శ్రావణ మాసపు మేఘాలతో అల్లకల్లోలమైన ఆకాశం, భువి పై చీకటి తెరను తొందరగా దించింది. వర్షం వస్తుందని ఊహించిన జనం బ్రతుకు సమరాన్ని ఆ రోజు తొందరగా ముగించి గూడు చేరుకుంటున్నారు. ఊరు సద్దుమణిగింది. విశ్రాంత బ్యాంకు అధికారి అయిన పార్వతీశం, తాను నిర్వహిస్తున్న “అనాథ ఆశ్రమం” పనులు కూడా వేగంగా పూర్తిచేసి, డిన్నర్ కానిచ్చి, బెడ్ రూం లోని టేబుల్ ముందున్న కుర్చీలో కూర్చుంటూ పక్కనే ఉన్న బుక్ రాక్ లో పుస్తకాలను వెదుకుతున్నాడు. అందులోనుండి ఒక డైరీ బయట పడింది. అప్రయత్నంగా చేతులు అందులోని పేజీలను తిప్పుతున్నాయి. డిగ్రీ చదువుతున్న రోజుల్లో సరదాగా రాసిన కవితలు అందులో ఉన్నాయి. ఒక్కొక్క పేజి తిప్పుతూ గత స్మృతులను నెమరు వేసుకుంటున్నాడు. ఒక పేజి లో రాసిన కవిత చదువుతూ ఆగాడు.
కోయిల కుహు కుహు అంటే ఆమె మాటౌతుంది
సెల యేరు గలగల పారితే ఆమె పాటౌతుంది
పండు వెన్నెల ప్రభవిస్తే ఆమె నవ్వౌతుంది
రాయంచ హొయలు కురిపిస్తే ఆమె నడకౌతుంది
ఇలా సాగిన ఆ కవిత చదువుతూ నాలుగు దశాబ్దాలు వెనక్కి వెళ్ళి పోయాడు.
——-///——-
పార్వతీశం స్వంత ఊరు సోంపేట. శ్రీకాకుళం జిల్లాలో ఒక పెద్ద పల్లెటూరు. దసరా తరువాత వచ్చిన ఆ పౌర్ణమి ని 'గౌరీ పౌర్ణమి' అని అంటారు. కన్నె పిల్లలు గౌరీ పున్నమి నోములు నోస్తే తొందరగా మంచి మొగుడు దొరుకుతాడని నమ్మకం. గౌరీ పూజ మొదట్లో గౌరమ్మ పాటలు పాడి ఆఖరిగా హారతి ఇచ్చినప్పుడు పాడే “జయ మంగళం గౌరీ జయ మంగళం, జయ మంగళం నిత్య శుభ మంగళం” పాట, ఆ సంవత్సరం ‘కామాక్షి’ పాడుతుంటే ఆపాట విన్న పార్వతీశం మంత్ర ముగ్ధుడయ్యాడు.
ఆ పున్నమిని 'జూదాల పున్నమి' అని కూడ అంటారు. ఆ రోజున జూదం ఆడక పోతే గాడిద కడుపున పుడతారన్నది అక్కడి వారి ప్రగాఢ విశ్వాసం. పార్వతీశం అందరి అబ్బాయిల్లా 'చీట్ల పేక' ఆడకుండా ఇంట్లోనే 'అష్టా చమ్మ' ఆట తో సరి పెట్టుకునే వాడు. తమ పక్కింట్లో ఉండే మేన మామ పిల్లలు సరోజ, సురేష్ మరియు ఎదురింట్లో ఉండే కామాక్షి లతో కలిసి ఆ సంవత్సరము కూడ 'అష్టా చమ్మా' ఆటకు రెడీ అయ్యాడు.
