వెన్నంటే కళ్లు - కందర్ప మూర్తి

Vennante Kallu
" అయ్యా, కిర్రు కిర్రు గుర్రం, డోలక్ బాజా, తల ఊపే గొల్ల భామ
బొమ్మలకు బేరాలు బాగుంటున్నాయి. డమకు డమా లాగుడు
డప్పు పిల్లలు ఇష్టపడుతున్నారు. ఈ సారి రామతీర్థంలో
సరుకులు బాగా అమ్ముడు పోతె నాను ముక్కుకి ఎర్రపొడి
ముక్కెర చేయించుకుంటాను..." కూతురు గౌరి
చెప్పుకుపోతుంటె నోటితో చుట్టపొగ వదులుతు శ్రద్ధగా
వింటున్నాడు ముసలి కార్పెంటరు వీరయ్య.
భార్య గోవిందమ్మ , గౌరికి మూడేళ్ల వయసున్నప్పుడు
గుండెజబ్బొచ్చి హాస్పిటల్లో చచ్చిపోతె మరొక పెళ్లి చేసుకోకుండా
గౌరిని పెంచి పెద్దదాన్ని చేసాడు. పట్నంలో ఆటబొమ్మలు అమ్మి
తిరిగి వస్తుంటె సైకిల్ని కారు గుద్దేస్తె కాళ్లు రెండు మోకాళ్ల నుంచి
ఆపరేషను చేసి తీసేసారు. బడికి పోయె పదేళ్ల గౌరిని బడి మాన్పించి
ఇంటికే పరిమితం చేసాడు. తను చేసిన ఆటబొమ్మలు బుట్టలో
ఉంచి పట్నం, సంబరాలు, తీర్థాలలో అమ్మిన డబ్బులతో ఇల్లు
గడుస్తోంది.
గౌరి ఇరవై ఏళ్ల ప్రాయంలో పొడవుగా నిగారింపుగా సోగ కళ్లతో
గుండ్రటి ముఖంతో పొడవైన జడలో ఎర్రని మందార పువ్వుతో చూసేవారిని ఆకర్షిస్తుంది. వసపిట్టలా ఎప్పుడూ చిరునవ్వుతో
మాట్లాడుతు సండిగా కనబడుతుంది. జాలి దయా ధర్మాలతో
వయసు మళ్లిన ముసలివారికి కావల్సిన సహాయం అందిస్తుంది.
" గౌరీ , సల్లగుండు. నీకు రాములోరంటి పెనిమిటి దొరుకుతాడు"
అని దీవెనలు పెడుతుంటారు వారు. ఊళ్లో వీరయ్య అంటె ఆదరణ,
పిల్ల గౌరంటె ఆప్యాయత చూపెడతారు జనం.
వీరయ్య గ్రామం కొండాపురం కొండ ప్రాంతంలో ఉన్నందున ఊరి
ప్రజలు కొండ వాలంట మట్టిరోడ్డులో నడుచుకుంటు పట్నానికి పోయి సరుకులు అమ్ముకుంటుంటారు.
వీరేశం , శంకరం, దుర్గేషు, కన్నయ్య, గౌరీషులకు హత్యలు,
దోపిడీలు, మానభంగాలు, అనేక హింసాత్మక కేసులలో జీవిత
కఠిన కారాగార శిక్షలు పడ్డాయి. వారిని సెంటర్ జైల్లో ఎప్పుడూ
కాళ్లకు ఇనుప గొలుసులు బేడీలతో పటిష్ట భద్రత మద్య శిక్షలు
అమలు చేస్తున్నారు. జైల్లో కూడా జైలు సిబ్బందితో దురుసుగా
ప్రవర్తిస్తు ఇబ్బందులు పెడుతుంటారు వారు. ఆ ఖూనీకోరులలో
యువకులు, మద్యవయస్కులు ఉన్నారు. జైలు ఆవరణలో
సాయుధ గార్డులు వారిచేత పగలు తోటపనులు, కాయగూరల
సేద్యం చేయిస్తుంటారు.
