ఈ కథ నేను రాసినది... కాదు - భాస్కరచంద్ర

Ee katha nenu rasinadi kaadu
"హలో".అంటూ మొబైల్ కాల్ తీసుకున్నాను.
"కంగ్రాట్స్ కన్ఫ్యూషన్" అన్నది అవతలి గొంతు.
నన్ను కన్ఫ్యూషన్ అని పిలి చేoత సాన్నిహిత్యం ఉన్న ఒకే ఒక వ్యక్తి గురునాధం.
"ఏమిట్రా! గురునాధం సరిగ్గా తెల్లవారను లేదు అప్పుడే కాల్ చేసావ్ , ఎంటో చెప్పు" అన్నాను నిద్ర కళ్ళను నలుపుకుంటూ.
"ఇంకా నిద్ర మబ్బు లోనే ఉన్నట్లున్నావే , ఎనీహౌ కంగ్రాట్స్ రా, పార్టీ ఎప్పుడో, ఎక్కడో చెప్పు "అన్నాడు.
"పార్టీ దేనికి రా? ముందు విషయం ఏంటో చెప్పి చావు" అన్నాను చిరాగ్గా , మంచం మీది నుంచి కిందికి దిగుతూ.
"ఈ రోజు పేపరు ఇంకా చూసి నట్టు లేవు!? అదేరా సండే మ్యాగజీన్ చూసావా ?" అని ఆతృతగా అడిగాడు.
గురునాధం కూడా నాలాగే ఏవో రాస్తూ ఉంటాడు.రాసి ఆయా పేపర్లకు, వీక్లీలకు పంపిస్తూ ఉంటాడు.అవి అచ్చయినప్పుడల్లా నాకు ఫోను చేసి చెప్పడం చేస్తూ ఉంటాడు.
నిజానికి నాలో రాయాలనే కోరికను నాటింది వాడే.
ఇలా రాయి,ఆ పేపరు కు పంపించు, కథ అంటే ఇది,కథానిక అంటే అది , కథా వస్తువు, సన్నివేశం, పార్శ్వాలు ఇలా ఎన్నో విషయాల గూర్చి చర్చించే వాడు.అయితే నాకు ఇవన్నీ అంతగా తెలిసేవి కావు, కాని ఏదో విషయం చూసినప్పుడు మాత్రం దాని గురించి రాయాలని అనిపించేది.అలా ఒకటి రెండు సార్లు రాసి గురునాధం కు చూపిస్తే ,చాలా బాగా రాశానని మెచ్చు కొన్నాడు.అతని మెచ్చుకోలు నన్ను ఇంకా ఇంకా రాసేలా చేసింది .ఈ విషయంలో నన్ను బాగా ప్రోత్సహించే వ్యక్తి అంటే వాడే.
అతను చెప్పినట్టే కొన్ని కథలు రాసాను, వాటిని సామాజిక మాధ్యమాలలో షేర్ కూడా చేసాను.కొందరు లైక్ చేస్తే మరి కొందరు కామెంట్స్ పెట్టేవారు.
వాళ్ళు పెట్టే కామెంట్స్ , పొగడ్తలు నన్ను మరింత రాసే లాగా ఉసి గొలిపేవి. దాంట్లో ఏదో తెలియని కిక్కు ఉండేది.
ఈ రోజు గురునాధం పొద్దున్నే కాల్ చేశాడు అంటే ,అతని కథేదో అచ్చయిఉంటుంది, అయితే ఈ సారి మాత్రం నాకు కంగ్రాట్స్ చెప్పడం వింతగా ఉంది.ఏమిటో అంతా కన్ఫ్యూషన్ గా ఉంది.
ఏ విషయాన్ని క్లియర్ గా చెప్పడు, పైగా నన్నే కన్ఫ్యూషన్ గాడినని హేళన చేస్తుంటాడు. వీడి తో వచ్చి పడే గొడవే అది.
నిద్ర తేలిపోయింది.అద్దం ముందు నిలబడి జుట్టూ సరి చేసుకొంటూ,"ఇంతకీ విషయం ఎంటో చెప్పరా బాబు " అన్నాను.
