
“నానమ్మా..! ” అంటూ శారదమ్మ గదిలోకి సుడిగాలిలా వచ్చింది సుమేధ.
“నాకు ఐదువందల నోటు దొరికింది” అంది. సుమేధ ముఖంలో వేయి దీపాల కాంతి, పెదవులపై చిరునవ్వు తొణకిస లాడుతోంది.
“ఎక్కడ దొరికింది సుమీ” ఆదుర్దాగా అడిగింది శారదమ్మ.
సుమేధ నాల్గవ తరగతి చదువుతోంది. తన తల్లి దండ్రుల దగ్గరి కంటే నానమ్మ దగ్గరే చనువెక్కువ. శారదమ్మ చెప్పే కథలంటే చెవి కోసుకుంటుంది.
“నేను బడికి వెళ్ళి వస్తుంటే దారిలో దొరికింది నానమ్మా” నోటును మురిపెంగా తన చిట్టి చేతి వేళ్ళళ్ళో తిప్పుకుంటూ చూపించింది సుమేధ. ఆమె కళ్ళు నోటు వెంబడి బండి చక్రాల్లా తిరుగసాగాయి.
“అది ఎవరిదో పాపం!. పోగొట్టుకుని ఎంత బాధపడ్తున్నారో ఏమో..! ఒక పని చెయ్యి సుమీ”
“ఏంటి నానమ్మా..!”
“నీకు నోటు ఎక్కడ దొరికిందో అక్కడికే తిరిగి వెళ్ళు. కాసేపు వేచి చూడు. ఎవరైనా తాము పోగొట్టుకున్న నోటు కోసం వెదుక్కుంటూ వస్తే వారికివ్వు. ఎవరూ రాకుంటే నేరుగా గుళ్ళోకి వెళ్ళి హుండీలో వెయ్యి. హుండీలోని డబ్బు ప్రజల శ్రేయస్సు కోసమే వాడుతారు”
“అలాగే నానమ్మా.. వస్తాను” అంటూ మళ్ళీ అంతే వేగంగా వెనుతిరిగి పరుగెత్తింది సుమేధ.
పది నిముషాలు వేచి చూసింది. రోడ్డు పక్కకు ఉన్న బడ్డీకొట్టు వద్ద వాకబు చేసింది. ఎవరూ రాలేదని.. రావడం లేదని నిర్థారణ చేసుకుని రామాలయానికి దారి తీసింది సుమేధ.
“రా బేబీ.. రారా..! శ్రీరామచంద్ర ప్రభువుల ఆశీస్సులు తీసుకుందామని వచ్చావా..!” అంటూ ఆప్యాయంగా పలుకరించాడు పూజారి.
“నాకు దారిలో ఐదువందల రూపాయల నోటు దొరికింది పూజారిగారూ. దాన్ని హుండీలో వేయమంది మా నానమ్మ. అందుకే వచ్చాను” అంటూ నోటును హుండీలో వేసింది సుమేధ.
“మీ నానమ్మ మంచి సలహా ఇచ్చింది. ఆవిడ గారి పేరేంటమ్మా” అంటూ ముద్దు, ముద్దుగా అడిగాడు పూజారి.
“శారదమ్మ గారు”
“ప్రముఖ రచయిత్రి చంద్రగిరి శారదమ్మగారి మనవరాలివా!” అంటూ సుమేధను తన దగ్గరకి తీసుకున్నాడు. వారి పేరు తెలియని వారు లేరు బేబీ” అంటూ శారదమ్మను పొగడసాగాడు. “మీ నానమ్మ గురించి ఈరోజు వార్తాపత్రికలన్నీ ప్రశంసిస్తూ రాశాయి”
సుమేధ ఆశ్చర్యపోయింది. తనకు నానమ్మ మంచితనం గురించే తెలుసు గాని రచయిత్రిగా తెలియదు. నానమ్మ గొప్పతనం గురించి ఇంట్లో మాట్లాడుకోగా వినలేదు.. తను ఎప్పుడూ చెప్పుకోనూ లేదు. ఈరోజు నానమ్మనడిగి తెలుసుకోవాలి. అని మనసులో అనుకుంటూ ఇంటికి పరుగు తీసింది.
