మల్లమాంబ - నాగమణి తాళ్ళూరి

mallamamba

సూర్యుడు పడమట దిక్కుకు వాలిపోతూ లోకానికి అరుణిమ రంగును అద్దినట్లుగా కనపడుతోంది. శయన మందిరపు గవాక్షం నుండి అల్లంత దూరాన కనపడుతున్న కోట బురుజును తిలకిస్తోంది మల్లమాంబ. ఆమెకెంతో ఇష్టమైన దినచర్యల్లో ప్రకృతి ఆరాధన ఒకటి. కానీ ఆ సమయంలో తన చెలికాడు కూడా తోడుంటే బావుంటుందని ఎంతగానో అనిపించినా వివాహం జరిగి మూడేళ్ళలో ఒక్కనాడైనా ఆమె మురిపెం తీరలేదు. రాజరికపు వ్యవహారాల్లో, ఎన్నో భాధ్యతల్లో తలమునకలై ఉండే మహరాజు ఆమె భర్త. సాధారణ స్త్రీలకు మల్లే భర్తతో గడపడం కుదరదని తెలుసామెకు. దూరపు కొండలు నునుపు అన్న చందాన పరదాల చాటున , మేలి ముసుగు మాటున భర్త రాక కోసం ఎదురు చూస్తూ కరిగిపోయే కలలెన్నో! తదేకంగా చూస్తూ ఉంటే కోట గోడలు రక్తపు మరకలతో నిండినట్లు అనిపించి ఒక్క క్షణం హృదయం జలదరించిందామెకు. " రాజరికం పులి మీద స్వారీ లాంటిది,ప్రతిక్షణమూ జాగరూకతతో ఉండక పోతే అది మనల్నే మింగేస్తుంది" తన తండ్రి చెప్పిన మాట గుర్తొచ్చి మనసంతా చేదుగా మారిపోయింది. గత కొద్ది రోజులుగా అలజడి చెలరేగుతోందామె అంతరంగంలో. తమ పొరుగు రాజైన వీరభధ్రుడు తమపై దండెత్తడానికి సమర సన్నాహాలు చేసుకుంటున్నాడనీ , సైన్యాన్ని సమాయాత్తం చేస్తున్నాడని విశ్వసనీయ సమాచారం అందింది. దక్షిణ భారతంలో ధాన్యకటకాన్ని రాజధానిగా చేసుకుని పాలించే ఉజ్వల వంశస్తుల్లో ఆరవ వాడు తన భర్త మహదేవుడు. తన తండ్రి హఠాన్మరణంతో రాజ్య పాలన చేపట్టినా శాంతి కాముకుడుగా ప్రజల బాగోగులు చూసే రాజుగా పేరు తెచ్చుకున్నాడు. పొరుగు వారితో స్నేహ బంధాన్ని బలపరుచుకునే ఉధ్దేశంతోనే ఉంటాడు ఎప్పుడూ. కానీ పచ్చని రాజ్యాన్ని చూసి కన్ను కుట్టిన పొరుగు రాజు వీరభధ్రుడు తమ రాజ్యంపై దండెత్తే ప్రయత్నాలు చేస్తున్నాడంట. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పాలించే ప్రభువులెవ్వరికీ యుధ్ధం వాంఛనీయం కాదు. దాని పర్యవసానాలు అత్యంత దారుణంగా ఉంటాయని తెలిసీ , తమ వీరత్వం ప్రదర్శనకో , రాజ్య విస్తరణ పేరుతో పొరుగు వారి పచ్చదనం చూడలేకో దండయాత్రలు సాగిస్తూ ఉంటారు రాజులు. చీకట్లు చిక్కగా ముసురుకున్నాయి.పరిచారికలు దీపాలు వెలిగిస్తున్నారు. వెలిగే దివ్వె వైపు తదేకంగా చూస్తూ "భగవంతుడా! ఈ చీకట్లను తరిమే చిరు దీపపు కాంతి వలె నీ దయను మాపై ప్రసరింపజేయి.