"ఏమి లేదురా ,నీ కథ ఆదివారం అనుబంధంలో అచ్చయింది అంతే." అన్నాడు ఆనందంగా.
ఇంకా ఏదో మాటాడుతున్నాడు.
అంతే నాకేమి అర్థం కాలేదు. షాక్ కు గురైనట్లు అనిపిస్తుంది.ఫోను కట్ చేసి అద్దo లో నన్ను నేను చూసుకున్నా. అది నేనే. ఇది నిజమే.కల అయితే కాదు అన్న నిర్ధారణకు వచ్చాను.
ఇది మొదటి సారిగా అచ్చయిన కథ.ఏదో సామాజిక మాధ్యమాల్లో,వాట్సాప్ గ్రూపుల్లో చిన్న చిన్న రచనలు చేశాను. కానీ ఒక ప్రముఖ పత్రిక అదివారం అనుభందం లో అచ్చవడం అంటే నాకు మాత్రం గొప్పే.ఇది ఆషామాషీ విషయం అయితే కాదు.
శరీరం అంతా గాల్లో తేలినట్లు అనిపించ సాగింది.గొంతు కూడా ఎండిపోయినట్లని పించ సాగింది.
ముందుగా, తొందరగా వెళ్ళి పేపరు తెచ్చుకోవాలి.ముందే
మా కాలనీ కొంచం రిమోట్ ఏరియాలో ఉంటుంది.ఇక్కడి నుండి స్టేషనరీ షాప్ రెండు మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.అక్కడ కూడా చాలా తక్కువగా వార్త పేపర్లను అమ్మకానికి పెడతారు.
కిచెన్ లోకి వెళ్ళి ఓ గ్లాసు నీరు తాగి ఎండీ పోతున్న గొంతుని తడిపి,అలాగే బైక్ తీసుకుని స్టేషనరీ షాప్ కేసి బయలు దేరాను .
బైక్ మీద వెళుతూ ఉంటే గాల్లో తేలినట్లు అనిపించ సాగింది.మనసులో ఏదో చెప్పలేని అనుభూతి.
లక్షల్లో సర్కులేషన్ ఉన్న పత్రిక అది.రాష్ట్రంలో నే పెద్ద పత్రిక. నిజంగా అలాంటి పత్రికలో నా కథ రావడం అదృష్టమే?!
బైకు పక్కనే పార్కింగ్ చేసి , పక్కనే ఉన్న బుక్ స్టాల్ కి వెళ్ళాను.ఆదివారం కావడం మూలాన సెంటర్లో రద్దీ తక్కువగానే ఉంది.
"పేపరు ఇవ్వమని" పది రూపాయలు నోటు అతనికి ఇవ్బబోయాను, అతను నేనడిగిన పేపర్ స్టాక్ అయిపోయిందన్నాడు.అది తప్ప అన్ని ఉన్నాయి. ఏవేవో పత్రికల పేర్లు చెప్పుతున్నాడు, కానీ అవేవీ నాకు అవసరం లేదు.
అక్కడ కాక మరెక్కడా వార్తా పత్రికలు దొరకవని నాకు తెలుసు. కొంచం నిరాశ కలిగింది. అయినా వేరే మార్గ లేదు.
కాలి చేతుల్తో ఇంటికి రావాల్సి వచ్చింది.
అయినా ఈ పత్రికల వారు కూడా అంతే,'అయ్యా మీ రచన పలాన తేదీన అచ్చవుతున్నది అని ఇంటిమేషన్ ఇస్తే వీరి ముల్లేం పోతుంది.ఓ మెయిల్ మా ముఖాన పడేస్తే ,మా ఏర్పాట్లు ఏవో మేం చూసుకుంటాం కదా! అని లోలోన గొణుక్కుని వాలు కుర్చీలో కూలబడ్డాను.
నా పరిస్తితి అంతను గమనిస్తున్న మా చిన్నోడు కారణ మడిగాడు.
"ఈ రోజు పేపర్లో నా కథ ప్రచురించారట.ఇప్పుడే గురునాధం అంకుల్ ఫోన్ చేసి చెప్పారు.తీర ప్రయాస పడి స్టేషనరీ షాపుకని అంత దూరం వెళితే, అక్కడ పేపర్స్ అయిపో యాయట" అని నిరాశగా చెప్పాను.