అప్పుడప్పుడు వారిలో మానసిక పరిపక్వత, ఆధ్యాత్మిక చింతన
కోసం ప్రవచన యోగులు, మానసిక నిపుణుల చేత ప్రసంగాలు
చేయిస్తుంటారు జైలు అధికారులు.
కొత్తగా బదిలీపై వచ్చిన యువజైలర్ జగదీష్ చార్జ్ తీసుకుని
జైలులోని ఖైదీలను పరామర్శిస్తుడు. ఆయన బ్రహ్మచారి. బ్రహ్మ
సమాజంలో పెరిగిన అనాథ. ఆయన చేసే వృత్తి జైలర్ ఐనా
దయా ధర్మాల పుట్ట. తెలిసో లేక ఆవేసంలో చేసిన తప్పుల
వల్ల శిక్షలు అనుభవిస్తు భార్యాపిల్లలకు, కన్నవారికి దూరమయేమని మనస్తాపంతో ఆవేదన చెందే ఖైదీలను ఎందర్నో చూసాడు.
శిక్షలు పడి జైలుకు వచ్చిన ఖైదీలకు జీవిత హితబోధ చేసి మళ్లీ
జైలుకు రాకుండా ఉండాలని ప్రయత్నిస్తుంటాడు.
సాధారణ ఖైదీలతో పాటు జీవిత ఖైదు అనుభవిస్తున్న ఐదుగురు
ఖైదీలను కూడా పరామర్సించడానికి వారి సెల్లులోకి వచ్చాడు
కొత్తగా వచ్చిన జైలర్ జగదీష్.
" నువ్వా కొత్తగా వచ్చిన జైలర్వి. పరవాలేదే, కుర్రాడిలాగున్నావు.
ఇక్కడ ఎంతకాలం ఉంటావు?" హేళనగా మాట్లాడటం మొదలెట్టారు
ఆ ఖర్కోటక ఖైదీలు.
గుబురు మీసాలు, దట్టంగా పెరిగిన జుత్తుతో జైలు తిండి తింటూ
కూడా కండల శరీరాలతో భీకరగా ఉన్నారు వారు.
ఎలాగైనా వారిలో పరివర్తన తెచ్చి మనుషులుగా మార్చాలనుకున్నాడు
జైలర్ జగదీష్.
కొద్ది రోజుల తర్వాత ఒక్కొక్కరిని తన చేంబర్ కి పిలిపించి వారు
చేసిన నేరాలు, ఎప్పటి నుంచి శిక్ష అనుభవిస్తున్నదీ, కుటుంబ సబ్యుల
గురించి వారు పడే వేదన అన్నీ తెలుసుకున్నాడు.
ఇంతలో కొండాపురం అటవీ ప్రాంతంలో ప్రభుత్వ బంజరుభూమి
ఉందని దాన్ని ఖైదీల చేత చదును చేయించి ఫలసాయ క్షేత్రంగా
మార్చడానికి చర్చలు జరుగుతున్నాయి.
జైలర్ జగదీష్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చెయ్యాలనుకున్నాడు.
కరడు కట్టిన ఈ ఐదుగురు జీవిత ఖైదీల ద్వారా ఆ బంజరుభూమిని
చదును చేసి వ్యవసాయ క్షేత్రంగా మార్చాలనుకున్నాడు.
అదే విషయమై జైలు సూపరింటెండెంటు గారిని కలిసి తన ఆలోచన
చెప్పాడు జైలర్.
"నోనో, దె ఆర్ డేంజరస్ పీపుల్స్. మర్డరర్స్. వాళ్లు జైలు దాటి బయటకు
వెళితే పారిపోడానికి ప్రయత్నిస్తారు. వాళ్లు ప్రమాద మనుషులు.