ఉజ్వల వంశాన్ని కాపాడు" అంటూ పరమేశ్వరున్ని వేడుకుంది. మంత్రులతో , సైన్యాధిపతులతో సుధీర్ఘ సమావేశ అనంతరం అర్ధరాత్రి దాటాక అంతః పురం లోకి ప్రవేశించాడు మహ దేవుడు. ప్రధాన పరిచారిక , వృధ్ధురాలు అయిన రంగమ్మ మహ రాజుకు ధృష్టి దిగ తుడిచి పక్కకు తప్పుకుంది. భర్తను చూడగానే అవ్యాజ్యమైన అనురాగమూ , అప్పటి వరకూ అదిమి పెట్టుకున్న బేలతనమూ కలిసిపోయి ఉక్కిరిబిక్కిరి చేస్తుండగా" స్వామీ!" అంటూ అల్లుకుపోయింది మల్లమాంబ. చికాకులతో , ఆందోళనలతో అస్తవ్యస్తమైన మనసుపై ప్రియ సఖి చల్లిన పన్నీటి జల్లు పరవశింపజేయగా ఆమెను గుండెల్లో పొదువుకుంటూ "అంతః పుర కాంతలకు, అందునా మహారాణికి ఇంత పిరికితనం భావ్యమా దేవీ!" అన్నాడు లాలనగా. "మహరాణి కన్నా ముందు ఓ స్త్రీని , మీ భార్యను స్వామీ! " అంది కించిత్ బాధ నిండిన స్వరంతో. ఒక్క క్షణం మహదేవుని మోము వివర్ణమైంది. "యుధ్ధం తప్పదా ప్రభూ!" మహారాజు ఒడిలో తలనిడుతూ అడిగిందామె. "పరిస్థితులు చూస్తుంటే అలాగే ఉంది. మనపై రెండు సార్లు దండెత్తి, మన చేతిలో చావు దెబ్బ తిన్నా బుధ్ధి తెచ్చుకోకపోగా మనకు వ్యతిరేకంగా బలగాలను సమకూర్చుకుంటున్నాడని తెలుసు. అయినా ఉపేక్షించాను. గత రెండు సంవత్సరాలుగా వానలు లేక , పంటలు పండక ప్రజలు దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. శిస్తులు మాఫీ చేసి , తటాకాల నిర్మాణానికి , బావుల తవ్వకానికి ఖజానాలోని సంపద ఖర్చు అయిపోయింది. సైన్యం పైనా , ఆయుధాల పైనా దృష్టి పెట్టేంత వ్యవధి కానీ , విత్తం కానీ లేదు. ఇటువంటి విపత్కర స్థితిలో మనమున్నామనే సంగతి తెలిసే ఇప్పుడు ఉత్తర భారతాన్ని పాలిస్తున్న జాఫర్ ఖాన్ ప్రధాన అనుచరుడు , సైన్యాధ్యక్షుడు అయిన ఉస్మాన్ బేగ్ తో సంధి నెరిపి అతని సాయంతో మనపై విజయం సాధించాలని ఉవ్విళ్ళూరుతున్నట్లున్నాడు. దుర్మార్గుడూ , దుష్టుడూ అయిన ఆ జాఫర్ ఖాన్ సైన్యాధిపతి తో నెయ్యం ఎప్పటికైనా ప్రమాదమే అని పసిగట్ట లేకున్నాడు. ఉస్మాన్ బేగ్ సాయంతో మనల్ని జయించి రాజ్యం కైవసం చేసుకోవాలని చూస్తున్నాడు." భర్త మాటలు వినగానే వెన్ను జలదరించింది మల్లమాంబకు. "జాఫర్" ఆమె పెదవులు అస్పష్టంగా ఉచ్చరించాయి. అతని గురించి కర్ణాకర్ణిగా విని ఉన్నదామె. యుధ్ధ ఖైదీలను క్రూరాతిక్రూరంగా హింసించి చంపడంలోనూ , ఓడిన రాజుల సతీమణులను చెరబట్టడంలోనూ అతనికి పోటీ లేదు. ఒక్క సారి మల్లమాంబకు భవిష్యత్తు అగమ్యగోచరంగా కనుపించింది. ఉన్న దానితో