మేన మామ కూతురు సరోజ తన కన్నా అయిదేళ్ళు చిన్నది. అందరు తన పెళ్ళాం అని ఆట పట్టిస్తుంటారు. కాని తన మనసులో నిండి ఉన్న దేవత మాత్రం కామాక్షి. సంవత్సరం క్రితం కామాక్షి వాళ్ళు తమ ఎదురింట్లోకి వచ్చినప్పటి నుండి ఆమె పై మనసు పడ్డాడు. సైగలు, ఎదురు చూపులు తప్ప మనసు విప్పడానికి అవకాశం దొరకలేదు. ఎదురింట్లో ఉండే కామాక్షి సరోజకు మంచి స్నేహితురాలు. ఏ పని చేసినా ఎక్కడికి వెళ్ళినా ఇద్దరు కలిసే వెళ్ళే వాళ్ళు జంట కవుల్లాగా. తనకు సరోజ అంటే ఇష్టమే గాని కామాక్షి అంటే ఇంకా ఇష్టం. కామాక్షి ఎక్కువగా మాటలాడదు. మాటలాడినా తల దించుకునే. కుందనపు బొమ్మ. ఆమె కనులను చూసి కలువ రేకులు తీర్చి దిద్దాడేమో ఆ బ్రహ్మ అనిపిస్తుంది. ఆ కళ్ళను చూసిన ఏ కళ్ళను ఆ కళ్ళు తమనుంచి తిప్పుకోనివ్వవు. మెరిసే మేని ఛాయ ఆమె సొంతం. అమరశిల్పి శిల్ప కళా పటిమకు ఆమె ఒక మచ్చు తునక. కామాక్షి ని ఒక సారి చూసిన వారు ఎవరైనా రెండో సారి చూడకుండా ఉండరు. పార్వతీశం కు లోలోపల ఆమె పై ఉన్న ఇష్టం కాస్త ప్రేమ గా మారి కవితల రూపం లో ఆ డైరీ కెక్కింది.
——-///——-
"సరోజ, మీ ఫ్రండ్ ఇంకా రాలేదేం?" అన్న పార్వతీశం ప్రశ్నకు బదులుగా "వచ్చేస్తుంది బావా అన్నీ సిద్ధం చెయ్" అని సమాధానమిచ్చింది సరోజ. పార్వతీశం అష్టా చమ్మా కు కావలసిన గవ్వలు పిక్కలు అన్నీ సిద్ధం చేసి సరోజ వాళ్ళ ఇంటి డాబా పైకి ఎక్కి కూర్చున్నాడు. ఆ పున్నమి నాటి పండు వెన్నెల ధార ప్రేమ లోగిళ్ళలో ప్రణయ ధారలు కురిపిస్తున్నట్టుంది. మధ్య మధ్యలో ఎక్కడి నుండో వస్తున్న మేఘాలు జాబిలితో దోబూచులాడుతున్నాయి. పార్వతీశం ప్రేమ మందిరంలో కొలువు దీరిన కామాక్షి కలవర పెడుతుంది. పెద్ద వాళ్ళు భోజనాలు చేసి పడుకున్నారు. ఇంతలో సరోజ వెళ్ళి కామాక్షి ని పిలుచుకొని వచ్చింది. సురేష్ కూడ రావడం తో ఆట మొదలెట్టారు. సరోజ, కామాక్షి ఒక టీం. పార్వతీశం, సురేష్ ఒక టీం. పార్వతీశం ఎదురుగా సురేష్ కూర్చున్నాడు. ఒక వైపు సరోజ ఇంకో వైపు కామాక్షి కూర్చున్నారు. పార్వతీశం కు ఆట పై కన్నా కామాక్షి పైనే మనసు లగ్నమైంది. ఆమెనే ఓరగంట చూస్తూ, ఊహల్లోకి జారుకున్నాడు. తనకు ఉద్యోగం రాగానే అమ్మా నాన్నకు చెప్పి కామాక్షిని తన దాన్ని చేసుకోవాలి. ఈ రోజు ఎలాగైనా కామాక్షి తో తన మనసులోని మాట చెప్పాలనుకున్నాడు. ఇంతలో మేఘాలు కమ్ముకున్నాయి. ఆట మంచి రంజుగా సాగుతుండగా కరెంట్ పోయింది.
"కొవ్వొత్తి వెలిగించి పట్టుకురా సరోజ. సురేష్ నువ్వు కూడ వెళ్ళి అక్కకు హెల్ప్ చెయ్యి" అని పార్వతీశం తెలివిగా ఇద్దరినీ పంపించేసాడు అక్కడి నుండి. ఎలా తన మనసు విప్పాలో అర్థం కాలేదు కొంతసేపు అతనికి. భయపడుతూ మెల్లగా కామాక్షి చెవిలో గుసగుస లాడాడు "ఐ లవ్ యు" అని. ఇంతలో కరెంట్ రావడంతో తేరుకున్నారిద్దరు. సరోజ, సురేష్ కొవ్వొత్తి వెలిగించి తెచ్చారు. ఆట మళ్ళీ మొదలైంది. రాత్రి 12 గంటల వరకు ఆడిన తరువాత వెళ్ళి పోయారు. వెళ్ళి పోతూ కామాక్షి తన వైపు తిరిగి చెయ్యి ఊపడం గమనించాడు పార్వతీశం.