ఎట్టి పరిస్థితుల్లో ఆ ఐదుగురు జైలు దాటి బయటకు రాకూడదు"
అని జైలు సూపరింటెండెంట్ తన అశక్తతను తెలియచేసాడు.
" సార్, వారిని ఎప్పుడూ అదే దృష్టితో చూడకూడదు.వారిలో
పశ్చాత్తాపం కనబడుతోంది. వారు తాము చేసిన నేరాల వల్ల
కుటుంబ సబ్యులకు సమాజానికి దూరమయామని ఆవేదన
కనబడుతోంది. ఒక అవకాశం ఇచ్చి చూద్దాం. తప్పక మార్పు
వస్తుందన్న నమ్మకం నాకుంది " అని పరిస్థితులు తెలియచేసాడు
జైలర్ జగదీష్.
జైలు సూపరింటెండెంట్ ఉన్నత అధికారులకు విషయం
తెలియచేసి కొండాపురం అటవీప్రాంతంలో ఉన్న పదెకరాల
ప్రభుత్వ బంజరు భూమిని జైలు సిబ్బంది పహరాలో జైలు
ఖైదీల చేత వ్యవసాయ క్షేత్రంగా మార్చడానికి అనుమతి
పొందేడు.
జైలర్ జగదీష్ కి విషయం తెలియచెప్పి కరడుగట్టిన ఆ
ఐదుగురు ఖైదీల విషయంలో చాల జాగ్రత్తగా ఉండాలని
వారు పారిపోడానికి దేనికైనా సిద్ధపడతారని జాగ్రత్తలు
చెబుతు వారుగాని అక్కడి నుంచి తప్పించుకున్పట్లైన
నిన్ను ఉద్యోగం నుంచి డిస్మిస్ చేసి జైల్లో ఉంచవల్సి
వస్తుందని సూచనలు చేసాడు.
కొండాపురం పక్కన ఉన్న ప్రభుత్వ బంజరు భూమిని
పరిశీలించి వచ్చిన జైలర్ జగదీష్ ముందుగా అక్కడ
ఉండటానికి రేకుల షెడ్డు, చుట్టూ ముళ్లతీగ ఫెన్సింగ్
వేయించాడు.
నాలుగు వైపుల సెంట్రీ పోస్టుల మీద సాయుధ సిబ్బంది
కాపలా కాస్తు ఎవరైన ఖైదీ పారిపోడానికి ప్రయత్నించినా
దౌర్జన్యం చేసినా కాల్చి వేయమని ఆర్డర్లు ఉన్నాయి.
దీర్ఘకాల శిక్షలు పడిన ఖైదీలను సమావేసపరిచి వారు
చేసిన నేరాల వల్ల కుటుంబ సబ్యులకు దూరమై ఈ
నాలుగు గోడల మద్య నాగరిక ప్రపంచానికి దూరంగా
శిక్ష అనుభవిస్తున్నారు..మిమ్మల్ని నమ్ముకుని బ్రతికే
తల్లిదండ్రులు, భార్యాపిల్లలు, అక్కచెల్లెళ్లు అన్నదమ్ములు
నిరాశ్రయులై ఆర్థిక ఇబ్బందులు పడుతుంటారు.
మీరు చేసిన నేరాల మూలంగా ఎన్నో కుటుంబాలు
కుటుంబ పెద్దలను కోల్పోయి నిరాశ్రయులైయుంటారు.
ఇలా వారిలో మనోవికాసం కల్గించడానికి మానవత్వంతో
సత్ప్రవర్తనతో శిక్షాకాలం తగ్గించడానికి ప్రయత్నిస్తున్నాడు
జైలర్ జగదీష్.
జీవిత శిక్ష పడిన ఖైదీలలో మంగలి , చాకలి, కమ్మరి, గజదొంగ,
తాపీమేస్త్రి ఇలా అన్ని వృత్తులవారు ఉన్నారు.