తృప్తి పడక ఈ మానవులు ఎందుకో ఈ వెంపర్లాటకు పోతారు. యుధ్ధం వల్ల కలిగే నష్టం తెలియకనా ఆ వీరభద్రుడు కయ్యానికి కాలు దువ్వుతున్నాడు. గతంలో రెండు సార్లు తమ చేతిలో పరాభవింప బడ్డ అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలను కుంటున్నాడు కాబోలు. రక్తపాతం తో , వీర సైనికుల శవాల దిబ్బ మీద స్థాపించే రాజ్యం అతనికి సంతృప్తిని కలిగిస్తుందేమో! చిన్నగా నిట్టూర్చింది. కలవర పడ్డ మనసు కలత నిద్ర గూటికి చేరుతున్న వేళ టంగ్ , టంగ్ మంటూ ఘంటానాదం. అత్యవసర పరిస్థితుల్లో మహరాజును జాగరూక పరిచేందుకు ఏర్పాటు చేయబడినది. దిగ్గున లేచి కూర్చున్నాడు మహదేవుడు. ఉత్తరీయం సరి చేసుకుంటూ చరచరా ఏకాంత మందిరం దాటి సమావేశ మందిరం వైపుగా కదిలాడు. ఎడమ కన్ను అదరడం ఆరంభించింది మల్లమాంబకు. పరమేశ్వరుని ధ్యానించడంలో మునిగిపోయింది. ### ### ### ### "యుధ్ధ మేఘాలు దట్టంగా మన రాజ్యం పై కమ్ముకున్నాయి దేవీ! వీరభధ్రుడు తన సైన్యంతో సరిహద్దుల వెంబడి మోహరించబోతున్నాడని వేగుల సమాచారం. ప్రత్యక్ష యుధ్ధం కన్నా దొంగ దెబ్బకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఈమారు. ఉస్మాన్ బేగ్ తన సైన్యంతో వీరభధ్రునికి సాయం చేయడానికి వస్తున్నాడని తెలిసింది. సైన్యాన్ని ముందుండి నడిపించే భాధ్యత నాపై ఉంది. రణరంగానికి బయలుదేరుటకు అనుమతి నివ్వు దేవీ!" మహదేవుని పలుకులు పిడిబాకుల్లా మానస వధ చేస్తున్నా పంటి బిగువున సహిస్తూ చిరునవ్వును మొహాన పులుముకుని నుదుట తిలకం దిద్ది , హారతి ఇచ్చి విజయుడవై తిరిగి రమ్మని సాగనంపింది మల్లమాంబ. తల్లి మాణిక్యాంబ పాదాలను తాకి ఆశీర్వచనం స్వీకరించి యుధ్ధ భూమికి తరలాడు మహదేవుడు. అంతఃపురం ఒక్కసారిగా మూగబోయింది. ఏక భుక్తంతో గౌరీ దేవి ఉపాసన చేస్తోంది మల్లమాంబ. మాణిక్యాంబ ఆధ్వర్యంలో మహా రుద్ర హోమం , మృత్యుంజయ హోమాలు , మందిరాల్లో అభిషేకాలు , అర్చనలు , మహరాజు విజయం కోసం పూజలు జరుగుతున్నాయి. హోరాహోరీగా సాగుతున్న యుధ్ధంలో తమ సైనికులు వీరత్వాన్ని చూపుతున్నారని వేగుల ద్వారా సమాచారం అందుకున్న మల్లమాంబ హృదయం ఒకింత గర్వంతో ఆనందంతో పులకరించిపోయినది. మరునాడు సాయంకాలానికి వాతావరణంలో పెను మార్పు. మల్లమాంబ పరిచారిక కమల నిస్సత్తువ ఆవహించినట్లుగా అడుగులు తడబడుతుండగా ధ్యానంలో నిమగ్నమై ఉన్న మల్లమాంబను చూసి కంట తడి పెడుతూ "అమ్మా! మన ఆశలు అడియాసలు