ఆనవాయితీతో ఆబ్దికం - మద్దూరి నరసింహమూర్తి

Anavayoteetho abdhikam

“విస్తట్లో చేయి పెట్టి తినకుండా అన్నాన్ని అలా కెలుకుతున్నారేమిటండీ, ఏమైనా సమస్య వచ్చి పడిందా”

“సావిత్రీ, నాన్న ఆబ్దికానికి ఇంకా రెండు రోజులే మిగిలేయి అన్నది నీకు తెలుసు. ఇంతవరకూ ఆనవాయితీ తప్పకుండా పెడుతున్నాము కదా”

“నిజమే. ఇప్పుడు ఎవరైనా కాదన్నారా”

“అదికాదు. ఈ సారి ఆనవాయితీతో ఆబ్దికం పెట్టే సులువు కనిపించడం లేదు సావిత్రీ”

“ఎందుకు అలా అనుకుంటున్నారు”

“ఆనవాయితీ నెరవేర్చడానికి కావలసినది ఎక్కడా దొరకడం లేదు. అందుకే ఆబ్దికం ఆనవాయితీతో ఎప్పటిలా పెట్టగలనా అన్న భయం వేస్తూ మార్గం కనపడక నాకు దిగులుగా ఉంది”

“ఇంకా రెండు రోజులు ఉన్నాయి కదా ఏదో దారి దొరుకుతుంది లెండి. ముందు మీరు భోజనం చేయండి”

“అలాగే. అవునూ రవి ఏడీ”

“ఆబ్దికం ఆనవాయితీ అంటూ తిరగడంతో మీకు సరిపోతుంది. బడికి సెలవలు కాబట్టి పది రోజులుగా పిల్లాడు నాలుగు మెతుకులు ఏదో ఇంత మింగి, వాడి స్నేహితుడు గోపాలం ఇంటికి ఆడుకుందికి పరిగెత్తుతూ చీకటి పడే వరకూ అక్కడే ఆడుకుంటున్నాడు. ఇంట్లో ఉండరా అంటే నా మాట వింటాడా ఏమిటి వాడు. మీరైనా కాస్త గట్టిగా చెప్పండి”

ఇంతలో ఆకలి వేసి భోజనానికి వచ్చిన రవి లోపలికి పరిగెత్తుకొని వచ్చి, తండ్రిని చూసి భోజనాల గది ద్వారం దగ్గరే ఆగిపోయేడు.

“ఏమిరా రవీ, చదువు చట్టబండలు ఏమీ లేక రోజంతా గోపాలం ఇంట్లో ఏమి చేస్తున్నావు”

“నాన్నా మరి మరి...”

“అక్కడ ఏమిటి చేస్తున్నావురా అంటే ఏమిటా నసుగుడు, అక్కడ ఏమిటి చేస్తున్నావో త్వరగా చెప్పు”

భయపడుతూ తాపీగా రవి చెప్పినది విన్న శర్మగారికి –

ఒక్కసారిగా బుర్రలోని భారం అంతా చేత్తో తీసేసినట్టై మనసు తేలిక పడి –

“చూసేవా సావిత్రీ, చంకలో పిల్లాడిని పెట్టుకొని ఊరంతా వెతికేడట నాలాంటి వెర్రివాడు వెనకటికి. మనకి కావలసినది రవితో ముందుగా చెప్పి ఉంటే, నాకు ఈ తిరుగుళ్లు తలనొప్పి తప్పి ఉండేవి”

“పోనీండి ఇప్పటికైనా మీకు మనశ్శాంతి దొరికింది అదే పదివేలు, తాపీగా తృప్తిగా భోజనం చేయండిక”

“ఒరే రవీ, దొడ్లోకి పోయి కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని రా, నాన్నగారి పక్కన నీకు కూడా వడ్డిస్తాను”

“అలాగే అమ్మా” అంటూ ఉషారుగా దొడ్లోకి పరిగెడుతున్న రవి వంక ప్రేమగా చూడసాగేరు దంపతులు.