——-///——-
రోజు రోజు కు ఇద్దరి మనసుల మధ్య ప్రేమానుబంధం పెరుగుతూ వస్తుంది. ఒక రోజు పార్వతీశం ఉదయం లేస్తూనే బయటికి వచ్చినప్పటికి కామాక్షి గుడికి వెళ్తూ కనిపించింది. అది మంచి శుభ శకునం గా భావించిన పార్వతీశం ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న ఉద్యోగ శుభ వార్త ఈ రోజు వస్తుందేమో అనుకున్నాడు. అనుకున్నట్టు గానే మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో పోస్ట్ మాన్ ఇష్ట దైవంలా ప్రత్యక్షమయ్యాడు. వరాల శుభ వార్త ను మోసుకొచ్చాడు. ఆనందభరితుడైన పార్వతీశం గట్టిగా 'అమ్మా నాకు ఉద్యోగమొచ్చింది' అని అరిచాడు. ఆ అరుపుకు కామాక్షి బయటికి వచ్చింది.
"గుడికి వెళ్ళి రారా" తల్లి రాధమ్మ సంతోషం గా అన్నదే తడవుగా పార్వతీశం డాబా పైకి ఎక్కి కామాక్షికి సైగ చేసాడు గుడికి రమ్మని. పక్క వీధిలోని శివాలయం కు బయలు దేరి వెళ్ళాడు. కొద్ది సేపటికి కామాక్షి కూడ వెళ్ళింది. సరోజ పెద్దనాన్న గారింటికి ఇచ్చాపురం వెళ్ళడం వలన, కామాక్షికిది మంచి తరుణం పార్వతీశంను ఒంటరిగా కలవడానికి. గుడి పక్కనే ఉన్న కోనేటి గట్టు పై ఇద్దరు కూర్చున్నారు. ఇరు హృదయాలలో ఒకటే అలజడి. మాట పెదవి దాటడం లేదు.
"కామాక్షీ, నేనంటే ఇష్టమేనా? నన్ను పెళ్ళి చేసుకుంటావా? అడిగాడు పార్వతీశం. ఆమె మంత్ర ముగ్ధురాలిలా తలూపింది తన ఇష్టాన్ని తెలియ జేస్తూ .
"కామాక్షీ, నేను వెళ్ళి ఉద్యోగంలో చేరాక వీలు చూసుకుని వచ్చి మా అమ్మ నాన్న దగ్గర మన పెళ్ళి విషయం చెబుతాను" అంత వరకు జాగ్రత్తగా ఉండు.
“అలాగే” అంటూ తల ఊపింది గాని కామాక్షి లోలోపల చాలా బాధ పడుతుంది. "ఎన్నాళ్ళు ఈ ఎడబాటు? నేను భరించలేను" అని మదన పడింది. "ఒక్క నెల ఓపిక పట్టు" అంటూ అనునయించాడు పార్వతీశం.
——-///——-
పార్వతీశం వెళ్ళి నెల రోజులు కావస్తుంది గాని అతని జాడ లేదు. అతనికి అశ్వారావు పేటకు దగ్గర్లో ఒక పల్లెటూరిలో బ్యాంకు లో పోస్టింగ్ ఇచ్చారు. డిశెంబర్ నెల కావడముతో బ్యాంకు వార్షిక ఖాతాల ముగింపు పనులలో సెలవు దొరక్క రాలేక పోయాడు.
"ఎల్లుండి నీ పెళ్ళి చూపులు నిన్ను చూడడానికి బరంపురం నుండి వస్తున్నారు" అన్న తల్లి మాటలకు ఉలిక్కి పడింది కామాక్షి. కాని ఏమి చేయలేని నిస్సహాయత. ఏమి చెయ్యాలో పాలుపోవడం లేదు. గుడి సమీపంలో ఉన్న బాలరాజు దగ్గరికి వెళ్తే ఏమైనా సహాయం చేస్తాడేమోనని తలచి అక్కడికి వెళ్ళింది. బాలరాజు పార్వతీశం కు దూరపు బంధువు. వీరిద్దరి ప్రేమ వ్యవహారాన్ని చాల రోజుల నుండి గమనిస్తున్నాడు. బాలరాజు కు తన పెళ్ళి చూపులు విషయం చెప్పి "బాలరాజు, నువ్వెలాగైనా నాకు హెల్ప్ చెయ్యాలి. మనం రేపు పార్వతీశం దగ్గరికి వెళ్ళాలి" అని చెప్పింది.