సుమేధ ఇంట్లోకి అడుగు పెద్తూనే ఆనాటి దినపత్రిక తిరుగ వేసింది. ఒక పేజీలో శారదమ్మ ఫోటో చూసి సంభ్రంగా..
“నానమ్మా..” అని పిలుచుకుంటూ శారదమ్మ గదిలోకి వెళ్ళింది.. అక్కడ లేదు. వంటింట్లోకి పరుగెత్తింది.
సుమేధ హడావుడి చూసి ముక్కున వేలేసుకుంది శారదమ్మ. కొడుకు, కోడలు ఉదయాన్నే ఆఫీసుకు పరుగులు తీస్తారు. బాగా అలసి పోయి తిరిగి వచ్చే సరికి రాత్రి దాదాపు ఎనిమిదవుతుంది. సుమేధ వారికి ఒక్కగానొక్క కూతురు. ఆమె ఆలనా, పాలనా అంతా శారదమ్మనే చూసుకుంటుంది.
“నానమ్మా.. నీ ఫోటో పేపర్లో పడింది. చూడలేదా..! రోజూ పొద్దున్నే పేపరంతా చదువుతావుగా.. నాకు చెప్పలేదేం” అంటూ ఆదుర్దాగా అడిగింది సుమేధ.
“చూడకేం సుమేధా.. చూశా. నాకిది కొత్త కాదు గదా..! అలా అప్పుడప్పుడు వస్తూనే ఉంటాయిరా. అయినా ఎవరికి చెప్పి ఏంలాభం సుమీ. నా సంతోషాన్ని పంచుకునే వారెవరున్నారు” అంటుంటే.. శారదమ్మ కళ్ళు చెమ్మగిల్లాయి. నానమ్మనలా ఎప్పుడూ చూడలేదు సుమేధ. ఎప్పుడూ నవ్వుతూ.. నవ్విస్తూ ఉండే నానమ్మ కళ్ళళ్ళో నీళ్ళు చూసి సుమేధ బావురుమంది.
“నానమ్మా.. నేను లేనా..?” అని ఏడ్చుకుంటూ శారదమ్మ గుండెల మీద వాలి పోయింది.
“సుమీ ఏడ్వకమ్మా.. నీకు గాక మరెవ్వరికి చెప్పుకుంటాను. సారీ ఇక ముందు అన్నీ చెబుతాగా..” కళ్ళను కడకొంగుతో తుడ్చుకుంటూ సుమేధను బుజ్జగించింది శారదమ్మ .
“ఫోటో ఎందుకు వేశారు? నేను ఆతరువాత సాంతం చదువుతా గాని ముందుగా నువ్వు చెప్పు నానమ్మా.. ” అని గోముగా అడుగుతూ తన శారదమ్మ కళ్ళలోకి సూటిగా చూడసాగింది. “మీ పేరు తెలియని వారుండరని పూజారి గారు అన్నారు. మా నాన్నగారి పేరైతే పక్కింటి వారికి కూడాతెలియదు” అంటూ తన అరచేతులను తిప్పుతూ పెదవులు విరిచింది సుమేధ.
“మనం నలుగురికి తెలియాలి అంటే ఏదైనా ఒక పనిలో ఆరితేరాలి. ముఖ్యంగా సమాజానికి ఏదో ఒక రకంగా ఉపయోగపడే సేవ చేయాలి. అదే విషయాన్ని రాస్తూ నాఫోటో వేశారు”
“నాకు అర్థం కాలేదు నానమ్మా..” అంటూ బిక్క మొహం పెట్టింది సుమేధ. ఆ ముఖాన్ని చూడగానే శారదమ్మ మనసు ఉప్పొంగి చిరునవ్వుతో.. సుమేధ బుగ్గలు నిమిరి ముద్దు పెట్టుకుంది.