ఆబ్దికం రోజున --

“ఏం సావిత్రమ్మా వంటకాలు ఎంత వరకూ వచ్చేయి, ఆబ్దికం పనులు ప్రారంభించుకోవచ్చా”

“తక్కువలో ఇంకో అరగంట పడుతుంది పంతులుగారూ, కాఫీ కానీ మజ్జిగ కానీ త్రాగుతారా”

“మజ్జిగ వద్దమ్మా, కాఫీ అయితేనే బండి హుషారుగా నడుస్తుంది”

“అలా అయితే మీరు పై పనులు చూసుకుంటూండండి, పది నిమిషాల్లో వేడి వేడి కాఫీ త్రాగుదురుగాని”

పంతులుగారు పై పనులు చూసుకుంటూ, శర్మగారు అసహనంగా అటూ ఇటూ తిరగడం చూసి – “ఏమిటైంది శర్మగారూ, అంత అసహనంగా అటూ ఇటూ తిరుగుతున్నారు”

“మా అబ్బాయిని పంపి అరగంట దాటింది శాస్త్రీగరూ, ఏదీ ఇప్పటివరకూ తేలేదు. ఎక్కడ తిరుగుతున్నాడో ఏమిటో”

“ఏమిటి తేవడానికి పంపేరు, ఎక్కడికి పంపేరు, అగో మాటల్లోనే మీ వాడు ఏదో సంచీతో వచ్చేడు”

శర్మగారు ఆతృతగా “ఏమిరా రవీ తెచ్చేవా”

“తెచ్చేను నాన్నా. సంచీలో పెట్టి సంచీ మూతిని త్రాడుతో బిగించి కట్టి మరీ తెచ్చేను. నువ్వు దాన్ని కట్టడానికి త్రాడు తెచ్చి ముందుగా ఒక కొస స్తంభానికి కట్టేయి. అప్పుడు సంచీమూతికి ఉన్న కట్టు విప్పి జాగ్రత్తగా దాన్ని తీస్తాను, ఆ త్రాడు చివర కొస దాని మెడకో కాలుకో వేసి గట్టిగా కట్టేస్తే సరి”

“శర్మగారూ ఏమిటి ఈ హడావిడి”

“చూస్తూండండి, మీకే తెలుస్తుంది” అని శాస్త్రిగారికి చెప్పిన శర్మగారు --

“సావిత్రీ, పనిమనిషికి దొడ్లో ఉన్న గోనెపట్టాను ఇసకను పట్టుకొని రమ్మను”

5 నిమిషాల్లో పనిమనిషి గోనెపట్టా ఇసక పట్టుకొని వచ్చింది.

వచ్చిన పనిమనిషితో శర్మగారు ఒక స్తంభం దగ్గర గోనెపట్టాను పరచమని చెప్పి, తెచ్చిన ఇసకను ఆ పట్టాపై మందంగా పోయమన్నారు.

ఆ తరువాత, పనిమనిషి సహాయంతో రవి సంచీలో ఉన్న కుక్కపిల్లని జాగ్రత్తగా తీసి దాని మెడకు త్రాడుకున్న ఒక కొసతో ముడి వేసి, అప్పటికే స్తంభానికి కట్టి ఉంచిన త్రాడు కొసతో కట్టివేసేడు.

“ఇదేమిటి శర్మగారూ, ఆబ్దికం జరిపించే చోట కుక్కపిల్లను స్తంభానికి వేసి కట్టేరు”

“ఈ ఏడాది ఆబ్దికానికి మీరు కొత్తగా వచ్చేరు కాబట్టి మీకు తెలియదు”

“ఏమిటి నాకు తెలియనిది”

“కుక్కపిల్లను తాడుతో స్థంబానికి కట్టి ఉంచి, ఆబ్దికం పెట్టడం మా ఇంటి ఆనవాయితీ”

“నా పిండా కూడు, అదేం ఆనవాయితీ శర్మగారూ. ఎక్కడా వినలేదు కనలేదు ఈ వింత”

“మీరు ఇంటికి వెళ్ళిన తరువాత మీ తాతగారిని అడగండి, ఆయనకు అంతా తెలుసు”

“మీరు చెప్పొచ్చుగా”

“నాకొకటి తెలిసి ఏడిస్తేగా మీకు చెప్పడానికి. మా పెద్దలు ఏర్పరచిన ఆనవాయితీని గుడ్డిగా ఆచరించడం ఒక్కటే నాకు తెలుసు”

“పంతులుగారూ, ఇగో వేడి కాఫీ. సేవించి మీరు ఆబ్దికం పనులు ఆరంభించండి, ఏదైనా అవసరమైతే కేక వెయ్యండి, తెచ్చి పెడతాను” అంటూ సావిత్రిగారు కాఫీ ఇచ్చేరు.