ఆ ఊరిలో ఉన్న చాల మంది కుర్రాళ్ళలాగే, బాలరాజు కూడ కామాక్షి పై మోజు పడ్డ వాడే. ఈ రూపంలో తనకు అవకాశం వచ్చిందని భావించాడు. ఈ ఛాన్స్ మిస్ అవకూడదనుకుని "అలాగే కామాక్షీ..., కాని ఇళ్ళు విడిచి వెళ్తే మళ్ళీ మీ అమ్మా నాన్న నిన్ను రానివ్వరు కనుక నీ సామాన్ల తో పాటు ఇంట్లో దొరికిన డబ్బులు, బంగారం కూడ పట్టుకుని బయలుదేరు. తెల్లవారి జామున నాలుగ్గంటలకి శివాలయం కు కుడి ప్రక్కనున్న ప్రహరీ గోడ వద్దకి రా, నేను ఆటో బేరమాడి తెస్తాను. బస్సు స్టాండ్ లో బస్సెక్కి పలాస వెళ్ళి ఏదో ఒక ట్రైన్ పట్టుకుందాం" అని చెప్పాడు.
ఆ రాత్రంతా బాలరాజు కు నిద్ర పట్టలేదు. అతని బుర్ర లో ఒక దురాలోచన రూపు దిద్దుకుంది. కాని ‘దైవ నిర్ణయం వేరుగా ఉంది’ అన్నది తెలియక, కామాక్షిని ఎలాగైనా లొంగదీసుకోవాలని “గాలిలో మేడలు కట్టాడు”.
———///——-
అందరు నిద్ర పోయారు. కాని కామాక్షికి నిద్ర పట్టలేదు. మూడు గంటల సమయంలో లేచి అన్ని సర్దుకుంటుండగా వీధి చివర కుక్కలు మొరగటం మొదలు పెట్టాయి. దానితో ఆ వీధిలో చాల మందికి మెలకువ వచ్చింది. కామాక్షి వాళ్ళ నాన్న గారు తన టిఫిన్ హోటల్ కు సిద్ధం కావడానికి లేచి కూర్చున్నారు. అనుకున్న ప్లాను జరగలేదు. కామాక్షి నిస్సహాయురాలిగా నిదురలోకి జారుకుంది.
ఉదయం లేటు గా లేచిన కామాక్షి తొందరగా స్నానం ముగించి గుడికి వెళ్తానని చెప్పి ఆ నెపంతో బాలరాజుని కలవడానికి బయలు దేరింది.
"ఏమిటిది కామాక్షి, ఇలా చేసావేమిటి? " బాలరాజు ప్రశ్న. "సారీ బాలరాజు" అని చెప్పి రాత్రి జరిగిన విషయం చెప్పింది. అంతా విన్న బాలరాజు "సరే, ఈ రోజు రాత్రికి పది గంటలకు లాస్ట్ బస్ లో బయలుదేరి పలాస వెళ్దాం. అక్కడ పదకొండు గంటలకి ఒక ట్రైన్ ఉంది. డైరెక్టు గా ఖమ్మం వెళ్ళిపోదాం" అని చెప్పాడు. "రాత్రి పది గంటలకు బయలు దేరడం కష్టం కదా, ఒక పని చెయ్యి, నీ హండ్ బ్యాగు లో డబ్బులు బంగారం సర్దుకొని ఫస్ట్ షో సినిమాకని వచ్చెయ్. సినిమా అయిపోయిన తరువాత అటునుండటే వెళ్ళి పోదాం" బాలరాజు చెప్పినట్లే కామాక్షి ఆరోజు వీధి చివరిలో నున్న ఇంకో ఫ్రండ్ తో కలిసి ఫస్ట్ షో సినిమా కెళ్తున్నానని ఇంట్లో అబద్ధం చెప్పి సినిమాకెళ్ళింది. ఏ క్షణాన ఇళ్ళు విడిచిపెట్టిందో గాని అదే ఆఖరి క్షణం అవుతుందని అనుకోలేదు కామాక్షి. “తాను ఒకటి తలిస్తే దైవమింకొకటి తలచినట్లు”, విధి కామాక్షిని వెక్కిరించింది.