దానినీ వాడు చాలా తేలికగా తీసుకొని, "ఇంత దానికి బాధ పడటం ఎందుకు? నన్నడిగితే ఇంకో మార్గం చూపేవాన్నీ " కదా అన్నాడు.
"అ మార్గం మేదో చెప్పరా బాబు " బ్రతిమాలుకోలు గా అడిగా.
నన్ను బెడ్ రూమ్ లోకి తీసుకెళ్ళి, తన సిస్టమ్ ఆన్ చేశాడు.సదరు పేపరు ఈ ప్రతిని స్క్రీన్ పై ఇట్టే చూపించి నా సమస్యను పరిష్కరించాడు.
సరాసరి కథ ఉన్న పేజీని క్లిక్ల్ చేశాను.
'అచ్చు కానీ కథ" అన్న శీర్షికతో కథ ఉంది.
నిజానికి ఈ శీర్షికతో నేను కథ రాసినట్టు నాకైతే గుర్తుకు రావడం లేదు.
కింద మాత్రం రచయితగా నా పేరే ఉంది .ఒకటికి రెండు మార్లు చదివి చూసాను, కచ్చితంగా అది నా పేరే.
" ఈ మధ్య ఎన్నో రాసా ,ఎన్నో పేపర్లకు పంపా , ఏ పేరు తో ఏ పత్రికకు పంపానో ఏమీ గుర్తు ఉంటుందిలే "అని సర్దుకున్నాను.ఏది ఏమైతేనేం నా పేరుతో కథ అచ్చయింది అదే పది వేలు.
అదేమైనా చిన్న పత్రికా ,పెద్ద పేరున్న పత్రిక.నే పెట్టిన పేరు స్టోరీ కి సరిపోలేదని వారికి నచ్చిన లేదా కథకి అనుగుణంగా ఉన్న పేరు పెట్టి ఉంటారు.నే పెట్టిన పేరే పెట్టాలని రూల్ ఉందా అని సముదాయించుకొన్నాను.
పేరులో ఏముంది..కథ ముఖ్యం. సబ్జెక్ట్ అదే విషయం మనది అయితే చాలు, ఏ పేరు పెడితే మనకేంటి నష్టం అని మనసును కుదుట పరుచు కొన్నాను.
రచయిత పేరును మల్లీ ఒక్కసారి సరిచూసుకున్నా. అక్కడ అచ్చయింది నా పేరే.దీంట్లో ఏ మాత్రం సందేహం లేదు.
నాకేమో కాగితం పేపర్ చదివితేనే తృప్తి.ఈ స్క్రీన్ పై చదవాలంటే నాతో కాని పని.అయినా కొంచం చదివి చూద్దామని ,కళ్ళని అక్షరాలు వెంట పరిగెత్తించా.
విషయం నాకైతే అర్థమైనట్టు లేదు. కథ మొదలు మాత్రం ఆసక్తికరంగా ఉంది. కానీ ఏ విషయం పై ఈ కథ అన్నది ఇంకా స్పురించడం లేదు.మొదటి పేర చదివాను.కానీ కథా వస్తువు ఏమిటో అర్థం కాలేదు..
"నాకంటే పత్రికల వాళ్లకు అనుభవం ఎక్కువ. వాళ్ల దగ్గర ఎంతో అనుభవస్తులైన ఎడిటర్లు, పాత్రికేయులు కంటెంట్ రైటర్స్ ఉంటారు .కథలో కొత్తదనం ఉండాలని తమ సృజనాత్మకత ఉపయోగించి కథను భిన్న కోణం నుంచి రాశారేమో .
"వారు ఎంతైనా ఉద్ధండులు ఏమైనా చేయగలరు" అని మనసుకు మళ్ళీ నచ్చచెప్పకున్నా.ఇంతలో మొబైల్ రింగ్ అయ్యింది. మొబైల్ చేతిలోకి తీసుకొని స్క్రీన్ చూస్తే అదే గురునాధం కాల్. కాల్ రిసీవ్ చేసుకుంటూ
" హలో,ఏంటోయ్ " అన్నాను.