అవుతాయనిపిస్తోందమ్మా! వీరభధ్రుని సైన్యం మన సైనికులను చిత్తు చేస్తున్నారంట తల్లీ! ఓటమి వైపుగా మన ప్రయాణం సాగుతోందేమోనమ్మా"అంది. మల్లమాంబ కనులు గట్టిగా మూసుకుంది. రెప్పల చాటు నుండి రెండు కన్నీటి బొట్లు ఆమె ఒడిలో పడి ఇంకిపోయాయి. ఆమె తన చేత్తో ఉదరాన్ని నిమురుకుంది. వంశాంకురం జీవం పోసుకుంటున్న విషయం నిన్ననే తెలిసింది. ఈ శుభవార్త మహరాజుకు తెలియజెప్పే అదృష్టం ఉందో లేదో తనకు. నిర్వేదమైన మనసును ఆవహించగా నిస్సహాయత ఆమె వదనంలో కనిపించింది. "కమలా! నావెంట వేగమే నడువ్" అంటూ బిరబిరా పరుగుదీసింది. అంతః పుర రక్షణకు నియోగించబడ్డ సిబ్బంధి , సైనికులు ఆమె ముందు నిముషాల్లో నిలబడ్డారు. "వీరులారా! ఇన్ని రోజుల మీ సేవలకు ఎంతో ఋణపడి ఉన్నాం. ఆపద సమీపిస్తున్నది. విజయమో , వీరస్వర్గమో తెలియని అయోమయ స్థితి దాపురించినది. అంతఃపుర కాంతలను , బాలికలను ఇక్కడి నుండి సురక్షిత ప్రాంతాలకు చేరవేసే భాధ్యత తమ భుజాలపై ఉన్నది,వేగమే కదలండీ" అంటూ వారిలో ఉడుకు రక్తం నింపి నిజమైన మహరాణి వలే రాజ్యభారాన్ని భుజాలపై వేసుకున్నది. "రత్నమాంబా ! సుశీలా! మయూఖా!అంతఃపురం వెనక వైపున ఉన్న మద్ది వృక్షం పక్కనే సొరంగ మార్గం ఉన్నది. దాని గుండా ఓ నాలుగు ఘడియలు పయనిస్తే అడవిని చేరవచ్చు. అక్కడి నుండి ఉత్తరం వైపుగా సాగిపోండి. మనకు అనుకూలురు‌, అయిన భద్రావతి రాజ్యాన్ని సమిపిస్తారు. ఈ రాజ ముద్రను చూపి ఆశ్రయం పొందండి. పరిస్థితులు చక్కబడగానే వెనక్కి పిలిపిస్తాను" అంటూ ఆడపడుచులను సమాయాత్తం చేసి సాధారణ దుస్తులతో , ఇద్దరేసి పరిచారికలు , నలుగురు సైనికులతో వారిని కోట దాటించింది. "అత్తా!" అంటూ కాళ్ళు చుట్టేసుకున్న ఆడపడుచు సుశీల బిడ్డ శివ దేవుడ్ని గుండెలకు హత్తుకుని కరువుదీరా ఏడ్చింది మల్లమాంబ. పురిటికై పుట్టింటికి వచ్చిన రత్నమాంబ కు వీడ్కోలు పలుకుతోంటే గుండెను ఎవరో కత్తితో పరపరా కోసినంత వేదన రగిలిందామెలో. అత్త గారినీ , ఆమె సవతులను , వారి ఆడపిల్లలనూ మరో మార్గం ద్వారా మరో దిక్కునకు మరల్చింది. మిగిలిన సైనికులతో , అంతఃపురంలో యుధ్ధ సమాచారం కోసం వేచి చూస్తోంది. మూడవ రోజు అపరాహ్న వేళ దాటి ఓ ఘడియ దాటే వరకు వర్తమానం అందినది. యుధ్ధంలో ఓటమి చవిచూడక తప్పలేదని. మహదేవ మహారాజు శత్రువుల చేత చిక్కినాడని. శత్రువులు కోటను ఆక్రమించడానికి మరెంతో సమయం లేదనీ! రెపరెపలాడుతున్న ఆశ అడుగంటిపోయింది. ఎక్కడో మినుకుమినుకుమంటున్న నమ్మకం కడగంటిపోయింది. "అమ్మా! మల్లమాంబా! బయల్దేరు తల్లీ! ఇక్కడ ఇక ఉండటం ఎంత మాత్రమూ సురక్షితం కాదు. కోటను ఆక్రమించుకున్న మరుక్షణం ఆ నీచులు అంతఃపురం వైపుగా సాగుతారు.