——-///——-
మరునాడు ఉదయం ఊరంతా గగ్గోలు పెట్టింది. బాలరాజు, కామాక్షి ఇద్దరు కలిసి లేచి పోయారని. కామాక్షి వాళ్ళ నాన్న గారు రాబోయె పెళ్ళివారికి వీలు కాదని కబురంపించారు. తరువాత తెలిసిన వాళ్ళనందరిని అడిగారు. ఊళ్ళో ఉన్న కొంతమంది యువకులని పలాసకు పంపించి వెదికించారు. గాని ప్రయోజనం లేక పోయింది. కొన్నాళ్ళు ఏడ్చి ఏడ్చి చిక్కి శల్యమైన ఆ తల్లిదండ్రులకు కాలమే ఉపశమనమిచ్చింది.
ఒక వారం పోయిన తరువాత ఇంటికి వచ్చిన పార్వతీశం కు విషయం తెలిసి చాల బాధ పడ్డాడు. కామాక్షి ఇలా చేసిందంటే నమ్మలేదు. కామాక్షి ప్రేమ లోని నిజాయితీ తనకు బాగా తెలుసు. అలాంటి కామాక్షి ‘మిన్ను విరిగి మీద పడినా’ ఇలా చెయ్యదు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది అనుకుని తనకు వీలైనంతమంది ఫ్రండ్స్ ద్వారా ఏమైనా సమాచారం తెలుస్తుందేమోనని ప్రయత్నించాడు. కాని లాభం లేక పోయింది. రెండు రోజులు ఇంట్లో ఉన్న పార్వతీశం కు ఏమి చెయ్యాలో అర్ధం కాక పిచ్చెక్కింది. మూడో రోజు ఉదయాన్నే బయలుదేరి వెళ్లి పోయాడు, అమ్మ ఎంత బ్రతిమిలాడినా వినకుండా.
రెండేళ్ళు బాధపడిన పార్వతీశం తరువాత ఇంట్లో ఒత్తిడికి తలొగ్గి సరోజతో పెళ్ళికి సిద్ధపడ్డాడు. అందుకోసం తమ స్వంత ఊరికి బదిలీ పై వచ్చాడు పార్వతీశం. అక్కడికి కొద్ది రోజుల తరువాత ఊర్లోకొచ్చిన బాలరాజు చెప్పిన వరకు ఎవరికి తెలియలేదు పార్వతీశం కామాక్షి ల ప్రేమ గాథ. అది విన్న సరోజ కూడ చాల బాధ పడింది. ఇటు చూస్తే బావ అటు ప్రాణ స్నేహితురాలు ఇద్దరి ప్రేమ భగ్నమైనందుకు. అసలేమి జరిగిందో చెప్పమని పార్వతీశం సరోజ ఇద్దరూ బాలరాజుని అడిగారు.
——///——-
బాలరాజు చెప్పడం ప్రారంభించాడు. “పార్వతీశం దగ్గరికి తీసుకెళ్ళమని కామాక్షి అడిగింది. సరేనని ఆ రోజు రాత్రి ఊరు విడిచిన మేము వేకువజామునే పలాసలో ఖమ్మంకు టిక్కెట్ కొనుక్కొని ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఎక్కాము. రాత్రంతా నిద్ర లేని కారణముగా మధ్యాహ్నము విజయవాడలో భోజనం తిన్నాక నిద్ర పట్టేసింది. ఖమ్మంలో దిగలేక పోయాం. మళ్ళీ మాకు మెలకువ వచ్చేసరికి చీకటిగా ఉంది. ఎక్కడ ఉన్నామో కూడ తెలియలేదు. జనరల్ బోగీ అవ్వడం వలన జనాలు క్రిక్కిరిసి ఉన్నారు. ఎటూ వెళ్ళలేని పరిస్థితి. ఎవరో చెప్పారు కాజీ పేట దాటిందని. ఇంక చేసేది లేక హైదరాబాద్ లో దిగుదామని అనుకుని కూర్చున్నాము. ఆ రోజు