"చూసుకున్నావా "అని అడిగాడు గురునాధం.
"లేదు రా! పత్రిక దొరకలేదు.అయినా మా వాడు నెట్ లో చూపించాడు..కానీ...."అని ఏదో అనే లోపు మళ్ళీ అతడే ఆశ్చర్యం గా చెప్పడం మొదలు పెట్టాడు."అబ్బా ఈ కాలంలో ఎవడ్రా పేపరు చదివేది ? అన్నీ స్క్రీన్ మయమే.సిస్టమ్ లో చూచావు కదా "అన్నాడు.
అవును అనీ వింటున్నట్లు ఉ అన్నాను.
"కథ బలే రాశావ్.శిల్పం బాగుంది.కథ నడిపించే విధానం బ్రహ్మాండం.ఇక ముగింపు అంటావా అదిరింది. .."ఇంకా ఏమేమో అంటున్నాడు.నాకేమో ఏమి అర్థం కాలేదు.
ఇంతకీ అది ఏ కథ?.దాని సబ్జెక్ట్ ఏంటి ? అస్సలే నాకు ఈ శిల్పాలు , కథనాలు ముగింపులు అస్సలే తెలియవు.
అసలు ఏమి రాశానో నాకే అర్థం కావట్లేదు.
.
వాడు ఏదో చెపుతూనే ఉన్నాడు.
నేను మాత్రం ఇంకా కన్ఫ్యూషన్ మోడ్ లోనే ఉన్నాను.వాడే మళ్ళీ కల్పించుకొని, "వాట్స్ అప్ చూడు, కథని పిడిఎఫ్ లో పంపించా. తెలిసిన అందరికీ , వాళ్ళ వాళ్ళకి, గ్రూపులో ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేసేయి. లైకులు, కామెంట్స్ ఇంకా ..."ఉత్సాహంగా చెప్పుకుంటూ పోతున్నాడు గురునాధం.
వాడు చెప్పినట్టే, దాన్ని తెలిసిన బంధువులకు, సహోద్యోగులకు, తెలిసిన గ్రూప్ లకి ఫార్వర్డ్ చేశా.కాకుంటే చాలా సింపుల్ గా వాడు ఎలా పంపించాడు అలా గే అందరికి పంపించాను.
ఇది నా కథ అని ,ఎలాంటి వివరణ లేకుండానే సింపుల్ గా పేస్ట్ చేశా.కారణం నాకు కూడా సబ్జెక్ట్ తెలియదు కాబట్టి.
ఏదో గురునాధం చెప్పాడు,నే చేశాను అన్నట్టు ఉంది నా వ్యవహారం.
ఆ రోజు అంతా ఇదే సందడితో గడచి పోయింది.
కనీసం ఈ కథ పైi వచ్చే సమీక్షలు, కామెంట్స్ అయినా నాకు పంపుతారో లేదో ! వాటికి కూడా వారే జవాబులు రాస్తారేమో ! ఒక వారం వేచి చూస్తే గాని అర్థం కాదు.
మరు నాడు ఆఫీసుకి వెళ్ళాను.ఒకరిద్దరు తప్ప మిగతా స్టాఫ్ అంతా ,ఏదో ఒక సందర్భంలో అభినందించారు.
వారం మధ్యలో, ఓరోజు ఆఫీసు లో కాలిగా ఉన్నాను.
ఎన్నో కథలు రాసా, కానీ ప్రింటయినది మాత్రం ఇది ఒక్కటే.ఇంతకీ నేనేమి రాశాను ,ఈ పత్రికల వాళ్ళకి ఎందుకు నచ్చింది., ఇంతకీ నేను రాసిన కథలో ఏమేమి మార్పులు చేశారో తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.మున్ముందు రాసే కథల్లో జాగ్రత్తలు తీసుకోవచ్చని కథను ప్రింటు తీసుకొని చదవడం మొదలు పెట్టా.
కథలో పెద్దగా గొప్పదనం ఏమి కనిపించ లేదు.ముగింపు నచ్చలేదు.కథకి ,కథ పేరుకు ఎలాంటి సంబంధం లేదు. కథను నడిపిన తీరు కూడా ఏమంత రుచించలేదు.