ఆమె ఇచ్చిన కాఫీ అందుకున్న పంతులుగారు “సావిత్రమ్మగారూ, ఆబ్దికానికి ఈ కుక్కపిల్లను తెచ్చి ఇక్కడ స్తంభానికి కట్టడమేమిటి, ఈ వెధవ ఆనవాయితీ వివరాలు ఏమిటో మీకేమైనా తెలుసా”

“మా ఆయనకే తెలియనిది నాకెలా తెలుస్తుంది అనుకున్నారు” అంటూ సావిత్రిగారు సిగ్గు పడుతూ త్వర త్వరగా లోపలికి వెళ్లిపోయేరు.

రెండు గంటలలో ఆబ్దికం పనులన్నీ యధాతధంగా జరిపించేరు శాస్త్రిగారు.

ఆబ్దికం జరుగుతున్నంత సేపూ – కుక్కపిల్ల ‘కుంయి కుంయి’ అని చిన్నగా అరుస్తూనే ఉంది.

అలా అది అరుస్తున్నప్పుడల్లా, అక్కడే కూర్చొని ఉన్న రవి దానికి చిన్న బిస్కట్ ముక్క ఇస్తూనే ఉన్నాడు.

భోక్తలతో పాటూ శాస్త్రిగారి భోజనాలు కూడా అయిపోయేయి.

శాస్త్రిగారితో సహా బ్రాహ్మణులు అందరూ వెళ్ళిన తరువాత శర్మగారు –

“ఒరే రవీ, ఆ కుక్కపిల్లను గోపి ఇంట్లో ఇప్పుడే ఇచ్చి వస్తావా, లేక భోజనం చేసి వెళ్తావా”

“అమ్మనడిగి గారె ఒకటి తిని, ఇప్పుడే వెళ్ళి గోపీకి కుక్కపిల్లను ఇచ్చి వస్తాను నాన్నా”

“అయితే, త్వరగా వెళ్ళి దాన్ని ఇచ్చేసి గోపీని కూడా పిలుచుకొని రా. నీతో పాటూ ఇక్కడ భోజనం చేస్తాడు. కాదంటే, ఓ నాలుగు గారెలు తిని వెళ్తాడు”

“అలాగే నాన్నా” అంటూ రవి లోపలికి వెళ్ళి అమ్మ దగ్గర గారె ఒకటి తీసుకొని నిక్కరు జేబులో కుక్కుకొని, కుక్కపిల్లను పెట్టి మూతి కట్టేసిన సంచీ పట్టుకొని గోపి ఇంటికి వెళ్ళేడు.

వెనకనుంచి సావిత్రిగారు “త్వరగా గోపితో వచ్చేయి రవీ, భోజనం చేద్దురుగాని”

“అలాగే అమ్మా” అంటూ రవి ఎక్కు పెట్టిన బాణంలా గోపి ఇంటి వైపుగా దూసుకొని వెళ్లిపోయేడు.

సావిత్రిగారు శర్మగారికి వడ్డించడం, ఆయన భోజనం అయిపోవడం కూడా అయిపోయింది.

“ఆకలితో ఉన్న పిల్లాడు ఇంకా రాడేమిటండీ” అని సావిత్రిగారు కంగారు పడుతూండగా రవి గోపి కలిసి తాపీగా వచ్చేరు.

“ఇద్దరూ దొడ్లోకి వెళ్ళి కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని రండి, వడ్డించేస్తున్నాను”

వారిద్దరూ కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి కబుర్లాడుకుంటూ అరటి ఆకులలో వడ్డించిన తద్దినం భోజనం పదార్ధాలను సరదాగా తృప్తిగా తినసాగేరు.

ఇంటికి వెళ్ళిన శాస్త్రిగారితో అతని తాతగారు –

“ఏమిట్రా మనవడా పొట్ట అలా ఉబ్బరించుకొని వచ్చేవు. కొంపదీసి శర్మగారి ఇంట్లో నాలుగు రోజులకు సరిపోయిన తిండి తిని చచ్చేవా ఏమిటి, చచ్చి ఊరుకుంటావు”

“ఈ పొట్ట ఉబ్బరం శర్మగారింట్లో తిండి తినడం వలన కాదు తాతయ్యా”

“మరి ఏమైందో చెప్పి ఏడూ”

“అక్కడ జరిగిన ఒక విడ్డూరం చూసి, ఆ వివరాలు ఏమిటో తెలిసి చావక, నా పొట్ట ఇలా ఉబ్బిపోతుంది”

“అక్కడ నువ్వు ఏం విడ్డూరం చూసేవు”