ట్రైన్ బాగా లేట్ అవ్వడం వలన రాత్రి పది గంటలకి హైదరాబాద్ చేరుకున్నాం. ఆ రాత్రికి స్టేషన్ ఎదురుగా హోటల్ రూం తీసుకుని తెల్లవారుతూనే బస్ పట్టుకుని ఖమ్మం వెళ్ళవచ్చుననుకుని అక్కడ హోటల్ రూం తీసుకున్నాం. స్నానం చేసి రాత్రి తినడానికేదైనా తెద్దామని బయటకు వెళ్ళాను. నేను వెళ్ళిన తరువాత తలుపు వేసుకుని కామాక్షి స్నానము చేయడానికి బాత్ రూం కు వెళ్ళింది. నేను తిరిగొచ్చేటప్పటికి ఆ హొటల్ పై పోలీసు రైడింగ్ జరిగింది. పోలీసులు మారూం తలుపు బాదుతున్నారు. ఇంతలో కామాక్షి తలుపు తెరిచింది. మేము ఎంత బ్రతిమాలినా పోలీసులు మా మాట విన లేదు. ఇద్దరినీ ఇంకా కొంత మందితో కలిపి జీప్ ఎక్కించి తీసుకు పోయారు. మగ వారిని వేరే సెల్ లో పెట్టారు. ఆడవారిని ఏమి చేసారో తెలియలేదు. మగ వారిలో చాల మంది జామీను తెచ్చుకుని మరుసటి రోజు వెళ్ళిపోయారు. నాకు జామీను ఇవ్వడానికి అక్కడ తెలిసిన వారు ఎవ్వరు లేక పోవడం వలన ఆ రోజంతా ఉంచి రాత్రి విడిచిపెట్టారు. పోలీసు స్టేషన్ కు వెళ్ళి అక్కడున్న వారిని కామాక్షి విషయమై వాకబు చేయగా తెలియదు పొమ్మన్నారు. ఏమి చేయాలో పాలు పోక, ఊర్లోకి వస్తే తంతారేమోనని భయపడి, మా దూరపు బంధువు ఒకాయన పూనే లో ఉన్నాడు ఆయన దగ్గరకు వెళ్ళి పోయాను. అక్కడే చిన్న ఉద్యోగం చేసుకుంటున్నాను". బాలరాజు చెప్పింది నమ్మాలో లేదో తెలియక తికమకపడ్డాడు పార్వతీశం. ఎందుకంటే బాలరాజు “జ్వరం కూడా అరువివ్వడు”. అలాంటి వాడు కామాక్షికి సాయం చేయడానికి సిద్ధపడ్డాడా! అని ఆశ్చర్యపోయాడు. కానీ నమ్మక తప్పని పరిస్థితి.
——-///——-
పోలీసు స్టేషన్ లో కామాక్షి కుమిలి కుమిలి ఏడుస్తుంది. ఆమెనెవ్వరు పట్టించుకోలేదు. ఒక లేడీ కానిస్టేబుల్, సీతక్క ఆమెను గమనించింది. అక్కడున్న అందరి మధ్యలో కామాక్షి “కాకి గూటిలో కోకిల పిల్లలా” అనిపించి అడిగింది “నీకు జామీను ఇవ్వడానికి ఎవరైనా వస్తారా” అని. కాని ఆమె నోట మాట రాలేదు. సీతక్క స్వంత ఊరు విశాఖపట్నం. నాంపల్లి పోలీస్ స్టేషన్ లో పని చేస్తుంది. మెల్లగా అనునయించి కామాక్షిని అడిగితే కామాక్షి తన కథ చెప్పింది. తమ ఊరికి పంపించే ఏర్పాట్లు చేస్తానని సీతక్క చెప్పినా తిరిగి సోంపేట వెళ్లడానికి కామాక్షి ఇష్టపడలేదు. జాలి పడ్డ సీతక్క తమ స్టేషన్లో స్వీపరుగా పని చేస్తున్న ఫాతిమాకు కామాక్షిని అప్పగించి ఆమె సంరక్షణకు కొంత డబ్బు కూడా ఇచ్చింది.