" చూడండి, ఖైదీ మిత్రులారా! ఈ విశాల బంజరు భూమిలో
మీకు ఎటువంటి కాళ్లకు ఇనుపగొలుసులు, చేతికి బేడీలు
వుండవు. మీరుండే నివాస షెడ్డులకు తలుపులుండవు.
సమయానుకూలంగా రోజువారీ పనులు చేసుకుంటు
మన భోజనం మనమే తయారు చేసుకోవాలి. తాగేనీళ్లు,
భోజన సామగ్రి మనమే సమకూర్చుకోవాలి.రాత్రి పగలు
ఏ కష్టం వచ్చినా మనమే సహకరించుకోవాలి. మీరు నామాటను
నిజం చేసి ఎటువంటి మోసం చెయ్యరనె నమ్మకంతో
ఈ కార్యక్రమానికి సంకల్పించాను. వారానికి ఒకసారి
దైనందిన ఆహార వస్తువులు జైలు నుంచి సరఫరా జరుగుతుంది.
దూరంగా ఉన్న కొండచెలమ నుంచి మంచినీళ్లు కేన్లలో
తెచ్చుకోవాలి. భూమిని చదును చేసే గునపాలు, పారలు
గొడ్డళ్లు, తొళ్లికలు, బొరిగలు, రాళ్లను పగలగొట్టె ఇనుప
సుత్తిలు ఇలా కావల్సిన సాధనాలు అందుబాటులో ఉన్నాయి.
మన శ్రమ కృషితో ఈ బంజరు భూమిలో బంగారం పండిద్దాం.
మన ఆశయం నెరవేరుద్దాం." అని హితబోధ చేసాడు జైలర్.
జైలర్ జగదీష్ ఖైదీలు సిబ్బందితో మొరటుగా వ్వహరించినా, దుర్భాషలాడినా తిరగబడినా వారిని అసబ్య పదజాలంతో
తిట్టడం కాని శరీరదండన కాని చెయ్యడు. వారిని పిలిచి
తన ఎదురుగా కూర్చోబెట్టి అనునయ మాటలతో వారికి
నచ్చచెబుతు కంటిచూపుతో వారిని తనవైపు ఆకర్షిస్తాడు.
ఆ దివ్యదృష్టిలో ఏ మహత్యముందో నాగస్వర వాద్యం
నుంచి వచ్చే ధ్వనికి బుసలు కొట్టే నాగసర్పం పడగ ఆడించినట్టు
ఎదుటి వ్యక్తి మెత్తపడిపోతాడు. ఎదురు సమాదానం చెప్పే
సాహసం చెయ్యరు. అందువల్ల ఖైదీలు సార్ తమని వెన్నంటి
కనిపెడుతు ఉంటారని భయపడుతుంటారు.
ఒకసారి చాకలి శంకరం అర్థరాత్రి షెడ్డులోని దీపం ఆర్పి
పారిపోదామని ప్రయత్నిస్తె గుమ్మం ముందు రెండు కాంతులు
చీకట్లో మెరుస్తు కనబడితె భయపడి వెనక్కి వచ్చి పడుకున్నాడు.
అలాగే కమ్మరి వీరేశం రాత్రి కొండాపురం గ్రామంలో కల్లు తాగడానికి
బయటికి వస్తె రెండు మెరుపుకళ్లు మెరుస్తు ఎదురుపడితే మెల్లగా
చాప మీదకు చేరుకున్నాడు. ఇలా ఖైదీలందరికీ ఏదో రూపంలో రెండు
కళ్ళు మెరుస్తు కనబడేవి. జైలర్ సారే తమని వెన్నంటి నీడలా
కాపలా ఉంటున్నాడని అర్థమైంది వారికి.
జైలర్ జగదీష్ కి వేరుగా గడ్డితో కుటీరం ఏర్పాటు చేసారు.