అంతఃపుర కాంతలను చెరబట్టడంలో పైశాచికానందం పొందుతారు." రంగమ్మ ప్రాధేయపడుతోంది. మల్లమాంబ లేచి నిలబడింది. చేత్తో తన ఉదరాన్ని ఒక్కసారి తడుముకుంది. ఉవ్వెత్తున ఎగసిపడే ఆవేదనను దిగమింగుతూ "రంగమ్మా! కోటను వీడి వెళ్ళేలోపు ఆఖరు సారి పరమేశ్వరునికి జరిగే హోమం తిలకిస్తాను , ఏర్పాటు చెయ్" అని ఆజ్ఞాపించింది. సుంగధ ద్రవ్యాలతో కూడిన పన్నీటి స్నానమాచరించి , పట్టు చీర ధరించింది.నవరత్న ఖచితమైన ఆభరణాలు ధరించి సాక్షాత్తూ ఆ పరమేశ్వరిలా నడయాడుతూ వచ్చి హోమ గుండం ముందు నిలబడింది. రెండు చేతుల నిండుగా ద్రవ్యాలను తీసుకుని అర్పిస్తూ రెండు చేతులూ జోడించి ఆ అగ్ని దేవునికి నమస్కరిస్తూ "భగవంతుడా! ముక్కుపచ్చలారని పసికూనలైన ఆడపిల్లల తాళి బొట్ల మీద , మట్టిలో కలిసిన ఆశల మీద, ఏరులై పారుతున్న రక్తం మీద , పుత్ర శోకంతో తల్లడిల్లే తల్లల కడుపు కోత మీద ,అనాధలుగా మిగిలిపోయే చిన్నారుల కలల సౌధాల మీద కట్టబడే సామ్రాజ్యాలు కూలి పోవు గాక. పరాయి సంపద , పరాయి రాజ్యం , పర స్త్రీ మీద వ్యామోహంతో దండయాత్రలు చేసే రాజ్యాల పునాదులు చరిత్రలో మిగలకుండు గాక. ఈ లోకాన్ని చూడకుండానే తిరిగిరాని లోకాలకు తరులుతున్న నా వంశాంకురం , మృత్యువుకై ఎదురు చూస్తూ శత్రువు చేతిలో చిక్కిన నా భర్త ఉసురు తగిలి ఈ పాపాత్ముల దురాగతాలు నేలకలిసి పోవు గాక!" అంటూ ఒక్క ఉదుటున మంటల్లోకి దూకి తన ఆశలతో పాటే సజీవ దహనమైపోయింది మల్లమాంబ. ఇరవై ఒక్క వసంతాలకే నూరేళ్ళు నిండిన మల్లమాంబ.

మరిన్ని కథలు

Cow and Tigers
ఆవు - పులులు
- యు.విజయశేఖర రెడ్డి
Trikala Vedi - Bhojaraju Kathalu
బొమ్మలు చెప్పిన కమ్మని కథలు
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
laziness is a sin
సోమరితనం అరిష్టం
- సరికొండ శ్రీనివాసరాజు‌
Toy Stories - Sadgunavathi
బొమ్మలు చెప్పిన కమ్మని కథలు
- బెల్లంకొండ నాగేశ్వరరావు.
Laughing Club
నవ్వుల లోకం
- భాస్కర్ కాంటేకార్
Toy Stories - Rudra Bhavani
బొమ్మలు చెప్పిన కమ్మని కథలు
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
Lost Words
చివరి మాటలు
- దార్ల బుజ్జిబాబు