ఫాతిమా సంరక్షణలో కొద్ది కొద్దిగా కుదుట పడ్డ కామాక్షి తమ టిఫిన్ హోటల్ అనుభవంతో అక్కడ ఫాతిమా ఇంటి వద్దనే “సీతక్క టిఫిన్స్” పేరుతో టిఫిన్ సెంటర్ ను ప్రారంభించింది. జీవితంలో దెబ్బ తిన్న కామాక్షి రాటుదేలింది. రాబోయే కాలాన్ని చాలెంజింగ్ గా తీసుకుని తన వ్యాపారాన్ని అభివృద్ధి పథంలో నడిపించింది. రిటైర్మెంట్ కు దగ్గరలో సీతక్క విశాఖపట్నంకు బదిలీ అయ్యింది. అప్పుడు కామాక్షి కూడా సీతక్కతో పాటు విశాఖపట్నం వెళ్లి పోయింది.
విశాఖపట్నంలో కూడా “సీతా పార్లర్” పేరుతో ఒక భోజన ఫలహార శాల స్టార్ట్ చేసిన కామాక్షి అనతికాలంలోనే మంచి పేరు సంపాదించుకుంది. మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిన వ్యాపారం ఆమెకు మంచి లాభాలను తెచ్చిపెట్టింది.
——-///——-
ఒక రోజు తమ బ్యాంక్ పని మీద విశాఖపట్నం వచ్చిన పార్వతీశం మధ్యాహ్నం లంచ్ కోసం “సీతా పార్లర్” కు వెళ్లి అక్కడ కేష్ కౌంటర్ లో కూర్చుని ఉన్న ఆమెను చూసాడు. ఆమె వయసు సుమారు ఏబయ్యేళ్ళు ఉండవచ్చు. కామాక్షిలా అనిపించినా, ఒక సర్వర్ ని అడిగి నిర్ధారించుకున్న తరువాత ఆమె దగ్గరకి వెళ్లి పలకరించాడు. పార్వతీశంను చూసిన కామాక్షికి దుఃఖం ఆగలేదు. లోపల తన పర్సనల్ రూమ్ లోకి వెళ్ళి పార్వతీశం ను రమ్మని పిలిచింది. ఇల్లు వీడిన నుండి తాను పడ్డ కష్టాలని వివరించి బోరున విలపించింది. పార్వతీశం కూడా చాలా బాధపడ్డాడు. కామాక్షి తల్లిదండ్రులు ఎలా తన కోసం విలపిస్తూ చనిపోయారో వివరించాడు పార్వతీశం. పార్వతీశం ఎంత బ్రతిమాలినా కామాక్షి సోంపేటకు రానని చెప్పింది. పార్వతీశం ద్వారా ఈ విషయం తెలుసుకున్న సరోజ కూడా చాలా బాధపడింది.
తరువాత కొన్నాళ్లకు పార్వతీశంకు ఒక ఉత్తరం వచ్చింది కామాక్షి నుండి. దానితో పాటు ఒక వీలునామా జత పరిచింది. తన యావదాస్తిని “కామాక్షి ఛారిటబుల్ ట్రస్ట్” కు రాసి, ఆ ట్రస్ట్ కు పార్వతీశంను ట్రస్టీగా నియమించింది.
తాను కేన్సర్ తో బాధపడుతున్నానని, ఈ ట్రస్ట్ అధ్వర్యంలో నాలాంటి విధివంచితుల కోసం ఒక అనాథ ఆశ్రమం స్థాపించమని కోరింది. ఆ ఉత్తరం అందుకున్న పార్వతీశం ఉత్తరక్షణాన విశాఖపట్నం బయలుదేరాడు. కాని అప్పటికే కామాక్షి తుదిశ్వాస విడిచింది.
పార్వతీశం, కామాక్షి కోరినట్లుగా, ఒక అనాథ ఆశ్రమం స్థాపించి దాని బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. “పతితులార, భ్రష్టులార, బాధాసర్పదష్టులార ఏడవకండేడవకండి” అన్న మహాకవి శ్రీ శ్రీ గారి వాక్యాల స్ఫూర్తితో, కామాక్షి ఆత్మ శాంతించేలా, జీవితంలో సర్వం కోల్పోయిన ఎంతోమంది అభాగ్యులకు ఆశ్రయం కల్పిస్తున్నాడు.
డైరీ చూస్తున్న పార్వతీశం కళ్ళు చెమ్మగిల్లాయి. “కామాక్షి లాంటి ఎంతోమంది ఆడపిల్లలు తమది కాని నేరానికి ఈ సమాజంలో విధి వంచితులుగా మిగిలిపోతున్నారు.” అని ఒక నిట్టూర్పు విడిచాడు.
——-///——-