ఉదయాన్నే కాలకృత్యాలు తీర్చుకుని ధ్యానంగా భగవద్గీతను
పారాయణం చేస్తుంటాడు. అక్కడి నుంచి ఎదురుగా ఉండే
రేకుల షెడ్డులోని ఖైదీల గతివిదులను పరిశీలిస్తుంటాడు.
విశ్రాంతి సమయంలో ఖైదీలను సమావేశ పరిచి భగవద్గీతలోని
ఆధ్యాత్మిక విషయాలను వారికి తెలియచేస్తుంటాడు.
దుర్మార్గపు పనులు చేస్తె పాపం అని దాని ఫలితంగా చనిపోయిన
తర్వాత నరకం అనే చోట జీవికి రకరకాల శిక్షలు అమలు
అవుతాయని, మంచి పనులు చేస్తె పుణ్యం వస్తుందని, కారణంగా
స్వర్గం ప్రాప్తించి జీవి ఆనందంగా ఉంటారని వివరిస్తుంటాడు.
కొండవాలు మట్టి కాలిబాట పక్కన బంజరు భూమిలో మనుషుల
సంచారం , చుట్టూ ముళ్ల తీగెల ఫెన్సింగ్ ఏర్పాట్లు చూసి రోజూ
పట్నానికి నిత్యావసర వస్తువులు అమ్ముకునే కొండాపురం ఊరి
జనాలకు ఏం జరుగుతోందో తెలియక తికమక పడుతున్నారు.
తండ్రి చేసిన ఆటబొమ్మలు తట్టలో పెట్టుకుని చేతిలో వెదురుపుల్లకు
కట్టిన డమక్ డమక్ మని చప్పుడు చేసే డప్పును తిప్పుతూ ఇదే
కాలిబాటన పట్నానికి పోతుంది గౌరి.
బంజరుభూమిలో పని చేస్తున్న ఖైదీలు గౌరి చేతిలోని డమక్
డోలు శబ్దం విని పనులు వదిలి వింతగా వయసులో ఉన్న గౌరిని
తదేకంగా చూస్తు వెకిలి చేష్టలు చేస్తుంటారు.
వారి నిసిత చూపులు కనిపెట్టిన గౌరి ఒక్కొక్కరిని వారి వయసులను
బట్టి అన్నా, నాయనా, తాత, పెద్దయ్య అని వరసలు పెట్టి పలకరిస్తుంది.
అప్పుడు వాళ్లకి తమ తోబుట్టువులు, కన్నపిల్లలు, బంధువులు గుర్తుకు
వస్తారు.
జైలర్ జగదీష్ ముందుగా నీటి కోసం దిగుడుబావి తవ్వాలని
నిర్ణయించి చదునుగా ఉన్న ప్రదేశంలో స్థలం చూసి భూమిని
తవ్వడం మొదలెట్టారు. పైన మన్ను గట్టిగా ఉంటూ దిగువన
బండరాళ్లు తగులుతున్నాయి. ఖైదీలతో పాటు తనూ నెత్తిన
టోపీ పెట్టుకుని తవ్వకం మొదలు పెట్టేరు జైలర్.
జైలర్ సార్ కూడా తమతో ఎండలో పనులు చేస్తుంటె వారిలో
ఉత్సాహం పెరుగుతోంది. ఇంతకు ముందు సెంట్రల్ జైలు నాలుగు
గోడల మద్య సెంట్రీలు తుపాకులు పట్టుకుని పని చేయిస్తు
దుర్భాషలాడేవారు. రెట్టించిన ఉత్సాహంతో మట్టిని, రాళ్లను
తవ్వుతు భూమిని లోతు చేస్తున్నారు. తవ్విన రాళ్లతో నూతికి
గట్టు, మెట్లు వేసారు. పల్లపు ప్రాంతంలో భూమి తవ్వినందున
మెల్లగా నీరు చిమ్మసాగింది. తాపీమేస్త్రి కన్నయ్య తన పనితనంతో
నూతిని పూర్తి చేసారు. ఇప్పుడు కొండవాలు నుంచి నీళ్ళు
తెచ్చుకోవల్సిన అవసరం లేకపోతోంది.