“సుమీ అయితే వివరంగా చెబుతా విను” అంటూ సుమేధ బుగ్గలపై మరో మారు ముద్దు పెట్టి.. “నాకు బాల్యం నుండీ పుస్తకపఠనం అంటే ప్రాణం. మన ఊరిలోని గ్రంథాలయంలో ఎక్కువ సమయం గడిపే దాన్ని. అప్పుడప్పుడూ చిన్న, చిన్న కథలూ రాసే దాన్ని. నేను తొమ్మిదవ తరగతిలో ఉండగా ఒక చిన్న నవల గూడా రాసాను. ఉపాధ్యాయులంతా చదివి మెచ్చుకున్నారు. మా తెలుగు మాస్టారు నేను రాసిన కవితలను, కథలను సవరించే వారు. పత్రికలకు పంపాలంటే డబ్బు సమస్య. అప్పుడప్పుడు మాఅమ్మ గారిని అడిగి తీసుకున్న పైసా, పైసా కూడబెట్టి రేడియో స్టేషన్‌కు ఒక కవిత, ఒక కథ పంపించాను. అవి ప్రసారమయ్యాయి. నా ఆనందానికి హద్దు లేకుండా పోయింది. ఐదారు కథలు పత్రికల్లోనూ వచ్చాయి.
నా వివాహమయ్యాక మీ తాతగారు నన్ను మరింత ప్రోత్సహించారు. కథలు రాయడం వేగవంతం చేశాను. కథలకు బహుమతులు రావడం.. కొద్ది కాలంలోనే నేను ఒక రచయిత్రిగా అందరికీ తెలిసి పోయాను. మీ తాగారి పెన్షన్ డబ్బులతో నా పుస్తకాలు అచ్చు వేయించి ఉచితంగా పంచుతూ వచ్చారు. అదో రకమైన సంఘసేవ అని తృప్తి పడేవాళ్ళం” అని చెబుతూ.. సుమేధను తన గదిలోకి తీసుకు వెళ్ళింది శారదమ్మ.
“మీ తాతగారు కాలం చేశాక.. నేను ఇక్కడికి రావడంతో నా కలం కుంటు పడింది” అంటూ రెండు బీరువాలు తెరచి తన చిన్న గ్రంథాలయాన్ని చూపించింది.
“ఇవన్నీ నువ్వు రాసినవేనా నానమ్మా..” అంటూ సుమేధ కనుగుడ్లు తేలేసింది.
“అన్నీ నేను రాయలేదు సుమీ. తొమ్మిది పుస్తకాలు రాశాను. అందులో ఐదు పిల్లల కోసం రాసినవి. మిగతావి ప్రముఖ రచయితలవి. నేను నీకు చెప్పే కథలన్నీ నేను రాసిన పిల్లల కథల పుస్తకాల లోనివే. మనం పోయినా.. మన పేరు శాశ్వతంగా భూమి మీద నిలిచి పోవాలంటే రచనలు చెయ్యడం ఒక మంచి దారి. కాని ఇప్పటి పిల్లలకు పుస్తక పఠనం మీద అభిరుచి లేదు. ఇక రచనలేం చేస్తారు” అంటూ నిట్టూర్చింది శారదమ్మ.
సుమేధ దీర్ఘాలోచనలో పడింది.
***
సుమేధ ఇప్పుడు ఆరో తరగతిలో అడుగు పెట్టింది.
ఒక రోజు సాయంత్రం బడి నుండి వస్తూనే..“నానమ్మా.. నా కథ ‘బాలప్రభ’ మాసపత్రికలో అచ్చయ్యింది. నాపేరు గూడా రాశారు. సుమేధ ఆరవ తరగతి అని. మాబడి చిరునామాకు పత్రిక వచ్చింది” అంటూ పరుగెత్తుకుంటూ వచ్చి శారదమ్మ చేతికి పత్రిక అందించింది సుమేధ. ఆమె ముఖంలో వేయి దీపాల కాంతి, పెదవులపై చిరునవ్వు తొణకిస లాడుతోంది.
“ఆనాడు ఐదువందల రూపాయల నోటు దొరికినప్పటి ఆనందంకంటే.. ఈరోజు మరింత ఆనందంగా వుంది నానమ్మా” అంటూ శారదమ్మ పాదాలనంటి కళ్ళకద్దుకుంది.
వేసవి సెలవుల్లో దాదాపు కథల పుస్తకాలన్నీ చదివింది సుమేధ. తన ప్రమేయం లేకుండా కథ అచ్చుకు నోచుకుందంటే నా మనవరాలు సామాన్యురాలు కాదు. నా వారసురాలు. అని మనసారా దీవిస్తూ... సుమేధను లేపి తన హృదయానికి హత్తుకుంది శారదమ్మ. *