ఈ కథ నేనే రాసానా అన్న అనుమానం వచ్చింది.
ఇంతకీ నేను ఈ కథను,ఈ పత్రికకు పంపించాన అన్న అనుమానం వస్తుంది.
ఒక్క సారి ఔట్ బాక్స్ లోకి వెళ్ళి చెక్ చేస్తే, ఈ మధ్యన పంపిన కథల్లో అలాటి వేవి కనిపించలేదు.
అసలు ఈ పత్రికకు పంపిన ఆనవాళ్లే లేవు.ఒక సారి ఇన్
బాక్స్ చూసా, సదరు పత్రిక నుండి వచ్చిన ,నమస్కారం మీ కథ ప్రచురణకు స్వీకరించబడలేదు ,గమనించగలరు.
లాంటి రిగ్రెట్ సమాధానాలే ఎక్కువగా ఉన్నాయి.
అయితే, ఎక్కడో పొరపాటు జరిగింది.
రాజులు గడిచి, మరో ఆదివారం ముందుకు వచ్చింది.
పోయిన వారం ఉన్నంత ఉత్సాహం మాత్రం లేదు.పత్రికను తెచ్చుకోవడానికి పరిగెత్తాలని కూడా అనించలేదు.
ఇంతలో గురునాధం కాల్ వచ్చింది.
కాల్ తీసుకొని హలో అన్నాను.గొంతులో మెతకథనం.
"సారీరా, నేనే కన్ఫ్యూషన్ అయ్యాను.నిన్ను కూడా కన్ఫ్యూస్ చేశాను..."
వాడు ఏమీ చెప్పలను కుంటున్నాడో చూచాయగా అర్థం అవసాగింది.
మౌనంగా వింటున్నాను.
"ఆ కథ నీది కాదు రా! నీ పేరుతో నే ఉన్న మరో రచయితది. నేనే ముందు వెనుక చూడకుండా ,నిన్ను కన్ఫ్యూస్ చేయడమే కాకుండా అంతటా ప్రచారం చేసేలా ఉసిగొలిపాను"
మౌనంగా వినడం నా వంతయ్యింది.
"నిన్న ఆ కథకు సమీక్ష రాసి అదే పత్రికకు రాసి పంపాను. సమీక్ష తో పాటు,రచయిత జవాబు కూడా ప్రింటు చేయబడింది.అప్పుడు గాని నాకు నిజం బోధపడలేదు. సారి " అన్నాడు గురునాధం.
నేను ఏం జవాబు చెప్పలేదు .మౌనంగా వింటున్నాను.
"సరే లేరా??!! కనీసం ఒక్క రోజైనా ఏదో సంతోషంలో మునిగి తేలాం కదా,అదే చాలులే "అని సర్ది చెప్పాను.
సామాజిక మాధ్యమాల లో,ఫేస్ బుక్ పేజీల్లో
కంగ్రాట్స్ ,లైకులు కామెంట్స్ పెట్టిన వారందరికీ రిప్లై ఇస్తూ, "ఇది నే రాసిన కథ కాదు, నా పేరు తో ఉన్న మరో రచయిత రాసిన కథ ,ఏదో బాగుందని మీ అందరితో షేర్ చేసుకున్నాను.ధన్యవాదాలు" అని పోస్ట్ చేశాను.
మనసు ఇప్పుడు ఎందుకో నిజంగా తేలికగా ఉంది. లేకున్నా చేసుకోవాల్సిందే అదే జీవితం...
___సమాప్తం___

మరిన్ని కథలు

Agnisikha
అగ్నిశిఖ
- హేమావతి బొబ్బు
Naanamma varasuralu
నానమ్మ వారసురాలు
- చెన్నూరి సుదర్శన్
Maro bharataniki punadi
'మరో భారతానికి పునాది'
- మద్దూరి నరసింహమూర్తి,
Juvvi
జువ్వి!
- అంతర్వాహిని
Kanchana prabha
కాంచన ప్రభ
- కందర్ప మూర్తి