క్రమేపి బండరాళ్లను, చెట్లను, తుప్పలను నరికి భూమిని
చదును చేసారు. గడ్డపారలు, గునపాలు, బెల్చాలతో మట్టిని
తవ్వి గడులుగా చేసి ఏతాం కర్రతో దిగుడుబావి నుంచి నీళ్ళు
తోడి పోస్తున్నారు. కేబేజీ, గోబీ పువ్వులు, రకరకాల కూరగాయలు
ఆకుకూరలు సాగుచేస్తు ముళ్లపొదలు, బండరాళ్లు, డొంకలతో
ఎగుడు దిగుడుగా ఉండే కొండబంజరు భూమి పచ్చగా
సస్య శ్యామలంగా కనబడుతోంది.
ఖైదీలకు, తనకు జైలర్ జగదీషే ఆహారం తయారుచేస్తున్నాడు.
జైలు భోజనంలో చప్పిడి తిండి తప్ప రుచి ఉండేది కాదు.ఇప్పుడు
కమ్మటి రుచితో కడుపు నిండుతోంది. పని సమయంలో పని,
విశ్రాంతి సమయంలో విశ్రాంతి దొరుకుతోంది.తాము జైలు ఖైదీల
మన్న సంగతే మరిచిపోయారు. వారిలోని దుర్మార్గం పోయి
మానవత్వం బయటపడుతోంది.
జీవితశిక్ష పడిన ఖైదీల నివాస ప్రాంతాలు సెంట్రల్ జైలుకు
దూరంగా ఉన్నందున వారి బంధువులు అప్పడప్పుడు వచ్చి
కుటుంబ సమస్యలు చెప్పుకుని బాధపడేవారు. తమ తప్పిదం
వల్లనే పిల్లలకు, బంధువులకు దూరమయామని ఖైదీలు
మనస్థాపం చెందేవారు.
ఒకసారి ఖైదీలలో ఒకడైన మంగలి దుర్గేషు జబ్బుతో బాధ
పడుతున్న ముసలితల్లిని తీసుకుని జైలు గార్డు వచ్చాడు.
తల్లి దుస్థితిని చూసి బావురుమన్నాడు దుర్గేషు.ఒక అమ్మాయిని
మానభంగం చేసి కిరాతకంగా చంపినందున జీవిత కఠిన
కారాగార శిక్ష పడింది. ఒంటరి ముసలితల్లిని చూసేవారు
ఎవరు లేరు. కొడుకు జైలు పాలయినాడని దిగులుతో గ్రామంలో
రోజులు గడుపుతోంది. ఇప్పుడు తల్లిని దురావస్థలో చూసి
మనస్సు వికలమైంది. ఎలాగైనా తల్లిని రక్షించమని జైలర్
సార్ ని కోరుకున్నాడు. జైలర్ జగదీష్ దుర్గేషుకు మాట ఇచ్చి
తల్లితో కొంత గడపడానికి కొంత సమయం ఇచ్చాడు.
మిగతా ఖైదీలకు కూడా తమ కుటుంబసబ్యులు గుర్తుకు
వచ్చి సత్ప్రవర్తనతో వ్యవహరించి జైలుశిక్ష నుంచి బయట
పడాలనుకున్నారు.
గౌరి తండ్రి చేసిన ఆటబొమ్మల్ని బుట్టలో పెట్టుకుని డమక్
డమ చప్పుడు చేసే డప్పును వెదురుపుల్లకి చుట్టి తిప్పుతు
ఉదయం పట్నానికి పోయి అమ్ముకుని సాయంకాలం ఇంటికి
కావల్సిన సరుకులు కొనితెస్తుంది.
