రావడం ఎంతటి అమానుషమో మీరే ఆలోచించుకోండి రేపు మీ భవిష్యత్తు మీ చేతులతోనే దిద్దుకుంటారో సరిదిద్దుకుంటారో మీ ఇష్టం " అనగానే ,సిగ్గుతో తలదించుకున్నారు వారు. మాధవ్ రావ్ మాటలకు మనసు ఉప్పొంగి , "నేను పంపిన చిన్న ఈ మెయిల్ కు మీరు ఇంతగా స్పందిస్తారని అనుకోలేదు సర్. అవసాన దశలో మానసికంగా కృంగిపోతూ వారు పడుతున్న బాధలను నివారించడానికి అదొక్కటే మార్గమని మీకు మెసేజ్ చేశాను.. మీరు ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంటారని నాకు తెలియదు..నా వలన ఏదైనా పొరపాటు జరిగి వుంటే మన్నించండి సర్ " అంటూ కృతజ్ఞత గా చూశాడు ప్రశాంత్. "లేదు , ప్రశాంత్.. ఒంటరి తల్లిదండ్రులకు ఆర్థికంగా భరోసా ఇవ్వాలనే ఉద్దేశంతోనూ వారి పిల్లల సంపాదనతో వారు బాగా జీవిస్తున్నామనే ఆనందం వారికి కలిగేలా వుండాలని ఎంతో మందిని సంప్రదించి ఇలాంటి నిర్ణయం తీసుకున్నాం.. అంతే కాదు మీ ప్రశాంత నిలయానికి అవసరమైన ఆర్థిక సాయం కూడా కంపెనీనే భరిస్తుందని మాటిస్తున్నా "అన్నాడు మాధవ్. ప్రశాంత్ సంతోషం తో హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపి "మన కంపెనీ లాగే మరిన్ని సంస్థలు కూడా ఇలాంటి నిర్ణయం తీసుకునేలా మీరు ప్రయత్నించాలి సర్ "అన్నాడు "తల్లిదండ్రులను దైవాలుగా కొలిచే మన దేశంలో, పిడికెడు అన్నం పెట్టేవారు లేక తల్లడిల్లుతున్న వారినెంతో మందిని చూసిన గుండె ఇది.. వారి కోసమైనా.. ఇది ఓ అత్యున్నత సంస్కరణగా ముందుకు తీసుకువెళ్ళడానికి ప్రయత్నిస్తాను "అన్నాడు చిరునవ్వు తో..మాధవ్ రావ్. తను అనుకున్నది నిజం కానున్నదనే సంతోషాన్ని ప్రశాంత నిలయం లోని వారందరితో ఈ విషయాన్ని పంచుకోవాలని మాధవ్ రావ్ గారి దగ్గర శెలవు తీసుకుని బయల్దేరాడు ప్రశాంత్. సమాప్తం.