శాస్త్రిగారు అతని తాతయ్యతో శర్మగారింట్లో చూసిన కుక్కపిల్ల వ్యవహారం అంతా చెప్పి –

“ఆబ్దికం జరిపించే చోట కుక్కపిల్లను స్తంభానికి వేసి కట్టడమేమిటి శర్మగారూ అని అడిగితే – ‘నాకొకటి తెలిసి ఏడిస్తేగా మీకు చెప్పడానికి, ఆనవాయితీని గుడ్డిగా ఆచరించడం ఒక్కటే నాకు తెలుసు, మీకు అంతగా ఆ వివరాలు తెలుసుకోవాలంటే, మీ తాతగారిని అడగండి, ఆయనకు తెలుసు’ – అన్నారాయన”

“అదా సంగతి” అంటూ ముసలాయన నవ్వసాగేరు.

“ఇగో తాతయ్యా నవ్వింది చాలు కానీ, ఆ వివరాలు త్వరగా చెప్పి చావు, లేకపోతే నా పొట్ట ఇంకా ఉబ్బిపోతుంది”

“ఇలా కూర్చో చెప్తాను”

“ఉబ్బిపోయిన పొట్టతో నేను కూర్చోలేను. నేనిలా ఇక్కడే పచార్లు చేస్తూ ఉంటాను, నువ్వు చెప్పు”

“అలాగే” అని తాతయ్యగారు గొంతుక సవరించుకొని –

అగ్రహారంలో గోవిందుశర్మగారిది లంకంత లోగిలి, చుట్టూ చెట్లు చేమలతో పెద్ద తోట. ఇప్పుడైతే మనం ఈ ఊరికి వచ్చేసేము కానీ, అప్పుడు మన కుటుంబం కూడా అక్కడే ఉండేది. ఇంట్లో ఏదైనా కార్యక్రమం ఉంటే, గోవిందుశర్మగారు తోటలోనే గాడి తవ్వించి, ఆయన భార్య అధ్వర్యంలో వంటలు చేయించేవారు. ఆ మహాతల్లి చేసిన గారెలు నోట్లో వేసుకుంటే, వెన్నలా కరిగిపోయి స్వర్గానికి బెత్తెడు దూరంలో ఉన్నామనిపించేది. పవిత్రమైన కార్యక్రమం జరిగే చోటుకి గభీమని ఎవరూ వచ్చేయకుండా వీధి తలుపు వేసినా, దొడ్డి వైపు తలుపు తీసి ఉంచక తప్పేది కాదు”

“అసలు విషయం చెప్పకుండా ఈ ఉపోద్ఘాతమంతా దేనికి తాతయ్యా”

“నువ్వు అడిగితే చెప్పడానికి అది కథ కాదురా, యదార్ధ గాధ. కాబట్టి పుట్టు పూర్వోత్తరాలు తెలుసుకోకపోతే అర్ధం చేసుకోలేవు”

“సరేలే, త్వరగా విషయానికి రా”

“గోవిందుశర్మగారి అబ్బాయి గోపాలశర్మ నేను సహ విద్యార్ధులం స్నేహితులం. రోజులో సగభాగం పైన నేను గోపాలంతో కలిసి వాళ్ళ తోటలోనే ఆడుకుంటూ ఉండేవాడిని. ఆ తోటలో ఒకటి రెండు కుక్క పిల్లలు కూడా మాతో పాటూ పరిగెడుతూ ఆడుతూ ఉండేవి.

నాకు బాగా జ్ఞాపకం, అప్పుడు నాకు గోపాలంకి కూడా ఎనిమిదేళ్లు.

శర్మగారింట్లో ఆరోజు ఆబ్దికం జరిపించడానికి మా నాన్నగారు – అంటే నీ ముత్తాతగారు – వచ్చేరు.

శర్మగారింటి వీధి తలుపు వేసున్నా, దొడ్డి వైపు తలుపు తీసి ఉన్నందున, తోటలో తిరుగాడే ఒక కుక్కపిల్ల లోపలికి దూరి ఆబ్దికానికని వండి అక్కడ మడిగా పెట్టిన నువ్వుల పచ్చడి నాకింది. దాని నాలుక మండింది కాబోలు, ‘కుంయి కుంయి’ అని అరుస్తూ దొడ్లో పిచ్చి పరుగులు పెట్టసాగింది. దాంతో, మహాలక్ష్మమ్మగారు మా ఇద్దరినీ పిలిచి ఆ కుక్కపిల్లను పట్టుకొని ఒక చోట దూరంగా కూర్చోమని గట్టిగా కేకలు వేసేరు. పనిమనిషి చేత ఆ పచ్చడి ఆవల పారవేయించి, పాపం కష్టపడి ఆమె మరలా కొత్తగా పచ్చడి చేసేరు.