దూరం నుంచి గౌరి చేతిలోని డమరుకం శబ్దం వినబడగానె
పనులు ఆపి ఖైదీలు ఇనుప ఫెన్సింగ్ దగ్గర కొచ్చి గౌరిని
పలకరించి తలొక పువ్వు చేతికి ఇచ్చేవారు. వాటిని ఆప్యాయంగా
తీసుకుని తలలో ముడుచుకునేది. అలాగే సాయంకాలం
ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు వారికి ఏవో తినుబండారాలు
తెచ్చి ఇచ్చేది గౌరి. ఈ విధంగా వారి మద్య చెప్పలేని
అనుబంధం ఏర్పడింది. ఒక్కరోజు గౌరి ఆ దారంట కనబడక
పోతె వారు ఆందోళనకు గురయేవారు. ఈ దినచర్య జైలర్
జగదీష్ కి తెల్సినా వారు మానసికంగా సంతోషంగా ఉంటున్నారని
సరిపెట్టుకునే వాడు.
ఒకసారి జైలర్ గారికి మలేరియా జ్వరం వచ్చి పక్కమీంచి
లేవలేకపోయారు. ఖైదీలకు ఏం చెయ్యాలో బోధ పడలేదు.
అప్పుడు గౌరి ఆ దారంట పోతుంటె విషయం చెప్పేరు.
వెంటనే గౌరి తన నెత్తి మీద బుట్టను దించి పక్కన పెట్టి
జైలర్ గారి కుటీరానికి వచ్చింది. ఇప్పటి వరకు ఫెన్సింగ్
లోపలి ఖైదీలనే కాని జైలర్ సార్ ని చూసింది లేదు.
నల్లనిగెడ్డం నూనూగు మీసాలతో ఆజానుబాహుడైన
యువకుడిని చూసి ముందు భయనడినా తర్వాత సర్దుకుని
మంచం దగ్గర కెళ్లి పరిస్థితి అర్థం చేసుకుని ఊళ్లోకి పోయి
ఆయుర్వేద వైద్యుడు ఆచారి గారిని తీసుకువచ్చింది.
ఆచారి గారు జైలర్ గారిని పరీక్షించి సంధివాత జ్వరమని
నిర్ధారణ చేసి అరకు చూర్ణం మందులు ఇచ్చి ఎలా
వెయ్యాలో సూచనలు జాగ్రత్తలు చెప్పేరు.
ఆరోజు గౌరి పట్నానికి పోకుండా జైలర్ గారికి సేవలు చేస్తు
ఆచారి గారు చెప్పినట్టు ఆహార పథ్యాలు చేయించింది.
మూడురోజుల తర్వాత జైలర్ గారికి జ్వరం తగ్గి మామూలు
మనిషి అయారు.
ఆ మూడురోజులు గౌరి ఇంటి వద్ద నుంచి అన్నం జావ,
మజ్జిగ , మిరియాల చారు ఆచారి డాక్టరు చెప్పినట్టు చేసి
తినిపించింది. ఆ అమ్మాయి సేవలకు జైలర్ గారు ఎంతో
ప్రసన్నులయారు. ఖైదీలందరు మా గౌరమ్మ జైలర్ సార్
ప్రాణాల్ని కాపాడిందని కొనియాడారు.
వ్యవసాయ క్షేత్రంలో పండిన కూరగాయలు, ఆకుకూరలు,
పళ్లు, పువ్వులు గౌరి తోపుడుబండి మీద పట్నంలో అమ్మి
ఆడబ్బును జైలర్ సార్ కి అప్పగించేది. ఆడబ్బుతో ఖైదీలకు
కావల్సిన బట్టలు, నిత్యావసర సరుకులు కొనితెచ్చేవారు.
సంవత్సరాలు గడిచేకొద్ది బంజరుభూమి చక్కటి వ్యవసాయ
క్షేత్రంగా మారి పచ్చని ఫలవృక్షాలు, కాయగూరలతో సుందరంగా
కనబడుతోంది.
ఈలోపున పర్యవేక్షణకు వచ్చిన జైలు సూపరింటెండెంటు గారు
జైలర్ జగదీష్ కృషికి ఖైదీలను అదుపులో ఉంచి వారి చేత
కొండకోనల్లో నీటి సౌకర్యం లేని ఇటువంటి అద్భుత వ్యవసాయ
క్షేత్రంగా తయారుచెయ్యడం అద్భుతమని ప్రసంసించారు.
కొండాపురం నుంచి పట్నానికి వెళ్లే మట్టిబాటను గ్రామస్తుల
సహాయ సహకారాలతో పక్కారోడ్డుగా తయారుచేసారు ఖైదీలు.
అలాగే కొండవాలులో చెక్ డామ్ నిర్మించి వర్షాకాలంలో కురిసిన
వర్షపు నీటిని కాలువ ద్వారా ఊరి చెరువుకు చేర్చి సాగునీటికి
ఉపయోగిస్తున్నారు. ఈ ఐదుగురు ఖైదీల వల్ల బంజరుభూమిలో
పక్షులతో కిలకిలారావాల పచ్చని వ్యవసాయ క్షేత్రంతో పాటు
కొండాపురం రూపురేఖలే మారిపోయాయి.
ప్రాణాంతకమైన మలేరియా జ్వరం వచ్చి జైలర్ జగదీష్
ప్రాణాపాయం నుంచి గౌరి సహాయం వల్ల బయట పడ్డాడని
తెలిసి జైలు సూపరింటెండెంటుతో పాటు ఖైదీలు, గ్రామ
ప్రజల అబ్యర్దన మేరకు జైలర్ జగదీష్ గౌరిని పెళ్లి చేసుకోడానికి
అంగీకరించారు.
జైలు సూపరింటెండెంటు పర్యవేక్షణలో, ఖైదీల ఆనందభాష్పాల
మద్య తమ ఊరు రూపురేఖల్ని మార్చిన మహానుభావుడిగా
కొండాపురం గ్రామ ప్రజలు చలాకిపిల్ల గౌరి పెళ్లిష అట్టహాసంగా
జైలర్ జగదీష్ తో జరిపారు.
దుర్మార్గులు, కఠిన హృదయులు అని సమాజంలో పేరుపడి
జీవితఖైదు అనుభవిస్తున్న ఐదుగురు కర్ఖోటక వ్యక్తులు
సన్మార్గంలో సత్ప్రవర్తన వల్ల జైలుశిక్ష రద్దయి విడుదలకు
అధికారులు అంగీకరించారు. వారు శ్రమించి బీడుభూమిని
ఆదాయం వచ్చే వ్యవసాయ క్షేత్రంగా మార్చినందుకు
పరిహారంగా ప్రభుత్వం వైపు నుంచి ఆర్థిక సహాయం అందింది.
ఖైదీలు ఐదుగురు జైలునుంచి విడుదలై వారి వారి గ్రామాలకు
పోయి వృత్తి పనులు చేసుకుంటు కుటుంబ సబ్యులతో సంతోషంగా
రోజులు గడుపుతున్నారు.
సమాప్తం

మరిన్ని కథలు

Manchi Donga
మంచి దొంగ
- చలసాని పునీత్ సాయి
Naanna
నాన్న
- డా:సి.హెచ్.ప్రతాప్
The game changer
ది గేమ్‌ చేంజర్
- హేమావతి బొబ్బు
Adrustam kalisoste
అదృష్టం కలిసొస్తె...
- కందర్ప మూర్తి
Illaale Devatha
ఇల్లాలే దేవత
- డా:సి.హెచ్.ప్రతాప్
Hidimbi premakatha
హిడింబి ప్రేమ కథ
- హేమావతి బొబ్బు
Vimukthi
విముక్తి
- డా:సి.హెచ్.ప్రతాప్
Aadhaar OTP
ఆధార్ ఓటీపీ
- యస్. రాజేష్ కుమార్