ఆ హడావిడి అంతా విన్న శర్మగారు గోపాలంతో –

“ఒరే బడుద్ధాయి వెధవా, కుక్కపిల్ల ఇంట్లో దూరిపోతూ ఉంటే ఏమిటి చేస్తున్నావు, గాడిదలు కాస్తున్నావా” అని తిట్టి –

“మీరిద్దరూ కలిసి ఇంట్లో ఒక స్తంభం దగ్గర గోనేపట్టా ఒకటి పరచి, దాని మీద మందంగా ఇసక పోసి, ఆ కుక్కపిల్లను ఆ ఇసక మీద పడుకో పెట్టి, ఒక త్రాడుతో దాన్ని ఆ స్తంభానికి వేసి కట్టేసి, అక్కడ నుంచి ఆ బుజ్జిముండ కదలకుండా కాపలా కాస్తూ కూర్చోండి” అని గట్టిగా కేకలు వేస్తూ చెప్పేరు.

మేమిద్దరం జడిసి పోయి అలాగే చేసి, ఆ కుక్కపిల్ల దగ్గరే ఆబ్దికం జరుగుతున్నంత సేపూ కదలకుండా కూర్చునేందుకు వెళుతూ – ‘గోనేపట్టా ఇసక ఎందుకు నాన్నగారూ” అంటూ అడిగేడు గోపాలం.

“ఆ బుజ్జిముండ ఏమైనా గలేజీ చేస్తే, ఆ చెత్త అంతా గోనెపట్టా మీద ఉన్న ఇసకమీద పడుతుంది. ఆబ్దికం పనులు అయిపోయిన తరువాత, ఇసకతో సహా ఆ గోనేపట్టా మన పనిమనిషి పారవేస్తుంది” అని బోధపరచి --- కుక్కపిల్ల విషయంలో ఆరోజు అలా జాగ్రత్తలు తీసుకోవడంతో, వంటలు తదితర పాత్రలు వస్తువులు మైలపడక ఆబ్దికం పనులు చక్కగా నెరవేరాయి.

అది గుర్తు ఉంచుకున్న గోపాలం హయాంలో నేను జరిపించిన ఆబ్దికం సమయంలో కూడా, ఆ తోటలో తిరిగే కుక్కపిల్లను తెచ్చి స్తంభానికి కట్టేసి, ఆబ్దికం పనులు పవిత్రంగా జరిపించేవాళ్లం.

గోపాలం కొడుకు కృష్ణ ఆ తతంగం అంతా జాగ్రత్తగా చూస్తూ, అతను హయాంలో మీ నాన్న జరిపించిన ఆబ్దికం అప్పుడు కూడా, కుక్కపిల్ల విషయంలో ఆ విధమైన జాగ్రత్తలతో ఆబ్దికం పనులు జరిగేవి.

గోపాలం అతని తండ్రిని, కృష్ణ అతని తండ్రిని, శర్మ అతని తండ్రిని చూసి ఆ జాగ్రత్తలతోనే ఆబ్దికం జరిపిస్తూ

పాటిస్తున్న ఆనవాయితీ అది”

ఆ వివరాలు విన్న తరువాత శాస్త్రికి పొట్ట ఉబ్బరం అయితే తగ్గింది కానీ --

ఆరాత్రి కలలో నాలుగు కుక్కపిల్లలు శాస్త్రి చుట్టూ తిరుగుతూ, అతని ఒళ్ళంతా గలేజీ చేసేయి.

**శ్రీరామ**

మరిన్ని కథలు

Gunthala Raju
గుంతల రాజు!
- - బోగా పురుషోత్తం
Adrustavanthulu
అదృష్టవంతులు
- యు.విజయశేఖర రెడ్డి
Adarsha kutumbam
ఆదర్శ కుటుంబం
- డా:సి.హెచ్.ప్రతాప్
Vennante Kallu
వెన్నంటే కళ్లు
- కందర్ప మూర్తి
Manchi Donga
మంచి దొంగ
- చలసాని పునీత్ సాయి
Naanna
నాన్న
- డా:సి.హెచ్.ప్రతాప్
The game changer
ది గేమ్‌ చేంజర్
- హేమావతి బొబ్బు